close

ప్ర‌త్యేక క‌థ‌నం

రెండో పీజీ విద్యార్థులపై డేగ కళ్లు

చట్టబద్ధ నివాసం కోసం నిబంధనలు
అతిక్రమిస్తున్నారనే అనుమానం
గదులకు వెళ్లి ఆరా... కొందరికి తాఖీదులు
అమెరికా వలస విభాగ అధికారుల చర్యలు
అప్రమత్తమై వెనుదిరిగే యత్నాల్లో భారతీయ విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: రెండో పీజీ పేరిట భారతీయ విద్యార్థులు తమ విశ్వవిద్యాలయాల్లో చేరి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని భావిస్తున్న అమెరికా అధికారులు అటువంటి వారిపై నిఘా తీవ్రతరం చేశారు. అమెరికాలో స్థిరపడాలన్న లక్ష్యంతో విద్యార్థులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) అధికారులు అనుమానిస్తూ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అయిదేళ్లకు పైబడి దేశంలోనే నివసిస్తున్న వారి వివరాలను ఆరా తీస్తున్నారు. విద్యార్థులు ఉండే గదులు, ఇళ్లకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానానికి హాజరు కావాలని కొందరికి తాఖీదులు (నోటీసు) కూడా జారీ చేస్తున్నారు. రెండో పీజీ చేస్తున్న భారతీయ విద్యార్థులు తమ దేశంలో ఎంత మంది ఉన్నారనే పక్కా సమాచారం ఐసీఈ విభాగం వద్ద ఉందని తెలుస్తోంది.

గడువు ముగిసేలోగా హెచ్‌1బీ వీసా లభిస్తే..
అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం(స్టెమ్‌) మాస్టర్‌ డిగ్రీ(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు పొందే వారికి రెండేళ్ల చదువుతో పాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) పేరిట మూడేళ్ల పాటు కోర్సుకు సంబంధించిన పూర్తి కాల ఉద్యోగం చేయొచ్చు. ఆ గడువు తీరే లోపు హెచ్‌1బీ వీసా పొందితే ఆరేళ్లపాటు (మొదట 3, తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తారు) ఉద్యోగం చేయడానికి వీలవుతుంది.

ఫార్మింగ్టన్‌ వ్యవహారంతో నిఘా తీవ్రం
ప్రపంచంలోని వివిధ దేశాల వారు అమెరికా హెచ్‌1బి వీసాల కోసం ఏటా 2 లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకుంటుండగా వారిలో 85 వేల మందికే జారీ అవుతున్నాయి. అందుకే భారతీయ విద్యార్థులు అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్నారన్న హోదా (స్టేటస్‌) కోసం మరో రెండేళ్లపాటు అక్కడే ఉండేందుకు రెండో పీజీ చేస్తున్నారు. అందులోనూ తక్కువ రుసుములు ఉండే వర్సిటీల్లో, తరగతులు జరగని వాటిల్లో చేరుతూ నిబంధనలకు విరుద్ధంగా పూర్తికాల ఉద్యోగాలు చేస్తున్నారని అమెరికా భావిస్తోంది. తాజాగా ఫార్మింగ్టన్‌ విశ్వవిద్యాలయం వ్యవహారంతో రెండో పీజీ విద్యార్థులపైనా ఆరా తీస్తున్నారు. మొదటి పీజీలో ఓపీటీ ద్వారా ఉద్యోగం చేసిన వారికి రెండో పీజీలో ఓపీటీ ఇవ్వరు. కాకపోతే వారానికి 20 గంటలకు మించకుండా కరికులమ్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(సీపీటీ) ద్వారా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయవచ్చు.

ఆరా తీస్తున్నారు...నోటీసులు ఇస్తున్నారు
ఐసీఈ అధికారులు విద్యార్థులు ఉండే ఇళ్లు, గదులకు వచ్చి రెండో పీజీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో కూపీ లాగుతున్నారు. సరైన సమాధానాలు చెప్పని వారికి నోటీసులు ఇస్తున్నారు. కాలిఫోర్నియాలో రెండో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న ఒక తెలుగు విద్యార్థికి నోటీసులు ఇచ్చి మార్చి 14న న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించారని, ఆ విద్యార్థి సహాయం కోసం తనకు ఫోన్‌ చేశారని అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్‌ విల్లే నగరంలో ఓ వర్సిటీలో సహ ఆచార్యుడుగా పనిచేస్తున్న పల్లా కిశోర్‌ తెలిపారు. ఫార్మింగ్టన్‌ వర్సిటీలో 600 మంది ప్రవేశాలు పొందినా 130 మందిని మాత్రమే అక్రమ వలసదారులుగా పేర్కొంటూ అక్కడి అధికారులు నిర్బంధించారు. ఈ క్రమంలో మిగిలినవారు అప్రమత్తమై ఎవరికి వారు స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

చట్టబద్ధంగా ఉండేందుకే ఈ పాట్లు

మెక్సికో లాంటి పలు దేశాల వారు చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటుంటారు. భారతీయ విద్యార్థులు చట్టబద్ధంగా నివసించటం కోసం రెండో పీజీ చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక తెలుగు విద్యార్థి నాలుగు పీజీలు కూడా చేశాడు. రెండో పీజీ చేసే వారిపై నిఘా ఉందని ప్రచారం జరుగుతుండటంతో కొందరు పీహెచ్‌డీ కోర్సులో చేరుతున్నారు. అప్పుడు పీజీ, పీహెచ్‌డీ వేర్వేరు కాబట్టి పీహెచ్‌డీలో మళ్లీ ఓపీటీ కూడా చేయొచ్చు. విద్యార్థులకు చదువుపరంగా ఎటువంటి మార్గదర్శకం కావాలన్నా నేను ఉచితంగా సహాయం చేస్తాను.

- పల్లా కిశోర్‌, సహాయ ఆచార్యులు, అమెరికా

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.