close

ప్ర‌త్యేక క‌థ‌నం

మాట కొంచెం.. మోత ఘనం

వచ్చే గురువారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ప్చ్‌.. పరీక్షలో ప్రశ్నలన్నీ తెలిసినవేరా.. టైమే చాల్లేదు..
ఆడ లేక మద్దెల ఓడు అంటే ఇదేలేవోయ్‌..

ఇక్కడంతా వేస్ట్‌రా.. ప్రపంచంలోనే పెద్ద యూనివర్సిటీలో సీటు కొడతా..
మా బాగా చెప్పావు, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి వెళ్లటమంటే ఇదే!

ఇవాళ మేమంతా కంబైన్డ్‌ స్టడీస్‌ చేద్దామనుకుంటున్నాం అంకుల్‌..
కూసేగాడిద వచ్చి మేసే గాడిదను.. అంటే ఇదే బాబూ..

అమ్మా, ఇవాళ మా స్నేహితులమందరం పార్టీకి వెళుతున్నామమ్మా..
ఆహా.. చల్లకొచ్చి ముంత దాచటమెందుకు తల్లీ.. ఎంత కావాలో చెప్పు?
సందర్భం ఏదైనా కావొచ్చు, ఒక్క సామెత వదిలితే చాలు.. కాస్త వ్యంగ్యం.. మరికాస్త హాస్యం.. చిన్న చమక్కు.. ఎక్కడో చిన్నగా చురుక్కు.. వీటన్నింటినీ మించి వెనకాలగా ధ్వనిస్తుండే బోలెడంత నిగూఢమైన అర్థం.. ఇవన్నీ కలగలిసి సంభాషణ భలే సరదాగా తయారవుతుంది! అదే సామెతలకు ఉన్న శక్తి. సామెతలంటే మనకున్న తరతరాల ఆస్తి. ఒక్కో సామెత.. జీవిత అనుభవాన్ని రంగరించి పోసిన ఒక్కో విజ్ఞాన గుళికలాంటిది. విప్పి చెప్పాల్సిన పని లేకుండానే నొక్కి చెబుతుండే లోకజ్ఞానం ఇది! కానీ పరభాషా మోహంలో పడి మన పిల్లలకు మనం ఈ ఆస్తిని పూర్తిగా అందించలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పండితులు. మనకున్న అపారమైన సామెతల్లో నేటితరం పిల్లలకు తెలుస్తున్నవి చాలా తక్కువే ఉంటున్నాయి. మన తాతల తరం వాడిన సామెతల్లో మనం వాడుతున్నవే తక్కువనుకుంటే.. ఇక ఆధునికత పేరుతో ‘నెట్‌’లో చిక్కుకుని, ‘సెల్‌’లో పెరుగుతున్న నేటితరం పిల్లలకు తెలిసినవి మరీ తక్కువగా ఉంటున్నాయి. వారికి ఈ మాటల మసాలా రుచి చూపించటం, ఈ సంపదను అందించటం ఎంతైనా అవసరం! అందుకు మనమేం చెయ్యాలి?

ఆస్తి ఇది.. అందిద్దాం రండి

సామెత.. అనగానే అదేదో పాత చింతకాయ పచ్చడి అనుకోవచ్చుగానీ.. సామెత లేని జీవితం లేదు! జీవితం లేని సామెతా లేదు!!
ప్రతి సామెతా.. ఒక చిక్కటి జీవితానుభవం నుంచి పురుడు పోసుకున్నదే! సంక్లిష్టమైన జీవన సందర్భం నుంచి ఆవిర్భవించిందే. అందుకే చూడటానికి సామెత నాలుగైదు సాదాసీదా పదాల సమాహారంలాగే అనిపిస్తుంటుందిగానీ అది స్ఫురింపజేసే అర్థం, అది అందించే వ్యాఖ్యానం మాత్రం ఎంతో నిగూఢంగా ఉంటుంది! ప్రతి సమాజానికీ తనదైన చరిత్ర ఉన్నట్లు.. ఎవరి సామాజిక జీవితం వారికే ప్రత్యేకం అయినట్లు.. ప్రతి భాషకూ ప్రత్యేకంగా తనవైన సామెతలూ తప్పకుండా ఉంటాయి. సామెతల విషయంలో.. ఏ భాష సొత్తు.. ఆ భాషదే! అందుకే వీటిని పొదివి పట్టుకుని.. మన తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కానీ మనం ఈ అపారమైన ఆస్తి విలువను సరిగా గుర్తించటం లేదంటున్నారు పండితులు. మనమే గుర్తించనప్పుడు ఇక మన తర్వాతి తరాలకేం అందిస్తాం? అందుకే ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా.. మన తెలుగు భాషా సాగరంలో తేలియాడుతున్న ఆణిముత్యాలను పొదివి పట్టుకోవాల్సిన అవసరం ఏమిటో.. అదెలాగో ఒక్కసారి చూద్దాం!

కూరకు పోపు.. సంభాషణకు సామెత!!
* కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.. ఇప్పుడు మన పిల్లలకు సెల్‌ఫోన్లు దొరికాయండీ.. వీళ్లను ఎట్లా బాగు చెయ్యాలో తెలీటం లేదు.
* పంచాయతీ ఎన్నికల్లో వాళ్లిద్దరూ కలిసిపోయారంట కదండీ.. అయినా.. తెలీక అడుగుతా.. జోగీజోగీ రాసుకుంటే ఏం రాలుతుంది?
* పెద్ద పార్టీ ఇస్తున్నాడంట.. వాళ్లబ్బాయికి వచ్చింది అంత పెద్ద ర్యాంకా.. కాకి పిల్ల కాకికి ముద్దు కాకపోతే..!
* లేనిపోని ఆరోపణలతో నన్నేం బెదిరించలేవ్‌.. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవ్‌..
* కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్లు.. జీతం పెంచమని సమ్మె చేస్తే అసలుకే మోసం వచ్చిందే....
... ఇలా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భానికీ, తారసపడే ప్రతి భావనకూ ఒక అందమైన, ఔరా అనిపించే సామెత ఉంటుంది. సరిగ్గా ఇదే సందర్భానికి పనికొచ్చే పోలికతో వచ్చే సామ్యత.. అదే సామెతగా స్థిరపడింది. అంతే కాదు.. పదంపదంలోనూ లోకజ్ఞానం దండిగా నింపుకొన్న సామెతలు మన జీవితంలోని ప్రతి పార్శ్వాన్నీ తట్టి పలకరిస్తూ.. ఏ సందర్భానికైనా లోతునూ, గాఢతనూ, ఒక కొత్త కోణాన్ని జోడిస్తాయి. అందుకే ఒక్క సామెత వాడామంటేచాలు.. సంభాషణలోకీ, తద్వారా మన జీవితంలోకీ కొత్త ఉత్సాహం వచ్చేస్తుందంటారు విఖ్యాత పరిశోధకులు చిలుకూరి నారాయణరావు! నిజానికి ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం కోసం మనం చాలాచాలా పుస్తకాలు చదువుతున్నాంగానీ.. వాస్తవానికి ఒక్కసారి సామెతలను చదివితే.. వాటిలోని వివేచనను ఒంటబట్టించుకంటే మన వ్యక్తిత్వం గొప్పగా వికసించటం తథ్యం! ఎందుకంటే ప్రతి సామెతా.. తరతరాలుగా వస్తున్న సామూహిక మానవ జీవన సారాన్ని.. చాలా కొద్దిపదాల్లో తనలో ఇముడ్చుకున్న సూత్రంలాంటిది! అందుకే తరచుగా సామెతలను మన గణిత సూత్రాలతో కూడా పోలుస్తుంటారు!

సందర్భమేదైనా...
వ్యక్తిగత సంబందాల్లో, రాజకీయ చర్చల్లో, సభల్లో, ఉపన్యాసాల్లో, చివరికి ప్రకటనల్లో, కార్టూన్లలో, రచనల్లో.. ఇలా ఎక్కడ వాడినా ఇవెంతో విషయాన్ని క్లుప్తంగా, సమర్థంగా చెప్పేస్తాయి. వినటానికి తేలికగా, ఎంతో తెలిసిన విషయంలాగే ఉంటూ కూడా.. మన భావాన్ని చెప్పటానికి అద్భుత వాహకాలుగా ఉపయోగపడటం సామెతలకే చెల్లుతుంది. సంభాషణ నిస్తేజంగా, విసుగ్గా లేకుండా ఓ చిన్న చమక్కును తోడు చేస్తాయి. ఒక్కోసారి, ఒక్క సామెత వాడితే చాలు, మొత్తం వాతావరణమే మారిపోతుంటుంది. అందుకే వీటిని ఒక రకంగా సంప్రదాయ ‘సౌండ్‌ బైట్స్‌’ లాంటివి అంటున్నారు భాషా వేత్తలు! పైగా సాంకేతిక సంరంభ కాలంలో.. మాట ఏదైనా క్లుప్తంగా.. ట్విటర్‌ సందేశంలా దూసుకుపోవాల్సిన అవసరం ఉన్న ఈ బిజీ యుగంలో.. సామెతలకు ప్రాధాన్యం మరింతగా పెరుగుతోందన్నది భాషా పండితులు బలంగా నమ్ముతున్న అంశం! క్లుప్తంగా, సూటిగానే కాదు, మన భావాన్ని బలంగా కూడా చెప్పేందుకు సామెతలు అద్భుతంగా అక్కరకొస్తాయి.

సామూహిక అనుభవ సారం!
సామెతలు.. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనుభవం మన ఒక్కరిదే కాదనీ.. మన ముందు తరాలు కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నాయన్న భరోసా ఇవ్వటమే కాదు.. దాన్నుంచి వాళ్లేం గ్రహించారన్న సారాన్ని కూడా చెబుతాయి. అంటే మన ఒక్కరి అనుభవాన్ని సార్వజనీనం, సార్వకాలీనం చేస్తాయి! మన అనుభవాన్ని తీసుకుపోయి ఓ సామాన్య సత్యంతో ముడి కూడా వేస్తాయి. లార్డ్‌ జాన్‌ రస్సెల్‌ సామెతను ‘విట్‌ ఆఫ్‌ వన్‌ అండ్‌ ద విజ్‌డమ్‌ ఆఫ్‌ మెనీ’ అంటారు. సామెత వాడటం ద్వారా మనం పక్క వారితో అనుసంధానమవటమే కాదు.. మనమూ వాళ్లూ కూడా కలిసి సుదీర్ఘమైన చరిత్ర ఉన్న మన గతం, ఆ అనూచానమైన విజ్ఞానంతో కూడా అనుసంధానమవుతాం. అందుకే సామెతలకు ఉన్న శక్తి.. ఉమ్మడి శక్తి.

అనాది విజ్ఞానం
సామెతలకు కాలం చెల్లటమన్నది లేదు. ఆదిమ మానవుడి తొలి సాహిత్య రూపం పాట అయితే మలి సాహిత్యరూపం సామెతే అయ్యుంటుంది అంటారు పండితులు. ఏ సామెత విన్నా అందరికీ తెలిసినట్టే ఉంటుంది, కానీ అదెప్పుడు పుట్టిందో చెప్పటం కష్టం. మహాత్ముల సూక్తులను ఎవరు ఎప్పుడు చెప్పారో కచ్చితంగా చెప్పొచ్చుగానీ సామెతలు అలా కాదు. వీటి పుట్టుక వెదకటమంటే గడ్డి వామిలో సూదిని వెదకటంలాంటిదే! పైగా చాలా సామెతలు కాలక్రమంలో, ప్రాంతాలను బట్టి రూపాలను కూడా మార్చుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు అర్థంలేని వ్యర్థ ప్రయాణం అన్న సందర్భంలో తరచుగా వాడే ‘పుల్లయ్య వేమారం వెళ్లినట్లు..’ అన్న సామెత మన తెలుగు ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వినిపిస్తూ ఉంటుంది. కొందరు ‘గంగన్న కోడూరు వెళ్లినట్లు’ అంటే మరికొన్నిచోట్ల సమీపంలోని ఊరిపేరేదో వినిపిస్తుంటుంది. ఇలా ఎవరికి వాళ్లు భావం చెడకుండా, ఎంతో సహజంగా సామెతను తమ సొంతం చేసుకోవటం వల్లనే ఇవి చెక్కు చెదరకుండా ఉండిపోతున్నాయి. ఒక రకంగా జీవన ధర్మంగా, ప్రకృతి సహజంగా మన భాషలో వచ్చి చేరిపోయినవి. అందుకే అవి అంత శక్తిమంతంగా, ప్రాచుర్యంలో ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సామెతలు కాలంతో పాటు మారిపోవచ్చు. కుడి చెయ్యి చేసిన దానం ఎడమ చెయ్యికి తెలియకూడదు వంటి సార్వజనీన సూత్రాన్ని చెప్పే సామెత ఎప్పటికీ ఉండిపోతుందిగానీ.. సామాజికంగా వస్తున్న మార్పులను బట్టి స్త్రీలను, కొన్ని కొన్ని వర్గాలను కించపరిచేలా ఉండే సామెతలు అదృష్టవశాత్తూ వాడకంలో వెనకబడి, క్రమేపీ ఒకప్పటి సామాజిక చరిత్రకు సాక్ష్యాలుగానే మిగిలిపోతాయి.

కొత్త శకం!
ఈ ట్విటర్‌ కాలంలో సామెతలకు, ప్రోవెర్బ్స్‌కు కొత్త శకం ఆరంభమైందని చెప్పుకోవచ్చు. వీటితో పెద్ద విషయాన్ని కూడా కాస్త హాస్యంతో, క్లుప్తంగా, వేగంగా విస్తరింపజెయ్యటానికి అద్భుత అవకాశం చిక్కుతోంది. అందుకే పెద్దపెద్ద వ్యాసాలు చదివే ఓపిక లేని ఈ రోజులకు సామెతలను మించిన మందులేదంటారు డిక్షనరీ ఆఫ్‌ మోడర్న్‌ ప్రోవెర్బ్స్‌ సంపాదకుడు ఫ్రెడ్‌ షాపిరో. వీటిని గుర్తుపెట్టుకుని సరిగ్గా సందర్భానికి అతికినట్లుగా వాడటం కూడా చాలా తేలిక. కాకపోతే కొన్నిసార్లు సామెతలను అతిగా వాడటం వల్ల మన సంభాషణ.. కొత్త ఆలోచనలు, కొత్త ప్రతిపాదనల వైపు తీసుకుపోకుండా.. అంతా తెలిసిందేకదా, కొత్తగా చెప్పిందేముందని అనిపించే ప్రమాదమూ ఉంది. వినేవాళ్ల మనసు కొత్త ఆలోచనల వైపు మళ్లకుండా మొద్దుగా అయిపోయే అవకాశమూ ఉంది. కాబట్టి సామెతల వాడకంలో తూకం ముఖ్యం. చేతనైన వాడి చేతిలో సామెత ఒక వజ్రంలా మెరిస్తే.. చేతకాని వాడి చేతిలో అది పిచ్చోడి చేతిలో రాయిలా తయారవ్వచ్చు! అందుకే సామెతలను వాడటంలోనూ ఓ ఒడుపు ఉంటుంది. దాన్ని పట్టుకుంటే పరుగెత్తే గుర్రం జీను దొరికినట్లే! మొత్తానికి సామెతల ఖజానా పెద్దది. మరి ఈ ఖజానాను మన పిల్లలకు అందించొద్దూ!

ఆశ్చర్యకరంగా.. కరిచే కుక్క మొరగదు. బార్కింగ్‌ డాగ్‌ సెల్‌డమ్‌ బైట్స్‌. నిప్పు లేకుండా పొగ వస్తుందా..వేర్‌ దేరీజ్‌ స్మోక్‌, దేరీజ్‌ ఫైర్‌.. మెరిసేదంతా బంగారం కాదు.. ఆల్‌ దట్‌ గ్లిటర్స్‌ ఈజ్‌ నాట్‌ గోల్డ్‌. ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి.. స్ట్రైక్‌ వైల్‌ ద ఐరన్‌ ఈజ్‌ హాట్‌’ వంటి బాగా ప్రచారంలో ఉన్న కొన్ని సామెతలు అన్ని భాషల్లోనూ కనబడతాయి.
సామెతల్లో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్నది సామెతల్లో కనిపించకుండా ఉండదు. అందుకే సామెత అంటే సర్వప్రపంచం

- ఆచార్య ఎం.కులశేఖరరావు

మనం ఒప్పుకొన్నా లేకున్నా.. మనందరం కూడా ప్రతి రోజూ ఎంతోకొంత.. పొట్టనిండా లోకజ్ఞానం నింపుకున్న సామెతలు, అవి చూపుతున్న వెలుగులో.. ఆ నైతిక మార్గంలో, సామాజిక కట్టుబాట్లలో.. ఆ దారిలోనే నడుస్తున్నాం. పరుగెత్తి పాలు వద్దనుకుంటూ సామెతల వెలుగులోనే ఎన్నో నిర్ణయాలూ తీసుకుంటున్నాం. అందుకే సామెతలు.. మనకు సగటు జీవుల వేద వాక్యాల్లాంటివి!

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.