close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఉన్నతం కాదు.. నాసిరకమే..!

ఉన్నత విద్యలో ప్రమాణాలు అంతంతమాత్రం 
కనీస మౌలిక వసతుల లేమే కారణం 
తెలంగాణలో 219 విద్యాసంస్థలకే న్యాక్‌ గుర్తింపు 
1,571 కళాశాలలతో అగ్రస్థానంలో మహారాష్ట్ర 
ఈనాడు - హైదరాబాద్‌

ఉన్నత విద్యనందించే కళాశాలల సాంద్రతలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. న్యాక్‌ గుర్తింపు ఉన్న విద్యాసంస్థల సంఖ్యలో మాత్రం బాగా వెనుకబడింది. కళాశాలల్లో కనీస వసతులు ఉన్నాయనడానికి న్యాక్‌ గుర్తింపును ఒక కొలమానంగా తీసుకుంటారు. రాష్ట్రంలోని కళాశాలల్లో మాత్రం కనీస వసతులు, బోధనా సిబ్బంది లేక ఆ గుర్తింపు దక్కడం లేదు. వందల సంఖ్యలో ఉన్నత విద్యాసంస్థలుండగా కేవలం 219 మాత్రమే న్యాక్‌ గుర్తింపు పొందటం గమనార్హం. అంటే రాష్ట్రంలో విద్యార్థులకు నాసిరకం ఉన్నత విద్యే అందుతోందనే విషయం స్పష్టమవుతోంది.

ప్రయోజనాలెన్నో.. 
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఏ మేరకు ప్రమాణాలు పాటిస్తున్నాయో పరిశీలించి, స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ‘జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్‌)’ గ్రేడ్లు ఇస్తుంది. దేశవ్యాప్తంగా 900 యూనివర్సిటీలు, 40 వేల కళాశాలలు ఉండగా.. 341 వర్సిటీలు, 7,695 కళాశాలలకు (మొత్తం 8,036 సంస్థలకు) మాత్రమే న్యాక్‌ గుర్తింపు దక్కింది. విద్యాసంస్థలకు సొంతస్థలం, భవనం, తరగతి గదులు, ఇతర కనీస వసతులతోపాటు కనీసం 5 విభాగాలకు అవసరమైన అధ్యాపకులు ఉంటే న్యాక్‌ గుర్తింపు వస్తుంది. వసతుల స్థాయిని బట్టి ఏ++ నుంచి సి శ్రేణి వరకు గ్రేడ్లు ఇస్తారు. న్యాక్‌ గుర్తింపు ఉంటే పలు సంస్థలు పరిశోధన ప్రాజెక్టులు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. ప్రభుత్వ సంస్థలకైతే రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) కింద కేంద్ర మానవవనరుల శాఖ నిధులు మంజూరు చేస్తుంది. యూజీసీ నుంచి స్వయంప్రతిపత్తి హోదా పొందొచ్చు. ఇలాంటి ప్రయోజనాలెన్నో ఉన్నాయి.

‘ప్రభుత్వ, ప్రైవేటు’ తీరొకటే.. 
ప్రభుత్వ సంస్థలకు స్థలం, భవనాల కొరత లేకపోయినా, అధ్యాపకుల సంఖ్య తగినంతగా లేదు. ప్రైవేటు సంస్థల విషయంలో రికార్డుల్లో అధ్యాపకులను తగినంతగా చూపుతున్నా.. చాలా వాటికి స్థలం, భవనం లేవు. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 11 విశ్వవిద్యాలయాలుండగా వీటిలో పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాలు, ఆర్‌జీయూకేటీ (బాసర), జేఎన్‌ఏఎఫ్‌యూలకు న్యాక్‌ గుర్తింపు లేదు. పాలమూరు వర్సిటీ ఇటీవలే గుర్తింపు కోసం దరఖాస్తు చేసింది. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 132 ఉండగా, అందులో 75 వరకు మాత్రమే ఏదో ఒక శ్రేణిని సంపాదించాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 1,000 వరకు ఉండగా, న్యాక్‌ గుర్తింపునకు నోచుకున్నవి 20లోపే. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు 188 ఉంటే, 45 వరకు గుర్తింపు దక్కించుకున్నాయి. ఇక ఫార్మసీ, ఎంబీఏ కళాశాలలు సరేసరి. ఇవన్నీ కలిపి చూసినా రాష్ట్రంలో 219 సంస్థలు మాత్రమే న్యాక్‌ గుర్తింపు పొందాయి. తెలంగాణ కంటే చిన్నవైన ఎన్నో రాష్ట్రాలు ఈ అంశంలో ముందంజలో ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 18-23 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి లక్ష మంది విద్యార్థులకు 51 కళాశాలల చొప్పున ఉన్నాయి. కళాశాలల సాంద్రతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. కర్ణాటక కూడా కళాశాలల సాంద్రతలో అగ్రశ్రేణిలోనే ఉంది. అక్కడ ఏకంగా 827 విద్యాసంస్థలకు గుర్తింపు ఉండటం విశేషం. మొత్తం 1,571 న్యాక్‌ విద్యాసంస్థలతో మహారాష్ట్ర దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసిన తర్వాత అయిదేళ్లలో సొంత ప్రాంగణంలోకి మారాలి. పది సంవత్సరాలు దాటినా, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ వెసులుబాటు ఇస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయా కళాశాలల నుంచి హామీ పత్రం తీసుకుంటూ ఉండటం గమనార్హం.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.