close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఒకే ఒరలో రెండు కత్తులు..ఇమిడాయ్‌!

తరతరాల కక్షలు మరిచి తెదేపాలోకి.. 
చేయీ చేయీ కలిపి ప్రచారం.. 
విభేదాలు విస్మరించి ఒకే జెండా కిందకు 
ఏపీలో సరికొత్త రాజకీయం ఆవిష్కృతం 
జె.కల్యాణ్‌బాబు, జి.వి.వి.సత్యనారాయణరెడ్డి 
ఈనాడు - అమరావతి, విజయనగరం

రాజకీయ వైరుధ్యం.. కుటుంబ తగాదాలు.. దశాబ్దాల వైరం పక్కకు జరిగాయి.. ఉప్పూ-నిప్పులా కొనసాగిన కుటుంబాల నేతలు ఒకేగూటి పక్షులయ్యారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న నానుడి.. నిజం కాదని నిరూపిస్తూ ఒకే గొడుగు కిందకు చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా, వ్యక్తిగతంగా కక్షలతో రగిలిపోయిన వారిని తెదేపాలోకి    తీసుకురావడంలో పార్టీ నాయకత్వం చతురత చూపించింది. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కలసి ప్రచారం చేస్తారని.. విజయనగరం జిల్లాలో కిశోర్‌చంద్రదేవ్‌, విజయరామరాజు ఒకే వేదికపైకి వస్తారని, చిరకాల రాజకీయ ప్రత్యర్థులైన నారా, నల్లారి కుటుంబాలు చేతులు కలుపుతాయని, దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా వారసులు ఒకే పార్టీలో చేరతారని, ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలసి పనిచేస్తారని  ఎవరూ ఊహించి ఉండరు. ఈ ఎన్నికల్లో అది సాధ్యమైంది.

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి..  చేతులు కలిపారు

డప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. వీరు ఒకే పార్టీలోకి వస్తారని కొన్ని రోజుల క్రితం వరకు ఎవరూ ఊహించలేదు. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ గొడవలతో మొదలైన వైరం.. ఆ తర్వాత రాజకీయంగానూ కొనసాగింది. రామసుబ్బారెడ్డి కుటుంబం  తెదేపా ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉంది. ఆదినారాయణరెడ్డి కుటుంబం కాంగ్రెస్‌లో ఉండేది. తర్వాత వైకాపాలోకి వెళ్లింది. ఆదినారాయణరెడ్డి తండ్రి సుబ్బిరామిరెడ్డి, చిన్నాన్న శంకర్‌రెడ్డి ఒక వర్గానికి, రామసుబ్బారెడ్డి పెదనాన్న శివారెడ్డి మరో వర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. ఈ వర్గాల మధ్య జరిగిన గొడవలు పలు హత్యలకు దారితీశాయి. సుబ్బిరామిరెడ్డి, శంకర్‌రెడ్డి, శివారెడ్డి.. ఫ్యాక్షన్‌ దాడుల్లోనే చనిపోయారు. శివారెడ్డి చనిపోయాక రామసుబ్బారెడ్డి 1994లో తెదేపా అభ్యర్థిగా జమ్మలమడుగు నుంచి పోటీ చేయగా, ఆదినారాయణరెడ్డి అన్న సి.నారాయణరెడ్డి కాంగ్రెస్‌ తరపున పోటీ చేశారు. 1994, 1999 ఎన్నికల్లో నారాయణరెడ్డిపై రామసుబ్బారెడ్డి గెలుపొందారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిపై ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. మొదటి రెండుసార్లు కాంగ్రెస్‌, 2014లో వైకాపా నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డి తెదేపాలో చేరి మంత్రి అయ్యారు. రామసుబ్బారెడ్డిని ఒప్పించి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు తెదేపాలో చేర్చుకున్నారు. ప్రస్తుతం తెదేపా తరఫున కడప ఎంపీ స్థానం నుంచి ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి బరిలో నిలిచారు.

కోట్ల, కేఈ..  ఒకే వేదికపైకి

ర్నూలు జిల్లా రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులైన కోట్ల, కేఈ కుటుంబాలు మొదటిసారి చేతులు కలిపాయి.. సూర్యప్రకాశ్‌రెడ్డి తండ్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్న  కాలం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం తీవ్రంగా నడిచింది. వారిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా... ప్రత్యర్థులుగా కొనసాగేవారు. తెదేపా ఆవిర్భావం వరకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మాదన్న కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఆ తర్వాత కేఈ వర్గం తెదేపాలోకి వచ్చి.. మళ్లీ కాంగ్రెస్‌లోకి.. ఆ తర్వాత తెదేపాలో చేరింది. మొదట్నుంచి కాంగ్రెస్‌లో కోట్ల వర్గం ఉంది. తాజాగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం సహా తెదేపాలో చేరారు. ఒకప్పుడు పరస్పరం ఎదురుపడేందుకూ ఇష్టపడని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కలిసి ప్రచారం సాగిస్తున్నారు.

నారా, నల్లారి.. విభేదాలు వీడి

చిత్తూరు జిల్లాలో నాలుగు దశాబ్దాల రాజకీయ విభేదాల్ని పక్కనబెట్టి నారా, నల్లారి కుటుంబాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ నేత నల్లారి అమరనాథ్‌రెడ్డికి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలు నడిపారు చంద్రబాబు. ఇప్పుడు అదే అమరనాథ్‌రెడ్డి కుమారుడు కిశోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇచ్చారు. 1978లో కాంగ్రెస్‌(ఐ) తరఫున చంద్రగిరి నుంచి చంద్రబాబు, వాయల్పాడు నుంచి అమరనాథ్‌రెడ్డి విజయం సాధించారు. అమరనాథ్‌రెడ్డి, చంద్రబాబు ఒకే పార్టీలో ఉన్నా.. వేర్వేరు వర్గాలకు నాయకత్వం వహించేవారు. అమరనాథ్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి నుంచి చంద్రబాబు రాజకీయ సలహాలు తీసుకునేవారు. అప్పట్లో జిల్లాపరిషత్‌ ఎన్నికలు జరగ్గా.. అమరనాథ్‌రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని పీలేరు నియోజకవర్గంలోని ఓ పీహెచ్‌సీ వైద్యురాలుగా ఉన్న కుతూహలమ్మను జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలిని చేయడంలో చంద్రబాబు చక్రం తిప్పారు. అప్పట్నుంచి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రబాబు మధ్య రాజకీయ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇరు కుటుంబాల మధ్య రాజకీయ వైరాన్ని పెంచాయి. చాలా విషయాల్లో వారి మధ్య సంవాదం జరిగేది. కొన్ని నెలల కిందట కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి తెదేపాలో చేరగా ఆయనకు పీలేరు టిక్కెట్‌ను చంద్రబాబు ఖరారు చేశారు.

రాజులంతా  దేశంలోకి..

విజయనగరం జిల్లాలో కొన్ని శతాబ్దాలుగా శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులైన విజయనగరం, బొబ్బిలి రాజులు.. మరోపక్క కురుపాం, మేరంగి రాజులు ఇప్పుడు తెదేపాలో ఉన్నారు. 1757లో విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య జరిగిన ‘బొబ్బిలి యుద్ధం’ నుంచి వారు వైరివర్గాలుగానే కొనసాగుతున్నారు. అశోక్‌గజపతిరాజు తండ్రి పి.వి.జి.రాజు 1950 నుంచి 1980 వరకు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. అశోక్‌గజపతిరాజు 1978లో జనతా పార్టీ తరఫున విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1982లో తెదేపాలో చేరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి సుజయకృష్ణ రంగారావు బొబ్బిలి సంస్థానం వారసుడు. ఆయన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌, 2014లో వైకాపా నుంచి గెలిచారు. తెదేపాలో చేరి మంత్రి అయ్యారు. ప్రస్తుతం అశోక్‌ గజపతిరాజు, సుజయకృష్ణరంగారావు సన్నిహితంగా పనిచేస్తున్నారు. కురుపాం సంస్థానాధీసులైన శత్రుచర్ల కుటుంబానికి, మేరంగి సంస్థానాధీశులైన వైరిచర్ల కుటుంబానికి తీవ్ర విభేదాలుండేవి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉండి, కేంద్ర మంత్రిగా పనిచేసిన కిశోర్‌చంద్రదేవ్‌ ఇటీవలే తెదేపాలో చేరారు. మరోపక్క మాజీ మంత్రి విజయరామరాజు 2014లో తెదేపాలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకోవడం, కలసి ప్రచారం చేస్తుండటం విశేషం.

పార్టీలో చేరి..  ఎన్నికల్లో బిజీ

ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహించేవారు. వీరిద్దరూ ఒకరు ఒక పార్టీలో ఉంటే, మరొకరు మరో పార్టీలో ఉండేవారు. ఒకరు తెదేపాలోకి వెళితే, మరొకరు కాంగ్రెస్‌లోకి వచ్చేవారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలూ తెదేపాలోనే ఉన్నాయి. కరణం బలరాం చీరాల నుంచి, గొట్టిపాటి హనుమంతరావు సోదరుడి కుమారుడు గొట్టిపాటి రవికుమార్‌ అద్దంకి నుంచి తెదేపా అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కరణం బలరాం, గొట్టిపాటి రవి రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్నారు.

వంగవీటి, దేవినేని పసుపు గూటికి..

విజయవాడలో కొన్ని దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న వంగవీటి, దేవినేని కుటుంబాలు ఇప్పుడు తెదేపాలోకి వచ్చాయి. గతంలో వంగవీటి రంగా కాంగ్రెస్‌లో ఉండేవారు. దేవినేని నెహ్రూ మొదట్లో తెదేపా.. తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి.. తిరిగి తెదేపాలోకి వచ్చారు. ఇటీవలే నెహ్రూ మరణించారు. ప్రస్తుతం రంగా, నెహ్రూ వారసులిద్దరూ తెదేపాలోనే ఉన్నారు. రంగా కుమారుడు రాధాకృష్ణ మొదట కాంగ్రెస్‌లోనూ.. తర్వాత ప్రజారాజ్యం, వైకాపాలో కొనసాగి వారం కిందట తెదేపా గూటికి వచ్చారు. మరోవైపు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గుడివాడ నుంచి పోటీ చేయనున్నారు.

అనంతలో ఆసక్తికరం

నంతపురం జిల్లాలో పరిటాల రవి, జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాల మధ్య తీవ్ర రాజకీయ వైరుధ్యాలు ఉండేవి. రవి కుటుంబం మొదట్నుంచి తెదేపాలోనే ఉంది. ఆయన చనిపోయిన తర్వాత.. సతీమణి సునీత రాప్తాడు నుంచి గెలిచారు. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జేసీ కుటుంబం తెదేపాలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం లోక్‌సభ స్థానానికి, ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పటికి పరిటాల, జేసీ కుటుంబాల మధ్య అంత సయోధ్య లేకపోయినా... రాజకీయంగా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.