close

ప్ర‌త్యేక క‌థ‌నం

క్షామానికి ఎదురొడ్డిన కామారెడ్డి

  ఊట కుంటలతో బోరు బావులకు జీవం
  సత్ఫలితాలిస్తున్న ఇంకుడు గుంతలు
  కాకతీయ చెరువుల్లో జలకళ
  రికార్డు స్థాయిలో 70 లక్షల క్యూబిక్‌ మీటర్ల విస్తీర్ణంలో చర్యలు
  దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచిన కామారెడ్డి జిల్లా

క్షామానికి చిరునామా అయిన కామారెడ్డి జిల్లా దేశం దృష్టిని ఆకర్షించింది. రికార్డు స్థాయిలో జల సంరక్షణ చర్యలు చేపట్టిన జిల్లాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 70 లక్షల క్యూబిక్‌ మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించిన సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కొండలు, అటవీ ప్రాంతాల్లో కాంటూరు కందకాలు, వ్యవసాయ భూముల్లో నీటి గుంతలు, ఊట కుంటలు, గృహావసరాల అనంతరం నీరు నేలలోకి ఇంకేలా ఇంకుడు గుంతలు తవ్వారు. పూడిక తొలగింపుతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి చెరువులు జల కళ సంతరించుకున్నాయి. మండలాల్లో భూగర్భ జలమట్టంలో పెరుగుదల నమోదయింది.

సదాశివనగర్‌ మండలంలో మిషన్‌ కాకతీయ పనులతో చెరువుల్లో నీటి కళ కనిపిస్తోంది. కల్వరాళ్ల చెరువులో చేపట్టిన పునరుద్ధరణ పనులతో ఇప్పటికీ చెరువులో నిండుగా నీళ్లున్నాయి. వానాకాలం పంట పోను యాసంగిలో కూడా సాగునీరు విడుదల చేస్తున్నారు. పూడికతీత, తూము, పాటుకాల్వలను బాగుచేయడంతో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. చెరువు కింద 269 ఎకరాల ఆయకట్టు ఉండగా యాసంగిలో 150 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు సాగులో ఉన్నాయి. ఇదే మండలంలో సదాశివనగర్‌ చెరువులో కూడా జలకళ ఉట్టిపడుతోంది.


నేలమ్మ... మురుస్తోంది
కామారెడ్డి జిల్లా నుంచి ఈనాడు ప్రతినిధి

 

నీటి సంరక్షణలో భాగంగా కామారెడ్డి జిల్లాలో అవకాశం ఉన్న ప్రతిచోటా పనులు చేపట్టారు. దీనికి ప్రధానంగా ఉపాధి హామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో విరివిగా ఉపయోగించుకున్నారు. బీబీపేట, సదాశివనగర్‌, రాజంపేట తదితర మండలాల్లో ఎండిన బోర్లు ఇప్పుడు నీటినిస్తున్నాయి. ఆరుతడి పంటలకు ఎంతో అనుకూలత చేకూరింది. ఇక్కడ చేపట్టిన జలసంరక్షణ చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జల సంరక్షణ చర్యలు చేపట్టే జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో భాగంగా 2018 సంవత్సరానికి ద్వితీయ స్థానాన్ని కామారెడ్డి జిల్లా దక్కించుకుంది. వాన నీటి సంరక్షణ, భూగర్భ జల మట్టం పెంపునకు తీసుకునే చర్యలు, మొక్కలు నాటడం, చెరువుల పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలను ఈ అవార్డుకు కొలమానంగా తీసుకుంటారు. కామారెడ్డి జిల్లాలో 2016 నుంచి 2018 సంవత్సరాల మధ్య కాలంలో తీసుకున్న విస్తృతమైన చర్యలు జిల్లాను ముందు నిలిపాయి. 2015 నవంబరులో 16.96 మీటర్లు ఉన్న జిల్లా సగటు భూగర్భ జలమట్టం 2017 నవంబరు నాటికి 9.90 మీటర్లకు పెరగడం సంరక్షణ చర్యల ఫలితాలను ప్రతిబింబించింది. ‘మా గ్రామం ఒకనాడు తీవ్ర నీటి ఎద్దడిని చవిచూసింది. దాని నుంచి బయటపడేందుకు ప్రతి ఇంటిముందు ఇంకుడు గుంత తవ్వుకున్నాం. బోర్ల వద్దకూడా గుంతలు తీశాం. గ్రామంలో మొక్కల పెంపకం చేపట్టాం. ప్రజలంతా సమష్టిగా కృషి చేస్తుండటంతో భూగర్భ జలమట్టంలో పెరుగుదల కనిపించింది. గ్రామంలోని, శివారుల్లోని బోర్లలో ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి. పరిశుభ్రతలోనూ మా పంచాయతీ ముందుంది. 2018లో మా పంచాయతీ స్వచ్ఛ్‌ భారత్‌ అవార్డును దక్కించుకుంది. రూ.10 లక్షల పారితోషికం అందింది’ అని వివరించారు శివాయిపల్లి సర్పంచి విఠల్‌రెడ్డి. రెండేళ్ల క్రితం వరకు మా బోర్ల నుంచి నీళ్లు రావడం తగ్గిపోయింది. వర్షాలు కురవక భవాని చెరువు నిండటం లేదు. ఉపాధి పథకంలో గతేడాది మా పొలాల ఎగువ ప్రాంతంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నాం. క్రమేపీ బోర్లు జీవం పోసుకున్నాయి. మొక్కజొన్న, కొంత విస్తీర్ణంలో వరి పంట సాగుచేసుకుంటున్నాం’ అని చెప్పారు బీబీపేట మండలం మాందాపూర్‌ రైతు బాగారెడ్డి.

 

ఉపాధితోపాటు జల సంరక్షణ

కామారెడ్డి జిల్లాలో ఉపాధి కూలీలకు పని కల్పించడంతోపాటు జల సంరక్షణ చర్యలు ఎక్కువగా తీసుకున్నాం. వీటన్నింటి ఫలితంగా గతేడాది భూగర్భ జలమట్టంలో పెరుగుదల నమోదయింది.
- చంద్రమోహన్‌రెడ్డి, ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు అధికారి

మున్ముందు సత్ఫలితాలు

భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు అందననున్నాయి. పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా ఏర్పడిన 214 పంచాయతీల్లో నీటి సంరక్షణకు 90 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేయబోతున్నాం.
- ఎన్‌.సత్యనారాయణ, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌

జల కళ ఉట్టిపడుతున్న ఈ ఊట కుంటను బీబీపేట మండలం మాందాపూర్‌ వ్యవసాయ పొలాల వద్ద ఎల్లం అనే రైతు తీయించుకున్నారు. ఇలాంటివి ఈ మండలంలో 18కిపైగా తవ్వారు. ఈ కుంటలకు సమీపంలోని బోర్లన్నీ ఇప్పుడు రీఛార్జ్‌ అయినట్లు రైతులు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకంలో రైతుల పొలం విస్తీర్ణాన్ని బట్టి ఊట, నీటి గుంటలు తవ్వుతున్నారు. వీటి కారణంగా పొలాల్లో తేమ కూడా పెరిగిందని రైతులు తెలిపారు. మొక్కజొన్న, వరి, ఉల్లి సాగును చేపడుతున్నామని రైతులు చెబుతున్నారు.

కొన్నాళ్ల కిందట ఎండిపోయిన ఈ బోరు ఇప్పుడు నీళ్లు పోస్తుందంటే ఆ పక్కనే తీసిన ఇంకుడు గుంతే కారణం. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో కొన్నాళ్ల క్రితం ఎండిపోయిన ఆరు బోర్లు ఇప్పుడు తిరిగి నీటిని ఇస్తున్నాయి. తాగునీటికి కటకటలాడిన పరిస్థితి నుంచి ఆ గ్రామం ఇప్పుడు తేరుకుంది. 215 ఇళ్లున్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకున్నారు. బోర్ల వద్ద సామూహిక ఇంకుడు గుంతలను తవ్వుకున్నారు. వారు చిందించిన చెమటకు ప్రతిఫలం లభిస్తోంది ఇప్పుడు. గ్రామంలో మురుగు సమస్య లేకపోగా భూగర్భ జలమట్టం క్రమంగా పెరగడం నీటి సంరక్షణ చర్యల ఫలితమే.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.