close

ప్ర‌త్యేక క‌థ‌నం

బడాచోర్‌.. హల్‌చల్‌ 

10 రాష్ట్రాల్లోని 39 ప్రాంతాలకు విస్తరణ 
క్రియాశీలక నేరస్థులు 28,550 మంది 
హైదరాబాద్‌కు రాకుండా నియంత్రించేందుకు సైబరాబాద్‌ ఎస్‌టీఎఫ్‌ బృందం వ్యూహరచన

నేరపరిశోధనతో సంబంధమున్న ఏ పోలీసైనా సరే ఇరానీ ముఠా కేసు అంటేనే ఉలిక్కిపడతారు. ఆ ముఠా కనుక నగరంలోకి అడుగుపెట్టిందంటే చాలు వరుస చోరీలతో అలజడి సృష్టిస్తుంది. సామాన్యులను బెంబేలెత్తించడంతోపాటు పోలీసులకు చికాకులు తెచ్చి పెడుతుంది. ఒక ప్రాంతానికి చెందిన ముఠాను అరెస్టు చేస్తే.. మరో ప్రాంతం నుంచి దుండగులు వచ్చి నేరాలకు తెగబడుతుంటారు. అందుకే ఈ ముఠాల కట్టడికి సైబరాబాద్‌ పోలీసులు సరికొత్త వ్యూహరచన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విస్తరించిన ఈ ముఠాల గురించి కీలక సమాచారం సేకరించారు. ఆయా రాష్ట్రాల పోలీసులతో మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు. ఈ నేపథ్యంలో ఆయా ముఠాల కార్యకలాపాలపై ప్రత్యేక కథనమిది.

 

ఈ ముఠా మూలాలేమిటి?  
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కొద్దిరోజుల క్రితం మహిళలను మాయచేసి మంగళసూత్రాలు కాజేసింది ఇరానీ ముఠాయే. ముంబయి అంబేవ్యాలీకి చెందిన వసీం అబ్బాస్‌ సిరాజ్‌, జావెద్‌ బలీ ముఠా ఈ నేరాలకు పాల్పడింది. వీరి స్వస్థలం పర్షియా (ఇరాన్‌). ఎప్పుడో గోల్కొండ సుల్తానుల కాలంలో వారిని మన దేశానికి తీసుకువచ్చి అంగరక్షకులుగా నియమించుకున్నారు. అలాగే మేలుజాతి అశ్వాల్ని అమ్మే తెగకు చెందిన కొందరు పర్షియన్లు అప్పట్లో భారత్‌కు వలస వచ్చారు. క్రమంగా దేశవ్యాప్తంగా స్థిరపడ్డారు. చాలామంది రకరకాల వృత్తుల్లో స్థిరపడగా కొందరు నేరాల వైపు మళ్లారు. అలాంటి వారే ప్రస్తుతం ఎక్కడికక్కడ ముఠాలుగా ఏర్పడి దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ వంటి నగరాలతోపాటు పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌ విసిరే స్థాయికి ఎదిగారు. 
ధనంతో వెన్నుదన్ను.. వకీళ్లు.. 
చోరీలకు రూపకల్పన నుంచి తెలివిగా తప్పించుకోవడం.. కొట్టేసిన ఆభరణాల్ని విక్రయించడం దాకా ఇరానీ ముఠాలది ప్రత్యేక శైలి.  
ఒకవేళ పోలీసులకు చిక్కితే విడిపించడం కోసం వీరు.. లాయర్లను, ఫైనాన్షియర్లను ఏర్పాటు చేసుకున్నారు.  

ముఠా నాయకుడు తన ముఠాలోని సభ్యులను చోరీల కోసం బయటి ప్రాంతాలకు తీసుకువెళ్లే ముందు ఫైనాన్షియర్ల దగ్గర డబ్బు తీసుకుని వారి కుటుంబాలకు బయానా చెల్లిస్తాడు.  
వీరికి సిమ్‌లు, సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లు, ద్విచక్రవాహనాలు, విమానం, రైలు టికెట్లు సమకూర్చేందుకు కొన్ని ముఠాలున్నాయి.  
చోరీ ద్వారా సంపాదించిన సొమ్ములో సగం డబ్బులు ముఠా నేత తీసుకుంటాడు.  
చోరీ ఆభరణాలను ఫైనాన్షియర్లే సగం ధరకు కొంటారు.  
పోలీసులు అరెస్టు చేస్తే విడిపించేందుకు అడ్వొకేట్లు సిద్ధంగా ఉంటారు.  
వీరికి కొన్నిచోట్ల స్థానిక రాజకీయ నాయకుల అండ కూడా ఉంటుంది.
ప్రీయాక్టివేటెడ్‌  సిమ్‌లు  
పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఇరానీ దొంగలు ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌లను వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ ముఠాలు నేరం చేసే ప్రాంతానికి వచ్చిన తర్వాత కొత్త సిమ్‌తోపాటు తక్కువ
ధరలో దొరికే మొబైల్‌ ఫోన్లను కొని వినియోగిస్తున్నాయి. ఒక నేరం చేసిన అనంతరం వాటిని పక్కన పడేస్తారు. రూ. 1000 చెల్లిస్తే చాలు రెండు ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌లు సమకూరుస్తున్న ముఠాలు కొన్ని ఉన్నాయి. ముంబయి, పుణే, రాజస్థాన్‌, భోపాల్‌లలో వీటిని పొట్లాలు కట్టి అమ్ముతున్నట్లు ఎస్‌టీఎఫ్‌ విచారణలో వెలుగుచూసింది. అంబేవ్యాలీ ముఠా వద్ద సుమారు 350 ఇలాంటి సిమ్‌లు ఉన్నట్లు తేలడం దర్యాప్తు బృందాన్ని విస్తుపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో సిమ్‌ల వ్యవహారంపై టెలికాం శాఖకు లేఖ రాయాలని   సైబరాబాద్‌ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
స్థానికంగా  బుద్ధిమంతులే 
ఇరానీ ముఠా సభ్యులు బయటి ప్రాంతాల్లోనే నేరాలు చేస్తారు తప్ప స్థానికంగా మాత్రం పెద్దమనుషుల్లాగే ఉంటారు. కర్ణాటక బీదర్‌ నగరపాలక సంస్థలో గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఒకరు ఈ ముఠాలో ఉండటం గమనార్హం. స్థానిక పోలీసుల్లో కొందరికి చోరీల్లో వాటాలిస్తారు. అందుకే ఇతర రాష్ట్రాల పోలీసులకు.. స్థానిక పోలీసుల సహకారం పెద్దగా లభించదు. దొంగల్ని పట్టుకునేందుకు వెళ్లిన ఇతర రాష్ట్రాల పోలీసులపైకి మహిళలు, వృద్ధులు, పిల్లలు దాడులకు తెగబడుతుంటారు. అందుకే కాలనీ బయట రోజుల తరబడి మకాం వేసి.. తమకు కావాల్సిన దొంగ బయటికి రాగానే పట్టుకొచ్చేస్తుంటారు. 
అక్కడి పోలీసులపై  ఒత్తిడి తెచ్చే వ్యూహం 
ఇరానీ దొంగలను అరెస్టు చేయడంలోని ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అక్కడి పోలీసుల్లోనే చురుకుదనం పుట్టించాలన్న సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు ఎస్‌టీఎఫ్‌ ఏసీపీ శ్యాంబాబు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆయా ప్రాంతాల పోలీసులతో హైదరాబాద్‌లో మేళా నిర్వహించి ఈ ముఠాలపై ఉన్న కేసుల గురించి వివరించనున్నారు. అలా చేస్తే ఆ ముఠాలు ఇక్కడికి రాకుండా నియంత్రించే వీలుంటుందని భావిస్తున్నారు. ఈ దొంగలపై పీడీ చట్టం ప్రయోగించి ఏడాదిపాటు కటకటాలకే పరిమతయ్యేలా చూడాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.