close

ప్ర‌త్యేక క‌థ‌నం

పాక్‌ సైన్యం జేబులో బొమ్మలే ఉగ్రవాదులు

లష్కరే తోయిబాను నియంత్రించాలంటే నేరుగా అక్కడి సైన్యంతో వ్యవహారం నడపాలి
పాక్‌ ప్రభుత్వానికి తీవ్రవాదులే బలమైన ఆయుధం
అమెరికా, భారత్‌లు తీవ్రవాద నిరోధం పేరుతో ప్రజల మౌలిక వసతుల్ని పట్టించుకోవడం లేదు
‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో దక్షిణాసియా వ్యవహారాల నిపుణురాలు క్రిస్టినా పెయిర్‌

ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

లష్కరే తోయిబా సహా వివిధ తీవ్రవాద గ్రూపుల్ని పాకిస్థాన్‌ సైన్యం పెంచి పోషిస్తోందని, వారి కనుసన్నల్లోనే ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయని లష్కరే తోయిబా సంస్థపై లోతైన అధ్యయనం చేసిన క్రిస్టినా పెయిర్‌ చెప్పారు. లష్కరేను నియంత్రించాలంటే నేరుగా పాకిస్థాన్‌ సైన్యంతోనే వ్యవహారం నడపాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి తీవ్రవాదులే బలమైన ఆయుధం అన్నారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్లను పెంచి పోషించిందీ పాకిస్థానేనని చెప్పారు. అమెరికాలోని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయంలో భద్రతా వ్యవహారాల అధ్యయన విభాగంలో క్రిస్టినా పెయిర్‌ ప్రొఫెసర్‌. దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలిసిస్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ ఫెలోగా పని చేశారు. దక్షిణాసియాలో ప్రత్యేకించి అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, భారత్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకల్లో రాజకీయ, సైనిక వ్యవహారాలపై విస్తృతంగా పరిశోధన చేశారు. లష్కరే తోయిబా గురించి, పాకిస్థాన్‌ సైన్యం యుద్ధం చేసే తీరు గురించి పుస్తకాలు, వ్యాసాలు రాశారు. అంతర్జాతీయంగా అనేక సంస్థల్లో సభ్యురాలిగా ఉన్నారు. అమెరికా, భారత్‌ లాంటి దేశాలు తీవ్రవాద నిరోధం పేరుతో ప్రజల మౌలిక వసతుల గురించి పట్టించుకోవడం లేదని, ఇప్పటివరకు ఈ పేరుతో పెట్టిన ఖర్చుతో ఎలాంటి ఫలితాలు వచ్చాయో పరిశీలించుకుని ఆరోగ్యం, విద్య రంగాలపై కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆమె సలహాఇచ్చారు. ఇరాన్‌ కంటే పాకిస్థాన్‌ ఎక్కువ ప్రమాదకారి అని ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో క్రిస్టినా వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు...

పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉందా?
పాకిస్థాన్‌లో ప్రధానమంత్రికి దేనిపైనా నియంత్రణ ఉండదు. అంతా సైన్యానిదే ఆధిపత్యం. తీవ్రవాదుల్నీ వారే నియంత్రస్తుంటారు. పాకిస్థాన్‌లో ఓ క్రికెటర్‌ ప్రధాని అయ్యారు. అతను భారతదేశానికి చాలాసార్లు వచ్చారు. భారత్‌ నుంచి క్రికెటర్లు పాకిస్థాన్‌కు పలుమార్లు వెళ్లారు కాబట్టి.. ఆ క్రికెట్‌ రోజుల్ని దృష్టిలో పెట్టుకొని ఏదో మారుతుందని ఆశలు పెట్టుకోవద్దు. ఏమీ మారదు. నేను భారతీయురాలినైతే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేదాన్ని. ఎప్పుడు శాంతి చర్చలు జరిగినా, ఎప్పుడు ప్రధానమంత్రుల మధ్య చర్చలన్నా.. అప్పుడు టెర్రరిస్టు దాడులు జరుగుతాయి. ఈ విషయంలో భారతదేశం ఏం చేయాలనేది వ్యక్తిగతంగా నేనెప్పుడూ సలహా ఇవ్వను.

అఫ్గానిస్థాన్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉంటే పాకిస్థాన్‌కు కళ్లెం వేయొచ్చని భారత్‌ భావిస్తుంది. ఆచరణలో ఇది సాధ్యమేనా?
అఫ్గాన్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉండాలా వద్దా అన్నది తాలిబాన్ల చేతిలో ఉంది తప్ప భారతదేశం కోరుకుంటే జరగదు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే తీవ్రవాదుల శిక్షణలు తగ్గుతాయనేది భారత్‌ భావన. గతంలో అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది. అయితే ఆ స్థిరత్వం భారతదేశానికి చాలా ఇబ్బందులు కలిగించింది కూడా. పాకిస్థాన్‌ చేతుల్లో అఫ్గానిస్థాన్‌ కీలుబొమ్మగా ఉండకూడదనే భారత్‌ కోరుకుంటుంది. ఇది ఎలా అన్నదే ముఖ్యం. అమెరికా, భారత్‌, ఇరాన్‌.. ఈ మూడే సరైన భాగస్వామ్యం. కానీ అమెరికా మాత్రం పాకిస్థాన్‌, సౌది అరేబియా మార్గంలో వెళ్తోంది.

‘‘అమెరికాలో ప్రభుత్వం, అధ్యక్షుడు జాతీయ భద్రతా ఎత్తుగడల్ని జారీచేస్తుంటారు. దీనివల్ల జాతీయ భద్రతకు సంబంధించి అధ్యక్షుడు, ప్రభుత్వం లక్ష్యాలేమిటో పౌరులకు తెలుసుకునే వీలుంటుంది. భారతదేశంలో అలా కాదు. ఏవైనా వార్షిక నివేదికల్లో అక్కడ, ఇక్కడ చూసి తెలుసుకోవడం తప్ప జాతీయ భద్రతకు సంబంధించి ఏం చేయబోతున్నారో దేశ పౌరులు తెలుసుకునే అవకాశం ఎక్కడుంది?

ఉగ్ర సంస్థల వల్ల పాకిస్థాన్‌కు కూడా నష్టమే కదా?
పాకిస్థాన్‌ ప్రభుత్వానికి తీవ్రవాదులే బలమైన ఆయుధం. స్థానికంగా ఎక్కడైతే అస్థిరత్వం ఉంటుందో అక్కడకు వీరిని పంపుతారు. భారత్‌లోని పలు దేవాలయాల వద్ద విధ్వంసకాండ సృష్టించిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ- సొంత దేశం పాకిస్థాన్‌లో మాత్రం హిందువుల్ని చంపలేదు. హిందూ దేవాలయాలపై దాడులు చేయలేదు. అక్కడి హిందువులకు, హిందూ దేవాలయాలకు వీరు మద్దతుదారులు కూడా. ముస్లిమేతర మైనార్టీలకు మద్దతుగా ఉంటారు. హిందువులు నివసించే ప్రాంతంలో కరవు తీవ్రంగా ఉంటే వీరు బావులు తవ్వారు. పాకిస్థాన్‌ను సురక్షితంగా ఉంచుతూ బయటి ప్రాంతాల్లో అనుకున్నది చేయడం వారి ఉద్దేశం. తాము టెంట్‌లో నిద్రపోతూ అదే టెంట్‌ను కాల్చుకొనే పని చేయరు కదా. పాక్‌లో హిందువులపై దాడులు చేసేది లష్కరే జైసా అనే మరో తీవ్రవాద సంస్థ. అలా దాడులు జరిగిన ప్రతిసారీ లష్కరే తోయిబానే ఈ పని చేసిందని అందరూ అనుకుంటూ ఉంటారు.

అఫ్గాన్‌ విషయంలో  సమగ్ర  కార్యాచరణ  ప్రణాళిక నుంచి  అమెరికా  తప్పుకోవడం  వల్ల  కలిగే ప్రభావాలు?
ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సరైన అవగాహన లేదు. అఫ్గాన్‌లో యుద్ధానికి సంబంధించి ప్రాథమికంగా కొన్ని సమస్యలున్నాయి. మొదట్నుంచీ అమెరికా తమ అవసరానికి పాకిస్థాన్‌ను వాడుకుంది. తాలిబాన్లకు పాకిస్థాన్‌ మద్దతు ఉందని తెలిసిన తర్వాతా ఇది కొనసాగింది. మాతో భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్‌- వాస్తవానికి మాకు సాయం చేయకుండా దొరికిన ప్రతి అవకాశాన్ని కోల్పోయేలా చేసింది. ఇరాన్‌ ప్రభుత్వమే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని, అణ్వాయుధాలను కలిగి ఉందని అమెరికాలో కాంగ్రెస్‌ సభ్యులు సహా చాలామంది వాదిస్తారు. ఇప్పటికీ పాకిస్థాన్‌ కంటే ఇరాన్‌ ఎక్కువ ప్రమాదకారిగా భావిస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఈ రెండు విషయాల్లో ఏ రకంగా చూసినా ఇరాన్‌ కంటే పాకిస్థానే అధ్వానం. ఇరాన్‌కు సంబంధించి సరైన దిశలో ఆలోచించిన మొదటి అధ్యక్షుడు నాకు తెలిసినంతవరకు ఒబామానే. ఇరాన్‌తో సత్సంబంధాలకు ఆయన తెరలేపారు. క్యూబాతో కూడా. ట్రంప్‌ వచ్చి వీటికి పుల్‌స్టాప్‌ పెట్టారు. అఫ్గానిస్థాన్‌ విషయంలో మాకు ఎప్పుడూ ఓ వ్యూహం లేదు.

‘‘తీవ్రవాదాన్ని పెద్ద భూతంలా చూపించి ప్రభుత్వాలు పబ్బం గడిపేసుకుంటున్నాయి. దేశంలో అంతర్గతంగా రోజూ జరుగుతున్న నరమేధాన్ని అవి పట్టించుకోవడం లేదు. సరైన వసతులు, సదుపాయాలు, ప్రమాణాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మౌలిక రంగాలపై దృష్టిపెట్టి ప్రజలను కాపాడుకోవచ్చు. అలాగే ఆరోగ్య రంగంలో మార్పులు అవసరం’’

తాలిబాన్లు కూడా అఫ్గానిస్థాన్‌లో వాటాదారులే అని ఒప్పించే ప్రయత్నం అంతర్గతంగా జరుగుతోంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఇది సరైన వాదన కాదు. న్యాయసమ్మతమైనదీ కాదు. ఇరాక్‌లో వేరు, అఫ్గానిస్థాన్‌లో వేరు. ఇరాక్‌లో తీవ్రవాదులు వేరేచోట నుంచి వచ్చి స్థిరపడ్డారు. వీరిని తుపాకులతో, అరెస్టులతో నియంత్రించవచ్చు. కానీ అఫ్గానిస్థాన్‌లో అలా కాదు. వాళ్లంతా స్థానికులు. వీరికి మద్దతిచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి ఇరాక్‌లో చేసినట్లుగా అఫ్గానిస్థాన్‌లో యుద్ధం చేయడం సాధ్యం కాదు. పాకిస్థాన్‌ను భాగస్వామిగా పెట్టుకొని అసలు చేయలేం. కారణం కేంద్ర బిందువు పాకిస్థానే. తాలిబన్లంతా స్థానిక వ్యవహారాలకే పరిమితం. వారికి అంతర్జాతీయ ప్రయోజనాలేమీ లేవు. ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండే సంస్థలను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకుల్లా వారు కూడా ఆధునికతను సంతరించుకుంటున్నారు. ఇప్పుడు చర్చల్లో కూడా వారు చెప్పే దానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికీ వారు ఎన్నికలు వద్దంటున్నారు. షరియా చట్టం కావాలంటున్నారు. మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులను లాగేసుకోవాలనుకుంటున్నారు.

అల్‌ఖైదా, ఐసిస్‌లపై చేసిన యుద్ధాలు ఏమైనా ఫలితాలిచ్చాయా?
అల్‌ఖైదాను ధ్వంసం చేయాలనుకున్నారు. కానీ ఏమైంది.. ఐఎస్‌ఐఎస్‌ను ఉత్పత్తి చేశారు. ఇరాక్‌తో యుద్ధం పేరిట అక్కడి సైన్యాన్ని నిర్మూలించారు. అప్పటికి ఐఎస్‌ఐఎస్‌ అనే సంస్థ పుట్టుక జరగలేదు. ఇరాక్‌ను ధ్వంసం చేయకపోతే ఐఎస్‌ఐఎస్‌ ఉండేది కాదేమో. భారత్‌, అమెరికాలు తీవ్రవాద నిర్మూలన పేరిట భారీగా నిధులు ఖర్చుచేశాయి. అమెరికాలో మౌలిక వసతులు చాలా అధ్వానం. ఆరోగ్య రంగం మరీను. ఈ నిధులను ఆరోగ్య రంగంపైన, విద్య పైన ఖర్చు చేసి ఉండొచ్చు. ఇంత ఖర్చు చేసినా మనం సురక్షితమని చెప్పలేం. ఐసిస్‌ ఐరోపాలో శరణార్థుల సంక్షోభాన్ని సృష్టించింది. బయటి శక్తులలోని వ్యతిరేక అంశాలను చూస్తే మనం సురక్షితం అని చెప్పడం చాలా కష్టం. దీన్నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. అమెరికా ఈ పని చేసి ఉండాల్సింది. లాడెన్‌ను తమకు అప్పగించడం గురించి తాలిబాన్‌తో సంప్రదింపులు జరిపే ప్రయత్నం కంటేకూడా.. చట్టాన్ని అమలు చేసే సంస్థల ద్వారా మరింత మెరుగ్గా ప్రయత్నించి ఉండొచ్చు.

‘‘గతంలో నిరక్షరాస్యులైన పేద యువత మాత్రమే ఉగ్రవాద సంస్థల్లో ఎక్కువగా చేరేవారు. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. బాగా చదువుకున్నవారు, ఐటీ నిపుణులైన యువ భారతీయులు ఇలాంటి సంస్థల్లో ఎందుకు చేరుతున్నారో ఇక్కడి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది’’

దక్షిణాసియా విధానానికి సంబంధించి ట్రంప్‌కు, ఒబామాకు ఉన్న తేడా ఏంటి?
ఒబామా ఆలోచనాపరుడు. పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన ఆలోచనకు తగ్గట్లుగా నడుచుకోలేదు. పాకిస్థాన్‌ తమకు ఒక సమస్య అనేది ఒబామా అవగాహన. కానీ ఇది అర్థమైన తర్వాత కూడా దీనికి పరిష్కారాలు చూపడానికి వ్యవస్థ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. ట్రంప్‌ వాటిని ఖాతరు చేయలేదు. ఈ ప్రాంతం గురించి ట్రంప్‌కు అవగాహన లేదు, తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఆయన విధానాలు ఎక్కువగా  ఎన్నికలు  దృష్టిలో పెట్టుకున్నవే. నాకు తెలిసినంతవరకు గతంలో ఉన్న అధ్యక్షులతో ఈ సమస్య లేదు.

భవిష్యత్తులో తీవ్రవాద ప్రభావం ఎలా ఉండబోతుంది?
పాకిస్థాన్‌ ఇప్పటికే మిలిటెంట్ల చేతుల్లోకి వెళ్లింది. కాబట్టి భారత్‌కు పాక్‌ భయం లేదు. భారతదేశం సంస్థాగతంగా బలంగా ఉంది. ఇక్కడి ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలి. భారత్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఐఎస్‌ఐఎస్‌ ప్రభావం తక్కువ. భారత్‌లో తీవ్రవాదులంతా ఒకే ప్రాంతానికి చెందినవారు. తీవ్రవాద సంస్థల్లో నిరక్షరాస్యులే చేరుతున్నారని ఇప్పటివరకు అనుకున్నాం. కానీ సాంకేతిక నిపుణులు, ఐటి పరిజ్ఞానం కలిగిన వారు ఎక్కువగా ఉన్నారు. దీని గురించి ఆలోచించాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.