close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఉష్ణతాపం. ఉగ్రరూపం 

కలవరపెడుతున్న వెట్‌బల్బ్‌ ఉష్ణాగ్రత 
రాష్ట్రంలో పదేళ్లలో 1711 మంది ఎండలకు మృతి 
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన 
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణతోపాటు దేశంలో.. ఉష్ణోగ్రత, తేమశాతం కలిపి(వెట్‌ బల్బ్‌) 31 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడం శాస్త్రవేత్తలు, నిపుణులను కలవరపెడుతోంది. భూమిపై చెట్లు తగ్గిపోతుండటం, కాలుష్యం అధికం కావడం.. ఉష్ణతాపం(గ్లోబల్‌ వార్మింగ్‌) పెరగడానికి కారణాలుగా అంచనా వేస్తున్నారు. దీనికితోడు సహజ వనరుల విధ్వంసం, పట్టణీకరణ.. తాపం పెరగడానికి ఉన్న కారణాల్లో ప్రధానమైనవిగా అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఏటా వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటోంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు సమీపిస్తుండటం.. వేసవి అంతా ముందే ఉండగా ఇప్పుడే సూరీడు భగభగలాడుతుండటం ప్రమాద సంకేతాలను చూపుతోంది. ఇటీవల ప్రకృతి వైపరిత్యాలు, వడగాడ్పులపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో శాస్త్రవేత్తలు పలు హెచ్చరికలు చేశారు. వాటిపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం 
ఆరోగ్యవంతులకూ ముప్పే 
మానవునిలో జరిగే జీవ క్రియలతో శరీరంలో 100 వాట్స్‌ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వేడిని చల్లబరిచేందుకు శరీరం చెమటను విడుదల చేస్తుంది. ఒక వేళ వాతావరణంలో ఉష్ణోగ్రత.. దేహం ఉష్ణోగ్రతను దాటితే బయటి వేడిని శరీరం స్వీకరిస్తుంది. దీనినే వడదెబ్బగా పరిగణిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వేళ ఈ వేడిమిని తట్టుకున్నప్పటికీ 40 డిగ్రీలు దాటినట్లయితే ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని వివరిస్తున్నారు. 

వృద్ధులు.. చిన్నారులకు ప్రమాదమే 
ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని అనుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రత 31 డిగ్రీలు ఉన్నప్పుడు గాలిలో తేమ 100 శాతానికి చేరితే ఆ సమయంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఎంత ప్రభావం చూపుతుందో అలా ఉంటుందని వివరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉంటే సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణకు 50 డిగ్రీల వద్ద తేమ శాతం 40కి తగ్గితే కంట్లో నీరు కూడా ఆవిరై కళ్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడే వారిలో అవయవాలు ఒక్కొక్కటి నీరసించి పోతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని యూనిసెఫ్‌ వైద్యుడు రాజారాం చెబుతున్నారు. 1880 నుంచి సగటు ఉష్ణోగ్రత 1.2 డిగ్రీలు పెరిగిందని ఆయన పేర్కొంటున్నారు. దీనివల్ల వేసవిలో మరింత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని.. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నీటిని తాగాలని సూచిస్తున్నారు. 
పదేళ్లలో 1711 మంది మృతి 
రాష్ట్రంలో 1971 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 2010, 2016 సంవత్సరాల్లో వడగాడ్పులు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతోపాటు 2015లో రాష్ట్రంలో అత్యధికంగా 540 మంది వడదెబ్బతో మరణించారు. 2008 నుంచి 2018 మధ్య తెలంగాణలో 1711 మంది ఎండలకు ప్రాణాలు వదిలారు. పదేళ్లలో 211 రోజులు వడగాడ్పులు వీచినట్లు వాతావరణ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా సాధారణ ఉష్ణోగ్రత కన్నా 0.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

వెట్‌బల్బ్‌ అంటే....

గాలిలో తేమ శాతం, ఉష్ణోగ్రతల పరిమాణాన్ని మానవ శరీర ఉష్ణోగ్రతతో పోల్చి చూసేందుకు శాస్త్రీయంగా వెట్‌బల్బ్‌ ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వెట్‌బల్బ్‌ అంటే థర్మోమీటర్‌ బల్బ్‌కు(పాదరసం) తడి వస్త్రాన్ని చుట్టి తేమను, ఉష్ణోగ్రతను ఏక కాలంలో లెక్కించే విధానం. కొన్నేళ్లుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వేసవిలో వెట్‌బల్బ్‌ ఉష్ణోగ్రత 31 డిగ్రీల వరకు నమోదవుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌, పచ్చదనం తరిగి పోతుండటంతో ఇది పెరుగుతూ వస్తోంది. సాధారణంగా మానవుని శరీర అంతర్గత ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌. చర్మం ఉష్ణోగ్రత 33-36 డిగ్రీలు. ఈ స్థితిలో సహజ సిద్ధంగా జీవక్రియలతో వేడెక్కే శరీరాన్ని చల్లబరిచేందుకు దేహం చర్మంపైకి చెమటను విడుదల చేస్తుంది. వెట్‌బల్బ్‌ ఉష్ణోగ్రత కనుక చర్మం ఉష్ణోగ్రతను అధిగమిస్తే జీవ క్రియలు దెబ్బతింటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రకృతి విధ్వంసం, పట్టణీకరణల ప్రభావం కూడా వెట్‌బల్బ్‌ ఉష్ణోగ్రత పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయని సూచిస్తున్నారు.

మార్చి నుంచి జూన్‌ వరకు వడగాడ్పులు

వడగాడ్పులు సాధారణంగా మార్చి నుంచి జూన్‌ వరకు వీస్తాయి. ఎప్పుడైనా జులైలోనూ ఉండవచ్చు. 
ఏ ప్రాంతంలోనైనా వరుసగా రెండు రోజుల పాటు 45 డిగ్రీలకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటే అక్కడ వడగాడ్పులు వీస్తున్నట్లు అర్థం. 
ఏ రోజు ఏ ప్రాంతంలోనైనా 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే అది చాలా వేడిగా ఉన్న రోజుగా పరిగణిస్తారు. 
వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్లానింగ్‌ సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌) మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 
నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) భువన్‌ పోర్టల్‌లో వాతావరణ వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు.

రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి వీచే వేడిగాలుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. వేడి వాతావరణంలో తిరిగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎండలో పనిచేసే కార్మికులు, పిల్లలు, వృద్ధులపై వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుంది. టీఎస్‌డీపీఎస్‌ ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నాం. మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం.

- షేక్‌ మీరా, సీఈవో, టీఎస్‌డీపీఎస్‌

గ్లోబల్‌ వార్మింగ్‌, పట్టణీకరణతో దేశంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రత, తేమశాతం కలిపి(వెట్‌ బల్బ్‌) 31 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఇది 33-35 డిగ్రీల మార్కును చేరుకుంటే శరీరంలో ప్రమాదకరమైన మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఎండలను అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవాలి.

- ఎం.వి.రమణ, శాస్త్రవేత్త, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌

ష్ణోగ్రత తక్కువగా ఉన్నా గాలిలో తేమ అసాధారణంగా పెరిగితే వడదెబ్బ తగులుతుంది. ఉదాహరణకు గాలిలో తేమ 75 శాతం ఉంటే ఉష్ణోగ్రత 34 డిగ్రీలున్నా దాని ప్రభావం 49 డిగ్రీలున్నప్పటి స్థాయి ఉంటుంది. ఆ సమయంలో తేలికగా అనారోగ్యానికి గురవుతారు. వాతావరణ శాఖ సూచనలు పాటించాలి.

- వైకే రెడ్డి, ఐఎండీ డైరెక్టర్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.