close

ప్ర‌త్యేక క‌థ‌నం

పెద్దపులికే హడల్‌

ఉచ్చు విసురుతున్న వేటగాళ్లు
విద్యుత్తు తీగలతో యమపాశాలు
కదలికల్ని ట్రాక్‌ చేస్తున్న ముఠాలు
 జాడలేని అరడజను పెద్దపులులు.. చిరుతలకు లెక్కేలేదు
దుప్పులు, లేళ్లు.. అడవిపందులు.. అన్నిరకాల వన్యప్రాణులకూ మరణశాసనం

అడవిలో భయమన్నదే ఎరుగనిది పెద్దపులి. అయితే ఇప్పుడు అది అడుగుతీసి అడుగు వేసేందుకు హడలిపోతోంది. పులి కనిపించిందని తెలిస్తే చాలు వేటగాళ్ల ముఠాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. కరెంటు తీగలతో యమపాశాలు విసురుతున్నాయ్‌. నెలరోజుల వ్యవధిలో రాష్ట్రంలో రెండు పులుల్ని చంపేశారు.. రెండున్నరేళ్ల వ్యవధిలోనే ఐదు పెద్దపులుల్ని హతమార్చారు. చిరుతల సంఖ్య అయితే లెక్కేలేదు. అటవీ అధికారులు జంతుగణన, ఇతరత్రా పేర్లతో అడవుల్లో వేల సంఖ్యలో కెమెరా ట్రాప్‌లు పెట్టారు. సిబ్బందికి కొదవలేదు. అయినా వేటగాళ్లను వీరు వెంటాడలేకపోతున్నారు.అడవిలో యథేచ్ఛగా సాగిపోతున్న వేటపై క్షేత్రస్థాయి అధ్యయనంతో ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

వేటు గాళ్లు
విద్యుత్తు తీగలతో యమపాశాలు
ఉచ్చు విసురుతున్న వేటగాళ్లు
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పులులు హతం
ఇక్కడకు వచ్చినవి వచ్చినట్లే ఖతం
కదలికల్ని ట్రాక్‌ చేస్తున్న ముఠాలు
తెలంగాణలో జాడలేని అరడజను
   పెద్దపులులు.. చిరుతలకు లెక్కేలేదు
దుప్పులు, లేళ్లు.. అడవిపందులు.. అన్నిరకాల వన్యప్రాణులకూ మరణశాసనం

దట్టమైన అటవీప్రాంతం.. అల్లుకున్న పచ్చదనం.. వాటి నడుమ స్వేచ్ఛగా సంచరించాల్సిన వన్యప్రాణులు నేడు అడుగు తీసి అడుగు వేయాలంటేనే వణికిపోతున్నాయ్‌. ఏ మూల నుంచి వేటగాడి బాణం వస్తుందో.. మరెటువైపు నుంచి బుల్లెట్‌ దూసుకొస్తుందో.. నేల మీద ఎక్కడ ఉచ్చు దాగి ఉంటుందో.. యమపాశాల్లాంటి కరెంటు తీగలు ఎక్కడ కాలికి తగులుతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ పొదల్లో దాక్కుంటున్నాయ్‌. బెంగతో చచ్చిపోతున్నాయ్‌.. ఇదీ తెలంగాణలోని వన్యప్రాణుల దుస్థితి. డ్రగ్స్‌, ఆయుధాల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉన్నది వన్యప్రాణులకే. పెద్దపులి, చిరుతలే కాదు.. ముంగీస, కొండచిలువ, చింపాంజీలకూ భారీ డిమాండ్‌ ఉంది. అందుకే వేట యథేచ్ఛగా సాగిపోతోంది.

వలసాల వీరభద్రం, సుతారపు సోమశేఖర్‌
ఈనాడు ప్రత్యేక ప్రతినిధులు

పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలోని అడవుల్లో పులుల జాడ కోసం అటవీశాఖ కెమెరాలను అమర్చింది. కొద్దికాలం క్రితం వరసగా పెద్దపులులు కెమెరా కంటికి చిక్కాయి. ప్రస్తుతం వాటిలో దాదాపు అరడజను పెద్దపులుల జాడ ప్రస్తుతం దొరకడం లేదు. హఠాత్తుగా అవన్నీ ఎందుకు మాయమయ్యాయి? వేటగాళ్ల చేతిలో హతమయ్యాయా.. అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దపులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించిన కవ్వాల్‌ అభయారణ్యం వేటగాళ్లకు స్వర్గధామంగా మారిపోయింది. అటవీ ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతున్న వన్యప్రాణుల వేటను పరిశీలించేందుకు వేటగాళ్లు పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల పెద్దపులుల్ని వధించిన శివ్వారం, పెంబి సహా తెలంగాణలోని అటవీ ప్రాంతాలను ‘ఈనాడు’ ప్రతినిధులు పరిశీలించారు. అడవిలో వేటగాళ్ల ఇష్టారాజ్యం నడుస్తున్నట్లు తెలుస్తోంది.

కాసులిస్తే ఇంటికే వన్యప్రాణి మాంసం

నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, దేవరకొండ, కొత్తగూడెం, మంథని, మహదేవపూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి వంటి ప్రాంతాల్లో జింకలు, కొండగొర్రెలు, అడవిపందుల మాంస విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు వేటగాళ్లు దాబాలకు, కొంతమంది ధనవంతుల ఇళ్లకు వన్యప్రాణుల మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. సొమ్ములిస్తే ఎలాంటి మాంసాన్ని అయినా సరఫరా చేసేవారున్నారు. వన్యప్రాణిని బట్టి కిలో ధర రూ.200-400 వరకు పలుకుతోంది. మంచిర్యాల, పెంబి వంటిచోట్ల జింక మాంసం దొరుకుతుందా? అని ‘ఈనాడు’ ప్రతినిధులు అడిగినప్పుడు ఒకరోజు ముందు చెబితే చాలన్న సమాధానం వచ్చింది. మరికొందరు సరదా కోసం షికారా (వేట) చేస్తున్నారు. అడవుల్లోకి వెళ్లి చంపేస్తున్నారు.

‘రాయల్‌ బెంగాల్‌’కే దడ

డిసెంబరులో మహారాష్ట్ర నుంచి రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా అటవీ ప్రాంతంలోకి వచ్చింది. జన్నారం డివిజన్‌లో డిసెంబరు 15న అది కెమెరా కంటికి చిక్కింది. 24 వరకు ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు సమాచారం. తర్వాత వారంలోపే కరెంటు తీగల షాక్‌తో ఆ పులి చనిపోయింది. చర్మం వలిచి, గోళ్లు తీసి విక్రయించే ప్రయత్నంలో స్థానిక ముఠా ఒకటి జనవరి 24న పట్టుబడింది. ఈ ఘటనకు పక్షంరోజుల ముందే పెంబి అటవీరేంజ్‌ పరిధిలోని పుల్గంపాండ్రి అటవీప్రాంతంలో విద్యుత్‌ తీగలు పెట్టి చంపిన పులి చర్మాన్ని ఇచ్చోడలో విక్రయించే ప్రయత్నంలో మరో ముఠా పట్టుబడింది. ఇక్కడ అడవిలో దాదాపు 2 కి.మీ. మేర విద్యుత్తు తీగలను అమర్చడం గమనార్హం.

పులి పడితే జాక్‌పాట్‌

* పులి ఉచ్చులో పడితే వేటగాళ్ల పంట పండినట్లే. గోళ్ల నుంచి చర్మం, ఎముకలు.. ఇలా ప్రతీ భాగంనుంచీ కాసులు పిండుకుంటున్నారు.
* ఇటీవల పట్టుబడిన వేటగాళ్లు పెద్దపులి చర్మాన్ని రూ. 25 లక్షల వరకు బేరం పెట్టినట్లు సమాచారం.
* పెద్దపులి చర్మం, గోళ్లు, ఎముకలకు డిమాండ్‌ ఉండటంతో అంతర్‌రాష్ట్ర ముఠాలు, స్థానిక ముఠాల సాయంతో పెద్దపులుల కోసం వేట సాగిస్తున్నాయి.
* పెద్దపులి, చిరుతే కాదు.. ముంగీస, తాబేలు, చింపాంజి, కొండచిలువలకూ అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది.
* జంతువుల జాడ తెలుసుకోవడం కోసం వేటగాళ్లు సమీప గ్రామాల్లోని వారికి డబ్బులు ఎర వేస్తున్నారు. జాడ తెలియగానే వల వేస్తున్నారు.

మొబైల్‌ కరెంటు ఉచ్చులు

జంతువుల్ని చంపడానికి వేటగాళ్లు మొబైల్‌ కరెంటు ఉచ్చులు పెడుతున్నారు. చెట్ల మొదళ్లకు వైర్లు చుడుతున్నారు. బ్యాటరీలు, ఇన్వర్టర్లను ఉపయోగించి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. మధ్యలో గొర్రె పిల్లలను, మాంసాన్ని ఎర వేస్తున్నారు. వాటికోసం వచ్చే అడవి జంతువులు విద్యుత్‌ తీగలు తాకి చనిపోతున్నాయి.

కేసుల ఊసులివి..

* వన్యప్రాణుల వధ సంఘటనల్లో నమోదవుతున్న కేసులు 1 నుంచి 5 శాతమే.. వెలుగులోకి రానివి ఎన్నో.
* ఏడాదిన్నర క్రితం ఉమ్మడి వరంగల్‌ జిల్లా మహాదేవపూర్‌ ప్రాంతం పలిమెల అటవీప్రాంతంలో రెండు దుప్పుల్ని కాల్చిచంపిన కేసులో ఓ పార్టీ నాయకుడు సహా షూటర్‌, మరో ఎనిమిదిమందిని అరెస్టు చేశారు.
* నిర్మల్‌ జిల్లా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో నీల్గాయిని వేటాడి చంపగా దాని మాంసాన్ని డిసెంబరు 31న గుగ్లావత్‌ ప్రకాశ్‌ అనే వ్యక్తి ఇంట్లో పట్టుకున్నారు. ఈ కేసులో అటవీశాఖ ముగ్గురు అధికారులపై కేసు పెట్టింది. ఈ కేసులో ఓ నిందితుడు పెంబిలో పెద్దపులిని చంపిన కేసులోనూ ఉన్నాడు.

* రెండేళ్లక్రితం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి పెద్దపులి చర్మాన్ని హైదరాబాద్‌కు తీసుకువెళ్లే క్రమంలో కొందరు నిందితులు పట్టుబడ్డారు.
* కాగజ్‌నగర్‌ మండలం కదంబిలోని ఓ గుహలో ఫాల్గుణ అనే పెద్దపులి మూడేళ్ల క్రితం నాలుగు, ఆ తర్వాత మరో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో ఇప్పుడు మూడు, నాలుగే కనిపిస్తున్నాయి. మిగిలినవి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయాయని అధికారులు చెబుతుంటే.. వన్యప్రాణి సంరక్షణ సంస్థలవారు మాత్రం  వేటగాళ్లకు చిక్కి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

3 ఏళ్లు 241 కేసులు

* గత మూడేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా అటవీశాఖ నమోదుచేసిన కేసులు 241.
* ఒక్క కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో నమోదైన కేసులు 64 (25 శాతం)

ముంగీస వెంట్రుకలు కిలో రూ.లక్షన్నర

మృదువుగా ఉండే ముంగీస వంటిపై వెంట్రుకలను మేకప్‌ బ్రష్‌ల తయారీకి వాడుతుంటారు. 40 ముంగీసలను చంపితే కిలో వెంట్రుకలు తూగుతాయి. అవి కిలో ధర రూ. 1.5 లక్షల వరకు పలుకుతున్నాయి. అందుకే వేటగాళ్లు ఈ అమాయక ప్రాణులను వందల సంఖ్యలో వధిస్తుంటారు.

కెమెరా ట్రాప్‌లు.. మందీ మార్బలం

జంతుగణన ఇతరత్రా పేర్లతో అటవీ అధికారులు అడవుల్లో వేల సంఖ్యలో కెమెరా ట్రాప్‌లు పెట్టారు. అయినా వేటగాళ్లను వెంటాడలేకపోతున్నారు. ఇక్కడి పులులు ఎప్పుడో మాయమయ్యాయి. పొరుగురాష్ట్రాల నుంచి అతిథిలా వచ్చినవాటినీ కాపాడలేకపోతున్నారు. పెద్దపులి కనిపించగానే తమ ప్రాంతంలో ఉందంటూ అధికారులు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ దాని రక్షణ మరిచిపోతున్నారు. వేటగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తమ పని కానిచ్చేస్తున్నారు.

సమస్య ఎక్కడ ఉంది?

* అటవీశాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. జిల్లాల్లో లేరు.
* ఇక పోలీసుశాఖలో అటవీ విభాగం లేకపోవడంతో వారు మామూలు కేసులే నమోదు చేస్తున్నారు.
* వేటాడుతున్న కేసుల్లో నమోదవుతున్నవి 5 శాతం లోపే.
* వేటగాళ్లు దొరికితే కేసులు ఉండడంలేదు. కేవలం జరిమానాలతో వదిలేస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారైతే జరిమానాలు కూడా లేనట్లే!

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.