close

ప్ర‌త్యేక క‌థ‌నం

పండేది తక్కువ.. తినేదీ తక్కువే! 

కూరగాయలపై ఉద్యానశాఖ అధ్యయనం 
రాష్ట్రానికి ఏటా 38.54 లక్షల టన్నులు అవసరం 
ప్రస్తుతం పండిస్తున్నది 23.46 లక్షల టన్నులే 
ఇతర రాష్ట్రాల రైతులకు ఆదాయం... మనకు ధరాభారం 
2.14 లక్షల ఎకరాల్లో పంటల కాలనీల ఏర్పాటు 
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కార్యాచరణ ప్రణాళిక

మనం తినడానికి అవసరమైనన్ని కూరగాయలు రాష్ట్రంలో పండటం లేదు... అదే సమయంలో ఆరోగ్యానికి రోజూ కావాల్సిన పోషక విలువల మేరకు కూరగాయలను ప్రజలు తినడం లేదు’’ అని రాష్ట్ర ఉద్యానశాఖ స్పష్టం చేసింది. ఇక్కడి కూరగాయల కొరత ఇతర రాష్ట్రాల రైతులు, వ్యాపారులకు  ఆదాయవనరుగా మారింది. దీనివల్లే కూరగాయల ధరలు తరచూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లు, కూరగాయలు, పండ్ల వినియోగం, పంటల సాగు, దిగుబడులు, కొరత తదితరాలపై ఈ శాఖ సమగ్ర అధ్యయనం చేసింది. అన్ని అంశాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తే వచ్చే జూన్‌ నుంచి కొత్త వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో పంటల సాగు పెంపునకు అన్నీ ప్రాంతాల్లో కూరగాయలు, పండ్ల పంటల కాలనీలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ నివేదికలో ముఖ్యాంశాలు.

రాష్ట్ర ప్రజలు నిత్యం 20 రకాల కూరగాయలను వినియోగిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ నిత్యం ఆహారంలో తప్పనిసరిగా 300 గ్రాముల కూరగాయలు తింటేనే సమగ్ర పోషక విలువలు అందుతాయి. ఈ 300 గ్రాముల్లో అన్ని రకాల కూరగాయలు ఉండాలి.

 

ప్రజలు ఆకుకూరలు బాగా తక్కువ తింటున్నందున విటమిన్లు, ఇతర పోషకాల లోపాలతో అనారోగ్యం పాలవుతున్నారు. కంటిచూపు తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా పెరగడానికి ఆకుకూరలు ఆహారంలో తక్కువగా ఉండటమే ప్రధాన కారణమని ఉద్యానశాఖ తెలిపింది.

ఏడాది పొడవునా టమాటా సాగు మేలు

రాష్ట్రంలో అత్యధికంగా టమాటాలు పండుతున్నా ప్రజలకు అన్ని కాలాల్లో అందుబాటులో లేక ధరలు మండుతున్నాయి. మొత్తం 90,714 ఎకరాల్లో 9.52 లక్షల టన్నులు పండుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రజలకు 5.37 లక్షల టన్నులు చాలు. కానీ ఏడాది పొడవునా 12 నెలల్లో వరసగా పంట రావడం లేదు. సెప్టెంబరు నుంచి ఏప్రిల్‌ దాకా ధర లేక రైతులు నష్టపోతుంటే ఆ తరువాతి నెలల్లో ధరల మంటతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి. మే నెలలో అధిక ఎండలకు ఈ పంట ఎక్కువగా దెబ్బతిని దిగుబడి పడిపోతోంది. 3 వేల ఎకరాల రైతులను గుర్తించి ఫిబ్రవరి నుంచి ప్రతి నెలకు వెయ్యి ఎకరాల చొప్పున సాగు ప్రారంభిస్తే వేసవిలో టమాటాల కొరత రాదు. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో టమాటా, వంగ, బెండ వంటి తోటల సాగు పెంపునకు ఎకరానికి రూ.15,320 చొప్పున రాయితీలివ్వాలి. జీడిమెట్లలోని సెంటర్‌ ఎక్సలెన్స్‌ నుంచి ఎకరాకు సరిపోయే నారు రూ.7,200 రాయితీతో రైతులకివ్వాలి.

అతి పెద్ద మార్కెట్‌ హైదరాబాద్‌ 
రాష్ట్ర రైతుల ఆదాయాన్ని పెంచడానికి హైదరాబాద్‌ నగరం అతి పెద్ద మార్కెట్‌గా అందుబాటులో ఉంది.  ఏడాది మొత్తానికి అవసరమయ్యే 7.22 లక్షల టన్నుల కూరగాయల సరఫరాకు 41,840 ఎకరాల్లో పంటలు పండించాలి. అందుకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, యాదాద్రి, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, మేడ్చల్‌  జిల్లాల్లో  కాలనీలు ఏర్పాటు చేయాలి.

రైతులను ప్రోత్సహిస్తాం

రాష్ట్రంలో కూరగాయల కొరత తీవ్రంగా ఉన్నందున పంటల కాలనీల ఏర్పాటే శరణ్యం. ఈ దిశగా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏడాది పొడవునా ప్రతి కూరగాయ పంట సాగయ్యేలా చూడాలన్నదే మా ప్రధాన లక్ష్యం. హైదరాబాద్‌ నగరంలో భవనాలపై వర్టికల్‌ ఫార్మింగ్‌ విధానంలో గొట్టాలకు రంధ్రాలు చేసి పలు రకాల కూరగాయలు పండించవచ్చు. దీనివల్ల ప్రతి ఇంటికీ తాజా కూరగాయలు లభిస్తాయి. 

- వెంకట్రాంరెడ్డి, సంచాలకుడు, ఉద్యానశాఖ 

కొరత తీరడానికి ఏం చేయాలి?

ప్రస్తుతం రాష్ట్రంలో పండిస్తున్న కూరగాయలు సరిపోకపోవడంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. ఈ కొరతను అధిగమించడానికి రాష్ట్ర ఉద్యానశాఖ కొన్ని సూచనలు చేసింది. 
ప్రతీ మున్సిపాలిటీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా చుట్టుపక్కల గ్రామాల్లో పంటల సాగు విస్తీర్ణం పెరగాలి. అక్కడి నేలలు, వాతావరణం ఆధారంగా పంటల కాలనీలు ఏర్పాటు చేయాలి. 
(ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల్లోని 38 గ్రామాల్లో ఏర్పాటుచేసిన పంటల కాలనీలు విజయవంతమయ్యాయి)

రైతులు పండించే పంటలకు కనీస గిట్టుబాటు ధర వచ్చేలా మార్కెటింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకావాలి.

వేసవికాలంలో మే నుంచి ఆగస్టు వరకూ కూరగాయల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని నివారించేందుకు మార్చి నుంచే సాగు పెంచాలి.

పంటల కాలనీ ఏర్పాటుకు ప్రతి 50 నుంచి 100 ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఒక్కో పంటకు విభజించాలి.

 

 

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.