close

ప్ర‌త్యేక క‌థ‌నం

తెదేపాలో బంధుగణం

బాలకృష్ణతోపాటు ఇద్దరు అల్లుళ్లూ పోటీ
ఎర్రన్నాయుడి కుటుంబంలో మరొకరు
బరిలో అశోక్‌గజపతిరాజుతోపాటు కుమార్తె అదితి

ఈనాడు-అమరావతి: కొన్ని కుటుంబాల్లోని ఇద్దరు నుంచి ముగ్గురు తెదేపా తరఫున బరిలో దిగుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మరోసారి పోటీ చేస్తున్న సినీ హీరో బాలకృష్ణతోపాటు ఆయన ఇద్దరు అల్లుళ్లూ పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేశ్‌ గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి, చిన్నల్లుడు భరత్‌ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
* దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు టెక్కలి శాసనసభ స్థానం నుంచి, ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహననాయుడు శ్రీకాకుళం ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నారు. ఎర్రన్నాయుడి కుమార్తె భవానీ రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి బరిలో దిగారు. విశాఖ జిల్లా పెందుర్తి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తికి కూడా రామ్మోహననాయుడు స్వయానా అల్లుడు.
* విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మరోసారి పి.అశోక్‌గజపతిరాజు, ఆయన కుమార్తె అదితి మొదటిసారి విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
* కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుటుంబంనుంచి ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు, సోదరుడు కేఈ ప్రతాప్‌ పత్తికొండ, డోన్‌ల నుంచి పోటీ పడుతున్నారు.
* కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు ఎంపీగా, ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.
* ఆళ్లగడ్డ నుంచి మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి ఆమె పెద్దనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు.
* పాణ్యం నుంచి గౌరువెంకటరెడ్డి భార్య గౌరుచరితారెడ్డి పోటీ పడుతుండగా, వెంకటరెడ్డి సోదరి భర్త మండ్ర శివానందరెడ్డి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు.
* అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
* చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఎన్‌.శివప్రసాద్‌, ఆయన అల్లుడు నర్శింహప్రసాద్‌ కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
* విశాఖ ఉత్తర నియోజకవర్గంనుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇదివరకే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వియ్యంకులు పి.నారాయణ, పులపర్తి రామాంజనేయులు నెల్లూరు నగరం, భీమవరం నుంచి బరిలో నిలిచారు.

వారసులు 18మంది
తెదేపా మూడు దశల్లో ప్రకటించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో 18 మంది వారసులకు చోటు దక్కింది. మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు భరత్‌ విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప, అమలాపురం నుంచి లోకసభ మాజీ స్పీకర్‌ దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్‌ బరిలో దిగుతున్నారు. అనంతపురం ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా, కృష్ణా జిల్లా పెడన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాగిత వెంకటరావు కుమారుడు కాగిత వెంకటకృష్ణప్రసాద్‌, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ కుమారుడు టీజీ భరత్‌ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.