close

ప్ర‌త్యేక క‌థ‌నం

కొలువులు వదలి... పోటీకి సై.. పార్టీలకు జై

ఎన్నికల బరిలో విశ్రాంత ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు
ప్రధాన పార్టీల అభ్యర్థులుగా రంగంలోకి
ఈనాడు - అమరావతి

వారంతా ఉన్నత స్థాయి కొలువుల్లో... వివిధ హోదాల్లో... ప్రభుత్వ పాలనలో, బోధనలో తమదైన ముద్ర వేసిన అధికారులు, ఉపాధ్యాయులు వారంతా.  రాజకీయాల్లో చేరి... ప్రజా ప్రతినిధులై ప్రజలతో మమేకమై... ప్రత్యక్షంగా సేవలు అందించాలని భావించారు. అనుకున్నదే తడవుగా భద్రమైన ఉద్యోగాల్ని వదిలేసి... రాజకీయాల్లో అడుగు పెట్టేశారు. ఎన్నికల బరిలో నిలిచి విజయ పతాక ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు ఎక్కువ మంది ఐఆర్‌ఎస్‌ అధికారులు బరిలో నిలుస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు... ఎవరు అవకాశం కల్పిస్తే వారి తరఫున పోటీకి సై అంటున్నారు. వీరిలో కొందరు విశ్రాంత అధికారులూ ఉన్నారు. మరికొందరు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీల్లో టికెట్ల కోసం తెరవెనుక ప్రయత్నాలు సాగించారు. కొందరు మాజీ అధికారులు ఇప్పటికే రెండు, మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం సాధించారు.

జనసేన...

* మెట్ట రామారావు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి.

* అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి చింతల పార్థసారథి బరిలో ఉన్నారు. ఈయన గతంలో ఐఆర్‌ఎస్‌ అధికారి.

* అమలాపురం నుంచి పోటీ చేస్తున్న డీఎంఆర్‌ శేఖర్‌ ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేశారు.

* గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తోట చంద్రశేఖర్‌ మహారాష్ట్ర క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం తరఫున, 2014లో వైకాపా తరఫున లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

* ఎ.భరత్‌ భూషణ్‌ ఇండియన్‌ రైల్వే సర్వీసు అధికారి. పదవీ విరమణ చేసి జనసేనలో చేరారు. వేమూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు.

* మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఇండియన్‌ రైల్వే సర్వీసు అధికారిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జనసేనలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా రెండోసారి బరిలో నిలుస్తున్నారు.


తెదేపా...

* బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీరామ్‌ మాల్యాద్రి ఐఆర్‌ఎస్‌ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని, 2007లో తెదేపాలో చేరారు. 2009లో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. 2014లో అదే స్థానం నుంచి గెలిచారు.

* తాడికొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2009లో ఓటమి చవిచూసిన ఆయన 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

* ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్న కె.ఎస్‌.జవహర్‌ గతంలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈసారి కృష్ణా జిల్లా తిరువూరు నుంచి బరిలో నిలిచారు.

* వంగలపూడి అనిత గతంలో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ పడుతున్నారు.


వైకాపా...

* సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరిన తొగురు ఆర్థర్‌ పదోన్నతులతో ఎస్పీ స్థాయికి చేరుకున్నారు. పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లో చేరారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు.
* చంద్రగిరి ఏసురత్నం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు (ప్రత్యేక భద్రత దళం)లో డీఐజీగా పనిచేసి పదవీ విరమణ చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు.
* ఉన్నమట్ల ఎలీజా ఐఆర్‌ఎస్‌ అధికారిగా పని చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
* విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నుంచి పోటీ చేస్తున్న గొల్ల బాబూరావు గతంలో జిల్లా పరిషత్‌ సీఈవోగా పనిచేశారు.
* తలారి రంగయ్య డీఆర్‌డీఏ పీడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
* గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న డాక్టర్‌ వి.వరప్రసాద్‌ తమిళనాడు క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి. 2014లో తిరుపతి ఎంపీగా గెలుపొందారు.
* గోరంట్ల మాధవ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆయన హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు.


బి.రామాంజనేయులు
విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. కలెక్టర్‌గా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిగా పని చేశారు.  ఈ ఎన్నికల్లో కర్నూలు జిల్లా కోడుమూరు తెదేపా అభ్యర్థి.

మాండ్ర శివానందరెడ్డి
పోలీసు శాఖలో ఉన్నత హోదాల్లో పనిచేశారు. నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి తెదేపా అభ్యర్థి.

వి.వి.లక్ష్మీనారాయణ
మాజీ ఐపీఎస్‌ అధికారి. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.

చంద్రమౌళి
విశ్రాంత ఐఏఎస్‌ అధికారి.
2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా కుప్పం నుంచి  చంద్రబాబుతో తలపడ్డారు. ఈసారీ అక్కడే పోటీకి దిగుతున్నారు.

మహ్మద్‌ ఇక్బాల్‌
మాజీ ఐపీఎస్‌ అధికారి. హిందూపురం అసెంబ్లీ స్థానానికి వైకాపా  అభ్యర్థి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.