Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

చట్టాలు నిర్వీర్యం

ఉపాధిహామీ, స.హ.చట్టాలను నిస్తేజపరిచిన యూపీఏ-2, ఎన్డీయే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆర్‌టీయేను తొక్కిపెట్టాయి
  ఏప్రిల్‌ 6న దిల్లీలో పీపుల్స్‌ అజెండా పేరుతో సభ
  ‘ఈనాడు’ ముఖాముఖిలో సామాజిక కార్యకర్త నిఖిల్‌డే

ప్రజా ప్రయోజనాలను కలిగించే అనేక చట్టాలకు పాలకులు క్రమంగా తిలోదకాలిస్తున్నారు. పేదల ఉపాధి హామీకి భరోసా కల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రం రాష్ట్రాలకు బడ్జెట్‌ కేటాయించకపోగా రాష్ట్రాలే భరించాలంటూ ఉచిత సలహాలిస్తోంది. కనీస వేతన చట్టం ప్రకారం ఉపాధి కూలీలకు వేతనాలు పెంచాల్సి ఉండగా మోదీ ప్రభుత్వానికి ఈ చట్టం కనిపించడమే లేదు

 

‘పరిపాలనలో పారదర్శకత కోసం పోరాడి సాధించుకున్న సమాచార హక్కు చట్టాన్ని కేంద్రంతోపాటు రాష్ట్రాలు తొక్కిపెట్టేశాయి. తెలంగాణలో సమాచార కమిషనర్ల నియామకమే చేపట్టడం లేదు. ఎన్డీయే ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో అనేక చట్టాలు, సంస్థలను నిర్వీర్యం చేసింది’

-నిఖిల్‌డే, ప్రముఖ సామాజిక కార్యకర్త

ఈనాడు - హైదరాబాద్‌

‘నిరుపేదల ఉపాధికి భరోసా కల్పించే చట్టం జాతీయ ఉపాధి హామీ పథకం. కరవు ప్రాంతాలు, గ్రామీణ ప్రజలకు పనులు కల్పించి చేతికి నగదును అందించే ఈ పథకం పేదలకు వరం లాంటింది. కానీ కేంద్ర ప్రభుత్వం సరిపోను నిధులు కేటాయించడం లేదు. దీనివల్ల పనిచేసినా వేతనాలు అందక వారు అవస్థ పడుతున్నారు. సరైన కూలీ రాక వెనక్కు తగ్గుతున్నారు’ అని ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్‌డే అభిప్రాయపడ్డారు. సమాచార హక్కుచట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం మొదలైన వాటి కోసం ఉద్యమించిన ముఖ్యుల్లో నిఖిల్‌డే ఒకరు. అరుణారాయ్‌ నేతృత్వంలోని మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌లో మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఈయన భారత్‌, అమెరికాలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ప్రస్తుతం నేషనల్‌ క్యాంపెయిన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్స్‌ సంస్థకు కో కన్వీనర్‌గా ఉన్నారు. కేంద్ర ఉపాధి హామీ మండలిలో సభ్యుడిగా పనిచేశారు. ప్రజా హక్కుల సాధనకు జాతీయ స్థాయిలో నిఖిల్‌డే కృషి చేస్తున్నారు. ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

? యూపీఏ ప్రభుత్వం కంటే తాము ఉపాధి హామీ చట్టాన్ని బాగా అమలు చేశామని ఎన్డీయే అంటోంది. మీరేమంటారు?
ఇది పెద్ద అబద్దం. యూపీఏ-1లో రూపొందించిన ఉపాధి హామీ చట్టాన్ని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోంది. డిసెంబర్‌, జనవరి నెలలకు సంబంధించిన  బకాయిలే రూ.10 వేల కోట్లవరకు ఉన్నాయి. ఈ మార్చి వరకు పథకాన్ని సజావుగా నడిపించాలంటే కనీసం రూ.17 వేల కోట్లు కావాల్సి ఉంది. బకాయిలు పేరుకుపోవడంతో ప్రజలు పనులకు రావడం లేదు. ఇదేనా పథకాన్ని బాగా అమలు చేయడమంటే. పైగా కూలీలు ఆసక్తి చూపడం లేదంటూ పార్లమెంట్‌లో ప్రభుత్వం చెప్పింది. ఈ విధమైన ప్రచారం చేసి పథకాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పనులు లేక పేదలు అల్లాడుతున్నారు. ఇవేమీ మోదీ ప్రభుత్వానికి కనిపించడం లేదు.

ప్రధానమైన లోపాలేమిటి?
ఉపాధి హామీ అంటేనే కూలీలకు పనికల్పించి వేతనాలు ఇవ్వడం. రోజుల తరబడి పనులు చేసినా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. ఈ పనులు చేస్తే డబ్బులు రావని వారంతట వారే దూరం పోయేలా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు చూపడమే లేదు. పనులపై పర్యవేక్షణా కొరవడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయి వరకు అజమాయిషీ చేసేవారు లేకుండా పోవడంతో పథకం ప్రభ కోల్పోతోంది. వంద రోజులు పని కల్పించాల్సినచోట 50 రోజులే కల్పిస్తున్నారు.

ప్రస్తుతం రోజుకు ఒక కూలీకి వస్తున్న గరిష్ఠ వేతనం జీవించేందుకు చాలుతుందా?
పని లేనివారికి వంద రోజులకు పని కల్పించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. కానీ, వేతనం చాలా తక్కువగా వస్తోంది. కనీస వేతన చట్టం ప్రకారం రోజుకు రూ.350 చొప్పున చెల్లించాలి. ఉపాధి హామీ పథకంలో కూడా ఇది అమలు చేయాలి. కనీస వేతన బోర్డు కమిటీ దీనిపై దృష్టిసారించింది. పని చేసిన వారికి కచ్చితంగా ఆ మేరకు వేతనం వచ్చేలా చూస్తేనే పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది.

సమాచార హక్కు చట్టం కోసం ఉద్యమించడమే కాకుండా దాని రూపకల్పనలోనూ మీరు కీలక పాత్ర పోషించారు. దాని అమలు ఎలా ఉంది?
సామాన్యుడి చేతిలో ఓ ఆయుధం సమాచార హక్కు చట్టం. ఎన్నో పోరాటాలతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మొదట్లో పకడ్బందీగా అమలైనా రానురాను కేంద్రంతోపాటు రాష్ట్రాలు దీని అమలులో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏడాదికి 70 నుంచి 80 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. అంతేకాదు వివిధ రకాల ప్రశ్నలు సంధించినందుకు 70 మందిని హత్యచేశారు. మొన్ననే గుజరాత్‌లో ఒకరిని హత్యచేయడం చూస్తే ఈ చట్టం అమలు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు?
రోజురోజుకు డిజిటల్‌ సాంకేతికత ప్రజల ముంగిటికి వస్తోంది. ప్రజలకు సంబంధించిన ఏ విషయమైనా ప్రభుత్వం, అధికారులు వారంతట వారే అందుబాటులో ఉంచాలి. సెక్షన్‌-4 కింద ప్రభుత్వ విభాగాలే సమాచారం వెల్లడించాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సమాచారం అందించకుండా దాచిపెడుతున్నాయి. ఇలా చేయడానికి వారికి హక్కులేదు. రాజస్థాన్‌లో మాత్రం ‘జన్‌ సూచనా పోర్టల్‌’ను ఏర్పాటు చేసి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’ కూడా ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

స.హ.చట్టం నిర్వీర్యం కావడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది. ఎన్డీయే ప్రభుత్వం ఈ చట్టానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి కారణాలేంటి?
ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఈ చట్టం పూర్తిగా బలహీనపడిపోయింది. కమిషనర్ల నియామకాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ప్రధాన మంత్రి కార్యాలయానికి చేసుకున్న దరఖాస్తుల్నే పట్టించుకోవడం లేదంటే వారికి ఈ చట్టంపై ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. శిక్షణలు ఇవ్వడం లేదు. మోదీ ప్రభుత్వం పరిపాలనలో పారదర్శకతకు పాతరేసింది. అంతేకాదు చట్టానికి సవరణలు కూడా చేయాలని ప్రయత్నించింది.

ప్రజలకు ఉపయోగపడే చట్టాల అమలుకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
పోరాడి తెచ్చుకున్న చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. దీనిపై పోరాడుతూనే ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి హామీ చట్టం ఉన్నట్లే మైదాన ప్రాంతాల ప్రజలకు కూడా పట్టణ ఉపాధి హామీ చట్టం ఏర్పాటు చేయాలి. మైదాన ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. దీనిపై ఏప్రిల్‌ 6న దిల్లీలో పీపుల్స్‌ అజెండా పేరుతో సభ నిర్వహించనున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఛార్జిషీట్‌ విడుదల చేస్తాం. ఆ తర్వాత 22 రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీనిలో పెన్షన్‌ పరిషత్‌, పీపుల్స్‌ రైట్‌ టు ఇన్ఫర్‌మేషన్‌, సూచన ఏవం రోజ్‌గార్‌ అధికార్‌ అభియాన్‌ తదితర ప్రజా సంఘాలు పాల్గొంటాయి.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ ఎప్పుడు మొదలైంది. ఏవైనా రాష్ట్రాలు ఇప్పటికీ మెరుగ్గా అమలు చేస్తున్నాయా?
యూపీఏ-2 నుంచే ఈ చట్టాన్ని చెడగొట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనికి ఆద్యుడు అప్పటి ఆర్థికశాఖ మంత్రి చిదంబరం. ఆయనను ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోంది. ప్రధానంగా నిధుల కేటాయింపే అసలు సమస్య. రాష్ట్రాల్లో బకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్రాలే ఆ నిధులు కేటాయించుకోవాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచ దేశాలు ఈ చట్టం వల్ల పేదలకు కలుగుతున్న మేలును కీర్తిస్తుంటే భారత ప్రభుత్వం మాత్రం చిన్నచూపు చూస్తోంది. బకాయిలున్నప్పటికీ తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఈ పథకాన్ని మెరుగ్గానే అమలు చేస్తున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు 10 లక్షల మంది పనిచేసేవారు. ఇప్పుడు రోజుకు 18 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

యూపీఏ-1లో పేదలకు, పారదర్శకతకు అనుకూలమైన అనేక చట్టాలు వచ్చాయి. యూపీఏ-2లో కానీ, ఎన్డీయేలో కానీ ఇవి కొనసాగకపోవడానికి కారణమేంటి?
నిజమే. యూపీఏ-1 హయాంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన చట్టాలు వచ్చాయి. ఆహార భద్రతా చట్టం, భూసేకరణ చట్టం, అటవీ హక్కుల చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(సవరణ) చట్టం, వీధి వ్యాపారుల చట్టం, విద్యా హక్కు, సమాచార హక్కు, ఉపాధి హామీ చట్టాల్లాంటివి ఎన్నో చేశారు. పారదర్శకమైన పరిపాలనకు బీజం వేశారు. అనంతరం యూపీఏ-2కు వచ్చేసరికి ఈ చట్టాల అమలులో స్తబ్ధత నెలకొంది. ఇక ఎన్డీయే ప్రభుత్వం ఈ చట్టాలను పూర్తిగా తొక్కేసి ప్రజావ్యతిరేక పరిపాలన చేస్తోంది. స్వచ్ఛ్‌ భారత్‌, ఉజ్వల్‌ తదితర పథకాలు తీసుకొచ్చినా ఇవి ఒకటి రెండు రోజులు మాత్రమే అమల్లో ఉండేవి. ఇవి చట్టాలు కావు. పేదలకు మేలుచేయాలన్న కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. మోదీకి పేదల కన్నా కార్పొరేట్‌ వర్గాల సంక్షేమమే ముఖ్యమైంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.