close

ప్ర‌త్యేక క‌థ‌నం

చెవులకు చిల్లులు

చెవుల్లో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదించడం నేటి తరానికి అలవాటుగా మారింది. బస్సు ప్రయాణంలో, ఖాళీ వేళల్లో, చివరికి వాహ్యాళిలోనూ ఇదే యువతకు తోడునీడైంది. శ్రుతి మించనంత వరకు ఇది హాయిగానే ఉంటుంది. అదే పనిగా పెద్ద శబ్దంతో వింటుంటే మాత్రం చెవులపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇది సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ  చేస్తున్న హెచ్చరిక. మోతాదుకు మించిన శబ్దాలు విన్న కారణంగా మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా 12-35 ఏళ్ల వయస్కుల్లో 100 కోట్ల మంది ఇదే సమస్య బారినపడే అవకాశం ఉందని కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఏ మోతాదులో శబ్దాలు ఎంత సమయం వినొచ్చు..అంతకుమించితే ఎలాంటి ప్రమాదం ఉంటుందో కూడా చెప్పింది.

చెవికెక్కించుకుందామా! 
శబ్ద తీవ్రత పెరిగితే వినికిడి లోపం 
అతిగా వాడితే ‘ఇయర్‌ ఫోన్ల’తో చేటే 
85 డెసిబెల్స్‌ దాటితే ప్రమాదమే 
యుక్త వయస్కుల్లో పొంచి ఉన్న ముప్పు 
ప్రపంచంలో 100 కోట్ల మందికి వినికిడి సమస్య 
యువతా..తస్మాత్‌ జాగ్రత్త! 
నివారణపై దృష్టి పెట్టాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ 
స్మార్ట్‌ఫోన్లు, సంగీత పరికరాల ఉత్పత్తిదారులకు కొత్త మార్గదర్శకాలు

చెవిలో కర్ణకఠోర శబ్దాలు వినిపిస్తున్నాయని ఇటీవల ఓ యువకుడు(28) వైద్యుణ్ని సంప్రదించాడు. అంతర చెవిలో కణాలు దెబ్బతిన్నాయని పరీక్షల్లో గుర్తించారు.ఆ యువకుడు గత ఐదేళ్లుగా చెవుల్లో ‘ఇయర్‌ ఫోన్లు’ పెట్టుకొని పెద్ద శబ్దంతో పాటలు వింటున్నాడని, అందుకే సమస్య తలెత్తిందని తేల్చారు. 


ఇటీవల శాసనసభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఓ యువకుడు(35) ఒక సభలో లౌడ్‌ స్పీకర్ల పక్కనే కూర్చున్నాడు. ధూంధాం పాటలకు ఆడిపాడాడు. నినాదాలు మార్మోగుతుంటే తానూ గొంతు కలిపాడు. అలా రెండు గంటల పాటు సభలో ఉన్న ఆ యువకుడికి కార్యక్రమానంతరం చెవిలో నొప్పిగా అనిపించింది. ఎంతకీ తగ్గకపోవడంతో వైద్యుణ్ని సంప్రదించాడు. పెద్ద శబ్దాలను దగ్గరగా, ఎక్కువసేపు వినడం వల్ల మధ్య చెవిలో సమస్య ఏర్పడిందని వైద్యులు నిర్ధారించారు. 
సంగీతం శ్రవణానందమే. మోతాదుకు మించిన శబ్దంతో వింటే మాత్రం కర్ణ కఠోరమే! నిరంతరం చెవుల్లో ‘ఇయర్‌ ఫోన్లు’ పెట్టుకొని పెద్ద శబ్దంతో అదే పనిగా సంగీతాన్ని వినడం వల్ల చెవులకు ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువతరం వినికిడి నష్టం బారిన ఎక్కువగా పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. 85 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ శబ్దంతో గంటల తరబడి చెవులను మారుమోగిస్తుంటే..శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ఈ తరహా సమస్యతో బాధపడుతున్న యువత దేశంలో సుమారు 10 శాతం వరకూ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రాన్రానూ ఇది తీవ్ర సమస్యగా రూపాంతరం చెందుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా నివారణ చర్యలపై అప్రమత్తత ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్‌ టెలీ కమ్యూనికేషన్‌ యూనియన్‌(ఐటీయూ) సంయుక్తంగా ఇటీవల వినికిడి లోపాల నివారణకు పాటించాల్సిన సరికొత్త ప్రమాణాలను, మార్గదర్శకాలను విడుదల చేశాయి.

ఎప్పుడు ప్రమాదం? 
సాధారణంగా 75 డెసిబెల్స్‌ వరకూ వినడానికి మన చెవి సౌకర్యవంతంగా సహకరిస్తుంది. గరిష్ఠంగా 85 డెసిబెల్స్‌ వరకూ వినొచ్చు(అదీ రోజులో 8 గంటల వరకూ మాత్రమే పరిమితి). 
90 డెసిబెల్స్‌ అయితే గరిష్ఠంగా 4 గంటలు, 95 డెసిబెల్స్‌ అయితే రెండు గంటలే పరిమితి. 
100 డెసిబెల్స్‌కు శబ్ద తీవ్రత పెరిగిన పక్షంలో కేవలం గంటకే వినికిడి సమస్య తలెత్తే ప్రమాదముంది. అంత మోత వల్ల అంతర్‌ చెవి(కాక్లియా)లో అతి సున్నితమైన గ్రాహక కణాలు తీవ్ర ప్రకంపనలకు లోనై దెబ్బతింటాయి.
ఇలా గుర్తించొచ్చు 
శబ్ద తీవ్రతకు గురై, వినికిడి లోపం తలెత్తడానికి ముందు కొన్ని సంకేతాలు వెలువడుతాయి. 
గుయ్‌య్‌య్‌య్‌..మంటూ హమ్మింగ్‌ శబ్దం వినిపిస్తుంది. ఈ తరహా శబ్దం సుమారు 10 రోజులపాటు ఉండి కొందరికి సాధారణ స్థితికి చేరుకుంటుంది. 10-15 రోజులు దాటినా ఆ శబ్దాలు చెవిలో మార్మోగుతుంటే మాత్రం వైద్యుణ్ని సంప్రదించాల్సిందే. 
ఎక్కువ రోజులు గడిస్తే శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తే ప్రమాదముంది. 
దీనివల్ల నిద్ర పట్టకపోవడం, మానసికంగా కుంగిపోవడం వంటి సమస్యల బారినపడతారు.

పొంచి ఉన్న ముప్పు 

ప్రపంచ వ్యాప్తంగా 12-35 ఏళ్ల వయస్కుల్లో దాదాపు 50 శాతం మంది(సుమారు 100 కోట్ల మంది) వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 
ప్రపంచ జనాభాలో దాదాపు 5 శాతం మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. వీరిలో 43.2 కోట్ల మంది పెద్దవాళ్లు కాగా, 3.4 కోట్ల మంది పిల్లలు. 
వీరిలో అత్యధికులు వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలే. 
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రతి 10 మందిలో ఒకరు వినికిడి లోపంతో బాధపడుతుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.

స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు ఉత్పత్తి చేసే సంస్థలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాలివీ 

శబ్ద తీవ్రత పెరిగే పక్షంలో పరిధి దాటుతున్నావని హెచ్చరించే యాప్‌ను పరికరంలో అమర్చాలి. 
పరిధి దాటుతుంటే బీప్‌ శబ్దం వంటి హెచ్చరిక సంకేతాలు అందజేయాలి. 
పరికరాలను ఎలా వినియోగించాలనే సూచనలను, శబ్ద తీవ్రతపై   హెచ్చరికలను పరికరం పెట్టెలపై రాయాలి. 
సంగీతం వినేటప్పుడు ఎంత మోతాదులో వింటున్నారనేది సూచించే విధంగా డెసిబెల్స్‌ కనిపించాలి. 
ప్రమాదకర డెసిబెల్స్‌ దాటి ముందుకు వెళ్లకుండా నియంత్రణ ఉండాలి. 
శబ్దాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినా గరిష్ఠ పరిమితికి మించి  పెంచుకునే వెసులుబాటు ఉండకూడదు. 
ఒకవేళ పెంచినా దానంతటదే శబ్ద తీవ్రత సాధారణ స్థాయికి చేరుకోవాలి.

అవగాహన రాహిత్యంతోనే.. 

సాధారణంగా రెండు రకాల శబ్దాల కారణంగా వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. బాంబు పేలుడు వంటి పేలుళ్లను దగ్గరగా విన్నప్పుడు, డిస్కోథెక్‌లు, ఊరేగింపుల్లో మోతల కారణంగా చెవిలో అంతర్భాగం దెబ్బతింటుంది. ఇక రెండో రకానికొస్తే చెవుల్లో ఇయర్‌ ఫోన్లు పెట్టుకొని పెద్ద శబ్దంతో ఎక్కువసేపు వినడం వల్ల కూడా ఇదే ప్రమాదం ఉంటుంది. సంగీతాన్ని ఎంత తీవ్రతలో వింటున్నాం? ఆ తీవ్రత మన చెవికి ఏ మేరకు హాని చేస్తుందనే అవగాహన ఎక్కువమందిలో లేకపోవడం వల్లనే ఎక్కువ మంది వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. సమస్యను త్వరితగతిన గుర్తించి చికిత్స పొందడమో, అసలు సమస్య బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమో చేయాలని సూచించింది.

వంద శాతం నివారించదగినదే 
డాక్టర్‌ మోహన్‌రెడ్డి, ఈఎన్‌టీ నిపుణులు

ధునిక జీవనశైలికి అలవాటుపడి పెద్దపెద్ద శబ్దాలతో సంగీతం వినడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మోజు వినికిడి సమస్యను తెచ్చిపెడుతోంది. ఒక్కసారి వినికిడి లోపం తలెత్తితే, దాన్ని పూర్వస్థితికి తీసుకురావడం కష్టసాధ్యమే. ఇది వారి నాణ్యమైన జీవితంపై దుష్ప్రభావం చూపుతోంది. ఇది వంద శాతం నివారించదగినదే. ఆ దిశగా అవగాహన పెంచుకోవడం ముఖ్యం.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.