close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఉగ్రమూకల పీచమణచాల్సిందే

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఉగ్రవాదుల దాడిలో పెద్ద ఎత్తున జవాన్లు నేలకొరగడాన్ని సవాలుగా తీసుకోవాలి. కశ్మీరు లోయలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టడంతో వారివైపు ఆకర్షితులయ్యే యువత తగ్గిపోయింది. పొరుగుదేశంలో శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి ఉనికి చాటాలనే ఉద్దేశంతోనే పుల్వామాలో దాడికి దిగారు. రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కటవ్వాలి. ఉగ్ర ముఠాలకు గుణపాఠం చెప్పాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సీఆర్‌పీఎఫ్‌) ఎన్నో దుర్భరమైన పరిస్థితుల్లో పోరాటం చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా వారికి శిక్షణ కూడా అవసరం..’’ అంటూ పలువురు విశ్రాంత సైనికాధికారులు ‘ఈనాడు’కు తమ అభిప్రాయాలను తెలిపారు. దాడికి ఎలా స్పందించాలనే అంశంపైనా విశ్లేషణలు చేశారు. పౌరుల స్పందనను అభినందించారు.

సామాజిక మాధ్యమాల ప్రభావం 
వీవీరెడ్డి, మాజీ సైనికాధికారి (బ్రిగేడియర్‌) 

‘‘ఉగ్రవాదం పట్ల ఆకర్షితులవుతోంది ఎక్కువగా యువతే. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్‌(ఐఎస్‌ఐఎస్‌) ప్రభావం పెరిగిన క్రమంలో కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద ఉనికి కనిపిస్తోంది. మధ్య వయసున్నవారు జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. ఇరవై ఏళ్ల అనంతరం అతిపెద్ద దాడి చోటుచేసుకుంది. లోయలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడే వారున్నా.. పాకిస్థాన్‌కు భయపడి మౌనంగా ఉంటున్నారు. స్థానిక రాజకీయ నాయకులు ప్రజలను ఆకర్షించేందుకు ఆమోదయోగ్యం కాని వాదనలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా ఉగ్రవాద చర్యలకు ఊతం ఇస్తోంది. లోయలో ఆర్మీ నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు స్థానికుల నుంచి స్పందన ఉంటోంది. తమ పిల్లలను వాటిలో చదివించుకోవాలని వారు తపన పడుతున్నారు. యువత మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తోంది. మరోవైపు కశ్మీర్‌లో దాడులు నిర్వహించి, తద్వారా దేశం మొత్తం పాకిస్థాన్‌ను ద్వేషిస్తే కశ్మీర్‌ ప్రజల్లో ఆ ప్రభావం పడుతుందని వారి ఆలోచన. అక్కడి ప్రజలు పాకిస్థాన్‌ వైపు మొగ్గు చూపుతారని ఆ దేశం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది’’. 

పాక్‌దే ఈ పాపం 
ఎంవీ కృష్ణారావు, విశ్రాంత అదనపు డైరెక్టర్‌, సీఆర్‌పీఎఫ్‌ 

రెండేళ్లపాటు నేను జమ్ము కశ్మీర్‌లో పనిచేశాను. స్థానిక పోలీసుల సహకారంతో సీఆర్‌పీఎఫ్‌ అక్కడ రక్షణ విధులు చేపడుతుంది. ఇంటెలిజన్స్‌ పోలీసులు కూడా సహకరిస్తారు. ఆపరేషన్ల సమయంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలను తీసుకెళ్తారు. దేశంలోని ఏ ప్రాంతం సైనికుడు అయినా జమ్మూలోని ట్రాంజిట్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులో రిపోర్టు చేయాలి. అక్కడి నుంచి వారిని శ్రీనగర్‌ పంపిస్తారు. రెండు రోజులుగా మంచు కురుస్తుండటంతో శ్రీనగర్‌ వెళ్లేవారు ఆగిపోయారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది గురువారం బయలుదేరగా జైషేమహ్మద్‌ ఉగ్రముఠా సభ్యుడు మందుగుండు సామగ్రితో కూడిన వాహనంతో సైనికుల వాహనాన్ని డీకొట్టారు. ఇలా వాహనంలో పేలుడు పదార్థాలు నింపి ఢీకొట్టిన సంఘటనలు పాకిస్థాన్‌లో తప్ప దేశంలో ఎక్కడా లేవు. పాక్‌ ప్రభుత్వం ఐఎస్‌ఐ కి ఏటా రూ.8 వేల కోట్లు కేటాయించి భారత్‌లో ఇలాంటి సంఘటనలకు ఉసిగొల్పుతోంది. దీనికి ఉగ్ర ముఠాలు భారతపౌరులు, సైన్యాన్ని చంపితే స్వర్గం ప్రాప్తిస్తుందంటూ చేసే ప్రచారంతో కశ్మీర్‌ యువత ప్రభావితం అవుతోంది. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా రెండు సంస్థలను పాక్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి మూలకారణం భారత్‌ అంటే పాకిస్థాన్‌కు ఉన్న ద్వేషమే. రెండు దేశాల మధ్య ఏదైనా బలమైన ఒప్పందం జరిగితే తప్ప దాడులు ఆగవు. భారత్‌ ప్రభుత్వం దీనికి అంగీకరించినా పాక్‌ ప్రస్తుత పీఎం ఇమ్రాన్‌ఖాన్‌ ఆర్మీని కాదని అలాంటి నిర్ణయం తీసుకోలేరు. 

దేశం మద్దతే మాకు ధైర్యం 
కోడె దుర్గాప్రసాద్‌ సీఆర్‌పీఎఫ్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌

‘‘సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు దాడిచేయడం ‘పిరికిపంద చర్య’ . బలగాల వద్ద తుపాకులు లేవని, నిరాయుధులను లక్ష్యంగా చేసుకుని దాడిచేసినట్లు కనిపిస్తోంది. దేశంలో అనేక క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కేంద్ర రిజర్వు బలగాలు పోరాటం చేస్తున్నాయి. 240 బెటాలియన్లుగా ఉన్న కేంద్ర బలగాలు దేశవ్యాప్తంగా 80% విధులను నిర్వహిస్తున్నాయి. జయలలిత మరణించిన రోజు శాంతిభద్రతలను ఈ బలగాలే కాపాడాయి. గుజ్జర్ల ఆందోళనలు, అసోం-నాగాలాండ్‌ పరిస్థితులు, ఛత్తీస్‌గఢ్‌లో తీవ్రవాదం, సరిహద్దుల రక్షణ వంటి ఏ సమస్య తలెత్తినా ఈ బలగాలే ముందుకురికి పరిస్థితులను అదుపులోకి తెస్తున్నాయి. పూర్తిస్థాయిలో శిక్షణలు లేకున్నా విధులు నిర్వహిస్తున్నాయి. ప్రధాని మోదీ మొదలుకొని దేశవ్యాప్తంగా పౌరులు స్పందిస్తున్న తీరు మాకెంతో ధైర్యాన్నిస్తోంది. దేశమంతా ఒక్కటై సైనికుల కుటుంబాలకు చేయూతనివ్వాలని పేర్కొంటుండటం సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. పుల్వామా దాడితీరు ఒక సవాలుగా కనిపిస్తోంది. వాహన శ్రేణిమీద పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రితో దాడి చేయడం ఇదే తొలిసారి. దేశంలో 2016లో బుర్హాన్‌వానీ అంతం తరువాత ఉగ్రవాదం ఉనికి కొంత తగ్గింది. యువతను ఉగ్రవాదం దిశగా ఆకట్టుకునేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఉగ్రవాద  సంస్థల్లో స్థానికులకన్నా బయటి నుంచి వచ్చే వారే వీటిలో ఎక్కువగా ఉన్నారు. వారు మతం పేరుతో స్థానికులను ఉత్తేజపరచి దేశానికి నష్టం కలిగించాలని కుట్రలు చేస్తున్నంత కాలం ఉగ్రవాదం తగ్గిపోతుందని నేను భావించడం లేదు.’’

దేశమంతా ఏకం కావాలి 
‘ఈనాడు’తో ఏఆర్‌కే రెడ్డి, విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌

‘‘పుల్వామా ఉగ్రదాడి గత రెండు దశాబ్దాల్లో అతిపెద్దది. సీఆర్‌పీఎఫ్‌ భారీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని మాటువేసి దాడి చేశారు. ఉగ్ర సమస్యపై దేశమంతా ఒకటిగా నిలబడాలి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌ వైఖరి మారడం లేదన్నది ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చింది. అయినా, ప్రజాస్వామ్య విధానం పేరుతో మనదేశం మెతకవైఖరి అవలంబించడం సరికాదు. ఈ సమయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని, దీనికి సైనిక చర్య ఒక్కటే పరిష్కారం కాదని భావిస్తున్నా.  ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్థాన్‌ను ఆర్థికంగా, నైతికంగా, సామాజికంగా ఒంటరి చేయాలి. అక్కడ నడిచేవన్నీ సైన్యం చేతిలో ఉండే ప్రభుత్వాలే.  జైషే మహ్మద్‌, లష్కరేతోయిబా, ఇండియన్‌ ముజాహిద్‌ లాంటి ఉగ్రవాద ముఠాలు కూడా వారి అధీనంలో ఉన్నాయి. వాస్తవానికి ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. అయినా వారికి అణ్వాయుధాలు కావాలి. మన దేశంలో ఒమర్‌ అబ్దుల్లా, ఫరూక్‌ లాంటి వాళ్లు దుర్ఘటనలను ఖండిస్తూనే ఆ దేశంతో చర్చించాలని కోరుతుంటారు. ఇంతమందిని చంపాక కూడా చర్చలు కోరడం దారుణమైన అంశం. ఇతర దేశాలతో దౌత్యం నిర్వహిస్తూనే వారికి గుణపాఠం చెప్పాలి. ఇంటెలిజన్స్‌ వైఫల్యంతోనే ఉగ్రదాడి జరిగిందని చెప్పలేం. హైదరాబాద్‌లో, శ్రీనగర్‌ లోయలో ఇంటెలిజన్స్‌ ఎన్నో విధ్వంసాలు చోటుచేసుకోకుండా ఆపింది. నాడు మసూద్‌ అజహర్‌ను విడుదల సరైన నిర్ణయం కాదని ఇప్పుడు అనిపిస్తోంది.’’

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.