Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

విధుల్లో పాల్గొనే అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ 

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన 
ఎన్నికల సంఘం కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ కేటాయించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధుల్లో పాల్గొన్న వారికి పూర్తిస్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు అందలేదన్న వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మునుపటి అనుభవాల నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయనుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడంతో ఎక్కడా ఎలాంటి సమస్యలు రాలేదని గుర్తించారు. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీన్ని పంచాయతీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. విజయవంతం కావడంతో దీన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి వివరాలన్నింటినీ ఆ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కంప్యూటరీకరిస్తారు. అధికారుల ప్రమేయం లేకుండా జిల్లాల వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు ఖరారవుతాయి. గతంలో వారు దరఖాస్తు చేసుకున్న తరవాత అధికారులు వాటిని పరిశీలించి ఆయా ప్రాంతాల నియోజకవర్గ ఎన్నికల అధికారికి దస్త్రాలను పంపేవారు. ఇకనుంచి అలాంటి అవస్థ ఉండదు. కంప్యూటరీకరించిందే తడవు పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల వివరాలు ఆయా నియోజకవర్గాల అధికారులకు చేరుతాయి. 
పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించేందుకు ముందుకొచ్చే విద్యార్థుల్లో అర్హులకు సైతం పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని తెలంగాణ ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియను లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ కోసం ఇంజినీరింగ్‌ విద్యార్థులను వినియోగించారు. వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించకపోవడంతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. వెబ్‌కాస్టింగ్‌కు ముందుకొచ్చే విద్యార్థుల వివరాలను నమోదు చేసుకుని వారికి ఎక్కడ విధులు కేటాయిస్తారో ఆయా నియోజకవర్గాల్లో ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 32,815 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వీటిల్లో పోలింగ్‌ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కొందరు పోలింగ్‌ సిబ్బందిపైనా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వ్యాజ్యాలు దాఖలైన సందర్భాల్లో వీడియో చిత్రీకరణ సాక్ష్యంగా ఉపకరిస్తుందన్న అభిప్రాయం అధికారుల్లో ఉంది. ప్రతి జిల్లాలోని పది శాతం పోలింగ్‌ కేంద్రాల ఎన్నికల ప్రక్రియను లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలని ఈసీ స్పష్టం చేసింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.