close

ప్ర‌త్యేక క‌థ‌నం

అమ్మో... బొమ్మ!

చిన్నారులు ఆడుకొనే బొమ్మల్లో హానికర లోహ, రసాయనాలు
నోట్లో పెట్టుకోవడం ద్వారా శరీరంలోకి  చేరుతున్న సీసం, థాలేట్స్‌
రక్త ప్రసరణకు అంతరాయం
మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావం
భావోద్వేగాల్లోనూ మందగింపు
ఎన్‌ఐఎన్‌ అధ్యయనంలోనూ వెల్లడి
ప్రకృతి సిద్ధమైన ఆటవస్తువులే మేలంటున్న వైద్యనిపుణులు

రంగురంగుల ఆట బొమ్మలంటే చిన్నారులకు ప్రాణం. గుక్కతిప్పుకోకుండా ఏడుపు లంకించుకొనే బుజ్జాయిలు సైతం చిన్న బొమ్మను వారి ఎదుట పెట్టగానే చిటికెలో బోసి నవ్వులు చిందిస్తారు! బొమ్మలకు చిన్నారులకు అంతగా అవినాభావ సంబంధం. అవి పిల్లలను ఎంతగానో అలరిస్తాయి. ఆటవిడుపుగా నిలుస్తాయి. చిన్న చిన్న బొమ్మల ద్వారానే చిన్నారులకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ ప్రపంచంతో అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. బాల్యమంతా అందమైన బొమ్మలతోనే గడుస్తుంది. చిన్నారుల జీవితాలతో ఇంతగా ముడిపడిన ఆట బొమ్మలది ప్రపంచ విపణిలో పెద్ద వ్యాపారం కూడా. అయితే, వీటి తయారీలో వినియోగిస్తున్న రంగులు, రసాయనాలు, లోహాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బొమ్మల ద్వారా చిన్నారుల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావంపై జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) గత ఐదేళ్లుగా అధ్యయనం నిర్వహిస్తోంది. నాసికరమైన బొమ్మలు పిల్లల జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో అధ్యయనంలో స్పష్టంగా పేర్కొంది.

మారిన ధోరణి
పూర్వం మట్టి, చెక్కతో చేసిన ప్రకృతిసిద్ధమైన బొమ్మలుండేవి. వాటితోనే పిల్లలు ఆడుకునేవారు. వాటికి రంగులేసినా సహజసిద్ధమైన రంగులే వేసేవారు. కాబట్టి వాటితో హాని ఉండేది కాదు. పర్యావరణ సమతౌల్యం కూడా ఉండేది. మన సంస్కృతిలో భాగంగా ఉండేవి. అయితే ఇప్పటి కాలం బొమ్మలు దీనికి భిన్నం. తుపాకీతో కాల్చుకోవడం, కారును వేగంగా నడపడం, రిమోట్‌ నియంత్రణతో కార్లను ఒకదానితో మరొకదాన్ని ఢీకొట్టించడం వంటివి చూస్తున్నాం. ఈ బొమ్మలు తయారుచేసే పదార్థాలు కూడా అన్ని కృత్రిమమే. అన్నీ ప్లాస్టిక్‌, లోహంతో చేసేవే. వాటికి పైపూతగా కృత్రిమ రంగులు, రసాయనాలను వినియోగిస్తున్నారు. బొమ్మలకు వేసే అన్ని రంగుల్లోనూ సీసం ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే సీసం తక్కువ ధరకు లభిస్తుంది. అలాగే థాలేట్స్‌ లేకుండా బొమ్మ రాదు. సీసం లేకుండా రంగు రాదు. అందుకే ఈ రెండింటినీ బొమ్మల తయారీలో ప్రముఖంగా వినియోగిస్తారు. బొమ్మలకు వాడే రంగులన్నీ కూడా పెట్రోలియం ఉత్పత్తుల్లో మిగిలిన వ్యర్థ రసాయనాలతో కూడినవే అధికంగా ఉంటాయి. థాలేట్స్‌ నుంచి రసాయనం క్రమ క్రమంగా విడుదలవుతుంటుంది.

 

సామాజికంగానూ సమస్యే
పూర్వం అమ్మ వంట చేస్తుంటే పిల్లలు సహాయపడుతుండేవారు. నానమ్మ పూజ చేస్తుంటే గంట కొడుతుండేవారు.. ఇలా వివిధ పనుల్లో పెద్దవారిని చిన్నారులు అనుకరిస్తుండే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. బడికెళ్తే చదువు.. ఇంట్లో ఉంటే బొమ్మలు, ట్యాబ్‌లే. పిల్లలూ తల్లిదండ్రుల మధ్య కూడా యాంత్రికత వచ్చేసింది. తాము వెంట ఉండి ఆడించే పరిస్థితులు తగ్గిపోవడంతో.. పిల్లలకు అడిగినన్ని బొమ్మలు కొనిస్తున్నారు. దీంతో పిల్లలు తమకు తాము ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని అందులోనే మునిగితేలుతున్నారు. ఇది రాన్రానూ శ్రుతిమించడంతో పిల్లలకు సామాజిక సంబంధ సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఎవరితోనూ కలవలేరు. భావ వ్యక్తీకరణ లోపిస్తోంది. భాషాపరమైన సమస్యలొస్తున్నాయి. బొమ్మలు/ ఆటపరికరాల మీదే మనసు పెట్టడం వల్ల మనుషుల మీద ఏకాగ్రత తగ్గిపోయింది. ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకొనే సామర్థ్యం తగ్గింది. భావోద్వేగ సమస్యలు తలెత్తుతాయి. పెద్దయ్యాక బృందంలో కలిసి పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెళ్లయ్యాక భాగస్వామితోనూ సంబంధాలు సరిగా ఉండవు.

 

బొమ్మల్లో ఉండే హానికారకాలు?

* సీసం
* క్యాడ్మియం
క్రోమియం
* ఆర్సినెక్‌
* మెర్క్యూరీ
* థాలేట్స్‌

రూ.4వేల కోట్ల వ్యాపారం

* మన దేశంలో పిల్లల బొమ్మల అమ్మకాల విలువ ఏటా సుమారు రూ.4వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
* బొమ్మల్లో నాణ్యత ప్రమాణాల నిబంధనల ప్రకారం..గరిష్ఠంగా 90 పీపీఎం వరకూ సీసం ఉండొచ్చు.
* అయితే 55 శాతానికి పైగా బొమ్మల్లో సీసం 90 పీపీఎం స్థాయిని మించి అధికంగా ఉన్నట్లుగా అధ్యయనంలో తేలింది.
* ప్రముఖ సంస్థలు ఉత్పత్తి చేసే వాటిల్లో 9 శాతం బొమ్మల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. పేరు ముద్రించకుండా ఉత్పత్తి చేసేవాటిల్లో.. 36 శాతం బొమ్మల్లో సీసం అధికంగా ఉంది.
* మనకు అందుబాటులో ఉన్న బొమ్మల్లో 70 శాతానికి పైగా చైనాలో తయారైనవే ఉంటున్నాయి. వీటిల్లో థాలేట్స్‌, సీసం ప్రమాదకర స్థాయుల్లో ఉండడాన్ని గుర్తించారు.

చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం ఇలా..

* రక్తంలో సీసం స్థాయి పెరుగుదల
* రక్తప్రసరణకు అంతరాయం
* మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావం
* రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం తగ్గుదల
* ఆయాసం, నీరసం
* చురుకుదనం లోపించటం
* ఆలోచన, గ్రహణ శక్తి తగ్గుదల
* ఏకాగ్రత కోల్పోవటం
* చదువుల్లో వెనుకబాటు
* మూత్రపిండాలు, కాలేయం, గుండె తదితర అవయవాలపైనా దుష్ప్రభావం
* థాలేట్స్‌ భవిష్యత్‌లో సంతానలేమికి దారితీస్తాయి

ప్రమాదకరమని గుర్తించడమెలా?

* బొమ్మ మరీ పలుచగా ఉండి, ఎటు తిప్పితే అటు వంగి  పోతుంటే అది నాసిరకమే.
* ప్రముఖ సంస్థ ఉత్పత్తి చేసిన బొమ్మలు అయితే.. ఆ సంస్థ పేరు, ఎక్కడ ఉత్పత్తి అయింది, బార్‌ కోడ్‌, బ్యాచ్‌ నంబరు.. మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూటర్‌ పేర్లు, సురక్షిత వాడుక సూచనలు, వినియోగదారునికి అందుబాటులో ఉండే ఫోన్‌ నంబరు తదితర అంశాలన్నీ ముద్రించి ఉంటాయి. ఇవేవీ లేని బొమ్మల్లో నాణ్యత ప్రమాణాలను అనుమానించాల్సిందే.
* ఇవన్నీ ముద్రించి కూడా నకిలీ సంస్థలు బొమ్మలను విపణిలోకి ప్రవేశపెడుతున్నాయి. వీటిని కూడా బ్రాండెడ్‌ బొమ్మలుగా చెలామణి చేస్తున్నాయి.
* మరీ కళ్లు చెదిరే రంగుల బొమ్మలు శ్రేయస్కరం కాదు.

ఏమిటి పరిష్కారం?

* బొమ్మల నాణ్యత ప్రమాణాలను పరీక్షించే వ్యవస్థను పటిష్ఠం చేయాలి.
* దేశీయ బొమ్మల ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించాలి.
* చైనా తదితర విదేశీ బొమ్మలను, ముఖ్యంగా హానికర లోహాలు, రసాయనాలతో తయారు చేసిన బొమ్మలను  నిషేధించాలి.
* సముద్ర మార్గాల ద్వారా బొమ్మల అక్రమ రవాణాను అడ్డుకోవాలి.
* అసంఘటిత రంగంలో బొమ్మల ఉత్పత్తిపై నిఘా పెట్టాలి.
* బొమ్మలతో ఆడుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడగాలి.
* బొమ్మలను చిన్న పిల్లలు నోట్లో పెట్టుకోనీయొద్దు.

బొమ్మల కొనుగోలులో జాగ్రత్త

పిల్లల ఎదుగుదలలో బొమ్మలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. బొమ్మలు లేకుంటే పిల్లల ఐక్యూ పెరగదు. చైనా ఉత్పత్తి చేసే బొమ్మలను అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌ తదితర దేశాలు నిషేధించాయి. నాసిరకమైన బొమ్మలను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం తగ్గిపోతుంది. ఈ విషయాన్ని పిల్లలు ఎదుగుతున్న దశలో తల్లిదండ్రులు గుర్తించలేరు కూడా. హానిరహిత బొమ్మలను కొనివ్వడానికి ప్రాధాన్యమివ్వాలి.

-డాక్టర్‌ బి.దినేశ్‌ కుమార్‌, ఉప సంచాలకులు, జాతీయ పోషకాహార సంస్థ

నెమ్మదిగా విషమివ్వడం లాంటిదే

పాశ్చాత్య దేశాల్లో బొమ్మల తయారీలో నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నారు. ప్లాస్టిక్‌, లోహాలు, రసాయనాలతో కూడిన బొమ్మలతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని గ్రహించిన పాశ్చాత్య దేశాలు పిల్లల్లో ఆరోగ్య పరీక్షలను ప్రతి ఆర్నెల్ల్లకోసారి నిర్వహించి రక్తంలో సీసం ఎంతుందనేది నిర్ధారిస్తారు. మన దగ్గర ఆ పద్ధతి లేదు. మనకు తెలియకుండానే చిన్నారుల మెదడు మొద్దుబారుతోంది. నిజం చెప్పాలంటే బొమ్మల ద్వారా నెమ్మదిగా చిన్నారుల శరీరాల్లోకి విషాన్ని ఎక్కిస్తున్నట్లే.
-డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు
ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.