close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆడ్వాణీ ఆలోచనేమిటి?

కమలం కురువృద్ధుడు పోటీ చేస్తారా?
కొనసాగుతున్న ఉత్కంఠ
అహ్మదాబాద్‌

భాజపా కురువృద్ధుడు ఎల్‌.కె.ఆడ్వాణీ ఈసారి పోటీకి దిగుతారా? అస్త్రశస్త్రాలు పక్కన పెడతారా? ఆసక్తిగొలుపుతున్న ఈ అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. దీనిపై ఆయన వైపు నుంచి గానీ, పార్టీ వైపు నుంచి గానీ ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దేశానికి ఉప ప్రధానిగాను, హోంమంత్రిగాను పనిచేసిన ఈ 91 ఏళ్ల దిగ్గజ నేత గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి 6 సార్లు విజయం సాధించారు. 1984 ఎన్నికల్లో కేవలం 2 లోక్‌సభ స్థానాలకు పరిమితమైన భాజపాను అనంతర కాలంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఆయనది. వయసురీత్యా ఈసారి ఆడ్వాణీ ఎన్నికల బరిలోకి దిగుతారా? గాంధీనగర్‌ నుంచి పోటీ చేస్తారా? వంటి ప్రశ్నలకు ఆయన వ్యక్తిగత కార్యదర్శి దీపక్‌ చోప్రా జవాబిచ్చారు. ‘‘అడ్వాణీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. ఇంతవరకు పార్టీ ఆయనను గానీ, ఆయన పార్టీని గానీ సంప్రదించలేదు. ఆయన స్థాయికి తనంతతానుగా గాంధీనగర్‌ నుంచి పోటీచేస్తానని ప్రతిపాదించాల్సిన అవసరం లేదు.’’ అని తెలిపారు. అయితే అభ్యర్థులకు వయసు నియమమేదీ లేదని, గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆడ్వాణీ ఈసారి బరిలోకి దిగకూడదని తనకుతానే నిర్ణయం తీసుకోవచ్చని గుజరాత్‌ భాజపా నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆడ్వాణీ పోటీచేసే విషయమై పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని గుజరాత్‌ భాజపా అధికార ప్రతినిధి భరత్‌ పాండ్యా తెలిపారు. మరోవైపు గాంధీనగర్‌ నుంచి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వంటి జాతీయ నేత పోటీ చేయాలని పార్టీలోని ఓ వర్గం డిమాండ్‌ చేస్తున్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో స్థానిక నేతలెవరూ గాంధీనగర్‌ సీటు నుంచి పోటీ చేసేందుకు తమ వ్యక్తిగత వివరాలు సమర్పించలేదని పార్టీ అబ్జర్వర్‌ నిమాబెన్‌ ఆచార్య తెలిపారు.

కమలనాథుడు

యోధ్యలో రామమందిరం నిర్మాణానికి మద్దతుగా 1992లో జరిపిన రథయాత్ర ద్వారా భారత రాజకీయాల్లో ఆడ్వాణీ కీలక మార్పును తీసుకురావడమే కాకుండా కమల వికాసంలోనూ ముఖ్యపాత్ర పోషించారు. 1991లో గాంధీనగర్‌ నుంచి తొలిసారి బరిలోకి దిగిన ఆడ్వాణీ అప్పటి నుంచి 1998, 1999, 2004, 2009, 2014ల్లో విజయం సాధించారు. బాబ్రీ మసీదు కేసు ఉండటంతో 1996లో ఆయన పోటీకి దూరంగా ఉండగా.. అప్పట్లో మాజీ ప్రధాని అటల్‌ బిహార్‌ వాజ్‌పేయీ ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. 2009లో ఆడ్వాణీని పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ అప్పట్లో పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే 2014లో నరేంద్ర మోదీని పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించగా ఆడ్వాణీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భాజపా అధికారంలోకి రాగా ఆయనకు ‘మార్గదర్శక మండలి’ సభ్యుడి పదవిని కట్టబెట్టారు. కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు ఆయనను దూరంగా ఉంచే ప్రయత్నంలో ఇదో భాగమన్న విమర్శలూ ఉన్నాయి. తదనుగుణంగానే ఆ మండలి ఏర్పాటైన తర్వాత ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం గమనార్హం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.