close

ప్ర‌త్యేక క‌థ‌నం

బడి కాదది.. అమ్మ ఒడి!

అమ్మ ఒడి నుంచి బుడిబుడి అడుగులు వేసుకుంటూ మన పిల్లలు నేరుగా వెళ్లేది ఎక్కడికి? బడికే!

అమ్మ ఒడి పసిబిడ్డలను రేయింబవళ్లు సాకి, ఈ లోకంలో బతకటం ఎలాగో నేర్పిస్తే.. వారికి ఈ లోకంతో బతకటం ఎలాగో బడి నేర్పిస్తుంది. అందుకే మన జీవితంలో అమ్మ ఒడికి ఎంత ప్రాధాన్యం ఉందో.. బడికీ అంతే ఉంటుంది. కేవలం చదువులు చెప్పటమే కాదు... నలుగురితో కలిసి నడుస్తూ.. లోకంతో కలిసి జీవించటం ఎలాగన్నది  నేర్పించేది మన బడి! మన పిల్లలకు ‘స్కూలు’ అన్నది కీలకమైన మెట్టు, వారి జీవితాల్లో అదో అతి ముఖ్యమైన ఘట్టం. మరి పట్టణాల్లోనూ, నగరాల్లోనూ వీధివీధికీ రకరకాల స్కూళ్లు వెలుస్తున్న ఈ రోజుల్లో మన పిల్లలను దేనిలో చేర్పించాలి?

బొమ్మల నుంచి బడి వరకూ మన పిల్లలకు ప్రతిదీ ‘అత్యుత్తమమైనదే’ అందించాలని పరితపించే ఈతరం తల్లిదండ్రులకు ఇప్పుడీ స్కూలు ఎంపిక అన్నది పెద్ద సవాల్‌లా తయారైంది! పరీక్షలు, ఫలితాలు, ర్యాంకులు, గ్రేడులు, రివ్యూలు, రిపోర్టులు... ఏ స్కూలో తేల్చుకోవటానికి ఇవి చూస్తే చాలా? లేక ఇంతకు మించి మరేమైనా చూడాలా?

పక్కింటివాళ్లు చేర్చారనో, ఎదురింటి వాళ్ల పిల్లలు వెళుతున్నారనో గుడ్డిగా అదే స్కూలుకు పంపించేయటం సరికాదు.
‘ఏసీ బస్సులు, ఏసీ క్లాస్‌రూములే కాదు.. ఆడిటోరియం కూడా ఏసీనే అంట’ అని గొప్పలకు పోతూ పిల్లలకు ఆ వయసులో నిజంగా అవసరమైన అంశాలను విస్మరించకూడదు.
చాలామంది తల్లిదండ్రులు ‘మనం పడింది చాలు కదా.. మన పిల్లలు కూడా కష్టాలెందుకు పడాలన్న’ ధోరణితో పిల్లలకు స్కూళ్లలో ఏసీతో సహా సకల విలాస సౌకర్యాలూ ఉండాలని చూస్తున్నారు. వాస్తవానికి ఆ వయసులో విలాసాల కంటే వారి మానసిక వికాసానికి దోహదం చేసే అంశాలేమిటన్నది చూడాలి.

ఈ చిక్కుముడిని ఛేదించుకునేదెలా?
మన బుడతల బంగారు భవిత కోసం మంచి స్కూలును ఎంచుకునేదెలా?


మన బిడ్డల బడి ఏది?

పిల్లలను బడిలో చేర్చటం.. పెద్ద కార్యక్రమం!
పిల్లల విద్య అన్నది లాభదాయక వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఏ పట్టణం, ఏ నగరం చూసినా రకరకాల ప్రీస్కూళ్లు, ప్లేస్కూళ్లు, ప్రైమరీ స్కూళ్లు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. వీటిలో దేన్ని ఎంచుకోవటమన్నది చాలా క్లిష్టమైన సమస్యే.

ఫలితాలు, గ్రేడులు, ర్యాంకులు, రిపోర్టులు.. వీటిని చూసి స్కూళ్లను, కాలేజీలను ఎంచుకోవటం తేలికేగానీ.. కేవలం ర్యాంకుల దృష్టితోనే స్కూళ్లను ఎంచుకోవటం సరికాదంటున్నారు నిపుణులు!
స్కూల్లో చేర్చటమంటే పిల్లలకు.. తమ జీవితానికి తాము చక్కటి పునాది వేసుకునే అవకాశం ఇవ్వటం! దీర్ఘకాలం పాటు జీవితానికి కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకునే సదుపాయం కల్పించటం. అందుకే స్కూలు ఎంపికలో జాగ్రత్త ఒక్కటే కాదు.. కొంత తెలివిగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మాట చెప్పటం తేలికేగానీ నిజానికి ఆచరణలో పెట్టటం మాత్రం అంత సులువు కాదు. అందుకే దీనికి సంబంధించిన భిన్న కోణాలు, పలు పార్శ్వాలను వివరంగా పరిశీలిద్దాం!


స్కూలు అంటే.. ఓ జీవితకాల బంధం!

తోటిపిల్లలతో, సాటివారితో, టీచర్లతో అనుబంధాలను పెనవేసుకోవటం, చక్కటి సంబంధాలను నిర్మించుకోవటం. స్కూలులో పిల్లలకు దక్కే అపూర్వమైన అవకాశం. స్కూలు వయసులో  సంపాదించుకునే చక్కటి, సుస్థిరమైన స్నేహాలు వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ముఖ్యంగా తమ ప్రత్యేకతలు, శక్తియుక్తులేమిటో తాము తెలుసుకునేలా చేస్తాయి. స్కూలు వాతావరణానికి తగినట్లుగా సద్దుబాట్లు చేసుకోవటం, స్కూలు నుంచి చక్కటి విలువలను అందిపుచ్చుకోవటం.. ఇవి కీలకం. నిజానికి స్కూలులో చేరిన తొలినాళ్లలో పిల్లలంతా తమ ‘బెస్ట్‌ఫ్రెండ్స్‌’ను కనీసం 200 సార్లైనా మారుస్తారని చెబుతుంటారు మనస్తత్వ నిపుణులు! ప్రతి స్నేహం పిల్లలకు ఎంతో నేర్పిస్తుంది. స్నేహాన్ని పెంచుకోవటం, ఉంచుకోవటం, అప్పుడప్పుడు తెంచుకోవటం.. ఇవన్నీ కూడా పిల్లలకు ఎంతో మనోధైర్యాన్ని, జీవన నైపుణ్యాలను నేర్పించే అనుభవాలు. దీన్నంటినీ కూడా పిల్లలు నిజమైన, గాఢమైన సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని అన్వేషించుకునే క్రమంగానే చూడాలన్నది బ్రెట్‌ లార్సెన్‌ వంటి సామాజిక మనస్తత్వవేత్తల బలమైన అభిప్రాయం.

యుక్తవయసు వచ్చే వరకూ సాగే ఈ స్నేహాలు, బంధాల అన్వేషణ పిల్లల సామాజిక అవగాహనకు, పరిణతికి దోహదం చేసి, జీవితంలో వాళ్లు నిజమైన, బలమైన బంధాలను ఎంచుకునేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. అందుకే స్కూలు వయసులో పిల్లలు పెంచుకునే స్నేహ బంధాలు దీర్ఘకాలం వారి మీద ప్రభావం చూపుతాయని గుర్తించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే.. మన పిల్లలకు ఎలాంటి స్కూలును ఎంచుకోవాలన్నది తేలికగానే అర్థమవుతుంది.


బిడ్డను బట్టి బడి

పిల్లల్లో కొందరు దూకుడుగా ముందుకు పోతూ తమకు తాముగా అన్నీ నిర్వహించుకోగలుగుతుంటారు. మరికొందరు చాలా సున్నితంగా ఉంటారు, మనమే వాళ్లను అన్నీ అడిగి తెలుసుకుంటూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా పిల్లల స్వభావం గ్రహించి.. అందుకు తగినట్లుగా స్కూలును ఎంచుకోవటం అవసరం.


చదువులే కాదు..

మన వ్యక్తిత్వానికి బలమైన పునాది పడేది స్కూలు వయసులోనే. అందుకే స్కూలు వయసును ‘ఫార్మేటివ్‌ ఇయర్స్‌’ అంటారు. అందుకే స్కూలులో పిల్లలు నేర్చుకునే విషయాలు, ఆ వయసులో పిల్లలకు ఎదురయ్యే అనుభవాలు వాళ్ల వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మైదానంలో ఆడుకోవటం, తోటి పిల్లలతో కలిసి ఒక బృందంగా పని చేయటం, కళలు, సృజనాత్మక విషయాలను నేర్చుకోవటం, శరీరం-ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవటం, నాట్యాలు, నాటకాలు.. ఇవన్నీ కూడా పిల్లల వ్యక్తిత్వం సమగ్రంగా రూపుదిద్దుకోవటానికి దోహదం చేసేవే. చదువులే ముఖ్యమనుకుంటూ, వీటన్నింటినీ ఉబుసుపోని వ్యవహారాలుగా తీసుకోవటం సరికాదు, పిల్లల సామర్ధ్యానికి ఇవి అదనపు కోణాన్ని జోడించి, వాళ్ల తెలివితేటలకు సానపెట్టే వ్యాపకాల వంటివి. కాబట్టి స్కూలుకు వెళ్లినప్పుడు పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులతో పాటు ఇలాంటి వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపకరించే విభాగాల ఉపాధ్యాయులు కూడా ఎలా ఉన్నారన్నది చూడటం చాలా అవసరం.


టీచర్‌ను పలకరించాలి

స్కూలుకు వెళ్లినప్పుడు టీచర్లతో తప్పనిసరిగా మాట్లాడాలి. ప్రతి తల్లీతండ్రీ తొలి గురువులైనట్లే.. ప్రతి టీచరూ కూడా పిల్లలకు రెండో తల్లిదండ్రుల వంటివారే! కాబట్టి వాళ్లకున్న బోధన అర్హతలతో పాటు పిల్లల పట్ల వాళ్లు చూపిస్తున్న అంకిత భావం, వాళ్ల స్వభావం వంటివీ పరిశీలించాలి. అలాగే తరగతి గదిలో ఒక టీచర్‌ 30-35 మంది పిల్లల వరకూ బాగానే దృష్టి పెట్టగలరుగానీ పిల్లల సంఖ్య అంతకు మించితే మాత్రం వాళ్లు రాజీపడక తప్పటం లేదని అంతర్జాతీయంగా జరిగిన చాలా అధ్యయనాల్లో తేలింది. 40-50 మంది పిల్లలు ఉండే తరగతుల కంటే చిన్నచిన్న తరగతుల్లో పిల్లలు ఎక్కువ నేర్చుకోగలుగుతున్నారనీ వెల్లడైంది. కాబట్టి స్కూలులో తరగతి గదులు ఎంత విశాలంగా ఉంటున్నాయి? ఒక్కో తరగతికీ ఎంతమంది పిల్లలను తీసుకుంటున్నారన్నది తప్పకుండా చూడాలి. అదే ప్రీస్కూల్‌ స్థాయిలో అయితే ప్రతి 10-15 మంది పిల్లలకు ఒక టీచర్‌తో పాటు ఇద్దరైనా సహాయకులుండటం అవసరం.పిల్లలు ఆడుకునే సమయంలో బడి దగ్గర ఉండగలిగితే వాళ్లు ఒకరితో ఒకరు ఎంత కలివిడిగా ఉంటున్నారు? ఎంత సన్నిహితంగా ఉండగలుగుతున్నారన్నది తేలికగానే అర్థమవుతుంది. పిల్లల భావోద్వేగ పరిపక్వతకు ఇలాంటి అంశాలను కూడా పట్టించుకోవటం చాలా ముఖ్యం.


చూడాల్సింది గూగుల్‌లో కాదు!

స్కూలు ఎంపిక చిక్కుముడిని ఎలా విడదీసుకోవాలో తెలీని చాలామంది తల్లిదండ్రులు ఇంట‌ర్నెట్‌ను ఆశ్రయించి.. గూగుల్‌లోకి వెళ్లి స్కూలు ర్యాంకులను, రివ్యూలను చూసి వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం పెరిగిపోతోంది. కానీ ఇది సరికాదు. దీనివల్ల కొన్నిసార్లు నిజంగా మంచి విలువలతో పని చేస్తున్న స్కూళ్లను కాదనుకోవటమో లేక ఏదో రకంగా హడావుడి చేస్తుండే స్కూళ్ల మాయలో పడిపోవటమో.. జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా తమ వ్యక్తిగత కారణాలతో రాసే ఒక్క చెడ్డ రివ్యూ.. మొత్తం స్కూలు మీదే దురభిప్రాయాన్ని ప్రచారంలోకి తేవచ్చు. కాబట్టి నెట్‌లో రివ్యూలను, రేటింగ్‌లను చూసి స్కూలును ఎంచుకోవటం, దాని గురించి అంచనాకు రావటం సరికాదు. ఇందుకు ఒకటే మార్గం.. ప్రత్యక్షంగా స్కూలుకు వెళ్లి చూడటం. యాజమాన్యంతో, మన పిల్లలు చదవబోతున్న క్లాసు టీచర్లతో మాట్లాడటం, మరీ ముఖ్యంగా ఇప్పటికే అక్కడ చదువుతున్న పిల్లలతో, వీలైతే వాళ్ల తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం ఉత్తమం. వీటితో పాటు అక్కడి వాతావరణం, సదుపాయాల వంటి చాలా కీలకమైన అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి నిర్ణయం తీసుకునే వీలుంటుంది!

- వి.ధనుంజయ, డైరెక్టర్‌, సిల్వర్‌ ఓక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, హైదరాబాద్‌.శుభ్రత ఉంటేనే భద్రత

తల్లిదండ్రులు తప్పనిసరిగా స్కూలుకు వెళ్లి చూడాల్సింది.. అక్కడ శుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నది! తరగతి గదులు, స్కూలు వాతావరణం, ఆటస్థలాలు, మైదానం, మరుగుదొడ్లు.. వీటిని ఎంత శుభ్రంగా ఉంచుతున్నారన్నది చాలా ముఖ్యం. అంతేకాదు, అక్కడి ఆయమ్మలు, టీచర్లు స్వయంగా ఎంత శుభ్రంగా ఉంటున్నారన్నది కూడా పరిశీలించాలి. బిల్డింగులు, సదుపాయాల వంటివన్నీ ఎంత ఖరీదైనవి ఉన్నాయని కాదు.. ఎంత శుభ్రంగా ఉన్నాయన్నది చూడటం ముఖ్యం. చిన్నవయసులో పిల్లలకు శుభ్రత అన్నది రెండు రకాలుగా ముఖ్యం. 1. అపరిశుభ్ర వాతావరణంలో వాళ్లకు రకరకాల జబ్బులు, వ్యాధుల వంటివి సోకే అవకాశం ఉంటుంది. 2. పిల్లలకు శుభ్రత అన్నది చిన్నతనం నుంచీ అలవడాల్సిన ఒక జీవన నైపుణ్యం. రోజులో వాళ్లు దాదాపు 7-8 గంటల పాటు గడిపే బడి వాతావరణం అపరిశుభ్రంగా ఉంటే, వాళ్లు ఏళ్ల తరబడి ఆ వాతావరణానికే అలవాటుపడిపోతే.. ఇక శుభ్రత అన్న విలువ వాళ్లకు ఒంటబట్టే అవకాశం ఉండదు. అందుకే బడి శుభ్రత అన్నది పిల్లల భవిష్యత్తుకు కూడా మరీమరీ ముఖ్యం.


ఎంత ఫీజుకు అంత చదువు అనుకోవద్దు

అత్యంత ఖరీదైన ప్రైవేటు, ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో చేరిస్తేనే మన పిల్లలకు బాగా చదువు వస్తుంది, అప్పుడే వాళ్లు మారుతున్న కాలానికి తగ్గట్లుగా ప్రయోజకులవుతారన్న  భావన చాలామందిలో ఉందిగానీ అది అన్ని సందర్భాల్లో సరైన ఆలోచనేం కాదు. నిజానికి మన దేశంలో తక్కువ ఫీజులతోనే చక్కటి, అత్యాధునికమైన స్కూళ్లతో పోటీ పడేలా చదువులు చెబుతున్న పబ్లిక్‌ స్కూళ్లు చాలానే ఉన్నాయి. మనం చెల్లిస్తున్న ఫీజులకు నాణ్యమైన విద్య, చక్కటి సదుపాయాలు, క్రీడల వంటి వికాస కార్యక్రమాలతో పిల్లలు సంపూర్ణంగా ఎదిగేందుకు దోహదం చేస్తుందన్న భరోసా ఉన్న స్కూలునే ఎంచుకోవటం అవసరం.


బడి ఇచ్చే విలువలు

బయటకు ఏం చెప్పినా చెప్పకున్నా.. ప్రతి స్కూలూ ఏదో తరహా విలువలను పిల్లలకు అందిస్తూనే ఉంటుంది. అవేమిటన్నది చూడటం అన్నింటికంటే ముఖ్యం. విద్యాబోధన విషయంలో వాళ్ల వైఖరి ఎలా ఉందన్నది చూడాలి. పిల్లలను రోజంతా తరగతి గదులకే పరిమితం చేసి.. పాఠాలను బట్టీ పట్టించటం, హోంవర్కులు, ర్యాంకులు, గ్రేడులకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటమన్నది ఒక రకమైన విలువలకు ప్రాతినిధ్యం వహిస్తే.. పిల్లలు ర్యాంకులు గ్రేడుల్లో కాస్త అటూఇటూగా ఎలా ఉన్నా.. తమదైన వ్యక్తిత్వంతో, బాధ్యతగా, సొంతగా తమదైన జీవితాన్ని నిర్మించుకునేందుకు ప్రాధాన్యమిచ్చేలా చూడటం.. మరోరకం విలువలకు పట్టం కడుతుంది. మరికొన్ని స్కూళ్లు మధ్యేమార్గంగా ఇటు చదువులకూ, అటు వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇచ్చేలా వాటి మద్య సమతౌల్యం కోసం ప్రయత్నిస్తుంటాయి. వీటిలో దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి మన లక్ష్యం ఏమిటి? వీటిలో ఏవి మన ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి? మన పిల్లల ఎదుగుదలకు ఏవి దోహదం చేస్తాయన్న స్పష్టతతో నిర్ణయం తీసుకోవటం అవసరం. మొత్తమ్మీద ఒత్తిడి ఎక్కువగా ఉండే బడి వాతావరణం పిల్లల విషయ గ్రహణ శక్తిని ప్రభావితం చేస్తోందని, దానివల్ల చదువుల్లో వెనకబడుతున్న దాఖలాలూ ఉంటున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి పిల్లల శక్తిసామర్థ్యాలను, స్వభావాన్ని బట్టి స్కూలును ఎంచుకోవటం అవసరం.ఏ కరిక్యులం, ఏ సిలబస్‌?

చాలామంది తల్లిదండ్రులు ఎస్‌ఎస్‌సీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ.. ఇలా రకరకాల సిలబస్‌లను చూసి గందరగోళపడుతూ పిల్లలను దేనిలో చేర్చాలన్నది తేల్చుకోలేకపోతుంటారు. నిజానికి కరిక్యులం ఏదైనా.. బోధనాపరమైన వ్యత్యాసాలు తప్పించి, ప్రాథమికంగా పిల్లలకు బోధించే అంశాలు, పాఠాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కాకపోతే ప్రతి బోర్డూ ఒక్కో రకమైన అంశం మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటుంది. కాబట్టి మనకు ఏదైనా ప్రత్యేక ఆసక్తి ఉంటే.. మన పిల్లలకు వీటిలో ఏ విధానం బాగా ఉపకరిస్తుందో తెలుసుకునేందుకు నిపుణుల సహాయం తీసుకోవటం ఉత్తమం. ఉదాహరణకు మధ్యలో చదువు కోసం విదేశాలకు కూడా వెళ్లాల్సి ఉంటే పిల్లలకు సిలబస్‌ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ‘ఐబీ’ (ఇంటర్నేషనల్‌ బకలరేట్‌ ప్రోగ్రామ్‌), సీఐఈ (కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జామినేషన్స్‌) వంటి ప్రత్యేక కరిక్యులం ఎంచుకోవటం ఉత్తమం కావొచ్చు, వీటిని మనదేశంలోని చాలా ఇంటర్నేషనల్‌ స్కూళ్లు బోధిస్తున్నాయి. మొత్తమ్మీద సుశిక్షితులైన టీచర్లు, ఆధునిక బోధనా విధానాలు.. వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.


మా పిల్లాడికి నేను చెప్పిందిదే

నువ్వు క్లాసులో మొదటి మూడు ర్యాంకుల్లో ఉండాల్సిన అవసరమేం లేదు. నీ ర్యాంకు మరీ దిగజారుడుగా లేకుండా.. నువ్వు మధ్యలో ఉన్నా ఓకే. అలాంటి వారికి మాత్రమే జీవితంలో ఇతర నైపుణ్యాలను నేర్చుకునేందుకు తగినంత సమయం దొరుకుతుంది.

- జాక్‌ మా
ప్రపంచ ప్రఖ్యాత అలీబాబా సంస్థ వ్యవస్థాపకుడు.ట్యాబ్‌లు, ఐప్యాడ్‌లు ..

చిన్నవయసు నుంచే పిల్లల చేతికి ట్యాబ్‌లు, ఐప్యాడ్‌లు ఇవ్వటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని భావించక్కర్లేదు. ఎదిగే వయసులో పిల్లల శారీరక కండర కదలికలు (మోటార్‌ యాక్టివిటీ) సమర్థంగా అభివృద్ధి చెందటం ముఖ్యం, అందుకు పెన్సిల్‌ పట్టుకోవటం నుంచి రకరకాల వస్తువులతో ఆడుకోవటం వరకూ అన్నీ ముఖ్యమే. కేవలం ట్యాబ్‌లు, ఐప్యాడ్‌లు ఇస్తే ఈ తరహా శారీరక ఎదుగుదల ప్రభావితమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఎదిగే వయసులో పిల్లలు పోషకాహారం తినడం, కలిసి తింటూ ఒకరితో ఒకరు పంచుకునేలా చూసే స్కూళ్లు.. మంచి భవితకు పునాదులు వేస్తాయి.


ఎంత దగ్గర!

అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చుగానీ మనం ఉంటున్న ప్రాంతానికి దగ్గర్లో మంచి స్కూళ్లేం ఉన్నాయన్నది చూడటం ఉత్తమం.  పిల్లలు కనీసం 5-10 ఏళ్ల పాటు ప్రతి రోజూ వెళ్లొస్తుండాలి. బస్సులోనే వెళ్లొస్తారు కదా అనుకోవచ్చుగానీ అందులో ఉన్న అసౌకర్యాన్ని పిల్లలు చెప్పలేరు. కాబట్టి పిల్లలు ప్రతి రోజూ మరీ దూరాభారం ప్రయాణం చెయ్యాల్సిన అవసరం లేకుండాచూడటం మేలు.


కలిసిమెలసి

కాస్త పెద్ద తరగతులకు వచ్చేసరికి ప్రతి క్లాసులోనూ ఆడపిల్లలు, మగ పిల్లలు రకరకాల బృందాలు ఏర్పడుతుంటారు. ఈ క్రమంలో అప్రయత్నంగానే అంతస్తులు, హోదాల వంటివీ వాళ్ళకు ప్రాధాన్యాలుగా మారిపోతుంటాయి. వీటి విషయంలో స్కూలు ఎలాంటి విలువలకు కట్టుబడి ఉంటోంది? పిల్లలందరూ కలిసిమెలిసి ఉండేలా చూస్తోందా; వివక్షలకు తావు లేకుండా ఆడపిల్లలు, మగపిల్లలు కలివిడిగా ఉండేలా ప్రోత్సహిస్తోందా? పిల్లల స్నేహాలు, బంధాల విషయంలో టీచర్లు ఎలా తోడు నిలబడుతున్నారు? వీటినీ తెలుసుకోవటం అవసరం.


-ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.