Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

ధైర్యే సాహసే  అభినందన్‌! 

శత్రువులకు చిక్కక ముందే విలువైన పత్రాలను మింగేసిన ధీరుడు 
వెంటపడిన యువకులను బెదిరిస్తూ వెనక్కు పరుగులు 
భారత వాయుసేన కమాండర్‌ను శ్లాఘిస్తూ  పాకిస్థాన్‌ మీడియా కథనం

తాను నడుపుతున్న విమానం కూలిపోయింది. పారాచూట్‌ సాయంతో ఎలాగోలా బయటపడ్డారు. కానీ... దిగింది శత్రువు గడ్డపై! కాసేపట్లో వాళ్లు వచ్చి పట్టుకుంటారు. ఇదే ఆఖరి గడియ కూడా కావచ్చు. ఇంతటి విపత్కర సమయంలో ఏం చేయాలి? తన ప్రాణాన్ని కాపాడుకోవాలా? మాతృదేశానికి చెందిన సమాచారాన్ని దాచి పెట్టాలా? రెండో దానికే  ప్రాధాన్యమిచ్చారాయన. శత్రువుల చేతికి చిక్కకముందే భారత్‌కు చెందిన విలువైన సమాచార పత్రాలను మింగేశారు. పట్టుబడిన తర్వాతా అదే ధీరత్వం! వెన్ను విరిగినా వెన్ను చూపని స్థైర్యం కనబరిచారు. 
ఆయనే .. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌! 
ఆయన క్షేమంగా తిరిగి రావాలని యావత్‌ భారతం ప్రార్థిస్తున్న వేళ... స్వయానా పాకిస్థాన్‌ పత్రిక డాన్‌ ‘అభినందన్‌’ కథనం ప్రచురించడం విశేషం. పాకిస్థాన్‌ పాఠకులకు ఇది మింగుడుపడని విషయమే అయినా... ప్రత్యక్ష సాక్షి రజాక్‌ చెప్పిన వివరాలను పూసగుచ్చినట్టు అందించిందా పత్రిక. 
‘‘పారాచూట్‌ నుంచి కిందకు దిగిన తర్వాత అభినందన్‌ పిస్తోలును చేతిలో పెట్టుకుని అక్కడున్న కొందరు యువకులను ఇది ఏ దేశం... భారతా? పాకిస్థానా? అని అడిగారు. కానీ, వారిలో ఓ కుర్రాడు తెలివిగా ‘ఇండియా’ అని చెప్పాడు. అభినందన్‌ అంతకుమించి తెలివితేటలు ప్రదర్శించారు. భారత్‌కు అనుకూలంగా వారి నడుమ బిగ్గరగా నినాదాలు చేశారు. ఇది ఆ కుర్రాళ్లకు మింగుడుపడలేదు. ఇది ఖిల్లాన్‌ అని చెబుతూ... ‘పాకిస్థాన్‌ ఆర్మీ జిందాబాద్‌’ అని వారు నినాదాలు చేశారు. తన వెన్ను విరిగిందనీ, తాగడానికి మంచినీళ్లు కావాలని ఆయన అడిగారు. కానీ, వాళ్లు రాళ్లు తీసుకుని ఆయనను కొట్టబోయారు. దీంతో అభినందన్‌ వెంటనే తన పిస్తోలును తీసి గాలిలోకి కాల్పులు జరిపారు. తనపై రాళ్లతో ఉరుముకొస్తున్న ఆ యువకుల వైపు పిస్తోలును ఎక్కుపెడుతూ... సుమారు అర కిలోమీటరు దూరం వరకూ వెనక్కు పరుగులు తీశారు. ఈ క్రమంలో వారిని భయపెట్టేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు. కానీ ఒక్కరికి కూడా హాని తలపెట్టలేదు. కొద్దిసేపటికి ఓ చిన్న నీటిమడుగు ఎదురుకాగా ఆయన అందులోకి దూకేశారు. తన జేబులోని విలువైన పత్రాలను, మ్యాపులను బయటకు తీసి కొన్నింటిని నమిలి మింగేశారు. మరికొన్నింటిని నీళ్లలో వేసేశారు. ఆ కుర్రాళ్లు మాత్రం ఆయనను వెంబడించడం ఆపలేదు. దగ్గరికి వచ్చి తుపాకీని కింద పడేయాలని వారు పదేపదే అనడంతో ఆయన దాన్ని కింద పెట్టారు. వారిలోని ఓ యువకుడు ఆ పిస్తోలును తీసుకుని ఆయన కాలిపై కాల్పులు జరిపాడు. 

తాను నడుపుతున్న మిగ్‌-21 కూలిపోతున్నప్పుడు అభినందన్‌కు గాయాలైనట్టు తెలుస్తోంది. రక్తం కారుతున్న ఆయనను నీటి మడుగులోంచి కొందరు యువకులు పట్టుకుని బయటకు తీసుకొస్తుండగా మరికొందరు ఆయనపై పిడి గుద్దులు గుద్దుతూ పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారు. కొందరు వారించినా వారు ఆగలేదు. ఇంతలోనే సైనికులు అక్కడికి చేరుకుని యువకుల నుంచి అభినందన్‌ను రక్షించి తమ అదుపులోకి తీసుకున్నారు’’ అని ఆ పత్రిక పేర్కొంది. 
భారత పైలట్‌ అనుకొని పిడిగుద్దులు 
భారత్‌పై దాడి చేయడానికి వచ్చి మిగ్‌ దాడికి గురైన పాకిస్థాన్‌ ఎఫ్‌-16 పైలట్‌ కూడా పారాచూట్‌ నుంచి క్షేమంగా కిందకు దిగారు. ఆయన కాలుపెట్టింది తన సొంత గడ్డపైనే. కానీ, ఆయనను స్థానికులు భారత్‌ పైలట్‌ అనే అనుకున్నారు. ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పైలట్‌ను ఆసుపత్రిలో చేర్పించి, పాక్‌ సైన్యానికి సమాచారం అందించారు. ఈ కారణంతోనే... ఇద్దరు భారత పైలట్‌లు తమకు చిక్కారని పాకిస్థాన్‌ సైన్యం తొలుత ప్రకటించి నాలుక కరచుకుంది. ఆ తర్వాత ఒక్క పైలట్‌ మాత్రమే తమ ఆధీనంలో ఉన్నట్టు స్పష్టం చేసింది.

అభినందన్‌ వీడియోలను తొలగించిన యూట్యూబ్‌

దిల్లీ: వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు చెందిన వీడియోలను యూట్యూబ్‌ గురువారం తొలగించింది. కేంద్ర సమాచార సాంకేతికశాఖ ఆదేశాల మేరకు ఆ సంస్థ ఈ చర్యలు చేపట్టింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో భాగంగా అభినందన్‌కు చెందిన వీడియోలన్నింటినీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్‌ను కోరింది. మరోవైపు... తమను వింగ్‌ కమాండర్‌ చిత్రాలు, వీడియోలు అడగవద్దనీ, ప్రజలు కూడా వాటిని సామాజిక వేదికలపై అందుబాటులో ఉంచవద్దని ‘ఇండియన్‌ మిలిటరీ అప్‌డేట్స్‌’ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

మావాడు ధీరుడు.. గర్విస్తున్నా  
అభినందన్‌ తండ్రి సింహకుట్టి వ్యాఖ్య 

ముంబయి: పాకిస్థాన్‌లో బందీగా ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ సురక్షితంగా స్వదేశానికి తిరిగొస్తారని ఆయన తండ్రి ఎయిర్‌ మార్షల్‌(విశ్రాంత) సింహకుట్టి వర్ధమాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కుమారుడి ధీరత్వం పట్ల తనకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. కష్టకాలంలో తమ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న దేశ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘మీ అందరి ఆందోళన, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మాపై కరుణ చూపిన దేవుడికి కృతజ్ఞతలు. అభి సజీవంగా ఉన్నాడు. గాయపడలేదు. మానసికంగా దృఢంగా ఉన్నాడు. శత్రువుల చేతిలో బందీగా ఉన్నప్పటికీ నిజమైన సైనికుడిలా ధీరత్వంతో మాట్లాడాడు. అతడి పట్ల చాలా గర్వంగా ఉంది’’ అని సింహకుట్టి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభినందన్‌కు పాక్‌లో చిత్రహింసలు ఎదురుకావొద్దని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

దేశ సేవలో ఆ కుటుంబం  
అభినందన్‌ భార్య, తాత కూడా వాయుసేనలో పనిచేసినవారే.. 

దిల్లీ: వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ కుటుంబానికి వైమానిక దళంతో విడదీయరాని అనుబంధం ఉంది. తరతరాలుగా ఆ కుటుంబం వాయుసేనలో పనిచేస్తూ దేశానికి సేవలందిస్తోంది. అభినందన్‌ తండ్రి సింహకుట్టి ఎయిర్‌ మార్షల్‌గా పదవీ విరమణ పొందగా.. తాత కూడా వైమానిక దళంలో పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. ఇక అభినందన్‌ సతీమణి తన్వీ ఓ ధీర వనిత. వాయుసేన విశ్రాంత అధికారి. స్క్వాడ్రన్‌ లీడర్‌గా ఆమె పనిచేశారు. అనేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. శత్రువులు దేశం దరిదాపుల్లోకి రాకుండా చాలాసార్లు నిలువరించారు. వాయుసేనలో అద్భుత ట్రాక్‌ రికార్డు ఆమె సొంతం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.