close

ప్ర‌త్యేక క‌థ‌నం

మామూళ్ల పైకం.. అధికారులకు మైకం

నిషేధిత ప్లాస్టిక్‌ సంచుల తయారీని పట్టించుకోని బల్దియా
ఆమ్యామ్యాల అడ్డాగా కాటేదాన్‌
నెలకు అక్షరాలా రూ.అరకోటికి పైగా వసూళ్లు

* కాటేదాన్‌లో 780 పరిశ్రమల భవనాల్లో ప్లాస్టిక్‌ సంచుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇందులో 520 యూనిట్లలో 50 మైక్రాన్లలోపు సంచులనే తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రోజుకు అయిదు టన్నుల చొప్పున నెలకు లక్ష టన్నులకు పైగా సంచుల ఉత్పత్తి జరుగుతోందని అనధికారిక సమాచారం.
* ప్లాస్టిక్‌ అంటేనే పర్యావరణ విఘాతం.. అందులోనూ నాసిరకం సంచులు చేసే హాని అంతా ఇంతా కాదు. రాష్ట్ర రాజధానిలో రోజూ వేలాది టన్నుల నిషేధిత ప్లాస్టిక్‌ సంచులు తయారుచేస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ఇక్కడి నిషేధిత ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కొందరు బల్దియా అధికారులకు నెలకు అక్షరాలా అరకోటి రూపాయలకు పైగా మామూళ్లు అందుతున్నాయంటే దందా ఏ స్థాయిలో సాగుతోందో అవగతమవుతోంది.

పర్యావరణానికి తీవ్ర విఘాతంగా మారిన 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ సంచుల ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్‌ మారిపోయింది. రాజేంద్రనగర్‌ మండలం కాటేదాన్‌ కేంద్రంగా 520 కర్మాగారాలు వేల టన్నుల నిషేధిత ప్లాస్టిక్‌ సంచులను అక్రమంగా తయారు చేసున్నాయి. కొన్నేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ సంచుల తయారీని నిషేధించింది. కిరాణా, మాంసం దుకాణాలతో పాటు ఇతర చిన్న వ్యాపారులు నిషేధించిన సంచులనే ఉపయోగిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ సంచుల తయారీ పరిశ్రమపై ‘ఈనాడు’ ప్రతినిధి దృష్టి సారించినపుడు పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాటేదాన్‌ పారిశ్రామికవాడలో వివిధ కారణాలతో పలు పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిని కొందరు అద్దెకు తీసుకొని కొన్నేళ్లుగా నిషేధిత ప్లాస్టిక్‌ సంచులను తయారు చేస్తున్నారు. కోల్‌కతా, ముంబయి మహానగరాలతో పాటు దేశంలోని సగం రాష్ట్రాలకు సంచులు రవాణా అవుతున్నాయి. రవాణా అధికారులు ప్లాస్టిక్‌ సంచుల లారీలను పట్టుకున్నపుడు కేవలం బరువు ఎక్కువ ఉంటే జరిమానా వేస్తున్నారు తప్ప నిషేధిత సరకును తరలించడంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌ కేంద్రంగా తెలుగు రాష్ట్రాలకు సరకు సరఫరా అవుతోంది.

మామూళ్ల కోసమే దాడులు
జీహెచ్‌ఎంసీ అధికారులు కఠిన వైఖరిని అవలంబిస్తే కాటేదాన్‌ నుంచి నిషేధిత సంచులు ఉత్పత్తి కావు. కానీ కొందరు అధికారులకు ఇదో ఆదాయ వనరుగా మారింది. బల్దియా కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినపుడు, మామూళ్లు తమకు తగ్గాయన్న సమయంలో కింది స్థాయి అధికారులు ఈ పరిశ్రమలపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. వీరికి అందే మామూళ్లు నెలకు రూ.55 లక్షల వరకు ఉంటాయని పలువురు చెబుతున్నారు. ఇటీవల నాలాల పూడికను తీస్తే వివిధ ప్రాంతాల్లో 30 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వచ్చాయి. రోజూ 4500 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తవుతుంటే అందులో అధికభాగం ప్లాస్టిక్‌ వ్యర్థాలదే అని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక నిఘా బృందాల నియామకం
ఈ మొత్తం వ్యవహారంపై బల్దియా విజిలెన్సు విభాగాధిపతి విశ్వజిత్‌ కాంపాటి దృష్టి సారించారు. ఇప్పటికే కాటేదాన్‌కు కొందరు అధికారుల బృందాన్ని పంపి వివరాలను సేకరిస్తున్నారు. ఇక్కడి యూనిట్లన్నీ ముందు భాగంలో తలుపులకు తాళం వేసి లోపల ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ఎవరైనా దాడులకు వస్తున్నారని సమాచారం తెలిస్తే అప్పటి 50 మైక్రాన్ల పైబడిన సంచులను చూపి.. వాటినే ఉత్పత్తి చేస్తున్నామని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటినీ వెలుగులోకి తీసుకువచ్చి కాటేదాన్‌లో నిషేధిత సంచుల తయారీని పూర్తిగా నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని విశ్వజిత్‌ ‘ఈనాడు’కు తెలిపారు. అవసరమైతే తమ సిబ్బందిని కొన్నాళ్లపాటు ప్రతేక్య నిఘా బృందంగా నియమించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.