close

ప్ర‌త్యేక క‌థ‌నం

సరిహద్దుల్లో బతుకు యుద్ధం 

బితుకు బితుకుగా ప్రజలు 
స్థానికులను ఖాళీ చేయిస్తున్న సైన్యం 
కశ్మీర్‌ లోయలో స్తంభించిన జనజీవనం 
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజల బతుకు యుద్ధం మాత్రం మొదలైంది. మోర్టార్ల మోతలు హోరెత్తిస్తుండగా.. చెవులు చిల్లులు పడేలా యుద్ధ విమానాల శబ్దాలతో ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అధికారుల సూచనల మేరకు కొందరు ఇళ్లలోనే ఉండిపోగా.. మరికొందరు దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. కశ్మీర్‌ లోయలోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. వేర్పాటువాదుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు చేయడాన్ని నిరసిస్తూ జాయింట్‌ రెసిస్టెంట్‌ లీడర్‌షిప్‌ (జెఆర్‌ఎల్‌) ఇచ్చిన రెండు రోజుల (బుధ, గురువారాల్లో) బంద్‌ కారణంగా లోయలో జనజీవనం స్తంభించిపోయింది. జమ్మూలోని సాంబ, ఆర్‌ఎస్‌పురా తదితర సెక్టార్లలో సరిహద్దులకు ఆనుకొని ఉన్న ఆర్నియా, సోహగ్‌పూర్‌, హన్సా, మోథా, లాంగ్రియాల్‌, ఫతేపుర్‌, జేడ్రా, షాహపూర్‌ తదితర గ్రామాల్లోని ప్రజలను సైన్యం ఖాళీ చేయిస్తోంది. కొన్నిచోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లిపోతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమ గ్రామ ప్రజలను తామే సరిహద్దుకు నాలుగైదు కిలోమీటర్ల దూరానికి తరలించి పునరావాసం కల్పిస్తున్నట్లు ఆర్నియా సర్పంచి స్వర్ణలాల్‌ ‘ఈనాడు’కు తెలిపారు. తమ గ్రామాల్లో చాలినన్ని బంకర్లు లేవని, ఉద్రిక్తతలు తలెత్తినప్పుడల్లా అప్పటికప్పుడు ప్రజలందరికీ పునరావాసం కల్పించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సర్జికల్‌ దాడులు జరిగినప్పుడు పాకిస్థాన్‌ బలగాలు తమ గ్రామంపై విరుచుకుపడ్డాయని, ఆ భయంతో ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయని, ఫోన్లలో త్రీజీ సదుపాయం లేదని, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టంగా మారిందన్నారు. దాదాపు సరిహద్దులకు ఆనుకొని ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఆకాశం నుంచి ఎలాంటి శబ్దం వినిపించినా ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో మిగిలిన వారు అప్పుడప్పుడు గుంపులుగా వీధుల్లోకి వచ్చి చర్చించుకుంటున్నారు. జేఆర్‌ఎల్‌ బంద్‌ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటలకే ఎన్‌ఐఏ అధికారులు వేర్పాటువాద నాయకులైన యాసిన్‌మాలిక్‌, మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూకీ తదితరుల ఇళ్లను స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల సహకారంతో చుట్టుముట్టారు. విషయం తెలియగానే శ్రీనగర్‌లోని ప్రఖ్యాత లాల్‌చౌక్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మైసూమి ప్రాంతంలో స్థానిక యువకులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కుల్గామ్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కావడంతో, దీనికి నిరసనగా ఈ జిల్లాలో బుధవారం బంద్‌ పాటించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.