close

ప్ర‌త్యేక క‌థ‌నం

తల్లి ఎద రక్షగా.. బిడ్డ బతుకు చల్లగా

సర్కారు ఆసుపత్రుల్లో సరికొత్త విధానం 
నెలలు నిండని, బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు కేఎంసీ చికిత్స 
కృత్రిమ పరికరం కంటే మెరుగైన ఫలితాలు 
రాష్ట్రంలో 22 కేంద్రాల్లో అమలు 
గతేడాది 6వేల మంది నవజాత శిశువులకు లబ్ధి 
ఈ ఏడాది మరో 11 కేంద్రాల్లోనూ విస్తరణ

అమ్మ పాలే కాదు.. అమ్మ ఎద కూడా ప్రాణ రక్షణ కవచమే. తల్లి గుండెలపై ఆదమరిచి బజ్జున్నా శిశువుకు అది అమృత తుల్యమే. ముఖ్యంగా నెలలు నిండకుండా, బరువు తక్కువగా పుట్టిన నవజాత శిశువుకు తల్లి ఆత్మీయ స్పర్శతో ఎనలేని వెచ్చదనం. కృత్రిమ పరికరం (ఇంక్యుబేటర్‌Â) కంటే అమ్మ ఆలనలోనే శిశువు మెరుగైన ఎదుగుదలను సాధిస్తుందనే సూత్రంతో రూపొందించిన ‘కంగారూ తల్లి సంరక్షణ (కంగారూ మదర్‌ కేర్‌- కేఎంసీ)’ విధానాన్ని సర్కారు ఆసుపత్రుల్లో గతేడాది ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్రంలోని 22 ప్రత్యేక నవజాత శిశుసంరక్షణ కేంద్రాలకు (ఎస్‌ఎన్‌సీయూ) అనుబంధంగా కేఎంసీ విధానం అమలవుతోంది. గతేడాది దీనికింద 6,179 మంది నవజాత శిశువులకు చికిత్స అందించారు. ఈ ఏడాది మరో 11 ఎస్‌ఎన్‌సీలను నెలకొల్పి, వాటికి అనుబంధంగా కేఎంసీ వార్డులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 


నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు, తక్కువ బరువుతో జన్మించిన శిశువులను కంటికి రెప్పలా కాపాడాలి. ఇందుకోసం అన్ని ఆసుపత్రుల్లోనూ ఇంక్యుబేటర్‌ వాడుతున్నారు. తల్లి కడుపులో మాదిరి వాతావరణం ఆ కృత్రిమ పరికరంలో ఉండటంతో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. కానీ దానికంటే అమ్మ ఎదమీదే బిడ్డను ఉంచితే ఎదుగుదల మరింత బాగుంటుందని, తల్లి నుంచి  ఆ నులివెచ్చని స్పర్శ శిశువుకు అన్ని విధాలా మంచిదని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇదే సూత్రంతో ‘కంగారూ తల్లి సంరక్షణ (కంగారూ మదర్‌ కేర్‌- కేఎంసీ)’ విధానాన్ని రూపొందించారు. దీన్ని తెలంగాణలోని కొన్ని సర్కారు ఆసుపత్రుల్లో గతేడాది ప్రవేశపెట్టారు. ఫలితాలు బాగుండడంతో మరిన్ని వైద్యశాలలకు విస్తరించబోతున్నారు.

కేంద్ర సాయంతో.. 
కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబరులో కంగారూ తల్లి సంరక్షణ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టింది. 
తెలంగాణలో 22 ఎస్‌ఎన్‌సీయూలకు అనుబంధంగా కేఎంసీల ఏర్పాటుకు అనుమతించింది. 
10 పడకలున్న ఒక్కో కేఎంసీ నిర్వహణకు ఏడాదికి రూ.2.5 లక్షలు మంజూరు చేస్తోంది. 
ఈ కేంద్రంలో తల్లికి ఆహారం, శిశువుకు ఔషధాలు, డైపర్స్‌, స్నానానికి సబ్బులు, ఒంటికి పట్టించే లేపనాలు వంటివి ప్రభుత్వమే సమకూరుస్తుంది.
ఈ శిశువుల్లో సమస్యలేమిటి? 
బరువు తక్కువగా, నెలలు నిండకుండా పుట్టిన శిశువులు నీరసంగా ఉంటారు. 
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో అంటువ్యాధుల బారినపడుతుంటారు. 
నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు శ్వాస అందడం కష్టంగా మారుతుంది. ఒక్కోసారి ఉన్నట్టుండి ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంది. 
వీరిని ఇంక్యుబేటర్‌లో పెట్టడం వల్ల శిశువు ఒకచోట, తల్లి ఒక చోట ఉంటారు. తల్లి ఒడికి దూరమవడం వల్ల బిడ్డకు ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. 
పాలు తాగించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.

కంగారూ’తో ప్రయోజనాలు 
తల్లి దగ్గరే ఉన్నామనే భద్రతా భావం ఉంటుంది. 
తల్లి ఎదపైనే ఉండడం వల్ల శిశువు శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంటుంది. ఇంక్యుబేటర్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ తల్లి దగ్గర అలా కాదు. కృత్రిమ పరికరం శిశువును ఎంత వెచ్చగా ఉంచుతుందో.. అంతకంటే వెచ్చగా తల్లి దగ్గర ఉంటుంది. 
శిశువు తల్లి ఛాతీపై పడుకున్నప్పుడు చర్మానికి తగిలే ఒత్తిడితో తల్లిలో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. ఈ హార్మోనే వెచ్చదనాన్ని క్రమబద్ధంగా ఉంచుతుంది. 
తల్లి ఎదపై ఉండడం వల్ల ఆమె గుండె శబ్దాన్ని శిశువు వినగలుగుతుంది. 
తల్లి ఎదపై ఉన్నప్పుడు అమ్మ ఉచ్ఛ్వాసనిశ్వాసాలకు అనుగుణంగా బిడ్డ కూడా ఊపిరి పీల్చుకుంటుంది. దీంతో ప్రాణవాయువూ శిశువుకు క్రమబద్ధంగా అందుతుంది. 
తల్లి కళ్లలో కళ్లు పెట్టి చూడడం, ఆమె మాటలు వినడంతో బంధం బలపడుతుంది. 
తల్లి పాలు ఇవ్వడం వల్ల పౌష్ఠికాహారమూ సరిగ్గా అంది త్వరగా బరువు పెరగడానికి దోహదపడుతుంది. 
ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు రాకుండా, అంటువ్యాధులు సోకకుండా అడ్డుకున్నట్లు అవుతుంది. 
అతి ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇంక్యుబేటర్‌లో ఉన్న శిశువు కంటే కేఎంసీలో తల్లి దగ్గరున్న శిశువు త్వరగా ఆసుపత్రి నుంచి ఇంటికెళ్తుంది. 
శిశువు కనీసం కిలోన్నర బరువు పెరిగిన తర్వాత ఇంటికి పంపిస్తారు. మరీ ప్రమాదకరమైన ఇతర అనారోగ్య సమస్యలుంటే తప్ప ఆస్పత్రిలో ఉంచరు. 
మళ్లీ ఆసుపత్రిలో చేరే అవకాశాలూ తక్కువ.


ఏమిటీ ‘కంగారూ’! 
ఆస్ట్రేలియాలో నివసించే ‘కంగారూ’ జంతువు తన బిడ్డను పొత్తిళ్లలో కడుపు కింది భాగంలో పొదివి పట్టుకుంటుంది. అక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఒక సంచిలాంటి అరలో భద్రంగా వెచ్చగా ఉంచుతుంది. ఇదే విధానాన్ని నవజాత శిశు సంరక్షణలోనూ అమలు చేస్తున్నారు. ఈ విధానంలో తక్కువ బరువుతో లేదా నెలలు నిండకుండా పుట్టిన శిశువును తల్లి ఛాతీపై ఉంచి, శిశువు పైనుంచి వస్త్రంతో ఇద్దరినీ కలిపి కడతారు. తల్లి నుంచి బిడ్డకు ఉష్ణప్రసరణ జరిగి.. శిశువు తల్లి కడుపులో ఉన్నప్పటి మాదిరిగానే వెచ్చదనం అందించినట్లు అవుతుంది. ఈ విధానం 1978లో కొలంబియాలో బగొటా అనే ప్రాంతంలో తొలుత ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రపంచమంతటా అవలంబిస్తున్నారు.
ఇంటి దగ్గరా చేయొచ్చు 
కేఎంసీ విధానాన్ని ఆసుపత్రిలోనే కాకుండా ఇంటి వద్ద కూడా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. కావాల్సిందల్లా వ్యక్తిగత పరిశుభ్రత. మెడలో ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా అవసరం. బరువు తక్కువగా ఉన్న శిశువులు రెండున్నర కిలోల బరువు పెరిగే వరకూ ఈ విధానాన్ని అవలంబిస్తే మంచిది.

నిర్వహణలో సమస్యలు 
కేఎంసీ నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులిస్తుందే గానీ ప్రత్యేకంగా నర్సులను నియమించలేదు. 10 పడకల కేఎంసీని నిర్వహించాలంటే కనీసం ఆరుగురు నర్సులైనా ఉండాలి. నియామకాలపై సరైన స్పష్టత లేకపోవడంతో ఎక్కువ శాతం కేఎంసీల్లో నర్సుల కొరత వేధిస్తోంది. దీంతో స్థానిక ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుంచి వెచ్చించి ఒప్పంద ప్రాతిపదికన కొన్ని ఆసుపత్రుల్లో నియమించుకున్నారు.

శిశువు భవిష్యత్తుకు సరైన విధానం

కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయక ముందు నుంచే 2012లోనే నల్గొండ జిల్లా ఆసుపత్రిలో కేఎంసీని ప్రారంభించాం. మొదట నాలుగు మంచాలతో ప్రారంభించి, ప్రభుత్వ అనుమతులొచ్చాక 10 పడకలతో ప్రత్యేక వార్డును నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉండడం వల్ల శిశువు ఆరోగ్యం గురించి తల్లులకు మంచి అవగాహన ఏర్పడుతుంది. కేఎంసీ విధానాన్ని అవలంబించని తల్లులు తమ శిశువుకు చిన్న సమస్య వచ్చినా.. ఆసుపత్రికి వస్తుంటారు. ఈ విధానాన్ని పాటించే తల్లులు తమ పిల్లల సమస్యలను సాధ్యమైనంత వరకూ ఇంటి వద్దే పరిష్కరించుకోగలిగే నైపుణ్యాన్ని సంపాదించుకోవడాన్ని గమనించాం.

- డాక్టర్‌ దామెర యాదయ్య, నవజాత శిశు వైద్యులు, నల్గొండ.

-ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.