close

ప్ర‌త్యేక క‌థ‌నం

దేశానికి దిక్సూచి కేసీఆర్‌

ఆయన ఆలోచనలతోనే జాతీయ కార్యాచరణ
పాతచింతకాయ పచ్చడి రాజకీయాలుండవు
తెలంగాణలో తెరాస విజయం ఏకపక్షమే
ఏపీ రాజకీయాల్లో మా పాత్రేమీ ఉండదు
ప్రజలే బాబును సాగనంపే ఆలోచనలో ఉన్నారు
పార్టీ మార్పిడులు సహజమే
కాంగ్రెస్‌ ఆత్మ విమర్శ చేసుకోవాలి
ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్‌

కాంగ్రెస్‌, భాజపాలకు దక్షిణాదిలో ఉన్న బలమేంటి? భాజపాకు కర్ణాటకలో, కాంగ్రెస్‌కు కేరళ, కర్ణాటకలలో తప్పితే మిగిలిన చోట్ల బలం అంతంత మాత్రమే. యూపీలో కాంగ్రెస్‌ తోక పార్టీగా మారిపోయింది. జాతీయ పార్టీలుగా చెప్పుకునే సీపీఐ, సీపీఎంల కంటే మాకే ఎక్కువ స్థానాలు వస్తాయి.
* కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడుస్తుంది. మేమంతా సైనికుల్లా పనిచేస్తాం. గతంలో మాదిరే ఈ ఎన్నికల్లోనూ ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తారు. ఈసారి యావత్‌దేశం తెలంగాణ వైపు చూస్తోంది. దీనికి అనుగుణంగా పార్టీని ఆయన సర్వసన్నద్ధం చేశారు. ఇప్పుడు దేశానికి ఆయనే దిక్సూచి.

మిగిలిన పార్టీల కంటే తెరాసకే ఎక్కువ జాతీయ భావాలున్నాయి. జాతీయ భావం, విశాలమైన దృక్పథం, జాతి ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలు నెరవేర్చడమే మా లక్ష్యమని కేసీఆర్‌ ప్లీనరీలో చెప్పారు. పుల్వామా దాడి జరిగితే మేం రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా మానుకున్నాం. ఆ సమయంలో మోదీ ఎన్నికల ప్రచారం చేయగా, రాహుల్‌గాంధీ ఆయన మీద మాటల దాడి చేశారు. ఇద్దరూ ఉగ్రవాదుల దాడిని రాజకీయం చేశారు.

ఈనాడు - హైదరాబాద్‌

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి ఏకపక్ష విజయం సాధిస్తుందని, 16 స్థానాల్లోనూ సత్తా చాటుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. గడచిన అయిదేళ్లలో తెలంగాణకు ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. దిల్లీని శాసిద్దాం... మన హక్కులను, ప్రయోజనాలను సాధించుకుందామనే నినాదంతో రాష్ట్ర ప్రజలందరిని ఏకం చేస్తామని చెప్పారు. పాతచింతకాయ పచ్చడి రాజకీయాలకు చరమగీతం పాడుతూ జాతీయ యవనికపై తెరాస ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. రైతుబంధు లాంటి పథకాల రూపకర్త కేసీఆర్‌ ఆలోచనలు జాతీయ స్థాయి కార్యాచరణగా మారనున్నాయని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని శనివారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

నాలుగు నెలల వ్యవధిలోనే రెండుసార్లు ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. తెరాస సన్నద్ధత ఎలా ఉంది?
కేటీఆర్‌: శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే మేం పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించాం. ఇప్పుడు మేం సంపూర్ణంగా, సన్నద్ధంగా ఉన్నాం. మా శ్రేణులను సమాయత్తం చేశాం. సీఓటర్‌ నిర్వహించిన సర్వేలో మొత్తం 17 స్థానాల్లో తెరాస 16, మా మిత్రపక్షం మజ్లిస్‌ ఒక స్థానం గెలుస్తుందని తేలింది. పార్టీ కార్యకర్తలను సిద్ధం చేసేందుకు సన్నాహక సమావేశాలు చేపట్టాం. ఇప్పటికి పది పూర్తి చేశాం. ఈ పదింటితో వీటిని ముగిస్తున్నాం. ఆదివారం నుంచి సీఎం కేసీఆర్‌ సభలు ప్రారంభవుతున్నాయి. వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం.

ఈ రెండు ఎన్నికలపై మీ విశ్లేషణ ఏమిటి?
శాసనసభ ఎన్నికల్లో ప్రజలు 50 శాతం ఓట్లు, 75 శాతం సీట్లతో మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అందులో తెరాస నిర్వహించనున్న కీలకపాత్రను ఈ ఎన్నికలు నిర్దేశించబోతున్నాయి. ఈ అయిదేళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజలు ఆలోచించుకోవాలి. మనం నిర్ణయాత్మకంగా ఉండాలంటే... గుణాత్మక మార్పు రావాలంటే..  ఎన్డీయే, యూపీయేలకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే మనం 16 స్థానాలను గెలవాలని ప్రజలకు చెప్పబోతున్నాం.

శాసనసభ ఎన్నికలు రాష్ట్ర కోణంలో జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు జాతీయ అంశాలతో ముడిపడి ఉంటాయి కదా?
రాష్ట్ర అంశాలు, జాతీయ అంశాలు అంటూ వేర్వేరుగా ఉంటాయని అనుకోవడం లేదు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం పురోగమిస్తుంది. వ్యవసాయం, విద్య, వైద్యం వంటివి ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఉమ్మడి జాబితా అవసరమే లేదని సీఎం చెప్పారు. వాస్తవానికి రాష్ట్రాల్లోని పథకాలను పర్యవేక్షించడానికి కేంద్రానికి వ్యవస్థే లేదు. అయినా పథకాలు కొనసాగించడం సరికాదు.

విభజన చట్టం అమలులో కేంద్రం వైఖరిని ఎలా చూస్తున్నారు?
విభజన చట్టం అమలు పూర్తిగా నిరాశాజనకమే. ఒక్క హైకోర్టు మినహా మిగిలినవి ఏమీ కాలేదు. పారిశ్రామిక  ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. తొమ్మిదో, పదోషెడ్యూళ్లపైనా కప్పదాటు వ్యవహారమే కనిపించింది.

ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నారు?
గత ఎన్నికల్లో మాకు నేరుగా 49 శాతం ఓట్లు వచ్చాయి. కారును పోలిన ట్రక్కుకు 2 లక్షల ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే మేం మరింత బలోపేతమయ్యాం. దూరమయిన వర్గాలు దగ్గరవుతున్నాయి. తెరాస పథకాలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది. కొంత మంది ఇతర పార్టీల శాసనసభ్యులు, నాయకులు చేరుతున్నారు. ఓటింగు పెరిగితే మెజారిటీ పెరుగుతుందని భావిస్తున్నాం. ఒక్కోసారి ఓట్లతో సంబంధం లేకుండా కూడా మెజారిటీ పెరుగుతుంది. వరంగల్‌లో కడియం రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇదే జరిగింది.

విపక్షాల నుంచి పోటీ ఎలా ఉంటుంది?
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మా ప్రధాన ప్రత్యర్థిగా అనుకుంటున్నాం. కానీ కాంగ్రెస్‌లో జోష్‌ లేదని ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నారు. జాతీయ స్థాయి నాయకులు, సీనియర్లు తప్పించుకు తిరుగుతున్నారు. పోటీకి దిగక తప్పని పరిస్థితుల్లో వారు వస్తే మా బలమేంటో చూపిస్తాం.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఏయే అంశాలు ప్రామాణికమవుతున్నాయి?
పార్టీకి విధేయత, సేవా గుణం, ప్రజలకు అందుబాటులో ఉండడం, సామాజిక సమీకరణాలు.. ఇలా అన్ని కలబోతగా నిర్ణయాలుంటాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బట్టి కూడా నిర్ణయాలుంటాయి.

పార్టీ శ్రేణులకు ప్రాధాన్యంపై మీ ఆలోచనలేమిటి?
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కారణాల వల్ల కార్యకర్తలకు పదవులు దక్కలేదు. ఇప్పుడు వారికి పూర్తిగా న్యాయం జరుగుతుంది. మేలో ఎన్నికలు ముగిసిన తర్వాత సమర్థులు, విధేయులు, క్రమశిక్షణ గల వారికి పదవులు లభిస్తాయి. ఎక్కడెక్కడయితే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి టికెట్లు పొందలేకపోయారో వారికి కార్పొరేషన్లు ఇతర బాధ్యతలను అప్పజెబుతాం.

మంత్రులకు పార్టీ పరంగా ఎలాంటి బాధ్యతలను అప్పగించారు?
ప్రభుత్వ పరంగా ఉండే మంత్రులు, పార్టీ పరంగా ప్రధాన కార్యదర్శులు... ఇద్దరు సమన్వయంతో పనిచేయాలని సీఎం బాధ్యతలు అప్పగించారు. కొత్తగా వచ్చిన శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌,, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్‌రెడ్డి వంటి వారు తమ సత్తా చాటుకోవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు.

కేసీఆర్‌ ప్రచారం ఎలా సాగబోతోంది?
సీఎం కేసీఆర్‌వి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కో సభ చొప్పున మొత్తం 16 సభలు అనుకుంటున్నాం. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలాంటి చోట రెండేసి ఉంటాయి. గత ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ల్లో సభలు పెట్టలేదు. ఈసారి ఉంటాయి. మొత్తంగా 50 లక్షల నుంచి 60 లక్షల మందిని సభల్లో సీఎం కలుస్తారు. ఎలక్ట్రానిక్‌, సామాజిక మాధ్యమాలను సమర్థంగా వాడుకుంటాం. నా ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా సాగుతుంది.

కేంద్రంలో కేసీఆర్‌ కీలక పదవుల్లోకి వెళ్తారనే ప్రచారంపై మీరేమంటారు?
ప్రధాని, ఉప ప్రధాని అనే ప్రచారాలు ఊహాగానాలే. కేసీఆర్‌ తెలంగాణపై పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి పనిచేస్తున్నారు. తెలంగాణ సీఎంగా ఆయన ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. మరో పదేళ్ల పాటు సీఎంగా ఉంటూ తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా మరింత ముందుకు తీసుకెళ్లడం అవసరం. హైదరాబాద్‌ కేంద్రంగా ఉంటూ దిల్లీని ప్రభావితం చేయొచ్చు. కేంద్రంలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తారు.

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నాలుగు నెలలుగా పనిచేస్తున్నారు. పదవీ నిర్వహణ ఎలా ఉంది?
ఇప్పటి వరకు కొంత మేర సంతృప్తితోనే ఉన్నా. ఇప్పుడంతా ఎన్నికల సమయం. పంచాయతీ ఎన్నికల్లో మేం ఆధిక్యం పొందినా అవి పార్టీ రహితం. పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన ఉంటాయి. పార్టీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత సభ్యత్వ నమోదు జరగాలి. మే చివరి కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తయితే జూన్‌ నుంచి సంస్థాగత శిక్షణ కార్యక్రమం ఉంటుంది. తెరాసను సుశిక్షుతులైన కార్యకర్తలతో దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.

సమాఖ్య కూటమి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
రేపటి రోజున తెరాస ఎజెండా దేశవ్యాప్తంగా అమలయ్యే పరిస్థితి వస్తుంది. కేసీఆర్‌ ఆలోచన, కార్యదక్షత, ఆయన విధాన రూపకల్పన జాతి ప్రయోజనాలకు అవసరం.

మీ ప్రధాని అభ్యర్థి ఎవరని విపక్షాలు అడుగుతున్నాయి..?
దేశ రాజకీయ పరిస్థితి గమనిస్తే ఎన్డీయేకి 110 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. యూపీయేకి వాటి కంటే తక్కువే వస్తాయి. రెండు పార్టీలు కలిసినా అధికారానికి చేరువ కాలేవు. వాటికంటే ప్రాంతీయ పక్షాలు దేశంలో బలంగా ఉన్నాయి. టీఎంసీ, బిజూ జనతాదళ్‌, తెరాస, వైకాపా, ఎస్పీ, బీఎస్పీలు కలిస్తే 100 నుంచి 150 స్థానాలు వీటికే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగురవేయాలనేది మనమే నిర్ణయించవచ్చు. ప్రధాని అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారు. వీరే ఉండాలని చెప్పడం ప్రజాస్వామ్య విధానమే కాదు.

ఏపీ రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు? దీని వల్ల ప్రయోజనాలేమిటి?
అక్కడి రాజకీయాల్లో మా పాత్ర ఏమీ లేదు. తెరాసకు ఒక పార్టీగా ఏపీలో వేలుపెట్టాల్సిన అవసరం, పరిస్థితి, ఆసక్తి లేదు. తెదేపా, వైకాపా, జనసేనలతో ఏపీలో త్రిముఖ పోటీ ఉంది. ఆ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబును సాగనంపే ఆలోచనలో ఉన్నారు. ఎవరైనా అయిదేళ్లు సీఎంగా పనిచేసి ఉంటే తాను చేసింది చెప్పాలి. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పాలి. పాజిటివ్‌ ఓటు కోసం యత్నించాలి. మేం శాసనసభ ఎన్నికల్లో అదే చేశాం. చంద్రబాబుది నెగెటివ్‌ మనస్తత్వం. ప్రజలను గోల్‌మాల్‌ చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారు. మేం ఏపీ ప్రజలు, తెలంగాణ ప్రజలు అని ఎక్కడా వేర్వేరుగా చూడలేదు. వారి ప్రయోజనాల విషయంలో ఏనాడూ ఆటంకాలు కల్పించలేదు. అందరు బాగుండాలనుకున్నాం. చంద్రబాబు గత ఎన్నికల సమయంలో సీమాంధ్రప్రజలను రెచ్చగొట్టి తెరాసను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు మాత్రం ఆయనను తిప్పి కొట్టారు. ఇప్పుడు ఎవరిని గెలిపించాలనేది ప్రజల నిర్ణయం. చంద్రబాబు ఇప్పుడు నైరాశ్యంతో  మాట్లాడుతున్నారు. రోజూ నిర్వహించే టెలికాన్ఫరెన్స్‌లో ఎన్టీఆర్‌ కంటే కేసీఆర్‌ పేరు ఎక్కువగా జపం చేస్తున్నారు.

ఎన్నికల్లో మీకు పూర్తి మెజారిటీ వచ్చింది. ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం ఎందుకని విపక్షాలు విమర్శిస్తున్నాయి దీనికి మీ సమాధానం?
శాసనసభ్యుల పార్టీ మార్పు అనేది సహజం. 2004లో కాంగ్రెస్‌ ఏం చేసిందో చెప్పాలి. శాసనసభ ఎన్నికల సమయంలో మా పార్టీకి చెందిన ఎంపీ, నలుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ చేర్చుకుంది. అప్పుడు ఈ జ్ఞానం ఏమైంది. నైతిక విలువలు ఎటు పోయాయి? మా పార్టీలో చేరుతున్న వారు అవసరమయితే తమ పదవులకు రాజీనామా చేస్తామని, తెరాస తరఫున పోటీ చేస్తామని చెప్పిన తర్వాత దీనిపై చర్చే అవసరం లేదు. కాంగ్రెస్‌ సుద్దులు చెప్పడం మాని ఆత్మవిమర్శ చేసుకోవాలి.

కేంద్రం నుంచి ఎన్ని చేదు అనుభవాలో..

కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది, ఒనగూరింది ఏమీ లేదు. ఎన్నో అంశాల్లో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కేంద్రంలో 2014లో నరేంద్ర మోదీకి ఏకపక్షమైన మెజారిటీ వచ్చింది. ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వాన్ని నడిపారు. తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి పెద్దగా ఓట్లు లేవు. ఒకటే ఎంపీ సీటు వచ్చింది. రాజకీయంగా ఎదిగే అవకాశం లేదనే అంచనాకు వచ్చి తెలంగాణను పట్టించుకోలేదు. 
* యూపీయే ప్రభుత్వం దిగిపోయే సమయంలో ఐటీఐఆర్‌ను మంజూరు చేయగా... దానిని ఎన్డీయే పక్కనబెట్టింది. మేం ఇరవైసార్లు అడిగినా పట్టించుకోలేదు. 
* బయ్యారం ఉక్కు కర్మాగారం అతీగతి లేదు. 
* మిషన్‌ కాకతీయ, భగీరథలకు రూ.24 వేల కోట్లను ఇవ్వాలనే నీతి ఆయోగ్‌ సిఫార్సులను ఖాతరు చేయలేదు. 
* పోలవరం మాదిరే కాళేశ్వరానికి, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా కోసం పలు మార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారు. 
* ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎం, ఎన్‌ఐడీ వంటి ఉన్నత విద్యా సంస్థలను ఇవ్వాలని కోరాం.
* హైస్పీడ్‌ రైలు కారిడార్లలో హైదరాబాద్‌కు స్థానం లేదు. 
* దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి అవమానకరంగా తొలగించింది. రాష్ట్రం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వలేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.