close

ప్ర‌త్యేక క‌థ‌నం

క్యాన్సర్‌పై సర్కారు పోరు

ముమ్మరంగా ముందస్తు పరీక్షలు
12 జిల్లాల్లో 24 లక్షల మందికి..
 అత్యధికులు సిరిసిల్ల జిల్లాలో, అత్యల్ప కేసులు మెదక్‌లో..
 తొలిదశలో చికిత్సతో పూర్తిగా నయమవుతుందంటున్న నిపుణులు
  నేడు ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినం


హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఆర్‌.లక్ష్మినారాయణ. ఈయన కుమారుడు  ఆర్‌.ధీరజ్‌కుమార్‌(8)కి నాలుగేళ్ల వయసులో తరచూ జ్వరం వచ్చేది. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించాక.. రక్తక్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధరించారు. ఎంఎన్‌జే ఆసుపత్రిలో అబ్బాయిని చేర్పించి, పూర్తిస్థాయిలో ఉచితంగా చికిత్స పొందారు. బాలుడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు.


హైదరాబాద్‌కు చెందిన కె.అనూరాధ(51) మధ్యతరగతి గృహిణి. 46 ఏళ్ల వయసులో రొమ్ముల్లో అసహజమైన మార్పులు జరుగుతున్నట్లుగా పసిగట్టారు. వైద్యులు క్యాన్సర్‌ అని నిర్ధరించారు. 2015లో ఎంఎన్‌జే ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.


ఈ రెండు కేసుల్లోనూ ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను నిర్ధరించడంతో చికిత్స సాధ్యమయింది. క్యాన్సర్‌ వచ్చిందని తెలియగానే కుంగిపోకుండా ధైర్యంగా వ్యవహరించడం కూడా క్యాన్సర్‌పై విజయానికి కారణమైనట్లు ఈ వ్యాధిని జయించినవారు, వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.



ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌పై తెలంగాణ ప్రభుత్వం విస్తృత కార్యాచరణను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 24 లక్షల మందికి పైగా క్యాన్సర్‌ ముందస్తు పరీక్షలు నిర్వహించారు. సుమారు 7 వేల మంది గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్‌ అనుమానితులను గుర్తించి, నిర్ధరణ కోసం వీరిని సమీపంలోని ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులకు పంపించారు. గతేడాది ముందస్తు క్యాన్సర్‌ పరీక్షల్లో అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 144 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కేసులను, అత్యల్పంగా మెదక్‌ జిల్లాలో 73 రొమ్ము క్యాన్సర్‌ కేసులను నిర్ధరించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

కుంగుబాటుకు.. స్థైర్యానికి మధ్య 12% వ్యత్యాసం
క్యాన్సర్‌ విజేతల్లో ఎక్కువ భాగం ఉమ్మడి కుటుంబాల్లో ఉండగా.. వ్యష్టి కుటుంబాల్లో రోగులు కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారని ఇటీవల ఒక అధ్యయనం పేర్కొంది. వీరిద్దరి మధ్య 12% వ్యత్యాసం ఉందని తేల్చింది. ప్రపంచంలో మరణాలకు దారితీసే ముఖ్యకారణాల్లో మొదటిది గుండెపోటు.. రెండోస్థానంలో నిలిచేది క్యాన్సర్‌. 30-40 ఏళ్ల వయసులోనూ 10% క్యాన్సర్‌ కేసుల పెరుగుదల ఉండటం ఆందోళన కలిగించే అంశం.

ముందస్తు పరీక్షలను విస్తరిస్తాం

తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్‌పై యుద్ధం ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే క్యాన్సర్‌లను గుర్తించే పరీక్ష విధానాలపై నర్సులు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చాం. జీవనశైలి వ్యాధుల నివారణ పథకంలో భాగంగా రాష్ట్రంలో సిరిసిల్ల, జగిత్యాల, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ పట్టణ, వరంగల్‌ గ్రామీణ, మెదక్‌, సంగారెడ్డి, సిద్ధిపేట, 12 జిల్లాల్లో క్యాన్సర్‌ను కనుగొనే ముందస్తు పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షల విధానాన్ని విస్తరించనున్నాం.

 
- డా. విక్రమ్‌, సంయుక్త సంచాలకులు, జీవనశైలి వ్యాధుల నివారణ పథకం

 

విస్తృత అవగాహన కల్పించాలి

‘హెపటైటిస్‌ బి, సి’లు కాలేయ క్యాన్సర్లకు, హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రావడానికి కారణమవుతున్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు టీకా అందుబాటులో ఉంది. 8-18 ఏళ్ల వయసు వాళ్లకు ఈ టీకా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కాలేయ క్యాన్సర్‌కు హెపటైటిస్‌ టీకా ఉంది. 40 ఏళ్లు దాటిన మహిళ ప్రతి ఏడాదికోసారి మ్యామోగ్రఫీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవాలి.

- డాక్టర్‌ శ్రీకాంత్‌, క్యాన్సర్‌ శస్త్రచికిత్స నిపుణులు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.