close

ప్ర‌త్యేక క‌థ‌నం

మారకపోతే ముప్పు తప్పదు..! 

నీటి పొదుపు అనివార్యం 
వేగంగా మటుమాయమవుతున్న జలవనరులు 
కిలో ఆహారోత్పత్తికి 2 వేల లీటర్ల వ్యయం 
ఉన్న నీటికి, వినియోగానికి పొంతనేదీ? 
సాగునీటి వాటా తగ్గించుకోక తప్పని పరిస్థితి 
సూక్ష్మసేద్యం మేలంటున్న కేంద్ర జల సంఘం 

హైదరాబాద్‌ నగరంలో సరఫరా అవుతున్న ప్రతి కిలో లీటర్‌ నీటికి ప్రభుత్వం రూ.55 వ్యయం చేస్తోంది. రాష్ట్రంలో తాగేందుకు నీరు లేక అనేక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏటా సకాలంలో వానాలు కురవక, ఆఖరి తడులకు నీళ్లుఅందక పంటలు ఎండుతున్నాయి.

ఆరుతడి పంటలు వేస్తే సాగునీటి సమస్య రాదనే సూచనను అంతా పెడచెవిన పెడుతున్నారు. 
జనాభా వృద్ధి రేటుకు, ఆహార పదార్థాల దిగుబడికి మధ్య వ్యత్యాసం క్రమంగా పెరుగుతోంది.

నీటి కొరత సమస్య వేగంగా తరుముకొస్తూ.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లు ఈ అంశాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. అందుకే అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకోకపోతే ముప్పుతప్పదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరిస్తోంది. ప్రపంచంలో, దేశంలో నీటి వనరుల వినియోగంలో వస్తున్న మార్పులపై కేంద్ర జల సంఘం ఇంజినీర్లు అనేక రకాల పరిశీలనలు నిర్వహించారు. ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే ఉండగా, అందుబాటులో ఉన్న నీటి వనరులు కేవలం 4 శాతమేనని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని హెచ్చరిస్తున్నారు.

మున్ముందు క్లిష్టమైన సమస్యలు 
అందుబాటులో ఉన్న నీటికి, వినియోగానికీ మధ్య పొంతన ఉండటం లేదు. రాష్ట్రంలో, దేశంలో తాగు, సాగునీటికి సగానికి పైగా జనం బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. దీంతో భూగర్భ జలాలు వేగంగా మాయమవుతున్నాయి. జనాభా వృద్ధితో తాగునీరు, విద్యుత్‌, పరిశ్రమలకు కేటాయించాల్సిన నీటి వనరుల శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. మన దేశంలో వచ్చే ఆరేళ్లలో అంటే 2025 నాటికి సాగునీటికి 83.3%, ఇతర అవసరాలకు 10.2% నీటిని వినియోగించాల్సి ఉంటుంది. 2050 నాటికి గృహ, విద్యుత్‌, పరిశ్రమలకు 20.4% నీటి అవసరాలు ఏర్పడనుండగా సాగుకు మిగిలేది 74.1% మాత్రమే. మరోవైపు జనాభా వృద్ధి రేటు ప్రకారం ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగాల్సి ఉంది. ఒకవైపు నీటి కొరత, మరోవైపు ఆహారధాన్యాల దిగుబడి పెంచాల్సి ఉండటంతో క్లిష్టమైన పరిస్థితులు, సమస్యలు ముప్పిరిగొంటాయని కేంద్ర జల సంఘం సూచిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ఈ సంఘానికి చెందిన డైరెక్టర్లు సాగు, తాగునీటికి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు.

సూక్ష్మసేద్యం ఆచరణీయం 

దేశంలో తరిగిపోతున్న నీటి వనరులను కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం నీటి పొదుపే. ఎన్నో దేశాలు సూక్ష్మ సేద్య విధానాలను అనుసరించి, అధిక దిగుబడి పొందుతున్నాయి. అమెరికా, చైనాలతో పోల్చితే మన దేశం దిగుబడిలో బాగా వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంపర, బిందు సేద్యాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సీడబ్ల్యూసీ గుర్తుచేస్తోంది. దీంతోపాటు నీటి సంరక్షణకు భారీ ప్రాజెక్టుల కన్నా, చిన్ననీటి వనరులతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తోంది. తెలంగాణలో ‘మిషన్‌కాకతీయ’, ఏపీలో ‘నీరు-చెట్టు’ లాంటి పథకాలతో నీటి వనరుల సంరక్షణలో మార్పు వస్తుందని సూచిస్తోంది. పౌరులు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం, రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలు పండించడం వైపు దృష్టి పెట్టాలని సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌ స్పష్టం చేశారు. దిగుబడికి, నీటి వినియోగానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందనేది పరిగణనలోకి తీసుకోవాలని చీఫ్‌ ఇంజినీర్‌ రంగారెడ్డి సూచిస్తున్నారు.

సాగు.. తాగు నీటికి కష్టాలు 
వాతావరణ మార్పులు, గ్లోబల్‌వార్మింగ్‌ తదితర కారణాలతో వర్షపాతం తగ్గుతూ ఉండటంతో, భూమిలో నీటి వనరుల శాతం కూడా తగ్గిపోతోంది. జనాభా విస్ఫోటనానికి సరిపోను తాగునీటి వాటాను పెంచాల్సి ఉన్నందున ప్రస్తుతం సేద్యానికి వినియోగిస్తున్న నీటివాటాను క్రమేపీ కుదించుకోవాల్సి వస్తుంది. దేశంలో ఉపరితల జలవనరుల ద్వారా ఏటా 690 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు, భూగర్భ జలాల ద్వారా 433 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. 1951లో ఒక్కో వ్యక్తికి 5,200 కిలో లీటర్ల నీటి వనరులు అందుబాటులో ఉండగా, 3,100 కిలో లీటర్లు ఉపయోగించుకునే వెసులుబాటు ఉండేది. 2011లో ఒక వ్యక్తికి 950 కిలో లీటర్లు మాత్రమే ఉపయోగించుకునే స్థాయికి నీటివనరులు తగ్గాయి. ఇది 2025 నాటికి 700 లీటర్ల స్థాయికి పడిపోనుంది. 2050 నాటికి 600 లీటర్లకు దిగజారుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది.
భారీగా పెరగనున్న నీటి వినియోగం 
మనిషికి తాగడానికి రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీరు సరిపోతుంది. కానీ, రోజుకు ఒక మనిషికి కావాల్సిన శాకాహారం ఉత్పత్తికి 2 వేల నుంచి 5 వేల లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. కిలో మాంసాహారం ఉత్పత్తికి 10 వేల నుంచి 20 వేల లీటర్ల నీరు అవసరం. 
హైదరాబాద్‌ నగర ప్రజలకు సరఫరా చేసే కిలో లీటర్‌ నీటికి రూ.50 - రూ.55 వ్యయమవుతోంది. నగరం మొత్తానికి రోజుకు 440 మిలియన్‌ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తుండగా గోదావరి నుంచి 300 కిలోమీటర్లు, కష్ణానది నుంచి 200 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తరలిస్తున్నారు. రోజుకు 11 కోట్ల యూనిట్ల విద్యుత్‌ అవసరం అవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు నీటిని వృథాచేస్తున్న దృశ్యాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. 

మన దేశంలో ఒక కిలో బియ్యం పండించడానికి 1,000-3,000 వేల లీటర్లు నీరు వినియోగిస్తున్నారు. 
2011 గణాంకాల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు కాగా.. దేశంలో ఆహార ధాన్యాల వినియోగం 200-250 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా ఉంది. ఇది 2016-17లో 272 మెట్రిక్‌ టన్నులు. 2050కి దేశ జనాభా 164 కోట్లకు, ఆహార పదార్థాల వినియోగం 450 మెట్రిక్‌ టన్నులకు చేరుకోనుంది. ఆహారోత్పత్తితో పాటు నీటి వినియోగమూ భారీగా పెరగనుంది. 
మన దేశంలో మొత్తం సాగులో సూక్ష్మసేద్యం వాటా 8% మాత్రమే. చైనాలో 14%, అమెరికాలో 60% సూక్ష్మసేద్యం కింద ఉంది. భారత్‌లో హెక్టారుకు 2.8 టన్నుల దిగుబడి ఉండగా, చైనాలో 4.7 టన్నులు, అమెరికాలో 7.7 టన్నుల దిగుబడి నమోదవుతోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.