close

ప్ర‌త్యేక క‌థ‌నం

పల్లెకు ఊతం.. పేదలకు ఉపాధి

గ్రామాలకు కీలకం- ఉపాధి హామీ పథకం
సక్రమంగా వినియోగించుకుంటే పలు మౌలిక సదుపాయాలు
పనుల ఎంపిక, పర్యవేక్షణ బాధ్యతలు పంచాయతీలవే
2019-20లో రూ.4 వేల కోట్లు ఖర్చుపెట్టాలనే యోచన

ఈనాడు, హైద‌రాబాద్‌

పంచాయతీల కొత్త పాలకవర్గాలు బాగా దృష్టి సారించగలిగితే ఉపాధి హామీ పథకం.. పల్లెలకు పెద్ద అండగా నిలవనుంది.  గ్రామానికి అవసరమని భావించిన వివిధ రకాల మౌలిక వసతులను ఈ పథకం ద్వారా కల్పించవచ్చు. పనుల ఎంపిక, లబ్ధిదారులకు ఉపాధిని చూపించే బాధ్యతలు గ్రామ పంచాయతీకే ఉంటాయి.  రాష్ట్రంలో 2019-20లో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4 వేల  కోట్ల మేర ఖర్చుపెట్టాలనే ప్రతిపాదనలు ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుత (2018-19) ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు చేపట్టిన పనుల విలువ రూ.2,819 కోట్ల మేర ఉండగా రూ. 2,795 కోట్లు కేంద్రం నుంచి అందాయి.పథకం అమలులో కేంద్రం మరికొన్ని సంస్కరణలను తీసుకురావొచ్చని తెలుస్తోంది.  ఉపాధి హామీని వ్యవసాయానికి, పారిశుద్ధ్యానికి అనుసంధానం చేయాలని,  ఏడాదిలో పని కల్పించే దినాల సంఖ్యను 100 నుంచి 150కు పెంచాలనే విజ్ఞప్తులను రాష్ట్ర సర్కారు చాలా కాలంగా చేస్తూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు పలు కొత్త పంచాయతీలు ఏర్పడినందున మరింతమంది బడుగు వర్గాల వారికి  పనులు లభించనున్నాయి.  పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివిధ పథకాల్లో కేంద్రానికి చెందిన  ఉపాధి హామీ పథకం కీలకమైనది. బడుగు జీవులు బతుకు తెరువుకోసం ఎక్కడికీ వెళ్లనక్కరలేకుండా.. గ్రామ పరిధిలోనే ఏటా వంద రోజుల పాటు పనులను కల్పించటం ఈ పథకం లక్ష్యం. పనులు కావలసిన వారు పంచాయతీ కార్యాలయంలో తమ దరఖాస్తులను అందజేస్తే సరిపోతుంది. సరైన పర్యవేక్షణ లేకపోవటంతో పనులు కూడా నాసిరకంగానూ ఉంటున్నాయి. అవకతవకల పాళ్లూ ఎక్కువనేనని సామాజిక తనిఖీల్లో బయటపడుతోంది. 2017-18లో రూ.2 వేల కోట్లు ఖర్చు చూపించిన పనులకు సామాజిక తనిఖీ చేయగా.. అందులో రూ.244 కోట్ల (12 శాతం) మేర నిధులు దుర్వినియోగం అయినట్టు బయటపడింది.

కొత్త పాలకవర్గాల కృషి కీలకం
పంచాయతీ పాలకవర్గాలు సమర్థంగా వ్యవహరిస్తే ఉపాధి హామీ పథకం ఊళ్లకు ఎంతో మేలు చేస్తుంది. పంచాయతీల సంఖ్య 8,684 నుంచి 12,734కు చేరినందున మునుపటి కంటే ఎక్కువ మందికి చేయూతను ఇచ్చేందుకు వీలవుతుంది. క్షేత్ర స్థాయి సహాయకులను, ఇతర సిబ్బందిని కొత్త పంచాయతీల వారీగా నియమించాల్సిన అవసరం ఉంది.

పథకం అమలులో ఎవరి బాధ్యతలు ఏవనేది వివరిస్తూ కేంద్రం వెలువరించే మార్గదర్శకాలను  తెలుగులోకి అనువదించి అన్ని పంచాయతీల్లో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక నేతలు అంటున్నారు.

ఇవీ సమస్యలు
ఏడాదికి వంద రోజుల పనులను కల్పించాలని చట్టం చెబుతున్నప్పటికీ దాన్ని కచ్చితంగా అమలు చేసే యంత్రాంగం కొరవడింది. పంచాయతీల పాలకవర్గాల ఉదాసీనతా ఒక కారణం. దీంతో ఏటా రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి సగటున 42 రోజుల పాటు మాత్రమే పని లభిస్తోంది. పనులు లేకపోతుండటంతో చట్టం లక్ష్యం నీరుగారి.. కొన్ని ప్రాంతాల వారు వలసదారి పట్టక తప్పటం లేదు. పని దినాలు తక్కువ కావటంవల్ల  రోజువారి వేతనం ఒక్కొక్కరికి 2017-18లో కేవలం రూ.139 చొప్పున మాత్రమే అందింది. కోరిన వారందరికీ 15 రోజుల్లోగా  ఉపాధిని చూపించకపోతే వారికి నిరుద్యోగ భృతిని ఇవ్వాలని, పనిచేసిన 15 రోజుల్లోగా వేతనాన్ని ఇవ్వకుంటే ఆలస్యమైన రోజులకు వడ్డీని చెల్లించాలని నిబంధనలున్నాయి. కానీ ఆచరణలో అవేమీ అమలు కావడం లేదు.

రాష్ట్రంలోఉపాధి హామీ పథకం తీరు
* ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టిన పనుల విలువ (రూ.లలో) : 2,819 కోట్లు
* వచ్చే ఆర్థిక సంవత్సరం(2019-20) చేపట్టనున్న పనుల విలువ : 4 వేల కోట్లు
* రాష్ట్రంలో పేర్లను నమోదు చేయించుకొన్నవారి సంఖ్య : 1.16 కోట్లు
* వారిలో పనుల్లో పాల్గొంటున్నవారు   : 59 లక్షలు
* పనిచేసేవారిలో ఎస్సీలు               : 16 శాతం
* పనిచేసేవారిలో ఎస్టీలు         : 12 శాతం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.