close

ప్ర‌త్యేక క‌థ‌నం

పరమ ఔషధం పసుపు

 జీర్ణాశయ క్యాన్సర్‌కు మెరుగైన విరుగుడు మన వంటింటి దినుసులోనే
 పసుపు నుంచి ఔషధం తీసే సాంకేతికత అభివృద్ధి
  పానీయాల తయారీకి కసరత్తు
 ‘ఈనాడు డిజిటల్‌’ ఇంటర్వ్యూలో శాస్త్రవేత్త హేమచంద్‌ తుమ్మల వెల్లడి

ఔషధ మొక్కలు, వనమూలికలు, మసాలా దినుసులకు భారత్‌ ఒక గని. చవులూరించే ఘుమఘుమలు, ఆకలి పెంచే సామర్థ్యం వంటి విశిష్ట లక్షణాల కారణంగా దేశంలో అధికశాతం మంది దినుసులను నిత్యం ఆహారంలో చేర్చుకుంటారు. అయితే వాటి ఔషధ విలువ గురించి చాలామందికి తెలియదు. మన వంటకాల్లో పసుపును విరివిగా ఉపయోగిస్తారు. దీన్ని రోజూ వంటకాల్లో కానీ సౌందర్య లేపనంగా కానీ వాడుతుంటారు. తెలిసి వినియోగిస్తున్నా తెలియక ఉపయోగిస్తున్నా పసుపులో ఉన్న పోషక విలువల వల్ల మన ఆరోగ్యం పరిపుష్టమవుతోంది.
పసుపులో కర్కుమిన్‌ అనే పదార్థం ఉంది. దీనికి శక్తిమంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉన్నాయి. పసుపులో ఔషధ విలువలతో పాటు  జీవక్రియల్లో కీలక పాత్ర పోషించే పదార్థాలూ ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు జీర్ణాశయ క్యాన్సర్‌ చికిత్సలో ఒక ఔషధంగా కూడా పసుపు పనిచేస్తుందని అమెరికావాసి అయిన భారతీయ శాస్త్రవేత్త హేమచంద్‌ తుమ్మల నిర్ధారించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఫార్మసీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పంజాబ్‌ వర్సిటీలో పీజీ చేశారు. దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని సౌత్‌ డకోటా స్టేట్‌ విశ్వవిద్యాలయంలో ఔషధ శాస్త్ర విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనతో ‘ఈనాడు డిజిటల్‌’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పసుపులోని ప్రత్యేక ఔషధ విలువల గురించి వివరించారు.

హేమచంద్‌ బృందం కొన్ని పాలిమర్లను ఉపయోగించి పసుపును ఒక ఔషధంగా ఉపయోగించేందుకు అవసరమైన ‘ఒరా కర్కుమిన్‌ సాంకేతికత’ను అభివృద్ధి చేసింది. జీర్ణాశయ క్యాన్సర్‌కు, హెచ్‌. పైలోరి ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయడానికి కర్కుమిన్‌ను జీర్ణాశయంలోకి పంపేలా, అలాగే అల్సరేటివ్‌ కొలైటిస్‌, పెద్ద పేగు క్యాన్సర్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి పెద్ద పేగులోకి విడుదల చేసేలా దీన్ని తీర్చిదిద్దవచ్చని వివరించారు.

‘‘పసుపులోని ఔషధ గుణాలను వెలుగులోకి తీసుకురావాలన్నది నా మనస్సులో ఎప్పటి నుంచో ఉన్న కోరిక. స్వతంత్ర పరిశోధకుడిగా మారాక పసుపుపై మనకున్న సంప్రదాయ విజ్ఞానాన్ని, దాని ప్రయోజనాలను ఆధునిక వైద్య అవసరాలకు అనుగుణంగా మలచేందుకు కసరత్తు మొదలుపెట్టా. మలద్వార క్యాన్సర్‌ అనేది భారత్‌, అమెరికాల్లో ఆందోళనకరంగా మారుతోంది. అందువల్ల నిర్దిష్టంగా ఈ క్యాన్సర్‌ను నివారించేలా కర్కుమిన్‌ను శరీరంలో నిర్దేశిత ప్రాంతాలకు చేరవేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాం. గొంతు నొప్పి, తీవ్ర జలుబు ఉంటే నేను ఇప్పటికీ పసుపు కలిపిన పాలను తాగుతుంటా.’’

 

భారత వంటకాల్లో పసుపును విరివిగా ఉపయోగిస్తున్నప్పటికీ మనకు ఇంకా జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు ఎందుకు పొంచి ఉంటోంది?
జవాబు: కర్కుమిన్‌ ప్రధానంగా ఇన్‌ఫ్లమేషన్‌ (మన శరీరంలో తలెత్తే వాపు తరహా మార్పులు)ను తగ్గిస్తుంది. అయితే అది కలుషిత ఆహారం నుంచి మనల్ని రక్షించే యాంటీబయోటిక్‌ మాత్రం కాదు. పేగుల్లో నిరంతరం ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తడం ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌ (ఐబీడీ), పెద్ద పేగు క్యాన్సర్‌ వంటి వ్యాధులకు కారణమవుతుంటుంది. చికిత్స చేయకుంటే అది మలద్వార క్యాన్సర్‌గా పరిణమించే ప్రమాదం ఉంది. ఐబీడీని ఒకప్పుడు ‘వైట్‌మ్యాన్‌ డిసీజ్‌’గా వ్యవహరించేవారు. జన్యుపరమైన లక్షణాల వల్ల కానీ ఆహారం వల్ల కానీ మనకు ఐబీడీ నుంచి రక్షణ ఉందన్న భావన శాస్త్రవేత్తల్లో ఉండేది. పాశ్చాత్య దేశాలవారి ఆహారంతో పోలిస్తే దక్షిణ భారతదేశ ఆహారం ప్రొటీన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లుతో సమతౌల్యంగా ఉంటుంది. అయితే భారతీయుల్లో ఐబీడీ కేసులు వేగంగా పెరుగుతున్నాయని దిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన వినీత్‌ అహుజా నేతృత్వంలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. దీంతో మనకు జన్యుపరమైన రక్షణ ఉందన్న భ్రమ పటాపంచలైంది. శుద్ధి చేసిన ఆహారం సహా పశ్చిమ దేశాల ఆహారానికి భారత్‌లో ఆదరణ పెరుగుతున్న కొద్దీ ఇక్కడివారిలోనూ ఈ విపత్కర పోకడ పెరుగుతోందని సూత్రీకరించారు.

దీన్నిబట్టి పసుపును వంటకాల్లో కాకుండా దాన్ని నేరుగా తీసుకోవడం వల్లే సమర్థంగా పనిచేస్తుందని భావించవచ్చా?
జవాబు: పూర్తిస్థాయి అధ్యయనం లేకుండా దీనిపై మాట్లాడటం కష్టం. పసుపులోని ప్రధాన పదార్థమైన కర్కుమిన్‌కు ‘ఫొటో-సెన్సిటివ్‌’ లక్షణం ఉంది. కాంతి తాకినప్పుడు అది క్షీణిస్తుంది. అందువల్ల ఎక్కువసేపు వండటం వల్ల కానీ, ఎక్కువకాలం వెలుతురులో ఉంచడం వల్ల కానీ దాని సమర్థత తగ్గిపోతుంది. అయితే మన వంటల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలైన అల్లం, వెల్లుల్లి, కారం వంటివాటినీ ఉపయోగిస్తుంటాం. వీటిని దీర్ఘకాలం పాటు వాడితే అవన్నీ కలసి మెరుగైన ఫలితాలను అందించవచ్చు. వీటి ఉమ్మడి వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను  దశాబ్దాల పాటు సాగే సంక్లిష్ట శాస్త్రీయ అధ్యయనంతో కన్నా కొన్ని శతాబ్దాలుగా నిత్యం మన ఇళ్లలో ఉపయోగించడం ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ధరించడం చాలా తేలిక.

పసుపు, ఘాటైన ఎండు మిర్చికి కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లా మీ స్వస్థలం కావటం వల్లే దీనిపై ప్రత్యేక ఆసక్తితో పరిశోధన చేపట్టారా?
జవాబు: ఇది మంచి ప్రశ్న. ఎండు మిర్చి వల్ల ఎసిడిటీ పెరుగుతుంది. అందువల్ల దానితో గుండెల్లో మంట తలెత్తుతుంది. వాటిలో కాప్సైసిన్‌ అనే పదార్థం ఉంటుంది. అది కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థం కావడం విశేషం. ఆర్థరైటిస్‌ ఉన్నవారిలో ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించడానికి దీన్ని వాడుతున్నారు. మోకాళ్ల నొప్పులకు వాడే లోషన్లు, క్రీముల్లోనూ ఉపయోగిస్తున్నారు. అందువల్ల మిర్చిని ఒక మోస్తరు స్థాయిలో తినొచ్చు. ఇక సమతుల ఆహారం విషయానికొస్తే మన పూర్వీకులు ఘాటైన పచ్చళ్లను ఆహారంలో తీసుకునేవారు. అయితే వారు భోజనం చివర్లో పెరుగన్నం తినేవారు. ఆ పెరుగులో పుష్కలంగా ఉన్న ప్రొబయాటిక్‌ లాక్టోబాసిలస్‌ వల్ల పేగుకు రక్షణ లభిస్తుంది. పెరుగు ఒక్కటే కాదు ఇలాంటి అనేక రకాలైన సమతుల ఆహారాలను మనం తీసుకుంటున్నాం. అందులో.. ఒకదాని వల్ల కలిగే దుష్ప్రభావాలను మరో ఆహార పదార్థం తగ్గిస్తుంది. మిర్చి, పెరుగు దీనికి ఉదాహరణ. ఒక ఆహార పదార్థంలోని మంచి లక్షణాలను ప్రోది చేసేలా కూడా అవి ఉంటున్నాయి. పసుపు, అల్లం, నల్ల మిరియాలు ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు భారత్‌లో అల్సర్లు, పెద్ద పేగు క్యాన్సర్లు చాలా అరుదుగానే సంభవించేవి.

క్యాన్సర్‌ ఔషధంగా పసుపు పనికొస్తుందన్న ఆలోచనకు మూలం ఎక్కడ?
జవాబు: నిరంతర ఇన్‌ఫ్లమేషన్‌ క్యాన్సర్‌కు దారి తీయవచ్చనేది ఇప్పటికే నిర్ధారణ అయిన అంశం. ఉదాహరణకు పొగాకు నమలడం వల్ల నోటి క్యాన్సర్‌ రావొచ్చు. జీర్ణాశయంలో దీర్ఘకాలంగా హెచ్‌.పైలోరి ఇన్‌ఫెక్షన్‌ ఉంటే అది జీర్ణాశయ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. పెద్దపేగులోని చెడు సూక్ష్మజీవుల ఉనికి లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల మలద్వార క్యాన్సర్‌ తలెత్తే ప్రమాదం ఉంటుంది. అదుపులేని ఇన్‌ఫ్లమేషన్‌ వల్లే ఇవన్నీ సంభవిస్తాయి. దీన్నిబట్టి మా పరిశోధన ముఖ్యాంశం ఇన్‌ఫ్లమేషన్‌ అని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ రుగ్మతను నియంత్రించడానికి అనేక రకాల చికిత్సలను అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం. పసుపునకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ    లక్షణాలకు తోడు క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని అడ్డుకునే సామర్థ్యం ఉందని వెల్లడైంది. జీర్ణాశయ క్యాన్సర్‌ సహా అనేక రకాల క్యాన్సర్లను మేం లక్ష్యంగా చేసుకుంటున్నాం.

పసుపును నిత్యం తీసుకోవడం వల్ల పలు రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుందా? దీన్ని నిత్యం మనం ఎలా తీసుకోవచ్చు?
జవాబు: ఇతర ఆహార పదార్థాలతో కలసి పసుపు పనిచేస్తుంది. ప్రస్తుతానికైతే ఈ పదార్థం నుంచి అత్యుత్తమ ప్రయోజనాలు పొందడానికి నానమ్మలు సూచించే సంప్రదాయ విధానాలే మెరుగు. కప్పు పాలను మరిగించి, ఒక స్పూను పసుపు పొడిని, రెండు చిటికెలు తాజా నల్ల మిరియాల పొడిని కలిపి కొద్ది నిమిషాల పాటు బాగా కలియతిప్పాలి. ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా తాగాలి. అయితే శరీరం దీన్ని బాగా ఒంటబట్టించుకునేందుకు వీలుగా మెరుగైన మిశ్రమాన్ని రూపొందించేందుకు బోలెడు పరిశోధన సాగుతోంది. అయితే గట్టి శాస్త్రీయ పరిశీలనలు లేకుండా మార్కెట్‌లోకి వచ్చే నకిలీ ఉత్పత్తుల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వైద్యుడి సలహా ప్రకారం నడుచుకోవాలి.

అనేక రకాల క్యాన్సర్లకు చికిత్స లేదు. కర్కుమిన్‌ ద్వారా అభివృద్ధి చేస్తున్న ఔషధం ఈ రుగ్మతను నివారించేదిగా ఉంటుందా లేక చికిత్సకు ఉపయోగపడుతుందా?
జవాబు: విటమిన్‌ మాత్రల్లాగే ఒరా కర్కుమిన్‌ను కూడా రోజూ తీసుకునేలా అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం. ఆరోగ్యకరమైన పానీయాలు లేదా ఆహారంలో భాగంగా లేదా గుళికల రూపంలో అందించి పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించి, తద్వారా క్యాన్సర్‌ ముప్పును తగ్గించాలనుకుంటున్నాం. ఈ పరిజ్ఞానంపై ‘టర్మరిక్‌ అల్ట్రా’ అనే ఒక అంకుర పరిశ్రమకు లైసెన్సు ఇచ్చాం. ఒరా కర్కుమిన్‌ను తొలుత పానీయాలు, న్యూట్రాస్యూటికల్స్‌, పెంపుడు జంతువుల ఆరోగ్య పరిరక్షణకు, సౌందర్య లేపనాల కోసం త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నది దీని ఉద్దేశం. ఇదే సమయంలో జీర్ణకోశ క్యాన్సర్లకు ప్రస్తుతమున్న చికిత్సలకు తోడుగా దీన్ని కూడా ఉపయోగించేందుకు అమెరికాలోని ‘ఫ్రెడ్‌ అండ్‌ పమేలా బఫెట్‌ క్యాన్సర్‌ సెంటర్‌’తో కలసి పనిచేస్తున్నాం.

గొంతు నొప్పి, తీవ్ర జలుబు ఉంటే నేను ఇప్పటికీ పసుపు కలిపిన పాలను తాగుతుంటా

మన ఆహారంలో సాధారణంగా ఉపయోగించే దినుసుల్లోని ఔషధ విలువల గురించి వివరాలు చెబుతారా?
జవాబు: మన వంటగదిలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. అయితే వాటన్నింటికీ సంప్రదాయ వినియోగమే ప్రాతిపదిక. శాస్త్రీయ అధ్యయనం కాదు. వీటిలో చాలావరకూ రుగ్మతలకు తాత్కాలిక ఉపశమనానికి ఉద్దేశించినవే. వ్యాధులకు చికిత్సలకు కాదు. దీర్ఘకాల వినియోగం వల్ల ప్రయోజనం ఉండొచ్చు. ఉదాహరణకు గసగసాలను ఒక స్పూను చక్కెరతో కలిపి తీసుకుంటే విరోచనాలకు ఉపశమనం లభించొచ్చు. తేనెలో నానబెట్టిన అల్లం లేదా కరక్కాయ తింటే పొడి దగ్గు తెరిపి ఇస్తుంది. దీన్ని పరిమితంగా లేదా ఒక మోస్తరు స్థాయిలో తీసుకోవాలి. ప్రతిరోజూ విటమిన్‌ మాత్రలా తీసుకోవాలనుకుంటే వైద్యుడి సలహా తీసుకోవాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.