close

ప్ర‌త్యేక క‌థ‌నం

కళ్లెం వేసే నియమావళి 

పార్టీలను అదుపులో ఉంచే బ్రహ్మాస్త్రం 
స్వేచ్ఛాయుత ఎన్నికలే ఈసీ లక్ష్యం 
ఈనాడు ప్రత్యేక విభాగం

ఎన్నికల ప్రకటన వెలువడిందంటే ప్రవర్తన నియమావళి కూడా అమల్లోకి వచ్చినట్టే. ప్రచారం నుంచి పోలింగ్‌ వరకు జరుగుతున్న అనేక అక్రమాలకు విరుగుడుగా ఎన్నికల సంఘం ఈ నియమావళిని అమల్లోకి తెచ్చింది. ఎన్నో అనుభవాలసారంగా రూపుదిద్దుకున్న ఈ నిబంధనలు ప్రజాస్వామ్య వ్యవస్థ గమనానికి మార్గదర్శిగా నిలుస్తున్నాయి. 

ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌- ఎంసీసీ) అంటే ఏమిటి? 
క్రమశిక్షణాయుతంగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఎన్నికల కమిషన్‌ నియమావళిని రూపొందించింది. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు ఎలా వ్యవహరించాలన్నదానిపై విధి నిషేధాలను పొందుపరిచింది. ఎన్నికల ప్రణాళికలు, ప్రసంగాలు, ప్రదర్శనలు, మొత్తంగా అన్ని వ్యవహారాల్లో ఈ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. 
ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 
అన్ని నిబంధనలూ ఒకేసారి కాకుండా క్రమేణా ఆచరణలోకి వచ్చాయి. 
తొలిసారిగా 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘విధులు-నిషేధాలు’ పేరుతో కొన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చింది. 
‌‌1962లో లోక్‌సభకు, కొన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు ప్రవర్తన నియమావళిని పంపించింది. వీటికి అన్ని పార్టీల అంగీకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 
‌‌1968లో అన్ని పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించి, నియమావళిని అందజేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయితీగా జరిగేందుకు వీలుగా కనీస ప్రమాణాలు పాటించేందుకు వీటిని రూపొందించినట్టు తెలిపింది. 
‌‌1971-72లో లోక్‌సభ, అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల సందర్భంగా మరోసారి నియమావళిని అన్ని పార్టీలకు పంపించింది. 
‌‌1974 ఎన్నికల సందర్భంగా నియమావళి అమలుపై కీలక నిర్ణయం తీసుకొంది. దీనిని అన్ని పార్టీలు కచ్చితంగా పాటించేలా చూడడానికి; ఉల్లంఘనలను గుర్తించడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన, అన్ని పార్టీల ప్రతినిధులు సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. 
‌‌1977 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మరోసారి అన్ని పార్టీలకు నియమావళిని పంపించింది. 
‌‌1979లో ‘అధికార పార్టీ’ని కట్టడి చేస్తూ నియమావళిలో పలు సవరణలు చేసింది. అధికార పార్టీ అభ్యర్థులు పదవులను దుర్వినియోగం చేయకుండా నిరోధిస్తూ నియమావళిలో కొత్త విభాగాన్ని చేర్చింది. అన్ని పార్టీలతో చర్చించిన తరువాతనే ఈ మార్పులు చేసింది. 
‌‌1991లో నిబంధనలు అన్నింటినీ క్రోడీకరించి ప్రస్తుతం అమలులో ఉన్న నియమావళిని రూపొందించింది. 
‌‌2013లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ ఎన్నికల ప్రణాళికలను కూడా ప్రవర్తన నియమావళి పరిధిలోకి తీసుకొస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలని పేర్కొంది. 
‌‌2014లో పార్టీల ఎన్నికల ప్రణాళికలను కూడా ప్రవర్తన నియమావళిలో చేర్చింది. 
ఎన్నికల సంఘం ఏ విధంగా అమలు చేస్తుంది? 
రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు ఎన్నికల సంఘం ఈ నియమావళిని అమలు చేస్తుంది. నియమావళి ఉల్లంఘన జరిగినట్టు ఎవరైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే కోర్టును ఆశ్రయించవచ్చు. పలు యంత్రాంగాల ద్వారా ఎన్నికల సంఘం నిబంధనల అమలును పరిశీలిస్తుంది. వివిధ విభాగాలతో ఉమ్మడి కార్యాచరణ బృందాలను, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తుంది. తాజాగా ‘సి-విజిల్‌’ మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా అక్రమాలపై ఆడియో, వీడియో రూపంలో ఫిర్యాదు చేయవచ్చు. 
వేటిని ఎన్నికల నేరాలుగా పరిగణిస్తారు? 
‌‌కులం, మతం, భాష ఆధారంగా విభజన, విభేదాలు, ఘర్షణ సృష్టించడం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం. 
‌‌వీటి ఆధారంగా ఓట్లు అడగడం, ప్రార్థన స్థలాలను ప్రచారానికి వాడుకోవడం కూడా ఇదే చట్టం కింద నేరంగా గుర్తిస్తారు. 
‌‌ఓటర్లకు లంచం ఇవ్వడం అవినీతి వ్యవహారంగానే కాకుండా ఎన్నికల నేరం కూడా. 
‌‌ఓటర్లను భయపెట్టడం ఎన్నికల నేరమే. 
‌‌మద్యం పంపిణీ ఎన్నికల నేరం. 
‌‌పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలి. ఆ సమయంలో సభలు నిర్వహించడం కూడా ఎన్నికల నేరం. 
ఉల్లంఘిస్తే ఏమవుతుంది? 
నియమావళిని ఉల్లంఘించిన వారికి ఈసీ నోటీసు పంపిస్తుంది. కొన్ని విషయాల్లో వారు క్షమాపణ చెబితే దాంతో సరిపెడుతుంది. నాయకులను మందలించడం, ప్రచారానికి వెళ్లకుండా నిలిపివేయడం వంటి చర్యలను తీసుకుంటుంది. ఇంకొన్ని అంశాల్లో కేసులు పెట్టాలని సూచిస్తుంది.

ఇవిగో ముఖ్యాంశాలు.. 
సాధారణ ప్రవర్తన: పార్టీలు చేసే విమర్శలు విధానాలు, కార్యక్రమాలు, ప్రస్తుత/గత పనితీరుకే పరిమితం కావాలి. (ఎ) ఓట్లు పొందడానికి కులం, మతంవంటి భావాలను ప్రచారం చేయకూడదు. (బి) ఆధారాలు లేని అంశాలను ప్రాతిపదికగా చేసుకొని అభ్యర్థులను విమర్శించకూడదు. (సి) ఓటర్లకు లంచం ఇవ్వడం, ప్రలోభ పెట్టడం చేయకూడదు. (డి) తమకు ఇష్టం లేని అభిప్రాయం చెప్పారన్న కారణంతో ఏ వ్యక్తుల ఇంటి ముందు కూడా ధర్నాలు, పికెటింగ్‌లు చేయకూడదు. 
సమావేశాలు: తగిన భద్రత ఏర్పాట్లు చేయడానికి వీలుగా సమావేశాలు నిర్వహించే ప్రదేశాలు, సమయం వంటి వివరాలను స్థానిక పోలీసులకు ముందుగానే తెలపాలి. 
ప్రదర్శనలు: ఇద్దరుకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్గంలో ప్రదర్శన జరపాలని భావిస్తే సంబంధిత నిర్వాహకులు ముందుగానే సంప్రదింపులు జరుపుకోవాలి. ఎలాంటి ఘర్షణలకూ అవకాశం ఇవ్వకూడదు.  
పోలింగ్‌ రోజు: పోలింగ్‌ బూత్‌ వద్ద విధులు నిర్వర్తించడం కోసం అన్ని పార్టీల ధ్రువీకరణ పొందిన కార్యకర్తలకు గుర్తింపు బ్యాడ్జీలు ఇస్తారు. వీటిపై పార్టీ పేరు, గుర్తు, అభ్యర్థి పేరు ఉండకూడదు. 
పోలింగ్‌ బూత్‌: ఓటర్లు, ఎన్నికల సంఘం ఇచ్చిన పాస్‌ ఉన్నవారు మాత్రమే పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లడానికి వీలుంది. 
ఎన్నికల పరిశీలకులు: నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయడానికి వీలుగా ఎన్నికల సంఘం పరిశీలకులను నియమిస్తుంది.  
అధికార పార్టీ: ప్రభుత్వం నడుపుతున్న పార్టీ అధికార దుర్వినియోగం చేయకుండా ఉండడానికి కఠిన నిబంధనలు రూపొందించింది. (ఎ) మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను ఎన్నికల వ్యవహారాలతో ముడిపెట్టకూడదు. ఇందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు. (బి) ఎన్నికల్లో విజయాలు మెరుగయ్యేలా ప్రభుత్వ విజయాలపై ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రభుత్వ ప్రసార సాధనాలను, వాహనాలను ఉపయోగించుకోకూడదు. (సి) ఆర్థిక సంబంధమైన హామీలు.. ఉదాహరణకు నిధులు కేటాయిస్తామనిగానీ, రహదారులు, నీటి పథకాలు మంజూరు చేస్తామనిగానీ, కొత్త పథకాలనూ ప్రకటించకూడదు. (డి) ప్రభుత్వ వసతి గృహాలు, హెలిప్యాడ్లువంటి సౌకర్యాలను అన్ని పార్టీల వారికీ కల్పించాలి. (ఇ) కొత్తగా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు, పదోన్నతులు ఇవ్వకూడదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంతకుముందే ప్రారంభమయి ఉంటే దాన్ని కొనసాగించవచ్చు. 
ఎ`న్నికల ప్రణాళికలు: ఓటర్లపై అనుచిత ప్రభావం చూపేలా హామీలు ఉండకూడదు. హామీలను నెరవేర్చే విధానాలను కూడా ప్రణాళికలో పొందుపరచాలి.
మే 23 వరకు అమల్లో.. 
ఎన్నికల తేదీలపై ప్రకటన వెలువడిన నాటి నుంచే నియమావళి అమల్లోకి వస్తుంది. మొత్తం ప్రక్రియ ముగిసే వరకు కొనసాగుతుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన నియమావళి మే 23 వరకు ఉంటుంది.

ప్రవర్తన నియమావళికి చట్టబద్ధత ఉందా? 
ఈ నియమావళిని దానికదే ఒక చట్టంగా పరిగణించరు. అయితే కొన్ని నియమాలు భారతీయ శిక్షా స్మృతి, నేర స్మృతి, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల కింద అమలవుతాయి. ప్రవర్తన నియమావళిని చట్టంగా మార్చడానికి ఎన్నికల సంఘం కూడా అంత సుముఖంగా లేదు. ఎందుకంటే మొత్తం ఎన్నికల ప్రక్రియను 45 రోజుల్లో ముగించాల్సి ఉంది. కొన్నింటిపై తక్షణ నిర్ణయాలు వెలువరించాల్సి ఉంటుంది. అన్ని నియమాలూ కోర్టు పరిధిలోకి వెళ్తే తీర్పు వెలువడడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఈ నియమావళిని చట్టంగా మార్చడం సాధ్యం కాదు. అయితే దీన్ని ప్రజాప్రాతినిధ్య చట్టంలో భాగంగానే పరిగణించాల్సి ఉంటుందని 2013లో పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది.

ఉల్లంఘించిన ప్రముఖులు 
2014 ఏప్రిల్‌ 30న నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో ఓటు వేసిన తరువాత పోలింగ్‌ బూత్‌ బయట వేచి ఉన్న విలేకరులతో మాట్లాడారు. ఆ సమయంలో భాజపా ఎన్నికల గుర్తు కమలం బొమ్మను చొక్కా జేబుకు ధరించారు. ఇది ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం కిందకే వస్తుందని భావించిన ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఆమేరకు అహ్మదాబాద్‌ పోలీసులు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 126(1)(ఎ), 126(1)(బి), ఐపీసీలోని సెక్షన్‌ 188, సీపీసీలోని సెక్షన్‌144 కింద కేసులు పెట్టారు. 
2017 డిసెంబరులో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ ముందు రోజున కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని ప్రసారం చేసిన ఛానల్‌పై కేసు పెట్టాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. రాహుల్‌కు సంజాయిషీ నోటీసు ఇచ్చింది. 
2014లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా భాజపా నేత అమిత్‌ షా ప్రసంగిస్తూ అవమానానికి ప్రతీకారం తీర్చుకొండి అంటూ జాట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది విద్వేషపూరిత ప్రసంగం అంటూ ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. ప్రచారానికి అనుమతించబోమని హెచ్చరించడంతో అమిత్‌ షా క్షమాపణలు చెప్పారు. 
2017లో గోవాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్‌ ప్రసంగిస్తూ భాజపా నుంచి డబ్బులు తీసుకొని తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఇలా నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తే పార్టీ గుర్తింపును రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.