close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఓటు తప్పనిసరి చేద్దామా?

ఎన్నికలు స్వేచ్ఛగానే జరుగుతున్నాయా? 
ఎవరైనా భయపెడితే ఓటు వేస్తుంటారా? 
ఏ పార్టీకైనా సానుభూతిపరులా? 
ఓటింగ్‌ తగ్గిపోవడానికి కారణమేంటి? 
ఈవీఎంలపై నమ్మకముందా? 
కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నల పరంపర 
ఎన్నికల క్రతువుపై సర్వేకు నిర్ణయం 
దేశవ్యాప్తంగా సమగ్ర వివరాల సేకరణ 
తెలంగాణలో త్వరలో మొదలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌లతో (ఈవీఎంలు) కచ్చితమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారా, ఓటింగ్‌ను తప్పనిసరి చేస్తే బాగుంటుందా? ఎన్నికల్లో కండబలం, ధన ప్రభావం పెరుగుతున్నాయని భావిస్తున్నారా? గత ఎన్నికల్లో ఓటు వేశారా?ఈ ఎన్నికల్లో మీకు ఓటు ఉందా?.. ఇలా అనేక అంశాలతో దేశవ్యాప్తంగా భారీ సర్వేకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సర్వేను తప్పనిసరి చేసింది. ఓటర్ల నమోదు మొదలుకొని ఓటు వేసే వరకు అనేక అంశాలపై అభిప్రాయాలను సేకరించనుంది. ఓటు వేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలను తెలుసుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా, తెలంగాణ, మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా మొదలు కావాల్సి ఉంది. 
18 పేజీల పత్రం 
సర్వే ఏయే అంశాలపై చేయాలి, ఎలా చేయాలి, ఓటర్ల నుంచి నమోదు చేయాల్సిన వివరాలేంటి అన్నదానిపై కేంద్ర ఎన్నికల సంఘం టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)తో 18 పేజీల పత్రాన్ని తయారు చేయించింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో సర్వే బాధ్యతను ఆర్థిక, సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్‌)కు అప్పగించారు. 
ఏపీలో 17,000 మంది 
ఏపీలో విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, నరసరావుపేట, అనంతపురం, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధి నుంచి మూడేసి శాసనసభ స్థానాలను సర్వేకు ఎంపిక చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ, తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాలను ఎంపిక చేశారు. మొత్తం 17,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. తెలంగాణలో మరికొద్దిరోజుల్లో ప్రారంభమవుతుంది. 
ప్రశ్నల పరంపర.. 
ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటరుగా నమోదు చేసుకొన్నారు.. ఓటర్ల జాబితాలో మీ పేరు తొలగించారా, మళ్లీ నమోదు చేసుకున్నారా, ఎక్కడ చేశారు, ఎవరి సాయంతో చేశారు, నమోదు కార్యక్రమం సంతృప్తిగా ఉందా, ఓటరు కార్డు వచ్చిందా, గత ఎన్నికల్లో ఓటు వేశారా, పోలింగ్‌ స్టేషన్‌ సరిగానే ఉందా తదితర వివరాలు తెలుసుకుంటారు. 
భయపెడితే ఓటేశారా? 
ఇటీవలి ఎన్నికల్లో మీరు ఓటు వేశారా, అందుకు కారణమేంటి, దేశంలో పరిస్థితులను మార్చుతుందనా లేక హక్కుగానా? అసలు అభ్యర్థిని చూశారా? మీరు ఏదైనా పార్టీకి సానుభూతిపరులా, ఎవరైనా భయపెడితేనో లేక మత పెద్ద కాని కుటుంబ పెద్ద కాని చెబితే ఓటు వేశారా లాంటి వివరాలను కూడా సేకరించనున్నారు. పోలింగ్‌ కేంద్రంలో సౌకర్యాలు, ఎన్నికల్లో దౌర్జన్యాలు.. ఇలా అన్ని వివరాలు అడుగుతారు. ఓటింగును తప్పనిసరి చేయాలా, దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయా.. వంటి అనేక వివరాలను సర్వేలో సేకరించనున్నారు. ఎవరి ద్వారా ప్రచారం చేయిస్తే ఓటర్ల నమోదు, పోలింగుపై ప్రభావం పడుతుంది, ప్రచారం ఎలా ఉండాలి? వంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.