close

ప్ర‌త్యేక క‌థ‌నం

రైతుబంధు.. మళ్లీ నగదు బదిలీనే!

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణం

ఈనాడు, హైదరాబాద్‌ : రైతుబంధు పథకం కింద వచ్చే వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ తప్పదని అంచనా. గత అక్టోబరులో శాసనసభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పుడు ఈ పథకం కింద అన్నదాతలకు చెక్కులు ఇవ్వవద్దని, నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆదేశించింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే మే నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో చెక్కుల పంపిణీ కుదరదని, రైతుల ఖాతాలకు మళ్లీ నగదు బదిలీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ అయిన రైతులందరి తాజా వివరాలను ఇవ్వాలని రెవెన్యూ శాఖను అడుగుతున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ (పీఎం-కిసాన్‌) పథకం అమలు కోసం గత నెల ఒకటో తేదీ వరకు రెవెన్యూ శాఖ ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన రైతులందరి వివరాలను వ్యవసాయశాఖ గత నెలలో తీసుకుంది. అప్పటికి మొత్తం 52 లక్షల మందికి కొత్త పాసుపుస్తకాలు ఇచ్చినట్లు తేలింది. ఆ తర్వాత కూడా పుస్తకాలిస్తున్నందున ఎప్పటికప్పుడు రైతుల సంఖ్య మారుతోంది. ఇంకా పుస్తకాలు అందని వారు 3 లక్షలకు పైగా ఉన్నారని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. గతేడాది వానాకాలంలో రైతుబంధు పథకం కింద 58 లక్షల మంది అన్నదాతల పేరుతో చెక్కులను ముద్రించారు. వాటిలో 50 లక్షల చెక్కులే పంపిణీ చేశారు. తిరిగి ప్రస్తుత యాసంగిలో పంపిణీ కోసం గత సెప్టెంబరులో మరో 50 లక్షల చెక్కులు ముద్రించారు. తీరా పంపిణీ ప్రారంభించిన సమయంలోనే వాటిని ఇవ్వవద్దని ఈసీ ఆదేశాలివ్వడంతో వాటిని పక్కన పెట్టేసి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. అవే చెక్కులపై కొత్త తేదీ వేసి ఈసారి వానాకాలంలో రైతులకిస్తే ఎలా ఉంటుందని ఆర్థిక, వ్యవసాయశాఖలు చర్చించాయి. కానీ లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వస్తున్నందున మళ్లీ చెక్కుల పంపిణీకి ఈసీ అంగీకరించదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ నుంచి రైతుల తాజా వివరాలు సేకరించిన తర్వాత నగదు బదిలీకి ఆర్థికశాఖకు ఇస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది వానాకాలం పంట కోసం  మే నెలలోనే చెక్కులను పంపిణీ చేశారు. ఈసారీ మే నెల నాటికల్లా నగదు బదిలీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం లెక్కలన్నీ వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. పీఎం-కిసాన్‌ పథకం కోసం ఐదెకరాల్లోపు రైతు కుటుంబాల ఆధార్‌, బ్యాంకు ఖాతా సంఖ్యలన్నీ కొత్తవి సేకరించారు. ఇక మిగతావారివి మాత్రమే తీసుకోవాలి. రాష్ట్ర బడ్జెట్‌లో రైతుబంధుకు రూ.12 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. శాసనసభ ఎన్నికల్లో నెగ్గితే ఎకరానికి ఏటా రూ.10 వేలు ఇస్తామని తెరాస హామీ ఇచ్చింది. దీని అమలుతో వానాకాలంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతు ఖాతాకు బదిలీ అవుతాయని అధికారులు తెలిపారు.
వారసుల పేరుతో పాసుపుస్తకాలు ఉంటేనే...
గతేడాది వానాకాలం సీజన్‌కు సంబంధించిన చెక్కులు ముద్రించిన తర్వాత కొందరు రైతులు కన్నుమూశారు. వారి వారసుల పేరుతో భూ యాజమాన్య హక్కులు మారి కొత్త పాసుపుస్తకాలు పంపిణీ అయితేనే వారికి రైతుబంధు వర్తిస్తుంది. గతేడాది ఈ కారణంగా మిగిలిన చెక్కులను వెనక్కి తెప్పించారు. ఒకసారి ఒక రైతు పేరుతో చెక్కు ముద్రించిన తర్వాత అతను మరణిస్తే తిరిగి అదే చెక్కును వారసులకు ఇవ్వడం కుదరదని, అలా ఇస్తే వారి పేరుతో నగదు ఇవ్వడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదని, వారసుల పేరుతోనే చెక్కు ముద్రించి ఇవ్వాలని బ్యాంకులు వ్యవసాయశాఖకు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో గతేడాది మిగిలిపోయిన చెక్కులన్నీ ఇక చెల్లవని తేలింది. రైతుబంధు, రుణమాఫీ పథకాల అమలుపై బ్యాంకర్లతో ఈ నెల 12న జరిగే ‘రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి’ సమావేశంలో చర్చిస్తామని ఆర్థిక, వ్యవసాయశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత వాటి అమలుపై ఒక స్పష్టత వస్తుందని అంచనా.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.