close

ప్ర‌త్యేక క‌థ‌నం

రాపూరు కొండల్లో రైళ్ల పరుగులు!

  తుదిదశలో ఓబులవారిపల్లి    కృష్ణపట్నం లైను పనులు
  ఇప్పటికే ట్రయల్‌రన్‌ విజయవంతం
  మార్చికల్లా జాతికి అంకితం
  బలోపేతం కానున్న  సీమ-సింహపురి బంధం
  తగ్గనున్న రవాణా వ్యయం
ఈనాడు - కడప

కడప-నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లోని రాపూరు కొండల్లో త్వరలో రైళ్లు పరుగులెత్తనున్నాయి.. ఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నం వరకు రైల్వేసేవలు అందుబాటులోకి రానున్నాయి. వాణిజ్య ఎగుమతులు, దిగుమతుల్లో మున్ముందు రవాణా వ్యయంతో పాటు ప్రయాణ సమయమూ తగ్గనుంది. ఏళ్ల తరబడి సాగిన ఈ రైలుమార్గం పనులు తుదిదశకు చేరాయి. ఇప్పటికే 90శాతం పైబడి నిర్మాణం పూర్తయింది. సొరంగంలోని మిగిలిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించి, వచ్చే మార్చికల్లా ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు అధికారులు సంసిద్ధులవుతున్నారు.
* రాయలసీమ జిల్లాలు ఉద్యాన పంటల సాగులో ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయి. ఇక్కడ లభ్యమయ్యే బెరైటీస్‌, ఇనుప ఖనిజం తదితరాలకు విదేశీ విపణిలో మంచి గిరాకీ ఉంది. నౌకాశ్రయానికి అనుసంధానంగా రైల్వేలైను లేక ఎగుమతులకు ఇబ్బంది ఏర్పడింది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఎరువులు, ఇతరత్రా సరకులను సీమ జిల్లాలకు చేర్చడమూ సమస్యగానే ఉంటోంది.
* కృష్ణపట్నం నౌకాశ్రయం నుంచి సీమ అనుబంధ జిల్లాలకు ప్రత్యేక రైల్వేలైను ఏర్పాటు ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపరచవచ్చని పదేళ్ల కిందటే పాలకులు ఆలోచించారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయంలో చొరవ చూపారు. కడప జిల్లాలోని ఓబులవారిపల్లి నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వరకు రైల్వేలైను నిర్మాణానికి 2006లో అప్పటి రైల్వేమంత్రి నీతీశ్‌కుమార్‌ పచ్చజెండా ఊపారు.

ఆసియాలోనే అతిపెద్ద సొరంగాలు

ఈ ప్రాజెక్టులో కడప-నెల్లూరు సరిహద్దులోని చిట్వేలి-చెర్లోపల్లి వద్ద సొరంగం పనుల పరంగానే అవరోధం ఏర్పడింది. ఇక్కడ రెండు సొరంగాలను రాపూరు కొండల్లో నిర్మిస్తున్నారు. కిలోమీటరు పొడవున్న తొలి సొరంగంలో ట్రాకు, విద్యుద్దీకరణ పనులు పూర్తిచేశారు. సుమారు ఏడు కిలోమీటర్ల పొడవున్న రెండో సొరంగంలో మాత్రం ఇవి కొలిక్కిరావాల్సి ఉంది. ఆసియాలోనే అతిపెద్ద సొరంగాలుగా వీటిలో ఈ చివరిదశ పనులు పూర్తిచేస్తే సీమ- సింహపురి మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడినట్లే. మార్చి నెలాఖరుకల్లా వీటిని ముగించి జాతికి అంకితం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ లైను అందుబాటులోకి వస్తే సీమ-కోస్తా ప్రాంతాల మధ్య సుమారు 50కి.మీ. దూరం తగ్గనుంది. కృష్ణపట్నం ఓడరేవుకు దిగుమతయ్యే సరకును తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సులువుగా సరఫరా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ తీరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నం నౌకాశ్రయానికి రైలుమార్గం లేని లోటునూ తీర్చొచ్చు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రైల్వేలైనుకు సంబంధించి ఓ భాగాన్ని నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద ఈ నెల 21న ప్రారంభించనున్నారు.

కొత్త మార్గం గురించి క్లుప్తంగా..

ప్రాజెక్టు: కృష్ణపట్నం రేవు నుంచి సీమ అనుబంధ జిల్లాలకు ప్రత్యేక రైల్వేలైను నిర్మాణం
ఎక్కడి నుంచి ఎక్కడకు: కడప జిల్లా ఓబులవారిపల్లి నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకు
అనుమతి లభ్యత: 2006లో
అంచనా వ్యయం: రూ.1646కోట్లు
మొత్తం పొడవు: 113 కిలోమీటర్లు
గతంలోనే ఏర్పాటైంది: 18 కి.మీ.
కొత్త లైను పొడవు: 95 కి.మీ.(ఓబులవారిపల్లి - వెంకటాచలం)
పనులు పట్టాలెక్కింది: 2013లో
తొలి విడత నిధులు: రూ.82.32 కోట్లు
మలి విడత: రూ.2017.15 కోట్లు
మొత్తం మంజూరు: రూ.2099.47 కోట్లు
పూర్తయిన పనులు: సుమారు 90 శాతం
సిగ్నల్‌ వ్యవస్థ సిద్ధమైంది: ఆరు స్టేషన్లలో పూర్తయిన మార్గంలో ఇటీవలే ట్రయల్‌రన్‌ నిర్వహించగా.. ప్రస్తుతం ఓబులవారిపల్లి స్టేషన్‌ వద్ద కొత్త లైను అనుసంధానించే పనులు ముమ్మరంగా చేస్తున్నారు.

యుద్ధ ప్రాతిపదికన పనులు

ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వేలైను పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భారీయంత్రాలు ఉపయోగించి చాలావరకు కొలిక్కి తెచ్చాం. సొరంగంలో ఏడు కిలోమీటర్లు మాత్రమే పనులు జరగాల్సి ఉంది. వాటినీ వేగంగా చేపట్టేందుకు కృషిచేస్తున్నాం. త్వరలోనే ఈ మార్గంలో గూడ్సు రైళ్లను తిప్పుతాం. మున్ముందు ప్రయాణికుల రైళ్లనూ నడిపే ప్రణాళిక ఉంది.
- విజయప్రతాప్‌సింగ్‌, డీఆర్‌ఎం, గుంతకల్లు

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.