close

ప్ర‌త్యేక క‌థ‌నం

పాక్‌ నిఘాను బోల్తా కొట్టించిందెలా?

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ నిఘా వ్యవస్థ కన్నుగప్పి యుద్ధ విమానాలను భారత్‌ ఆవలికి ఎలా పంపగలిగిందనే విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి ప్రత్యర్థి యుద్ధ విమానాల కదలికలను పసిగట్టేందుకుగాను పాక్‌కు పటిష్ఠ రాడార్‌ వ్యవస్థ ఉంది. కింద నుంచి వెళ్లే విమానాలను గుర్తించేందుకు ‘బలూన్‌ బరాజ్‌’ అనే గగనతల నిఘా వ్యవస్థను ఏర్పాటుచేసుకుంది. అయినా ఇవేవీ మిరాజ్‌-2000 యుద్ధ విమానాలను అడ్డుకోలేకపోయాయి.

దాయాది తేరుకునేలోపే..
తెల్లవారుజామునే జరిగిన ఈ దాడి పాక్‌ను విస్మయానికి గురిచేసింది. దాన్ని అడ్డుకునేందుకు సమయం లేదు. ఎల్‌వోసీ నుంచి బాలాకోట్‌ పెద్ద దూరమేం కాదు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఉగ్ర శిబిరం ఉంది. యుద్ధ విమానాల వేగానికి ఈ దూరం లెక్కే కాదు. మిరాజ్‌ల రాకను గుర్తించి దాయాది దేశం స్పందించేలోపే అవి పని పూర్తి చేసి ఉంటాయి. నిఘా వ్యవస్థతో పోలిస్తే పాక్‌ ప్రతిస్పందన సామర్థ్యం బలహీనం. నియంత్రణ రేఖ వెంబడి సుఖోయ్‌-30 యుద్ధ విమానాల తరంగాలను నిరోధించే పనిలో పాక్‌ గస్తీ విమానాలు ఉండగా మిరాజ్‌లు లోపలికి దూసుకెళ్లి.. లేజర్‌ గైడెడ్‌ బాంబులను కోఆర్డినేట్స్‌ పెట్టి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించి ఉండొచ్చు. పాక్‌ ఆర్మీ జనరల్‌ ఒకరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమైన వాదన వినిపించారు. నియంత్రణ రేఖ నుంచే ఓ కోణంలో మిరాజ్‌లు పేలోడ్‌ను విసిరాయని.. దీంతో బాలాకోట్‌ వరకు బాంబులు చేరుకున్నాయని ఆయన చెప్పారు. ఆ వాదన హాస్యాస్పదం.

పాక్‌ ఎలా స్పందించొచ్చు?
తాజా వైమానిక దాడులతో పాక్‌ రగిలిపోతుంటుందన్నది కాదనలేని వాస్తవం. ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో పాక్‌ ఎలా స్పందిస్తుందన్నదానిపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.

ఏమేం చేయొచ్చంటే..
* సంప్రదాయ యుద్ధానికి పాక్‌ మొగ్గుచూపే అవకాశాలు దాదాపుగా లేవు. రణరంగంలో నేరుగా మనదేశాన్ని ఢీకొట్టి నిలవగలగడం ఆ దేశానికి శక్తికి మించిన పని. అందుకే జిహాదీలను వినియోగించుకొని జమ్మూకశ్మీర్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కీలక నగరాలు లక్ష్యంగా దాడులకు తెగబడొచ్చు. జిహాదీలు మరణిస్తే ఆ దేశానికి పెద్దగా నష్టమేం ఉండదు.

* సరిహద్దుల్లో పాక్‌ దళాలు మరింత ముమ్మరంగా కాల్పులు జరిపే అవకాశముంది. కశ్మీర్‌లో అంతర్గత ఘర్షణలను మరింత పెంచేందుకు ప్రయత్నించొచ్చు.
* గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌ వంటి ప్రాంతాల్లో భారత జాలర్లను బంధించి దౌత్య పైచేయి సాధించేందుకు ప్రయత్నించొచ్చు.

భారత్‌ తర్వాతి అడుగేంటి?
వైమానిక దాడులతో ఉగ్ర మూకల భరతం పట్టిన భారత్‌ ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశముంది. పాక్‌ దాడులకు దిగితే తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉంటుందనడంలో సందేహమేమీ లేదు. తాజా దాడులపై అంతర్జాతీయ స్పందన ఎలా ఉంటుందనేది మనదేశం తదుపరి అడుగును ప్రభావితం చేయొచ్చు. ముఖ్యంగా దాడులకు పలు దేశాల నుంచి మద్దతు లభిస్తే సరిహద్దుల వెంట మన సైన్యం మరింత దూకూడుగా వ్యవహరించే అవకాశముంది. ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడొచ్చు. సరిహద్దుల్లో ఉగ్ర శిబిరాలకు క్షిపణి రక్షణ వ్యవస్థ అందుబాటులో లేదు. యుద్ధ ట్యాంకులను ఎదుర్కొనే సామర్థ్యం కూడా లేదు. కాబట్టి ట్యాంకులతో వాటిపై దాడికి దిగే అవకాశాలు లేకపోలేదు. నియంత్రణ రేఖకు సమీపంలో పాక్‌ సైనిక ఉన్నతాధికారుల ఫాంహౌజ్‌లు ఉన్నాయి. వాటిపై మన శతఘ్నులతో దాడి చేయడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ నియంత్రణ రేఖ వెంబడి మన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ దాడులకు దిగితే, ఈ ఫాంహౌజ్‌లను లక్ష్యంగా చేసుకొని ఆ దేశాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేయొచ్చు.

- లెఫ్టినెంట్‌ కల్నల్‌ కె.మాధవరావు విశ్రాంత సైనికాధికారి. (శ్రీలంక, మణిపూర్‌, జమ్మూకశ్మీర్‌లో ఈయన పలు సైనిక ఆపరేషన్లలో పాల్గొన్నారు. బ్లాక్‌ క్యాట్‌ కమాండో దళంలో స్క్వాడ్రన్‌ కమాండర్‌గానూ పనిచేశారు.)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.