close

ప్ర‌త్యేక క‌థ‌నం

సాగుకు యంత్ర సాయం

రూ.వెయ్యి కోట్లతో వ్యవసాయ యంత్రాల పంపిణీ
   ఇందులో కేంద్రం నుంచి వచ్చేవి రూ. 240 కోట్లు
   మిగతావన్నీ రాష్ట్ర ప్రభుత్వమే మంజూరు చేయాలి
   వచ్చే ఖరీఫ్‌కల్లా రైతులకి ఇవ్వాలి
వ్యవసాయశాఖ ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: సాగు వ్యయం పెరగడం, కూలీల కొరత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రత్యామ్నాయంగా పెద్దఎత్తున యంత్రాలను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే జూన్‌లో ప్రారంభమయ్యే వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌ నుంచి వ్యవసాయ యంత్రాల పంపిణీ ప్రారంభించాలనేది లక్ష్యం. వరి నాట్లు యంత్రంద్వారా చేస్తే కూలీల ఖర్చు సగానికి సగం తగ్గి రైతుకు ఆదాయం పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.వెయ్యి కోట్లు మంజూరుచేయాలని కోరింది. మొత్తం మూడు రకాల పథకాల నుంచి నిధులు అడిగింది. రాష్ట్ర సాధారణ బడ్జెట్‌లో రూ.600 కోట్లు, కేంద్రం అమలుచేస్తున్న ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్కేవీవై)’ నుంచి రూ.100 కోట్లు, ‘వ్యవసాయ యాంత్రీకరణ సబ్‌ మిషన్‌ (ఎస్‌ఎంఏఎం)’ పథకం కింద రూ.300 కోట్లు కేటాయించాలి. ఆర్కేవీవై, ఎస్‌ఎంఏఎం పథకాలు కేంద్రం అమలు చేస్తున్నందున మొత్తం నిధుల్లో 60 శాతమే (రూ.240 కోట్లు) ఇస్తుంది. ఈ 60% రావాలంటే మిగతా 40% (రూ.160 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద వ్యవసాయశాఖకు విడుదల చేయాలి.

సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం
సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీలో ప్రాధాన్యమివ్వాలని ఎస్‌ఎంఏఎం పథకం కింద కేంద్రం ప్రకటించింది. గరిష్ఠంగా ఒక్కో సన్న, చిన్నకారు రైతుకు రూ.లక్షన్నర వరకూ యంత్రాల ధరలో రాయితీ ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖకు సూచించింది. రైతు ఒక్కడే యంత్రాలను కొనలేకపోతే అందరికీ ఉపయోగపడేలా ‘వ్యవసాయ యంత్రాల సేవా కేంద్రం (సీహెచ్‌సీ)’ ఏర్పాటుచేయాలి. ఒక్కో పంట సాగు ప్రారంభంలో దుక్కి, విత్తనాలు, నాట్లు వేయడం మొదలుపెడితే అంతిమంగా కోత, నూర్పిడి, మార్కెట్‌కు రవాణా చేసేవరకు ఉపయోగపడే అన్ని రకాల యంత్రాలనూ ఈ కేంద్రంలో ఉంచాలి. చెరకు పంట కోత యంత్రాల ధర రూ.కోటికి పైగా ఉంది. ఇలాంటి భారీ యంత్రాలను ఈ కేంద్రంలో ఉంచడానికి రైతులను సంఘంగా ఏర్పాటుచేసి బ్యాంకు నుంచి రుణం రూపేణా రైతుల వాటా ఇచ్చేలా చూడాలి. భారీయంత్రాల వ్యయంలో గరిష్ఠంగా 40% వరకు రాయితీ ఇస్తారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చెరకు రైతుల సంఘాల పేరుతో చక్కెర మిల్లులే వారి వాటాను చెల్లించి యంత్రాలు కొన్నాయి. దీనివల్ల యంత్రాలపై రైతులకు కాకుండా మిల్లుకు హక్కు ఉంటోంది. ఇలా కాకుండా రైతులే యజమానులుగా సీహెచ్‌సీల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.