Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

మోత మోగుతున్న మొబైల్‌ డేటా 

రోజుకు నాలుగు గంటలు నెట్‌పైనే 
ఐదేళ్లలో 50 రెట్లు పెరిగిన వినియోగం 
నెలకు సగటున ఒక్కో వ్యక్తి 8.32 జీబీ వాడకం 
ఒక్క ఏడాదిలోనే ఎనిమిదింతలు పెరుగుదల 
ట్రాయ్‌ అధ్యయనంలో వెల్లడైన వాస్తవాలివీ

ఐదేళ్లలో భారత్‌లో మొబైల్‌ డేటా వినియోగం 50 రెట్లు పెరిగింది. ప్రపంచంలో మొబైల్‌ డేటా వినియోగంలో భారత్‌ ముందుంది. 

- ఇటీవల కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పిన మాట ఇది...

రానున్న ఐదేళ్లలో ప్రస్తుత సగటున ఒక వ్యక్తి వినియోగిస్తున్న మొబైల్‌ డేటా వినియోగం రెండున్నర రెట్లు పెరుగుతుంది. సగటున నెలకు 15 జీబీ ఉండే అవకాశముంది. 

- మొబైల్‌ డేటా వినియోగంపై నోకియా, ఎరిక్‌సన్‌ తదితర సంస్థల అంచనా.


తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 100 మంది ప్రజలకు మొబైల్‌ డేటా, బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యమున్న ప్రజలు 48 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది.

- ట్రాయ్‌ ఇటీవల విడుదల చేసిన మొబైల్‌ గణాంకాల్లో వెల్లడైన వాస్తవం

ఒకరోజు భోజనం లేకున్నా ఉంటారేమో కానీ... ఒక గంట మొబైల్‌ డేటా లేకుంటే ఉండలేని పరిస్థితి నెలకొంది.

డిజిటల్‌ విప్లవంలో భాగంగా దేశవ్యాప్తంగా మొబైల్‌ డేటా వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గడిచిన రెండేళ్లలో డేటా, కాల్‌ ఛార్జీలు తగ్గడంతో ఈ సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల క్రితం ధనిక వర్గాలకే పరిమితమైన ఆధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్‌ఫోన్లు, బ్రాడ్‌బ్యాండ్‌ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేరువయ్యాయి. టెలికం కంపెనీల మధ్య ధరల యుద్ధం, 4జీ నెట్‌వర్క్‌ విస్తరణ తరువాత ప్రతినెలా జీబీ సామర్థ్యం కలిగిన మొబైల్‌ డేటా కేవలం రూ.10కే లభిస్తోంది. అదే సమయంలో 2017 డిసెంబరు నుంచి 2018 డిసెంబరు వ్యవధిలోనే దేశవ్యాప్తంగా వినియోగించిన డేటా రెండింతలు పెరిగింది. గడిచిన ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనూ వైర్‌లైన్‌, వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య రెండింతలై 4.32 కోట్లకుపైగా చేరింది. అంటే దాదాపు జనాభాలో సగం మందికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిందని ట్రాయ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ప్రతిరోజూ దాదాపు 4 గంటలు మొబైల్‌డేటా వినియోగిస్తున్నారు. గంటల తరబడి వాట్సాప్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాలపై గడుపుతున్నారు. 
వీడియోలు చూస్తున్నారు...! 
మొబైల్‌ డేటా వినియోగంలో డిజిటల్‌ మీడియాదే సింహభాగం. హిందీ, ఇతర స్థానిక భాషల్లో సమాచారం అందుబాటులో ఉండటంతో డేటా వినియోగం పెరుగుతోంది. ఇటీవల సర్వే ప్రకారం రోజుకు సగటున 4 గంటల పాటు ఇంటర్నెట్‌పై గడుపుతున్నట్లు వెల్లడైంది. మరోవైపు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలు పెరుగుతున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుకోవడానికి, ఛాటింగ్‌ చేయడానికి, సమాచారాన్ని చూసేందుకు డేటా వినియోగం పెరుగుతోంది. నెట్‌వర్క్‌ సంస్థలు ప్యాకేజీల్లో భాగంగా ఉచితంగా కాల్స్‌ సౌకర్యం కల్పించినప్పటికీ, వాయిల్‌ కాల్స్‌ సగటు సమయం పెద్దగా పెరగలేదు. అదే సమయంలో వాయిస్‌ కాల్స్‌కు బదులుగా వాట్సాప్‌, ఫేస్‌టైమ్‌, గూగుల్‌ తదితర యాప్‌ల ద్వారా వీడియోకాల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మొబైల్‌ డేటా విరివిగా అందుబాటులోకి వచ్చిన తరువాత అమేజాన్‌ప్రైమ్‌ వీడియో, నెట్‌ప్లిక్స్‌, హాట్‌స్టార్‌, యూట్యూబ్‌ల్లో వారానికి 8.2 గంటలు ఆన్‌లైన్‌లో సినిమాలు చూస్తున్నారు. 
ఎందుకు పెరిగింది...? 
టెలికం కంపెనీల మధ్య పోటీతో డేటా, కాల్‌ ఛార్జీల ధరలు తగ్గాయి. ఒకప్పుడు రెండంకెల ఎంబీ డేటా వినియోగిస్తే బిల్లులు వేలల్లో వచ్చేవి. మొబైల్‌ నెట్‌కు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఆ తరువాత టెక్నాలజీ గణనీయంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ వీటిని వినియోగించాలంటే అవసరమైన డేటా ఛార్జీలు ఎక్కువ ఉండేవి. గత నాలుగేళ్ల నుంచి టెలికం కంపెనీలు ఈ ఛార్జీలు తగ్గించాయి. మూడేళ్ల క్రితం జీబీ డేటాకు రూ.184 ఛార్జీగా ఉండేది. ఇప్పుడు అది రూ.10కే పరిమితం అయ్యింది. టెలికం కంపెనీలు పోటీపడుతూ తక్కువ ధరకే మూడునెలల కాలపరిమితి కలిగిన ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఇందులో డేటాకే అత్యధిక ప్రాధాన్యం. రోజుకు 1జీబీ నుంచి రూ.2.5 జీబీ డేటా, ఉచిత కాల్స్‌, పరిమిత ఎస్‌ఎంఎస్‌లు అందిస్తున్నాయి. ఇదే సమయంలో డేటా వినియోగం కూడా పెరుగుతోంది. 
అన్ని రంగాలు డిజిటల్‌ వైపు.. 
దేశంలో అన్ని రంగాలు డిజిటల్‌ వైపు పయనిస్తున్నాయి. ప్రభుత్వ సేవల నుంచి ప్రైవేటు సేవల వరకు అన్నీ మొబైల్‌ డేటాపై ఆధారపడి ఉన్నాయి. ఉచిత యాప్‌ల ద్వారా రక్షణాత్మక సేవలు అందిస్తున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్‌ చూసుకోవాలన్నా, నిధులు బదిలీ చేయాలన్నా, ప్రభుత్వ సేవలు పొందాలన్నా, సినిమాలు చూడాలన్నా, ఈ-కామర్స్‌లో వస్తువులు కొనుగోలు చేయాలన్నా, జబ్బుపడితే వైద్య సహాయం పొందాలన్నా.. ఇలా అన్నీ మొబైల్‌లోనే. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌ ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ల యాప్‌లు వస్తున్నాయి. డిజిటల్‌ మీడియా సమాచారం క్షణాల్లోనూ తెలిసిపోతోంది. డేటా వినియోగంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దేశంలో ఎక్కడైనా డేటాను వినియోగించే అవకాశం లభించింది. ఎక్కడికి వెళ్లినా తమకు వచ్చిన ఈ-సమాచారం చూసుకోవచ్చు. అందుకే దేశవ్యాప్తంగా వినియోగమవుతున్న డేటాలో 96 శాతం మొబైల్‌ డేటాదే. తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిలోనే 4జీ వినియోగం 142 శాతం, 3జీ వినియోగం 256 శాతం పెరగడం గమనార్హం. 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.