close

ప్ర‌త్యేక క‌థ‌నం

వ్యూహాలకు పదును

ఆ ఏడు స్థానాలపై తెరాస ప్రత్యేక గురి
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కేసీఆర్‌
సమర్థులైన అభ్యర్థుల ఎంపికకు సన్నాహాలు
ఈనాడు - హైదరాబాద్‌

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాల గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న తెరాస ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వాటిలో భారీ మెజారిటీతో విజయం సాధించి, గులాబీ జెండాను ఎగరేయాలని భావిస్తోంది. నల్గొండ, ఖమ్మం, సికింద్రాబాద్‌, నాగర్‌కర్నూలు, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబాబాద్‌ నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. నల్గొండ, నాగర్‌కర్నూలు స్థానాల్లో కాంగ్రెస్‌; మల్కాజిగిరిలో తెదేపా, ఖమ్మంలో వైకాపా, సికింద్రాబాద్‌లో భాజపా గెలిచింది. అక్కడ గెలిచిన ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి (నల్గొండ), మల్లారెడ్డి (మల్కాజిగిరి), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఖమ్మం) తెరాసలో చేరారు. చేవెళ్ల నుంచి తెరాస తరఫున గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 2018లో కాంగ్రెస్‌లో చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల, నల్గొండ, మల్కాజిగిరి, నాగర్‌కర్నూలు, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తెరాస ముందంజలో నిలిచింది. ఖమ్మం, మహబూబాబాద్‌లలో మాత్రం వెనకబడింది. మహబూబాబాద్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినా ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓట్లు విపక్షానికంటే తక్కువ వచ్చాయి.

మేటి అభ్యర్థుల కోసం...
* చేవెళ్ల స్థానంలో ఆర్థికం బలంతోపాటు ఆది నుంచి తెరాసకు మద్దతుదారుగా ఉన్న రంజిత్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఆయన ఇద్దరు మంత్రులకు సన్నిహితులు. ఆ తర్వాత మాజీ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్‌ సభ్యురాలు సబితారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డిలు తెరాసలో చేరేందుకు ముందుకొచ్చారు. కార్తీక్‌ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. సబితారెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిల కుటుంబాలు ఒక్కటి కావడంవల్ల చేవెళ్ల పరిధిలోని బలమైన సామాజిక వర్గం ఐక్యంగా ఉండి తెరాసను గెలిపిస్తుందని సీఎం విశ్వసిస్తున్నారు.
* నల్గొండ స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, తేరా చిన్నపరెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌ పోటీని బట్టి అభ్యర్థిని బరిలో నిలపనుంది. అవసరమయితే రంజిత్‌రెడ్డిని కూడా తెరపైకి తేవాలని యోచిస్తోంది. కాంగ్రెస్‌ను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా జిల్లా నుంచి ఇప్పటికే నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పార్టీలో చేర్చుకుంది.
* ఖమ్మం స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. వైరా నుంచి గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యే రాములునాయక్‌ పార్టీలో చేరారు. పినపాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు, సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కూడా తెరాస తీర్థం పుచ్చుకునేందుకు ముందుకొచ్చారు. ఈ నియోజకవర్గ పరిధిలోని మరికొందరు కాంగ్రెస్‌ సభ్యులు కూడా తెరాసలో చేరనున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కేటీఆర్‌ మద్దతు ఉన్నా సీఎంకు అసంతృప్తి ఉంది. దీంతో ప్రత్యామ్నాయంగా పలువురు అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శ్రీనివాస్‌రెడ్డి చివరికంటా ప్రయత్నాలు చేస్తున్నారు.
* మహబూబాబాద్‌ నియోజకవర్గంలోనూ పాగా వేసేందుకు వీలుగా ఈ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హరిప్రియను తెరాసలో చేర్చుకున్నారు. ప్రస్తుత ఎంపీ సీతారాంనాయక్‌కు మళ్లీ టికెట్‌ ఇస్తామని సీఎం శాసనసభ ఎన్నికల ముందు ప్రకటించారు. ఎన్నికల్లో పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఓడిపోవడంతో సీఎం అసంతృప్తికి లోనయ్యారు. ప్రత్యామ్నాయంగా మాజీ ఎమ్మెల్యే కవిత, ప్రభుత్వ అధికారులైన పాండురంగనాయక్‌, రాంకిషన్‌రావుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. సీతారాంనాయక్‌ తనకే టికెట్‌ వస్తుందని దృఢమైన నమ్మకంతో ఉన్నారు.
* రాజధాని పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అత్యంత ప్రాధాన్యమైందిగా సీఎం భావిస్తున్నారు. వివిధ సమీకరణాల అనంతరం పార్టీ అభ్యర్థులుగా నవీన్‌రావు, బండి రమేశ్‌, రాజశేఖర్‌రెడ్డి పేర్లు నిలిచాయి. కాంగ్రెస్‌ నుంచి ముఖ్యనేతలుంటే రంజిత్‌రెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయించే వీలుంది. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.
* నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండటంతో ఈసారి ఆ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని సీఎం నిర్ణయించారు. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఒక్క కొల్లాపూర్‌ సెగ్మెంటు మినహా మిగతా ఆరు స్థానాల్లో తెరాస విజయం సాధించింది. కొల్లాపూర్‌ సెగ్మెంటులో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఓటమి ఎదురయిందనే భావనతో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. అనుభవజ్ఞుల అవసరం ఉందనే భావనతో మాజీ మంత్రి రాములును ఇక్కడ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను తెరాసలో చేర్పించే యత్నాలు జరుగుతున్నాయి.
* సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలో గెలుస్తామని తెరాస ఆత్మవిశ్వాసంతో ఉంది. మంత్రి తలసాని తన కుమారుడు సాయికిరణ్‌ను గెలిపించే బాధ్యతను మోస్తానని అధిష్ఠానానికి చెప్పడంతో కిరణ్‌ పేరు ముందు వరుసలో పరిశీలనలో ఉంది. మేయరు రామ్మోహన్‌ భార్య శ్రీదేవియాదవ్‌ పేరు బీసీ మహిళా కోటా కింద ప్రతిపాదించారు. తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి రమేశ్‌ సైతం బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తెరాస ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇక్కడ ఎన్నికల సభను నిర్వహించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.