Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

పట్టు బిగించాం ఇక విడవద్దు 

దెబ్బకొడితే మళ్లీ మళ్లీ కొడతామన్న భయాన్ని పాకిస్థాన్‌కు కల్పించాలి 
యుద్ధం భరించే స్థితిలో ఆ దేశం లేదు 
మనమూ కోరుకోవడం లేదు 
ఈనాడు-ఈటీవీతో జాతీయ భద్రత సలహామండలి సభ్యుడు తిలక్‌ దేవసెర్‌
చల్లా విజయభాస్కర్‌ 

ఈనాడు, దిల్లీ

భారతదేశం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేసి మంచి పనే చేసిందని జాతీయ భద్రతా సలహామండలి సభ్యుడు తిలక్‌ దేవసెర్‌ స్పష్టం చేశారు. భారత సహనశీలతను అలుసుగా తీసుకొని ఇన్నాళ్లు ఉగ్రవాదాన్ని ఎగదోసిన దాయాది దేశానికి ఇదే సరైన గుణపాఠమని పేర్కొన్నారు. ఆర్థికంగా, అంతర్జాతీయ సమాజపరంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేసి కట్టడి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినెట్‌ సచివాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పని చేసి 2014 అక్టోబర్‌లో పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం వివేకానంద ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ కన్సల్టెంట్‌గానూ సేవలందిస్తున్నారు. భారత సరిహద్దు దేశాలకు సంబంధించిన భద్రతా విషయాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. ‘పాకిస్థాన్‌: కోర్టింగ్‌ ద అబైస్‌’,  ‘పాకిస్థాన్‌: అట్‌ ద హెల్మ్‌’ పేరుతో రెండు పుస్తకాలు కూడా రాశారు. ఇందులో ‘పాకిస్థాన్‌: కోర్టింగ్‌ ద అబైస్‌’ అన్న పుస్తకం పాకిస్థాన్‌పై వెలువడిన అత్యుత్తమ రచన అని ఆ దేశ మేధావి ఖలీద్‌ అహమ్మద్‌ కూడా కితాబిచ్చారు. జన్మతః పంజాబ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంపై ‘ఈనాడు-ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 
ప్రస్తుతం భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న పరిస్థితులను మీరు ఎలా చూస్తారు? 
పాకిస్థాన్‌ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఇన్నాళ్లు భరిస్తూ వచ్చిన మనం ఓపిక నశించి ఓ అడుగు ముందుకేసి వారి భూభాగంలోనే దెబ్బకొట్టాం. భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాలతో పాటు, పాకిస్థాన్‌తో మనం వ్యవహరిస్తున్న వ్యూహంలోనూ ఇది పెద్ద మలుపు. అణ్వాయుధ ముప్పు పెరుగుతుందేమోనన్న ఉద్దేశంతో భారత్‌ ఇన్నాళ్లు దాడికి దిగలేదు. దాన్ని అలుసుగా తీసుకొని పాకిస్థాన్‌ ఇన్నాళ్లు వ్యూహాలు అమలు చేస్తూ వచ్చింది.  ఇప్పుడు భారత్‌... మాపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పితే మిమ్మల్ని మీ భూభాగంలోనే దెబ్బకొడతామని నిరూపించింది. అందువల్ల ఉగ్రవాదంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు పాకిస్థాన్‌కు ఏర్పడింది.  ఇక ముందు కూడా ఆ దేశం పాత పంథాలోనే వెళ్తే భారత్‌ మళ్లీ మళ్లీ ఎదురుదాడులకు దిగుతుంది.

‘‘మనం ఉద్రిక్తతలు తగ్గించాలి.  మన పట్టుదలను కాదు. మాపై ఉగ్రవాదులను  ఉసిగొల్పితే మీపై మళ్లీ దాడి చేస్తామన్న  స్వరాన్ని తగ్గించకూడదు. మనం ఇప్పుడు  ఆ స్థాయికి చేరుకున్నాం. అదే పరిస్థితి  కొనసాగించాలి. అంతర్జాతీయ సమాజం జోక్యంతో ఉద్రిక్తతలు నిదానంగా తగ్గిపోతాయి. వాళ్లు ఉగ్రవాదాన్ని నియంత్రిస్తే మిగతా 
విషయాలు మెరుగుపడతాయి.’‌’

ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందా? 
అలా నేను అనుకోవడం లేదు. ముందు మీరు పాకిస్థాన్‌ పరిస్థితులను గమనించండి. దాని ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉంది. డబ్బు కోసం సౌదీ అరేబియా, యూఏఈ, చైనాలాంటి మిత్రదేశాలు, ఐఎంఎఫ్‌ ముందు భిక్ష పాత్ర పట్టుకోవాల్సి వస్తోంది. యుద్ధాన్ని భరించే శక్తి... సమర్థించుకొనే స్థితి వారికి లేదు. 
యుద్ధాన్ని భరించే శక్తి భారత్‌కు ఉందా? 
యుద్ధం అన్నది ఏ దేశానికీ మంచిది కాదు. అది దేశ విధ్వంసానికి, ఆర్థిక వ్యవస్థ నాశనానికి దారితీస్తుంది. దేశాభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులను యుద్ధం కోసం వినియోగించాల్సి వస్తుంది. అందువల్ల ఏ దేశమూ యుద్ధాన్ని కోరుకోదు. ఒక వేళ యుద్ధమే అనివార్యమైతే ఆర్థికంగా మనం పాకిస్థాన్‌ కంటే ఎంతో బాగున్నాం. దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. 
శాంతికాముకులుగా మేం అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. ఆ ప్రకటనను మనం ఎలా చూడాలి? 
దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను పాకిస్థాన్‌ భూభాగంలో పడ్డారన్న విషయం అందరికీ తెలుసు. దొరికిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలు వెల్లువెత్తాయి. ఆయన్ను అదుపులో ఉంచుకొనే అవకాశం పాకిస్థాన్‌కు లేదు. భారత వైమానిక దళ యూనిఫాంలో ఉన్న ఆయన్ను యుద్ధ ఖైదీగా పరిగణించి అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం నడుచుకోకతప్పదు. ఆ ఒప్పందంపై పాకిస్థాన్‌ కూడా సంతకం చేసింది. కట్టుబడకతప్పదు. ఎలాగూ వదిలిపెట్టకతప్పదు. దాన్ని శాంతికాముక సంకేతంగా అభివర్ణించి ఉగ్రవాద సమస్య నుంచి అందరి దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు వారి మంత్రి మహమ్మద్‌ ఖురేషీ మాట్లాడుతూ ఒకవేళ ఉద్రిక్తతలు తగ్గేట్లయితే పైలట్‌ను విడుదల చేస్తామన్నారు. వింగ్‌ కమాండర్‌ను అడ్డం పెట్టుకొని  శాంతి చర్చల పేరుతో బేరసారాలు చేయాలని చూశారు. భారత్‌ అంగీకరించలేదు. ఆయన్ను విడుదల చేయడం ద్వారా వారు మనకు కొత్తగా చేస్తున్న మేలు ఏమీ లేదు.

‘‘భారత్‌ అక్కడి సైనిక స్థావరాలను, జన సమ్మర్థ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు. మున్ముందు ఉగ్రదాడులకు అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు చెప్పిన స్థావరాలపై మాత్రమే దాడి చేసింది. ఈ విధానాన్ని ప్రపంచం అంతా అభినందించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాలను అమెరికా కూడా సమర్థించింది. అది న్యాయబద్ధమని, భారత్‌ తన హక్కులకు లోబడే నడుచుకొందని పేర్కొంది.’‌’

పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా ఎలా నియంత్రించాలి? అంతర్జాతీయ సమాజం బాధ్యత ఎంతమేర ఉంది? 
ఇందులో అంతర్జాతీయ సమాజానికి పెద్ద పాత్ర ఉంది. చైనాలాంటి దేశాలు సాయం ఇస్తూపోతే పాకిస్థాన్‌ తాను అనుకున్నది చేసుకుంటూ పోవచ్చనుకుంటుంది. అలాకాకుండా అమెరికా, యూకే, యూరోపియన్‌ యూనియన్లు పాకిస్థాన్‌పై ఒత్తిడి కొనసాగిస్తూ పోవాలి. పాకిస్థాన్‌ ఆర్మీ చూడటానికి చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నా, డబ్బు లేకపోతే అది మనుగడ సాగించడం కష్టం. అందువల్ల అంతర్జాతీయ సమాజం ఆర్థిక వనరులను కఠినతరం చేయడమే పాకిస్థాన్‌ను నియత్రించడానికి ప్రధాన మార్గం. ఆ దేశంలో అంతర్గత సంక్షోభం నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా తలసరి సగటు నీటి వినియోగం కంటే తక్కువ లభ్యత ఉంది. చాలా ప్రాంతాల్లో కరువుఛాయలు అలుముకొన్నాయి. 50% మందికిపైగా పిల్లలకు చదువు లేదు. పాఠశాలలకు వెళ్తున్న పిల్లల్లో 60% మంది మధ్యలోనే మానేస్తున్నారు. కార్మిక శక్తిలో 3.5% మాత్రమే పట్టభద్రులు మిగతా వాళ్లంతా ప్రాథమిక, మాధ్యమిక చదువులకే పరిమితం అవుతున్నారు. విశ్వసాంకేతిక యుగంలో ఇలాంటి మానవవనరులతో మనుగడ సాగించడం కష్టం.  వీటిపైన ప్రధాన దృష్టి సారించాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొస్తే ఏదైనా కొంత మార్పు రావొచ్చు. 
దౌత్యపరంగా మనం ఎలా ముందుకెళ్లాలి? 
పాకిస్థాన్‌ చేష్టలను అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలా చెప్పి, సాక్ష్యాలు ప్రపంచం ముందుపెట్టి వారిని ఏకాకులను చేయాలి. ఇప్పటికే వారి సంగతి అమెరికా, ఐరోపా సమాజానికి తెలిసిపోయింది. ఇప్పుడు దాని ప్రవర్తన మార్చుకొనేలా మనం మరింత ఒత్తిడి తీసుకురావాలి. పాకిస్థాన్‌కు అన్ని సమయాల్లోనూ మద్దతుగా నిలిచిన చైనా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. చైనాకు ఆర్థిక అభివృద్ధి కావాలి తప్పితే విధ్వంసం కాదు. పాకిస్థాన్‌లో చైనా వ్యవస్థలు కూడా లక్ష్యాలుగా మారాయి. అది కూడా మెత్తగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తోంది. దాన్ని మనం అనుకూలంగా మలచుకోవాలి. 
గత 70 ఏళ్లుగా మనం చర్చలు అన్న మాట వింటూ వస్తున్నాం. ఎందుకు  విజయవంతం కాలేదు? 
మాకు ఎవ్వరి భూమీ అవసరం లేదు. మా భూమి అంగుళం కూడా వదులుకోబోమన్నదే భారత్‌ విధానం. అటు వైపు పాకిస్థాన్‌ మతకోణంలో ఆలోచిస్తోంది. జమ్మూకశ్మీర్‌ ముస్లిం మెజార్టీ రాష్ట్రం. అది తమ దేశంలో కలవాలనుకుంటోంది. అందువల్ల ఇరుదేశాల మధ్య పరస్పర అవగాహన కుదిరే పరిస్థితి లేదు. రెండూ సమాంతర ఆలోచనలతో ఉన్నాయి. వాళ్లు జమ్మూకశ్మీర్‌ను చేజిక్కించుకోవడం ఎప్పటికీ జరిగే పనికాదు. మనం పాకిస్థాన్‌ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌ భూభాగం కోసమే మాట్లాడుతాం. ఇరుగుపొరుగు దేశాలుగా సరిహద్దులు దాటడం, వాణిజ్యం, ఇతర అంశాల గురించి మాట్లాడుకోవచ్చు. మూల సమస్యలపై రెండింటి మధ్య సయోధ్యకు అవకాశం లేదు.

‘‘ఇమ్రాన్‌ఖానో తోలుబొమ్మ. అక్కడి సైనికపాలనకు ఆయన ఓ ముసుగు. అధికారం అంతా ఆర్మీ చేతుల్లోనే ఉంది. వారు రాసిచ్చింది చదవడం ఆయన పని. ఆయన ఏదో ఒకటి చెప్పారంటే అందులో ఏమీ లేదని అర్థం. వాళ్లకు నిజంగా శాంతి కావాలని ఉంటే ఇన్నిసార్లు మనపై దాడి చేయరు. ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి హఫీద్‌ సయీద్‌, మసూద్‌ అజర్‌ లాంటి ఉగ్రవాద నేతలను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టేంత వరకూ వారు శాంతి కోరుకుంటున్నట్లు మనం భావించలేం.’‌’

పాకిస్థాన్‌ శాంతివచనాలు పలికింది కదా? దాన్నేమంటారు? 
భారత్‌ చాలా సీరియస్‌గా ఉందన్న విషయాన్ని వారు ఇప్పుడు పసిగట్టారు. ఇన్నేళ్లు మనం ప్రతిస్పందించ లేదు. వాళ్లూ మనల్ని పెద్దగా తీసుకోలేదు. తొలిసారి ధైర్యంగా నిర్ణయం తీసుకొని మనం అమలు చేశాం. మీ దగ్గర అణ్వాయుధం ఉన్నప్పటికీ మాపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పితే మాత్రం కచ్చితంగా బుద్ధి చెబుతాం     అన్న సందేశాన్ని పంపాం. అందుకే శాంతి వచనాలు పలుకుతున్నారు. 
స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా నిజాయతీగా ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించిందా? 
1950లో పండిట్‌ నెహ్రూ, లియాఖత్‌ అలీలు ప్రయత్నించారు. 1990ల్లో సంయుక్త చర్చలు జరిగాయి. పైన పేర్కొన్న కారణాల వల్ల అవేమీ సఫలం కాలేదు. 
అమెరికా ఇటీవలికాలంలో దౌత్య పరంగా, రక్షణపరంగా మనకు బహి రంగంగా మద్దతు పలుకుతూ వస్తోంది. ఆ దేశాన్ని మనం నమ్మొచ్చా? 
నమ్మకపోవడానికి కారణం ఏమీ లేదు. అధ్యక్షుడు ట్రంప్‌ కూడా నిన్నామొన్న మాట్లాడినప్పుడు మంచి వార్త రాబోతోందని చెప్పారు. అమెరికా ప్రభుత్వ ప్రకటన కూడా భారత్‌కు పూర్తిగా మద్దతుగా ఉంది.  వచ్చే అధ్యక్ష ఎన్నికల్లోపు అఫ్గానిస్థాన్‌ నుంచి తమ సేనలను వెనక్కు రప్పించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చాలా ఆసక్తితో ఉన్నారు. అందుకు పాకిస్థాన్‌ సాయం కావాల్సి వస్తుందని వారు అనుకొనిఉండొచ్చు. ఆ అవసరాన్ని అనుకూలంగా మార్చుకొని అమెరికాను తటస్థంగా ఉండేలా చేయాలని పాకిస్థాన్‌ భావిస్తూ ఉండవచ్చు. అమెరికా మాత్రం అఫ్గానిస్థాన్‌ పరిస్థితులకు అతీతంగా భారత్‌కు బహిరంగంగా పూర్తి మద్దతివ్వడానికి ముందుకొచ్చింది. పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లి భారత్‌ దాడి చేయడం పూర్తి న్యాయబద్ధమేనని ప్రకటించింది. అది పాకిస్థాన్‌కు పెద్ద షాక్‌.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.