close

ప్ర‌త్యేక క‌థ‌నం

సర్కారీ నౌకరికి.. కష్టాల సవారీ

ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోసం గ్రామాల నుంచి హైదరాబాద్‌ బాట
మధ్యాహ్నం ఆకలి తీరేది రూ.5 భోజనంతోనే
ఉదయం వేళల్లో పార్కుల్లో పుస్తకాలతో కుస్తీ
ఫీజులు భరించలేక స్నేహితుల నుంచి నోట్సు జిరాక్సు
నెలల తరబడి గ్రంథాలయాల్లోనే సన్నద్ధం
ఈనాడు - హైదరాబాద్‌

కొడితే సర్కారు కొలువే కొట్టాలి.. ఇందుకోసం ఎంత శ్రమైనా పడాలి. ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి.. ఇదీ తెలంగాణలో గ్రామీణ ఉద్యోగార్థుల ఆకాంక్ష. ఆర్థిక కష్టాలు సవాళ్లు విసురుతున్నా, ఒకపూట కడుపు మాడుతున్నా, కొలువు కొట్టాలన్న లక్ష్యంతో అప్పులు చేసి మరీ పలువురు గ్రామాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ చేసినవారు సైతం ఈ ఉద్యోగాలపైనే మక్కువ చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర విభాగాల్లోని ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్‌ వచ్చినా దరఖాస్తు చేసి కష్టపడుతున్నారు. అసలు ఉద్యోగ ప్రకటన ఉన్నా.. లేకున్నా.. నిరంతర అధ్యయనం కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదయాన్నే గదుల నుంచి పుస్తకాలు పట్టుకుని శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాల వద్దకు వెళ్లడం, రాత్రి వరకు అక్కడే ఉండి చదువుకుని తిరిగి గదులకు చేరుకుంటున్నారు. ఉద్యోగాల శిక్షణ కార్ఖానాలుగా పేరుగాంచిన హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌, అమీర్‌పేట, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో ఈ దృశ్యం నిత్యం ఆవిష్కృతమవుతోంది.
ఉదయం శిక్షణ.. మధ్యాహ్నం గ్రంథాలయంలో..
డిగ్రీ, పీజీ పూర్తిచేసిన నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటోంది. బ్యాంకులు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, భద్రతా బలగాలు, రైల్వే, టీఎస్‌పీఎస్సీ, కింది స్థాయి ఉద్యోగాలకు సిద్ధమవుతోంది. తెలంగాణ గ్రూప్‌-1 ప్రకటన కోసం యువత ఇప్పటి నుంచే శిక్షణ తీసుకుంటోంది. కాలేజీ విద్యార్థులు తమకు అనుకూలమైన సమయాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. కోర్సులు పూర్తిచేసిన వారు ఉదయం వేళల్లో శిక్షణ తరగతుల్లో.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సమీప గ్రంథాలయం లేదా పార్కులో కూర్చుని చదువుకుంటున్నారు. ఈ తరహాలో చదువుకునేందుకు చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీ ముఖ్య కేంద్రంగా మారింది. రోజూ వందలాది మంది విద్యార్థులు అక్కడే కూర్చుని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇందిరాపార్కు, సుందరయ్య పార్కు ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగార్థులతో కిటకిటలాడుతున్నాయి.
మధ్యాహ్నం రూ.5 భోజనం..
ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల్లో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారే. శిక్షణ కేంద్రానికి వచ్చేందుకు రెండు, మూడు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఉదయం, సాయంత్రం శిక్షణ తరగతులు.. మధ్యలో సమయం దొరికినప్పుడల్లా పఠనం. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు మధ్యాహ్నం రూ.5 భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. మధ్యాహ్న వేళల్లో శిక్షణ కేంద్రాల ప్రాంతాల్లోని జీహెచ్‌ఎంసీ భోజనశాలల వద్ద అభ్యర్థులు ఎక్కువగా కనిపిస్తున్నారు. రూ.5 భోజనం చేసి, రాత్రి 8 వరకు లైబ్రరీలో చదువుకుంటామని నిరుద్యోగి భూపాల్‌ చెప్పారు.
పేదలు, మధ్య తరగతి ప్రజలకే ఎక్కువ...
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలతో హైదరాబాద్‌కు వస్తున్న వారిలో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. ఊరిలో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో బతకలేక, తల్లిదండ్రులకు భారం కాలేక పట్టణాలు, నగరాల్లో ఉండే స్నేహితుల వద్దకు వస్తున్నారు. పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శిక్షణ ఫీజులు, పుస్తకాల ఖర్చు తీసివేస్తే ఇంటి అద్దె, రాత్రిభోజనం, టిఫిన్‌ తదితర అవసరాలకు నెలకు రూ.5 వేల వరకు ఖర్చులు ఉంటున్నాయి. శిక్షణ అనంతరమూ ఇక్కడే ఉంటూ నోటిఫికేషన్ల ప్రకారం సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ప్రైవేటు సంస్థల్లో శిక్షణ ఫీజులు భారీగా ఉంటున్నాయి. గ్రూప్‌-4 స్థాయి ఉద్యోగ శిక్షణకు ప్రైవేటు సంస్థలు రూ.15-20 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. గ్రూప్‌-1, సివిల్స్‌ కలిపి ఒక  విద్యార్థి నుంచి రూ.1.5 లక్షల వరకు తీసుకుంటున్నాయి. ఈ స్థాయిలో ఫీజులు భరించలేని ఉద్యోగార్థులు అప్పటికే శిక్షణ తీసుకున్న వారి నుంచి నోట్సు జీరాక్స్‌ తీసుకొని చదువుతున్నారు.
సంక్షేమశాఖల శిక్షణ కేంద్రాలు అంతంతే..
పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ. వీరి కోసం ఆయా సంక్షేమ శాఖలు స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసినప్పటికీ.. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన తరువాతే శిక్షణ ఇస్తున్నారు. ఇందులోనూ బ్యాచ్‌కు 100 మందిని మాత్రమే తీసుకుంటున్నారు. కానీ, శిక్షణ కోరుకుంటున్న ఉద్యోగార్థుల సంఖ్య భారీగా ఉంటోంది. కొత్త జిల్లాల మేరకు స్టడీ సర్కిళ్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు.

ఇంటికి పోవాలనిపించడం లేదు 

మాది చిన్న రైతు కుటుంబం. ఉన్న రెండెకరాల్లో వ్యవసాయంతోపాటు నాన్న కుండలు చేయగా వచ్చే మొత్తంతో కుటుంబ అవసరాలు తీరడం లేదు. అందుకే ఐదేళ్ల కిందట డిగ్రీ పూర్తికాగానే హైదరాబాద్‌కు వచ్చా. రెండేళ్లపాటు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశా. అది సంతృప్తిని ఇవ్వలేదు. మూడేళ్లుగా పిజ్జా కార్నర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటున్నా. వచ్చే జీతంతో అద్దె, ఇతర అవసరాలు తీరుతున్నాయి. అమ్మనాన్నకు డబ్బులు పంపించడం కుదరక, ఇంటికి కూడా పోవాలనిపించడం లేదు. ఈ సారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం కొడతా. రాకపోతే ఇంటికి పోయి కుండలు చేసుకుంటా.

- సంపత్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లా

2020కి ఇప్పటి నుంచే..

గతేడాది డిగ్రీ పూర్తయ్యింది. సివిల్స్‌ రాయాలనే లక్ష్యంతో పది నెలలుగా హైదరాబాద్‌కు వచ్చి చదువుకుంటున్నా. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు గ్రంథాలయంలోనే ఉంటా. ఎక్కడా కోచింగ్‌ తీసుకోకుండా ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నా. సిలబస్‌ చూసుకొని ప్రణాళిక ప్రకారం 2020లో సివిల్స్‌ రాయడానికి సిద్ధమవుతున్నా.

-రాకేశ్‌రెడ్డి, ఖమ్మం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.