close

ప్ర‌త్యేక క‌థ‌నం

లగ్గం ఖర్చుకు పగ్గం వేద్దాం

ఒంటి బతుకున జంట సరిగమ పలికించే మాఘమాసం మరో రెండ్రోజుల్లో వచ్చేస్తోంది. కొత్త జీవితం ఆకారం దాల్చే ఆ కమనీయ దృశ్యాల్ని కనులారా వీక్షించడానికి సిద్ధమయ్యారా? అయితే మీ కళ్లు చారెడంత చేసుకోండి. ఇంద్రసభను తలపించే పెళ్లివేదికలు.. భూమ్యాకాశాలు దద్దరిల్లే డీజే శబ్దాలు.. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల స్వాగత తోరణాల్ని చూసి ఆశ్చర్యపోకండి. నూరున్నొక్క, కొండొకచో వెయ్యిన్నొక్క వంటకాల్ని చూసి, ఇన్ని తినగలమా..! అని సంశయపడకండి. అదిరిపోయే వెడ్డింగ్‌ కార్డ్స్‌ను అందుకుని.. వామ్మో ఇదేం ఖర్చు అని ముక్కున వేలేసుకోకండి. ‘గొప్ప పెళ్లిళ్ల’కు ఆరంభ సూచికలవి. మీ నెత్తిన చక్కర్లు కొట్టే ‘రెక్కల యంత్రపు’ ఝంకారానికి జడుసుకోకండి. మిమ్మల్ని పెళ్లికి ఆహ్వానించిన వారి తాహతును చాటే డ్రోన్‌ కెమెరాలవి.

యా పెళ్లిళ్లలో డబ్బుకు విలువలేదు. ఎంత ఎక్కువగా ఖర్చుచేస్తే అంత ‘ప్రత్యేకం’ అనుకునే రోజులొచ్చేశాయ్‌. ఇదో అనివార్యతలా స్థిరపడుతోంది. మధుర జ్ఞాపకంలా పెళ్లి చేయాలనుకోవడంలో తప్పులేదు కానీ.. వివాహ ఖర్చులు అదుపు తప్పుతుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకర్ని చూసి మరొకరు అనుకరిస్తున్నారు. ఈ అనుకరణల పుణ్యమా అని.. పేద, మధ్యతరగతి వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ దుబారా ఆచారాలను ఆపలేమా? కుటుంబాల్ని కుంగదీస్తున్న దుబారా ఖర్చులు, వాటి నివారణ మార్గాలపై ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక క‌థ‌నం.

పెళ్లి ఇప్పుడు ఆర్భాటపు వ్యవహారం. ఆహ్లాదంగా జరగాల్సిన వేడుక సిరిసంపదల ప్రదర్శనకు వేదిక. అన్యోన్యతను పెంచే ఆప్యాయతల కన్నా ఆడంబరాలదే పైచేయి. కలవారిని అనుకరిస్తూ మధ్యతరగతి కష్టాలను కొనితెచ్చుకొంటోంది. నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్‌... ముగిసేసరికి ఆర్థికభారం వెక్కిరిస్తోంది. ఇక విందు గురించి చెప్పక్కర్లేదు. జానెడు పొట్టకు దేన్నితినాలో... దేన్ని వదలాలో తేల్చుకోలేనంతగా వంటకాల్ని వడ్డించేస్తున్నారు. ఇతరుల్ని అనుకరిస్తూ మూసలో పడి కొట్టుకుపోతున్నారు. పెరిగిపోతున్న పెళ్లి ఖర్చుపై ఒకసారి స్థిమితంగా ఆలోచిస్తే చాలు... కుటుంబాలు అప్పులపాలు కావు. అప్పుడు వివాహం చేసుకున్నవారికీ, చేసినవారికీ కూడా మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

 

* హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి రిటైరయ్యేదాకా పనిచేస్తే.. వచ్చిన ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తం రూ.10 లక్షలు. అతడు తన కుమారుడి పెళ్లి రిసెప్షన్‌ కోసం ఫంక్షన్‌ హాల్‌ అద్దె, అలంకరణల కింద చెల్లించిన మొత్తం రూ.10 లక్షలు!!’. ఇక పెళ్లి ఖర్చు ఏ స్థాయిలో  ఉంటుందో ఊహించుకోండి.

* అతనో చిరుద్యోగి. చదువుకునే రోజుల నుంచి స్నేహితులు చాలా మంది ఉన్నారు. వారందరినీ కలపడానికి తన కుమార్తె వివాహాన్ని ఓ వేదికగా చేద్దామనుకున్నాడు. చేతిలో డబ్బు లేకున్నా ఆడంబరాలకు పోయాడు. ప్రస్తుతం అతనికి మిగిలిన అప్పు రూ.25 లక్షలు

* ఆయనో సంపన్నుడు. తన కుమార్తె వివాహాన్ని దాదాపు 5 రోజుల పాటు వేడుకగా చేశాడు. అతిథులు ఔరా! అనుకునేలా రోజుకో రకంగా అలంకరణలు, భోజన ఏర్పాట్లు చేశాడు.
కుమార్తెకు కొన్న నగలు, దుస్తుల్ని చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే. పెళ్లికి ఎన్నికోట్లు ఖర్చయిందో ఆయనకే ఎరుక!

వామ్మో.. ఇంత ఖర్చా?

* ఒక సర్వే ప్రకారం.. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్లపై చేస్తున్న ఖర్చు ఏటా- రూ.లక్ష కోట్లు పైగానే!
* పెళ్లి ఖర్చులు ఏటేటా 25-30% దాకా పెరుగుతున్నాయి.
* సగటు భారతీయ వివాహ ఖర్చు తరగతులను బట్టి రూ.20 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ ఉంటోంది.
* దేశంలో ఒక వ్యక్తి తన జీవితకాలంలో సంపాదించిన మొత్తంలో ఐదో వంతును పిల్లల పెళ్లిపై ఖర్చుచేస్తున్నాడు.

పెళ్లి ఖర్చులు పెరగడానికి కారణాలు

* వ్యక్తుల ఆదాయాలు పెరగడం.
* పెళ్లి వేడుకల్ని ‘ప్రత్యేకంగా’ చాటుకోవాలనే ధోరణులు ఎక్కువకావడం.
* డబ్బూ, దర్పాన్ని ప్రదర్శించుకోవాలనుకునే మనస్తత్వం.
* చుట్టుపక్కల వారిని అనుకరించడానికి ప్రయత్నించడం.
* నానాటికీ పెరుగుతున్న ధరల ప్రభావం.

దేనిపై ఎంత ఖర్చు?

పెళ్లి వేదిక: పెళ్లికయ్యే ఖర్చులో ఎక్కువభాగం ఫంక్షన్‌ హాలు/హోటల్‌పైనే వెచ్చించాల్సి వస్తోంది. కొందరు ఏసీ ఫంక్షన్‌ హాళ్లనూ బుక్‌చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు ఫంక్షన్‌ హాలుకు సగటున రూ.1-2 లక్షల అద్దె చెల్లించాల్సి వస్తోంది. సాధారణ హోటల్‌ బాల్‌రూమ్‌ అద్దె రూ.లక్ష దాకా ఉంటోంది.

అలంకరణలు: వివాహ వేదికను స్వర్గంలా అలంకరించడం ఇప్పుడో ఫ్యాషన్‌. పూలు, సంప్రదాయ డిజైన్లు, శిల్పకళా చిత్రాలు, తోరణాలు, మిరిముట్లు గొలిపే విద్యుద్దీపాలు, ఆకట్టుకునే కుర్చీలు.. ఇలా సుందర రమణీయంగా పెళ్లి మంటపాల్ని ముస్తాబుచేస్తున్నారు. ఒక్కొక్కరి అలంకరణ అభిరుచుల్ని బట్టి వేదిక డెకరేటర్లు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

భోజనాలు: మన పెళ్లిని బంధుమిత్రులు కలకాలం గుర్తుంచుకోవాలంటే భోజనాల్లో గొప్పలు కనిపించాల్సిందేనన్న ధోరణి ప్రబలిపోయి, లెక్కకుమించి వంటకాలు వండిస్తున్నారు. వాటిలో కొన్నింటిని అతిథులు రుచి కూడా చూడలేరు. ఏకంగా స్వీట్‌స్టాళ్లు, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లు, ఫ్రూట్‌స్టాళ్లు ఏర్పాటుచేయిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో సాధారణ క్యాటరర్‌ ఒక ప్లేటుకు రూ.400 నుంచి రూ.800 దాకా వసూలుచేస్తే... పేరున్న క్యాటరర్‌, పెద్ద హోటల్‌ యజమాని రూ.1500 నుంచి రూ.2500 దాకా వసూలుచేస్తున్నాడు.

డ్రెస్‌లు: జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని సందర్భం కాబట్టి.. పెళ్లిరోజు ఎంతో భిన్నంగా కనిపించాలని, ఖరీదైన దుస్తులు ధరించాలని వధూవరులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. పెళ్లికూతురు ధరించే చీరలు రూ.5 వేలతో మొదలై రూ.2-3 లక్షల దాకా ఉంటున్నాయి. లెహెంగాలు రూ.50 వేల దాకా ఉంటున్నాయి. పెళ్లికొడుకు షేర్వాణీ సూటుకు రూ.30-50 వేల దాకా ఖర్చుచేస్తున్నారు. ఇక వధూవరుల కుటుంబీకులకు, సమీప బంధువులకు కొనే దుస్తుల ఖర్చు అదనం.

* వేడుకలు: మెహందీ, సంగీత్‌, నిశ్చితార్థం, రిసెప్షన్‌... ఇలా రకరకాల పేర్లతో మూడు నాలుగు రోజులు పెళ్లి వేడుకలు నిర్వహించే సంప్రదాయం వేళ్లూనుకుంటోంది. కొన్ని కుటుంబాలు అంతకుమించీ చేస్తున్నాయి. ప్రతి వేడుకకూ ప్రత్యేక దుస్తులు, సెటప్‌లు, సామగ్రి అవసరమవుతాయి. డీజే, లైటింగ్‌, అలంకరణలు.. ఇవన్నీ తోడవుతున్నాయి. ఒక్కో వేడుకకు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చుచేస్తున్నారు.

* ఫొటోలు/వీడియోలు: సినిమా షూటింగ్‌ను తలపించేలా పెళ్లి వేదిక వద్ద ఫొటోగ్రఫీ/వీడియోగ్రఫీలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, పోస్ట్‌ వెడ్డింగ్‌ షూట్‌ పేరుతో వీడియోల్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్‌లతో చిత్రీకరిస్తున్నారు. ఫొటోల అల్బంలలో దర్పం కనిపిస్తూ ఉంటుంది. ఫొటోలు, వీడియోల కోసం ఒక్కో కుటుంబం స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా ఖర్చుచేస్తున్నారు.

నగలు: పెళ్లి కుమార్తె నగలు, పెళ్లి కుమారుడికి బంగారు గొలుసులు, ఉంగరాల కొనుగోలుకు ఒక్కో కుటుంబం స్థాయిని బట్టి భారీగానే వెచ్చిస్తున్నారు. పెళ్లి కుమార్తె నగల్ని కట్నం కింద ఇస్తున్నారు.

* ఇతర ఖర్చులు: వివాహ ఆహ్వాన పత్రికల ముద్రణ, బ్యాండు మేళం, ఆర్కెస్ట్రా/డీజేల ఏర్పాటు, రిటర్న్‌ గిఫ్ట్‌లు, అద్దె వాహనాలు, విడిది ఏర్పాట్లు, అతిథులకు ఆహ్వానం పలకడం, స్నాక్స్‌, జ్యూస్‌, నీళ్ల గ్లాసుల్ని అందివ్వడం కోసం అందమైన అమ్మాయిల నియామకం, ధనవంతుల పెళ్ళిల్లలో బౌన్సర్ల ఏర్పాటు, పెళ్లి తర్వాత వధూవరుల హనీమూన్‌.. ఇలా ఇతరత్రా ఖర్చులు చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. ఖరీదైన పెళ్లి పత్రికల్ని ఒకర్ని మించి మరొకరు అచ్చువేయించి పంచుతున్నారు. ఆహ్వాన పత్రికల డిజిటల్‌ వీడియోల్నీ పంపుతున్నారు.

* డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లు: సంపన్నులు సొంతూళ్లో కాకుండా.. గోవా, ఉదయ్‌పూర్‌, మారిషస్‌, శ్రీలంక, మాల్దీవులు, స్పెయిన్‌, ఇటలీ తదితర దూర ప్రాంతాల్లో పెళ్లిచేయడానికి(డెస్టినేషన్‌ వెడ్డింగ్‌) ఇష్టపడుతున్నారు. పెళ్లికి వచ్చేవారికి విమాన టిక్కెట్లు, అక్కడ హోటల్‌ రూంల బుకింగ్‌, అలంకరణలు, భోజనాలు, సరదాల కోసం చేసే ఖర్చులకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఒక్కో కుటుంబ ఆర్థిక స్థోమతను బట్టి ఖర్చు చేస్తున్నారు.

నాడు.. ఇంత ఖర్చేదీ?

ఒకప్పుడు పెళ్లంటే బంధుమిత్రులంతా కలిసి పండుగలా చేసుకునేవారు. పెళ్లిలో ఖర్చుల కంటే కూడా.. ఆత్మీయతలు, అనుబంధాల హడావుడే ఎక్కువగా కనిపించేది. ఇంటి వద్దో, గుడిలోనో పెళ్లిచేసేవారు కాబట్టి.. ఫంక్షన్‌ హాళ్ల ఖర్చులుండేవి కాదు. పెళ్లి కుదర్చడం దగ్గర్నుంచి.. వధువును అత్తారింటికి సాగనంపేదాకా.. ప్రతి పనిలోనూ బంధుమిత్రుల భాగస్వామ్యం ఉండి తీరాల్సిందే. పెళ్లి పనులు చేయడానికి పిలవకపోతే నొచ్చుకునే రోజులు. పిలిస్తే.. ఇంటిల్లిపాదీ వెళ్లీ.. అన్నీ తామై పనిచేసే అభిమానం. కొబ్బరి మట్టలతో, మావిడాకుల తోరణాలతో పెళ్లి మంటపాన్ని అలంకరించేవారు. వచ్చిన చుట్టాలకు తమ ఇళ్లలోనూ విడిది ఏర్పాటుచేసేవారు. కొసరి కొసరి వడ్డించినా.. విస్తళ్లలో వృథాగా వదిలిపెట్టడానికి ఆస్కారం ఇచ్చేవారు కాదు. ఎవరో ధనవంతులైతే తప్ప... మిగతావారు పెళ్లిపై ఎక్కువగా ఖర్చుపెట్టేవారు కాదు. గొప్పలన్నీ ఆత్మీయతలు, అనురాగాల్లో కనిపించేవి.

నేడు.. అంతటా ఖర్చే

మెహందీ, సంగీత్‌, విదేశీ పూల అలంకరణలు, ప్రీ వెడ్డింగ్‌, పోస్ట్‌ వెడ్డింగ్‌ షూట్‌లు, సెలబ్రిటీలతో ప్రత్యేక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా/డీజే శబ్దాలు, పూలవర్షాలు, డ్రోన్‌లతో చిత్రీకరణలు, బ్రైడల్‌ మేకప్‌లు, బౌన్సర్ల హడావుడులు... ఒక్కటేమిటి ఆధునిక పెళ్లిళ్లలో అన్నీ ఉంటున్నాయి. అన్నీ ఖర్చుతో కూడుకున్నవే.

ఖర్చులు తగ్గించుకోండి ఇలా..

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పెళ్లి ఖర్చుల్ని తగ్గించుకోవచ్చని ‘డోలీ సాజాకే రఖ్‌నా’ సహవ్యవస్థాపకురాలు రాగినీ శ్రీవాస్తవ, బ్యాండ్‌ బాజా.కామ్‌ సీఈఓ సచిన్‌ సింఘాల్‌ తదితర వెడ్డింగ్‌ ప్లానర్లు సూచిస్తున్నారు. ఈ సూచనలు అన్ని వేళలా, అందరికీ నచ్చకపోయినా.. కొన్నయినా ఉపయోగపడతాయని వారు అంటున్నారు.

* ఇతరుల్ని పెళ్లి ఖర్చుల్ని చూసి వారిని అనుకరించొద్దు. మీ ఆర్థిక స్థోమతను బట్టి ప్లాన్‌ చేసుకోండి.

* నగరం/పట్టణం నడిబొడ్డున కాకుండా.. ఊరి శివార్లలో పెళ్లి మంటపాల్ని బుక్‌చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి.

* హోటళ్లు, రిసార్టుల్లో కాకుండా.. బహిరంగ ప్రదేశాల్లో, ఒక మోస్తరు ఫంక్షన్‌ హాళ్లలో పెళ్లి పెట్టుకుంటే.. పన్నుల తలనొప్పి ఉండదు.

* ముహూర్తాల సమస్య లేకపోతే...ఆఫ్‌సీజన్‌లో పెళ్లిపెట్టుకుంటే ఫంక్షన్‌ హాళ్లు కాస్తంత చౌకగా దొరుకుతాయి.

* పెళ్లిని వారాంతంలో కాకుండా వారం మధ్యలో పెట్టుకుంటే ఖర్చులకు కొంత కళ్లెం వేయొచ్చు.

* ఖరీదైన పెళ్లి ఆహ్వాన పత్రికలు కాకుండా.. సంప్రదాయ ఆహ్వాన పత్రికలవైపు మొగ్గండి. లేదంటే ఓ డిజిటల్‌ వీడియోను తయారుచేయించి.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల ద్వారా పంపండి. సొంత వెడ్డింగ్‌ కార్డుల్ని డిజైన్‌ చేసుకునే కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లను వినియోగించుకోండి.

* ముఖ్యులు, ఆప్తులు, తప్పకుండా పిలవాల్సిన స్నేహితులు, బంధువుల్నే పెళ్లికి ఆహ్వానించండి. మొహమాటానికి ముఖపరిచయస్తుల్ని సైతం పిలిచి.. ఖర్చులు పెంచుకోకండి.

* అందర్నీ ఆకట్టుకునే మంచి వంటకాల్నే పరిమితంగా వండించండి. లెక్కకు మించి వండించడం వల్ల వృథా ఎక్కువ. ఖర్చూ పెరుగుతుంది.

* పెళ్లి తేదీ ఎలాగూ తెలుసుకాబట్టి.. చాలా ముందుగానే ఆఫ్‌సీజన్‌లో, డిస్కౌంట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెళ్లి దుస్తుల్ని కొనుక్కోండి.

* భోజన ఏర్పాట్లు, పువ్వులు, అలంకరణ, అద్దెలు, దుస్తులు, నగలు.. ఇలా ఏయే ఖర్చులుంటాయో ముందే లెక్కరాసుకోండి. ఖర్చు మరీ అదుపు తప్పుతుందని అనుకున్నప్పుడు మీరు రాసుకున్న జాబితాలో మొదటి, ద్వితీయ ప్రాధాన్యాల్ని ఎంచుకుని.. మూడో ప్రాధాన్యాన్ని పరిహరించడానికి ప్రయత్నించండి.

* టేబుళ్ల వద్ద కూర్చుని తినే భోజనాల కన్నా.. ఫ్యామిలీ తరహా బఫేల వైపు ఎక్కువగా మొగ్గుచూపండి.
* ఫొటోల పేరుతో భారీగా ఖర్చుచేయొద్దు.
* పెళ్లిళ్ల సందర్భంగా మద్యం సరఫరాను నివారించండి.

పెళ్లి ఖర్చు ఏ రాష్ట్రంలో ఎంత?

రాజస్థాన్‌ 1
పెళ్లిళ్లపై అత్యధికంగా ఖర్చుచేసే రాష్ట్రాల్లో రాజస్థాన్‌ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ కనీసం మూడురోజులు పెళ్లిచేస్తారు. మధ్యతరగతి కుటుంబం సగటు ఖర్చు రూ.15-20 లక్షల దాకా ఉంటోంది. సంపన్నులైతే జైపూర్‌లో రూ.కోటి, ఉదయ్‌పూర్‌లో రూ. 1.5 కోట్ల దాకా ఖర్చుచేస్తున్నారు.

గుజరాత్‌ 2
పెళ్లి ఖర్చులో రెండోస్థానం గుజరాత్‌దే. ఇక్కడ సగటు ఖర్చు రూ.14-18 లక్షల మధ్య ఉంటోంది. ఈ రాష్ట్రంలో నాలుగురోజుల పాటు పెళ్లి వేడుకలు నిర్వహిస్తారు. భోజనం, ఇతరత్రా ఏర్పాట్లపై ఎక్కువ ఖర్చు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ 3
పెళ్లి ఖర్చులో రాజస్థాన్‌, గుజరాత్‌లకు తెలుగు రాష్ట్రాలేమీ తీసిపోని విధంగా తయారవుతున్నాయి. ఇక్కడ కొందరు ఐదురోజుల దాకా పెళ్లి వేడుకలు చేస్తారు. నగలు, దుస్తుల కొనుగోలు, రిటర్న్‌గిఫ్ట్‌లు, అలంకరణలు, భోజనాలపై ఎక్కువ ఖర్చుచేస్తారు. మధ్యతరగతి కుటుంబం సగటు ఖర్చు రూ.10-12 లక్షల మధ్య ఉంటోంది.

తమిళనాడు 4
తమిళనాడులో మూడు రోజులు పెళ్లి వేడుకలు నిర్వహిస్తారు. సగటు ఖర్చు రూ.10 లక్షల దాకా ఉంటోంది.

పంజాబ్‌ 5
ఈ రాష్ట్రంలో ఆహారం, అలంకరణలు, దుస్తులపై ఎక్కువగా ఖర్చుపెడతారు. సగటు ఖర్చు రూ.8-10 లక్షల మధ్య ఉంటోంది.

ఎందరు వస్తారో..!

పెళ్లికి పిలిచేటప్పుడు ఎందరు వస్తారో ముందే తెలుసుకోవడం మంచిది. దీనివల్ల ఎందరు వస్తారో అంచనావేసుకుని.. దానికి అనుగుణంగా వంటలు చేయడానికి వీలవుతుంది. ఇది మంచికేనని, వృథా తగ్గుతుందని అంటున్నారు.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.