close

ప్ర‌త్యేక క‌థ‌నం

రూ.919 కోట్లు కోల్పోయిన ఏపీ

  వెనుకబడిన జిల్లాల విషయంలో బుందేల్‌ఖండ్‌తో పోలిస్తే తేలిన లెక్క ఇది
  లోక్‌సభలో కేంద్ర మంత్రి సమాధానంతో వెలుగులోకి...

ఈనాడు, దిల్లీ: బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ కింద మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాలకు 2009లో మొత్తం రూ.7,466 కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘తరచూ ఎదురయ్యే కరవు, వరదలు, తుపాన్ల వంటి ప్రత్యేక సమస్యలు ఎదుర్కోవడానికి రాష్ట్రాలు, జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో విస్తరించిన బుందేల్‌ఖండ్‌కు 2009లో కేంద్ర ప్రభుత్వం రూ.7,466 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. 2009-10 నుంచి 2017-18 (2018 మార్చి 31వరకు) ఈ ప్యాకేజీ కింద రూ.6,257.35 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు రూ.3,107.87 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.3,149.48 కోట్లు దక్కింది. ప్రస్తుతం బుందేల్‌ఖండ్‌ లాంటి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే ఉద్దేశం లేదు’’ అని కేంద్ర మంత్రి ప్రకటించారు.

అక్కడ రూ.481 కోట్లు.. ఏపీకి రూ.350 కోట్లు
లోక్‌సభా ముఖంగా కేంద్ర మంత్రి బుధవారం ఇచ్చిన సమాధానం ఆంధ్రప్రదేశ్‌ విషయంలో 2015 డిసెంబర్‌ 1న నీతి ఆయోగ్‌ ఇచ్చిన నివేదికకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ నివేదికలో బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీని ఉదాహరణగా చూపుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు ఒక్కో దానికి ఏటా రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లు ఇస్తే సరిపోతుందని సిఫార్సు చేసింది. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ కింద ఒక్కో జిల్లాకు సగటున రూ.296 కోట్లు మాత్రమే ఇచ్చారని, దాంతో పోలిస్తే ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు చొప్పున ఇవ్వడం ఎక్కువేనని పేర్కొంది.  బుధవారం లోక్‌సభలో కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం చూస్తే బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీని ఏడేళ్ల కాలపరిమితికి ప్రకటించారు. సగటున ఒక్కో జిల్లాకు రూ.574.30 కోట్ల చొప్పున 13 జిల్లాలకు కలిపి రూ.7,466 కోట్లు కేటాయించారు. చివరకు ఏడేళ్లలో ఒక్కో జిల్లాకు రూ.481.33 కోట్లు విడుదల చేశారు. ఇది నీతి ఆయోగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు సిఫార్సు చేసిన దానికంటే రూ.131 కోట్లు అధికం. ఏడు జిల్లాలకు కలిపితే ఏపీ రూ.919కోట్లు కోల్పోయినట్లు లెక్క. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ కంటే తక్కువగా సిఫార్సు చేసిన మొత్తాన్ని కూడా ఇప్పుడు కేంద్రం నిలిపేయడంతో దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాల్సి వస్తోంది.

నాలుగేళ్లలో రూ.628 కోట్ల ఎంపీ నిధుల ఖర్చు
ఆంధప్రదేశ్‌లో ఎంపీల్యాడ్స్‌ కింద గత నాలుగేళ్లలో మొత్తం రూ.628.17 కోట్లు ఖర్చుచేసి 17,513 పనులు పూర్తిచేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్‌ గోయెల్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ 2015-16 నుంచి 2018-19 వరకు రాష్ట్రానికి రూ.590 కోట్లు ఎంపీల్యాడ్స్‌ కింద కేంద్రం మంజూరు చేయగా, పాత నిధులతో కలిపి రూ.628.17 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

సుప్రీంకోర్టులో పెండింగ్‌ కేసులు 56,994
సుప్రీంకోర్టులో జనవరి 31 నాటికి 56,994 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పి.పి.చౌదరి తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌ కేసులు, న్యాయమూర్తుల ఖాళీలపై విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినాని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అన్ని హైకోర్టుల్లో కలిపి 42,45,775 కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో 3,63,146 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో న్యాయాధికారులకు సంబంధించి 22,833 పోస్టులకు గానూ 17,701 మంది ఉన్నారన్నారు. ఏపీ హైకోర్టులో 24 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని పి.పి.చౌదరి తెలిపారు. హైకోర్టులో జడ్జి పోస్టుల ఖాళీపై అనంతపురం ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జడ్జి పోస్టుల భర్తీని నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు.

కడప విమాన సర్వీసుకు డిమాండ్‌
ప్రయాణికులకు లాభించిన ఉడాన్‌ పథకం

కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్‌ పథకం వల్ల కడప నుంచి అటు చెన్నై... ఇటు విజయవాడ, హైదరాబాద్‌కు నడుస్తున్న విమానాలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. టర్బోమేఘా సంస్థ ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది.  రూ.2వేల లోపే టికెట్‌ లభిస్తుండటంతో కలిసివచ్చింది. ఎక్కువగా ప్రయాణికులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండగా... ఆ తర్వాతి స్థానాల్లో విజయవాడ, చెన్నైలు ఉన్నాయి. హైదరాబాద్‌-కడప మధ్య 66,135 మంది (సగటున 75.5% సీట్లు), చెన్నైకు 39,142 మంది (65%), విజయవాడకు 34,146 మంది (73.5%) రాకపోకలు సాగించారు. కడప నుంచి చెన్నైకు 849, విజయవాడకు 650, హైదరాబాద్‌కు 1,230 విమాన సర్వీసులు తిరిగాయి. బుధవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.