close

ప్ర‌త్యేక క‌థ‌నం

మనసు పరవశం! 

నేడు ప్రేమికుల దినోత్సవం!

మనసులో పుట్టి.. మరో మనసును సుతారంగా అల్లుకుని.. మెలమెల్లగా ఓ మాయలా పెనవేసుకుపోయే మహత్తరమైన సమ్మోహనం.. ప్రేమ! 


ప్రేమ ఉన్నచోటే జీవితం ఉంటుంది. ఇది మనసులను తట్టి లేపి.. అనంతమైన అనుభూతులను రుచిచూపించే మానవత్వ భావన. అందుకే ప్రేమకంటూ ఎల్లలులేని ప్రత్యేకమైన భాష ఉంది. దాన్ని మనకెవ్వరూ నేర్పాల్సిన పని లేదు. ఆ బీజం పడుతూనే యువ హృదయాల్లో పులకింతలు మొదలవుతాయి. పెద్దల హృదయాలు అవ్యాజమైన అనుభూతులతో పొంగుతాయి. 


అమ్మ ప్రేమ కావొచ్చు.. అమ్మాయి ప్రేమ కావొచ్చు.. ఆ పేరు వినపడితేనే అదో తుళ్లింత! అంతకు మించిన పరవశం!! అందుకే సెయింట్‌ వాలంటైన్‌ విధినిషేధాలకు ప్రాణాలొడ్డి మరీ అవ్యాజమైన ప్రేమకు బాసటగా నిలిచారు. ప్రేమ భావానికి ప్రపంచ సంబరాన్ని జోడించారు!

అసలింతకీ ఎవరా వాలంటైన్‌? ఏమా ప్రేమ కథ! 
చాలామంది అనుకుంటున్నట్లు వాలంటైన్‌ ప్రేమికుడే కాదు.. ప్రేమను ప్రేమించిన.. ప్రేమకు పెద్ద దిక్కుగా నిలిచిన పెద్ద మనసున్న మనిషి!

వాలంటైన్స్‌ డే!

ఈ కథ తెలుసుకోవాలంటే ఒక్కసారి క్రీ.శ. 3వ శతాబ్దానికి వెళ్లిపోవాలి.  
రోమన్‌ సామ్రాజ్యాన్ని రెండో క్లాడియస్‌ చక్రవర్తి పరిపాలిస్తున్న రోజులవి. సామ్రాజ్యం నిలబడాలంటే సమర్థ సైనిక శక్తి అనివార్యమని నమ్మాడు క్లాడియస్‌. అంతేకాదు, పెళ్లి,  పిల్లల జంజాటంలో పడితే సైనికులు సమర్థంగా సేవలు అందించలేరని కూడా భావించాడు. వెంటనే దేశంలో యువకులెవరూ పెళ్లిళ్లు చేసుకోవటానికి లేదంటూ నిషేదం విధించాడు, అంతా సైన్యంలో సేవలందించాలని ఫర్మానా జారీ చేశాడు. దీంతో దేశంలో యువతీయువకులంతా గిజగిజలాడిపోయారు. వాళ్ల బాధ చూసిన స్థానిక బిషప్‌ వాలంటైన్‌ చలించిపోయాడు. ప్రేమలు పంచుకునే వయసులో పెళ్లిళ్లలను నిషేధించటం అర్థరహితమని గ్రహించిన ఆయన తన దగ్గరకు వచ్చిన యువతీయువకులకు రహస్యంగా పెళ్లిళ్లు చేయటం ఆరంభించాడు. క్రమేపీ యువతరానికి ఆయన ఆరాధ్యుడయ్యాడుగానీ.. ఈ విషయం క్లాడియస్‌ వరకూ వెళ్లింది. అగ్రహోదగ్రుడైన క్లాడియస్‌.. వాలంటైన్‌కు కారాగారమే కాదు.. శిరచ్ఛేదన శిక్ష కూడా విధించాడు. అలా ఫిబ్రవరి 14న అమరుడైన వాలంటైన్‌.. ప్రేమ జంటలకు ఆరాధ్యుడిగా, ప్రేమకు పెద్దదిక్కుగా చరిత్రకెక్కి.. సెయింట్‌ వాలంటైన్‌ అయ్యారు. అందుకే రాజ్యాన్ని ధిక్కరించి, ప్రేమకు బాసటగా నిలిచిన ఆయన అసువులుబాసిన రోజునే ‘ప్రపంచ ప్రేమికుల దినం’గా జరుపుకోవటం ఆనవాయితీగా మారిందన్నది విస్తృతంగా వినిపించే కథ. ఇంకా వాలంటైన్‌కు సంబంధించిన కథలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ప్రేమ పట్ల ఎంతో అభిమానం చూపిన వాలంటైన్‌ను సెయింట్‌గా గుర్తిస్తూ, ఆయన గౌరవార్థం 5వ శతాబ్దం చివర్లో పోప్‌ జలేసియస్‌ ఫిబ్రవరి 14ను ‘సెయింట్‌ వాలంటైన్స్‌ డే’గా ప్రకటించారు. అందుకే వాలంటైన్స్‌ డే.. ప్రేమికుల రోజే కాదు.. ప్రేమను ప్రేమించే, పెద్ద మనసున్న ప్రతి ఒక్కరి రోజూ కూడా! 
ప్రాచుర్యం.. ఛాసర్‌ ఘనకార్యం! 

ప్రాచీన రోమన్లు ఫిబ్రవరి మాసాన్ని పక్షుల సంతాన సంయోగ కాలంగా భావించి.. ఈ నెలలో లూపర్‌కేలియా పేరుతో పెద్ద సంతాన సంబరం చేసుకునేవాళ్లు. క్రమేపీ ఈ రోమన్‌ సంబరాన్ని వాలంటైన్స్‌ డేగా  ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆంగ్ల సాహితీ రంగానికి పితామహుడైన  కవి జెఫ్రీ ఛాసర్‌కు దక్కుతుంది.  ఛాసర్‌.. 1375లో ‘పార్లమెంట్‌ ఆఫ్‌ ఫౌల్స్‌’ పేరుతో ఓ కవిత రాశాడు. దాన్లో ‘‘ఆ రోజు సెయింట్‌ వాలంటైన్స్‌ డే.. అందుకే ప్రతి పక్షీ తన ప్రేమికను ఎంచుకునేందుకు అక్కడికి చేరుతుంది’’ అని రాశాడు. సాహితీ సాంస్కృతిక రంగాలను రొమాంటిక్‌ భావకవితా పవనాలు ఆవహిస్తున్న ఆ రోజుల్లో ఛాసర్‌ కవిత పెద్ద సంచలనమైంది. దీంతో 1400 నుంచీ రాజకుటుంబీకులు తమ ప్రేమికులకు ‘వాలంటైన్స్‌’ పేరుతో కవితలూ, లేఖలూ రాయటం ఆరంభించారు. ఇలా మెల్లగా 1500కల్లా ‘సెయింట్‌ వాలంటైన్స్‌ డే’.. ప్రేమికుల రోజుగా సామాన్యులను కూడా గమ్మత్తుగా ఆవహించింది.

తల మీద పువ్వున్న రాజు 

సెయింట్‌ వాలంటైన్‌ శిరోఎముక ఇది! 1800లో రోమ్‌లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన దీన్ని సందర్శకుల కోసం అక్కడి శాంతామారియా చర్చిలో ఉంచారు. సున్నిత ప్రేమకు గుర్తుగా తల మీద పుష్పాలతో ఇది నిత్యం సందర్శకులను ఆకట్టుకుంటోంది. 

ప్రపంచం నిండా ప్రేమ

బ్రిటన్‌, అమెరికాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పండగ వాలంటైన్స్‌ డే! ఈ రోజున అమెరికాలో కనీసం 62% మంది తాము అమితంగా ప్రేమించే వారికి గ్రీటింగ్‌ కార్డులు, క్యాండీలు, ఆభరణాలు పంపటమో.. వారికి రొమాంటిక్‌ డిన్నర్లు ఇవ్వటమో. ఇలా ఏదో ఒకటి చేస్తారు!

గులాబీలదే పరిమళం!

ప్రేమికుల రోజు బహుమతుల్లో గులాబులకే ప్రాధాన్యం. అందుకే ఈ రోజున మార్కెట్‌ నిండా గులాబీ బాలలు విరబూస్తాయి. అయితే పూలు కొనే వారిలో అబ్బాయిలే ఎక్కువ. ఎర్రగులాబీ రోమన్‌ ప్రేమదేవత వీనస్‌కు ఇష్టమైన పుష్పం. అందుకే ఎర్రగులాబీలకు గిరాకీ.

కార్డుల కథ

తొలి వాలంటైన్స్‌ డే కార్డులు 1500లలోనే కనబడతాయి. 1700లకు వచ్చే సరికి బ్రిటన్‌లోని ప్రజలంతా వాలంటైన్స్‌ డే రోజున కార్డులుగానీ, ప్రేమ లేఖలుగానీ ఇచ్చిపుచ్చుకోవటం ఆరంభించారు. దాదాపు అదే సమయంలో ఈ ప్రేమ జ్వరం అమెరికానూ ఆవహించింది. 1840లలో భారీఎత్తున వాలంటైన్స్‌ డే కార్డుల తయారీ  ఆరంభమైంది. 1913లో కాన్సాస్‌ నగరానికి చెందిన హాల్‌మార్క్‌ కంపెనీ భారీఎత్తున వాలంటైన్స్‌ కార్డులు ముద్రించటం మొదలుపెట్టింది.  
ఇప్పుడు 100 కోట్ల వాలంటైన్స్‌ డే కార్డులు చేతులు మారుతున్నాయి. అమెరికా తదితర దేశాల్లో క్రిస్మస్‌ తర్వాత అతిపెద్ద ‘అమ్మకాల హాలిడే’ సీజన్‌ ఇదే! 

అంతా ప్రేమ కానుకగా మొదట్లో హార్ట్‌ ఆకారంలో ఉండే రంగురంగుల క్యాండీలే ఇచ్చేవారు. రిచర్డ్‌ క్యాడ్‌బరీ 1800లలో వాలంటైన్స్‌ డే కోసం ప్రత్యేకంగా చాక్లెట్లు తయారు చేశారు. ఇప్పుడీ సీజన్లో హార్ట్‌ ఆకారం ఉండే చాక్లెట్లు, చాక్లెట్‌ బాక్సులు 3.5 కోట్లకు పైనే అమ్ముడుపోతాయని అంచనా.


ప్రేమ పొంగే భంగిమ!

ఈ భంగిమలో ప్రేమికురాలి ముందుర మోకాళ్ల మీద కూర్చుని నా ప్రేమను అందుకోమని ప్రతిపాదించటం... ప్రపంచవ్యాప్తంగా ఓ మురిపెంగా మారింది. ఇలా ఏటా 60 లక్షల జంటలు ఈ రోజు ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటున్నట్లు తాజా సర్వే ఒకటి చెబుతోంది.

ఒంటరిగా సంబడం!

ప్రేమను పంచుకునేవారు ఎవ్వరూ లేరా? చింతించకండి... మీరూ పండగ చేసుకోవచ్చు.. ఒంటరిగా! దీన్నే ‘శాడ్‌’ (సింగిల్స్‌ అవేర్‌నెస్‌ డే) అంటున్నారు.. ఒక్కరే మీకు మీరే చాక్లెట్లు బహూకరించుకుని, ఒంటరిగా డిన్నర్‌ చెయ్యొచ్చు!
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.