close

ప్ర‌త్యేక క‌థ‌నం

యథాతథమా.. మార్పులూ చేర్పులా?

కొత్త జోన్‌ ప్రకటనతో  రైల్వే డివిజన్ల పరిధిపై చర్చ
తెరపైకి మరోసారి తిరుపతి, కాజీపేట డిమాండ్లు

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన నేపథ్యంలో సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఇప్పటివరకు ఉన్న డివిజన్ల పరిధి చర్చనీయాంశంగా మారింది. కొన్ని డివిజన్లు రెండు, మూడు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో కొంత భాగాన్ని విజయవాడ డివిజన్‌లో కలపనున్నట్లు రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. మిగిలిన ఐదు డివిజన్ల పరిధి యథాతథంగా ఉంటుందా? మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయా అన్నది కీలకంగా మారింది. తెలంగాణలో కాజీపేట, ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిని కొత్త డివిజన్లుగా ప్రకటించాలని డిమాండ్లు ఇప్పటికే ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అవి తెరపైకి వస్తున్నాయి.

వేర్వేరు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన డివిజన్లు
ద.మ.రైల్వేలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ డివిజన్లు.. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడే ‘దక్షిణ కోస్తా’ జోన్‌లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ జోన్లు ఉంటాయని గోయల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ డివిజన్లో కలిసే వాల్తేరు డివిజన్‌ ఎంత భాగం, దాని పరిధి ఏమిటన్నది స్పష్టం చేయలేదు. మిగిలిన డివిజన్లలో కొన్ని వేర్వేరు రాష్ట్రాల పరిధిలో ఉండటంతో వాటిని పునర్విభజించాలన్న డిమాండ్లు మొదలవుతున్నాయి.
* గుంటూరు డివిజన్‌ 629.51 రూట్‌ కిలోమీటర్లలో 485.5 కి.మీ. ఏపీలో ఉంటే, 145 కి.మీ. మేర తెలంగాణలో ఉంది.
* 1551.35 రూట్‌ కిలోమీటర్లతో ద.మ.రైల్వేలో అతిపెద్ద డివిజన్‌గా సికింద్రాబాద్‌ ఉంది. దీనిలో ఒక భాగం మహారాష్ట్రలోని బల్లార్షా వరకు, మరోవైపు ఏపీలోని కొండపల్లి వరకు ఉంది.
* 651.61 రూట్‌ కిమీ ఉన్న హైదరాబాద్‌ డివిజన్‌ గద్వాల మార్గంలో.. ఏపీలోని కర్నూలు, డోన్‌ వరకు విస్తరించిఉంది. కర్ణాటకలో రాయచూరు వరకు ఉంది.
* విజయవాడ డివిజన్‌ గూడూరు నుంచి దువ్వాడ వరకు ఉంది. విశాఖపట్నం జోన్‌ ప్రధాన కేంద్రం కానున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌లో ఎంత భాగాన్ని కలుపుతారన్నది తేలాలి.
* గుంతకల్లు డివిజన్‌ రాయలసీమతో పాటు మహారాష్ట్రలో వాడి వరకు ..కర్ణాటకలో బళ్లారి వరకు విస్తరించి ఉంది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం, ఆ తర్వాత స్టేషన్లు నైరుతి రైల్వేలోని బెంగళూరు డివిజన్లో ఉన్నాయి.
* నాందేడ్‌ డివిజన్‌ను ముంబయి కేంద్రంగా ఉన్న మధ్య (సెంట్రల్‌) రైల్వే జోన్‌లో కలపాలని మహారాష్ట్ర వాసులు చాలాకాలంగా కోరుతున్నారు. ఆ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణలో కొత్త డివిజన్‌ ఏర్పాటుకు అవకాశాలుంటాయని రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు.

రెండు రాష్ట్రాల్లో ఒక్కొక్కటి
తెలంగాణలో కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. దీనిపై ఎంపీలు పలుమార్లు రైల్వేశాఖను కోరారు. అదేవిధంగా తిరుపతి బాలాజీ పేరుతో తిరుపతిని డివిజన్‌ చేయాలనే డిమాండ్‌ కూడా ఉంది. దక్షిణ కోస్తా రైల్వేలో మూడు డివిజన్లు మాత్రమే ఉండనుండటంతో విస్తీర్ణంలో పెద్దవైన సికింద్రాబాద్‌, గుంతకల్లు డివిజన్లను పునర్వ్యవస్థీకరించి కొత్తవి ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రాలు, జిల్లాల పునర్విభజనతో పోలిస్తే రైల్వేలో భిన్నమైన పరిస్థితి. రాష్ట్రాల సరిహద్దుల వారీగా పునర్విభజన సాధ్యం కాదని, నిర్వహణ-పరిపాలన సౌలభ్యం దృష్టితోనే డివిజన్లు ఉంటాయని రైల్వేలో కొందరు అధికారులు అంటున్నారు. రాష్ట్రాల సరిహద్దుల ప్రకారమైతే..ఒక్కో రాష్ట్రానికి ఒక్కో జోన్‌ ఇవ్వాల్సి వచ్చి, గందరగోళంగా మారుతుందని కొందరు నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రత్యేక పరిస్థితుల్లో మార్పులు-చేర్పులకు అవకాశం లేకపోలేదు. ఆయా రాష్ట్రాలు కోరితే డివిజన్లను పునర్వ్యవస్థీకరించే అవకాశాలను కొట్టిపారేయలేం. రైల్వే మంత్రి గోయల్‌ చేసింది సూత్రప్రాయ ప్రకటన మాత్రమే. కొత్త జోన్‌ ఏర్పాటు ప్రక్రియ చాలా ఉంటుంది. రైల్వేశాఖపై వచ్చే ఒత్తిళ్లు, జోన్ల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కొత్త డివిజన్ల ఏర్పాటు, ఉన్నవాటిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది’ అని కొందరు నిపుణులు, అధికారులు అంటున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.