close

ప్ర‌త్యేక క‌థ‌నం

కోడ్‌ కూయక ముందే.. మేలుకొంటున్నారు!

ఓటర్లకు ముందస్తు తాయిలాలు
మహిళలకు చీరలు
వేల మందికి భోజనాలు
వైద్య శిబిరాలు సరేసరి
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఆశావహుల సరికొత్త పోటీ
ఈనాడు - అమరావతి

ఎన్నికల నియమావళి (కోడ్‌) అమల్లోకి వస్తే ఓటర్లకు పిన్నీసు ఇచ్చినా.. పెద్ద రాద్ధాంతం అవుతుంది. ఎన్నికల సంఘం నుంచి నోటీసులు, ప్రతిపక్షాలు, మీడియా హంగామా అంతాఇంతా కాదు. బహుశా ఈ వ్యవహారాలపై సంపూర్ణ అవగాహన ఉన్న మన నాయకులు, ఆశావహులు ఎన్నికలకు చాలా రోజులు ముందుగానే.. ఓటర్లను ఆకర్షించేందుకు పోటాపోటీగా తాయిలాల పంపిణీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, వచ్చే ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు, ఆశావహులు ఈ రేసులో దూసుకుపోతున్నారు. వీరి కానుకల పంపిణీ హడావుడితో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం ఆవిష్కృతం అవుతోంది. ఈ కానుకలను కొన్నిచోట్ల అభ్యర్థులు నేరుగా ఇస్తుండగా, మరికొన్నిచోట్ల వాళ్ల కుటుంబసభ్యుల పేరుతో ఉన్న ఫౌండేషన్లు, స్వచ్ఛంద సంస్థల ద్వారా, మరొకొందరు అనుచరుల ద్వారా పంపిణీ చేస్తున్నారు.

ఒకరిని మించి మరొకరు..
మహిళలను పెద్దఎత్తున తీసుకువచ్చి వారికి భోజనాలు పెట్టి మరీ చీరలు పంచుతున్నారు. తిరుపతి సమీపంలోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇద్దరూ పెద్దఎత్తున చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అయితే దంపతులకు కలిపి చీర, పంచె లేదా ప్యాంటు, షర్టు, ఆయన పార్టీకి సంబంధించిన హామీల కరపత్రం కలిపి ఒక సంచిలో పెట్టిమరీ పంపిణీ చేశారు. ఆయన ప్రత్యర్థి కూడా పెద్దఎత్తున చీరలు పంచారు. వీరిద్దరే నియోజకవర్గంలో 2లక్షల వరకు చీరలు పంచినట్లు తెలుస్తోంది.

* గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇటీవల ఓ సామాజిక వర్గానికి చెందిన సుమారు 3-4 వేల మంది మహిళలకు భోజనాలు పెట్టి, చీరలు పంచారు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున డబ్బులు కూడా ఇచ్చారు. శాసనసభ్యుడికి పోటీగా అదే నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా ఉన్న నాయకుడు.. మహిళలను ఆహ్వానించి భోజనాలు పెట్టారు. ఆయన కూడా ఒక చీర, రూ.500 చొప్పున వారి ఇళ్లకే పంపించారు. బాపట్లలో తెదేపా నేతలు ఇద్దరు చీరలు పంపిణీ చేయగా, ఎమ్మెల్యే సుమారు 15వేల మంది వృద్ధులకు దుప్పట్లు ఇవ్వడం గమనార్హం. గురజాల నియోజకవర్గంలోనూ దాదాపు 60వేల చీరలను పంపిణీ చేశారు.
* కృష్ణా జిల్లా మైలవరంలోనూ ఓ అభ్యర్థి పెద్దఎత్తున చీరలు పంచారు.
* అనంతపురం జిల్లాలో కీలక ఎమ్మెల్యే తనయుడికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 62వేల చీరలు పంచినట్లు సమాచారం. ఇదే జిల్లా మడకశిరలో టికెట్‌ ఆశిస్తున్న ఒక నేత ఏడాది నుంచి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో తిరుగుతూ మహిళలకు చీర, పార్టీ హామీల కరపత్రాన్ని కలిపి పంచుతున్నారు.

 

సేవా కార్యక్రమాల్లో
* విశాఖజిల్లా భీమిలిలో ఉన్న అన్న క్యాంటీన్‌లో అల్పాహారం, రెండు పూటల భోజనం మంత్రి గంటా శ్రీనివాసరావు ఉచితంగా ఇస్తున్నారు. ఇక్కడ రోజంతా రూ.5చొప్పున అమ్మిన కూపన్లను మంత్రికి పంపితే ఆ మొత్తాన్ని ఆయన చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల గంటా జన్మదినం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు.
* కడప జిల్లాలోని రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఒక్కోటి చొప్పున రాజన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేశారు. రోజూ మధ్యాహ్నం రూపాయికి భోజనం ఇస్తున్నారు.
* గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తరచూ కంటి వైద్య శిబిరాలను నిర్వహించి, ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తున్నారు.
* కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి జవహర్‌ పేద విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు.
* శ్రీకాకుళం జిల్లా సరిహద్దు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు.. ఆయన తండ్రి పేరిట ఉన్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. అనారోగ్యంగా ఉన్నవారిని ఈ అంబులెన్స్‌ల ద్వారా విశాఖ కేజీహెచ్‌కు పంపిస్తున్నారు.
* నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు కంటి, హృదయ వైద్య శిబిరాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు.
* గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 33 వేల మందికి చంద్రన్న బీమా ప్రీమియం ఆయనే చెల్లించారు. కొంత మందికి ఆయనే డబ్బులు కట్టి ఆర్టీసీ వనిత కార్డులు ఇప్పించారు.
* పోలవరం ఎమ్మెల్యే క్రీడాపోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేస్తున్నారు.

షష్టిపూర్తి ఉత్సవాలు!
గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో పేద వర్గాలకు చెందిన దాదాపు వేయి మంది గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దుస్తులు, పళ్లు, రూ.వెయ్యి నగదు అందజేశారు. 60 ఏళ్లు నిండిన వారికి షష్టిపూర్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దంపతులకు  కొత్త వస్త్రాలు, డబ్బులు ఇచ్చి సత్కరిస్తున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందినవారికి దుస్తులు పంపిణీ చేశారు.

 

పండగలకు
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు రంజాన్‌ వచ్చిందంటే.. నియోజకవర్గ పరిధిలో తెల్ల రేషన్‌కార్డులు ఉన్న ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే తోఫాతో పాటు, సొంతంగా కిలో మేక మాంసం, లీటరు పాలు సరఫరా చేస్తారు. క్రిస్మస్‌ రోజున నియోజకవర్గంలోని ప్రతి చర్చికి కేకులు పంపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గంలో తెదేపా టికెట్‌ ఆశిస్తున్న నేత సంక్రాంతికి నియోజకవర్గంలో దాదాపు లక్ష కుటుంబాలకు మిఠాయిలు పంపారు.

ఆర్థిక సాయం
ఇంట్లో ఎవరైనా చనిపోతే పరామర్శలకు వెళుతున్న నేతలు ఆ కుటుంబాలకు రూ.4వేల నుంచి రూ.10వేల వరకు, ఒక్కోసారి ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. కడప జిల్లాలో గోపవరం పంచాయతీలో కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం బకాయిపడ్డ ఆరు నెలల వేతనంలో సుమారు రూ.16 లక్షల వరకు ఓ ఎమ్మెల్యే సొంతంగా చెల్లించారు. ఆటోలకు జీవిత పన్ను చెల్లింపులో సగభాగం   సొంత నిధులు ఇచ్చారంటున్నారు.

 

ఉద్యోగ మేళాలు
విశాఖ నగరంలోని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఇటీవల పెద్ద ఎత్తున ఉద్యోగ మేళాలు నిర్వహించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు  పంపిణీ చేశారు.
విశాఖ జిల్లా ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది యువతను ఆకట్టుకునేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోనే ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ చేసేందుకు ప్రత్యేక శిబిరాలు పెడుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.