close

ప్ర‌త్యేక క‌థ‌నం

గరళం.. భూగర్భ జలం

పలు జిల్లాల్లో తాగడానికి పనికిరాదు
నీటిలో అధికంగా ఫ్లోరైడ్‌, నైట్రేట్‌, టీడీఎస్‌...
భూగర్భ జలవనరుల్లో ఏటా 65 శాతం వాడకం
అత్యధికంగా హైదరాబాద్‌లో 36 శాతం వినియోగం
సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో 94 శాతం
కేంద్ర భూగర్భ జలమండలి తాజా నివేదికలో వెల్లడి

ఓవైపు భూగర్భం లోలోతుల్లోంచి జలాన్ని ప్రజలు ఇష్టారీతిగా పైకి లాగేస్తున్నారు. మరోవైపు ఆ నీటిలో అనేక రసాయనాలుంటున్నందున నేరుగా తాగడానికి పనికిరాదని శాస్త్రీయ పరీక్షల్లో తేలింది. అంతేగాక జల సంరక్షణకన్నా వాడకం అధికంగా ఉంటోందని కేంద్ర భూగర్భ జలమండలి తాజా నివేదికలో వెల్లడించింది. 2014 నుంచి దేశవ్యాప్తంగా భూగర్భంలో జలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తించి పటాల రూపంలో దశలవారీగా అన్ని జిల్లాల్లో చిత్రీకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, ఉమ్మడి నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో చిత్రీకరణ పూర్తయింది. వరంగల్‌, కరీంనగర్‌, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో  కొనసాగుతోంది. ఇప్పుడు మెదక్‌ జిల్లాలోనూ ప్రారంభించారు. భూమి నుంచి వెలికి తీస్తున్న జలాలను పొదుపుగా వాడటంతో పాటు, వర్షపునీటి సంరక్షణకు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర భూగర్భ జలమండలి స్పష్టం చేసింది. పలు జిల్లాల్లోని భూగర్భ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా సేవించడం ఆరోగ్యానికి హానికరమని తేల్చింది. ఈ నివేదికను ‘ఈనాడు’ సేకరించింది. కొన్ని ముఖ్యాంశాలు...

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రుతుపవనాలకు ముందు, తర్వాత రెండుసార్లు నీటి నమూనాలను పరీక్షిస్తే మొదట 43 శాతం, అనంతరం 47 శాతం నమూనాల్లోని నీరు ప్రజలు తాగడానికి పనికిరాదని తేలింది.
* ఈ జిల్లాలోని దర్పల్లి, బోధన్‌, జుక్కల్‌, పిట్లం, బిచ్‌కుంద, నాగిరెడ్డిపేట, భిక్కనూరు, ఆర్మూర్‌ మండలాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ అధికశాతంలో ఉంది.

* 58 శాతం నమూనాల్లో నైట్రేట్‌ ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది సాధారణంగా లీటరు నీటిలో 45 మిల్లీగ్రాములకు మించరాదు. కొన్నిచోట్ల గరిష్ఠంగా 488 మిల్లీగ్రాముల వరకు ఉండడం గమనార్హం. దేశంలోకెల్లా అత్యధికంగా రాజస్థాన్‌లోని బీకానేర్‌లో లీటరు నీటిలో 3080 మి.గ్రా. ఉంది.

* మనిషి తాగే లీటరు నీటిలో ‘పూర్తిగా కరిగే ఘనపదార్థాలు(టీడీఎస్‌) 500 మిల్లీ గ్రాముల లోపు ఉండాలి. కానీ కొన్నిచోట్ల గరిష్ఠంగా 654 నుంచి 3 వేల మిల్లీ గ్రాముల వరకు ఉంటున్నాయి.

* ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని బచ్చన్నపేట, నర్మెట్ట, రఘునాథపల్లి, ధర్మసాగర్‌, నర్సంపేట, దుగ్గొండి, పర్వతగిరి, వర్ధన్నపేట, నెక్కొండ, చెన్నారావుపేట, నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్‌, డోర్నకల్‌ తదితర మండలాల నీటి నమూనాల్లో ఫ్లోరైడ్‌ తీవ్రంగా ఉంది.

* ఈ జిల్లాలోనూ నైట్రేట్‌, టీడీఎస్‌ చాలా అధికంగా ఉన్నాయి. కేసముద్రం మండలం తాళ్లపూసలపల్లి గ్రామంలో లీటరు నీటిలో 5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్‌ ఉంది. ఈ నీటిని తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం.


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కోనరావుపేట, వేములవాడ, ఇల్లంతకుంట, బోయినపల్లి, బెజ్జంకి, సైదాపూర్‌, భీమదేవరపల్లి, గంగాధర, ధర్మారం తదితర మండలాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ అధికంగా ఉంది. ఈ జిల్లాలో 68 శాతం నమూనాల్లో నైట్రేట్‌ తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల గరిష్ఠంగా లీటరు నీటిలో 479 మి.గ్రా. ఉండటం గమనార్హం.


తెలంగాణలో భూగర్భ జల వనరులపై గుర్తించిన ముఖ్యాంశాలు

నల్గొండ జిల్లాలోని 97 గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు ఎలాంటి అవకాశాలూ లేవు. ఈ జిల్లాలో వృథాగా పోతున్న 8.4 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల(ఎంసీఎం) నీటిని సంరక్షించడానికి ఇంకుడుగుంతలు నిర్మించాలి. మూసీ నది పరివాహక ప్రాంతంలో పూడుకుపోయిన చెరువులను తవ్వించి శుద్ధి జలాలతో నింపాలి.


పొలాల్లో నీటిగుంతల తవ్వకం బాగా పెరగాలి. నల్గొండ జిల్లాలో 18,440, నిజామాబాద్‌లో 27,234 వరంగల్‌లో 13,960, కరీంనగర్‌లో 17,320 నీటిగుంతల తవ్వకం ద్వారా జలసంరక్షణతో పాటు, భూగర్భ జలాల పెంపునకు అవకాశాలున్నాయని మండలి సూచించింది.


16 జిల్లాల్లో ఫ్లోరైడ్‌ అధికం

లీటరు నీటిలో 1.5 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్‌ ఉంటే తాగరాదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 7 మినహా  16 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ పరిమితికన్నా ఎక్కువగా ఉంది.  తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ (కొన్ని మండలాలు తప్ప) మినహా అన్ని, ఏపీలో ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లో ఫ్లోరైడ్‌ అధికంగా ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల 1200 అడుగుల లోతు వరకు తవ్వి నీటిని తీస్తున్నారు. వరసగా ఒకటీ రెండేళ్ల పాటు వర్షాలు లేకపోతే భూగర్భ జలాలు తిరిగి పెరగడం అసాధ్యమని తేలింది.


అధిక వాడకం...

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో భూగర్భ జలాలను పరిమితి కన్నా 336 శాతం అధికంగా పైకి తోడుతున్నారు.


దేశవ్యాప్తంగా భూమి లోతుల్లోని నీటి వనరుల వాడకం ఏటా పెరుగుతోంది. దేశంలోకెల్లా అత్యధికంగా రాజస్థాన్‌లో 1800 నుంచి 2 వేల అడుగుల వరకు బోర్లు తవ్వి నీరు తీస్తున్నారు.


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.