close

ప్ర‌త్యేక క‌థ‌నం

గెలుపే గీటురాయి

అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రధాన పార్టీలు
చాలాచోట్ల సిట్టింగ్‌లకు రిక్తహస్తం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. తెరాస మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్‌ ఖమ్మం మినహా 16 స్థానాలకు ఖరారు చేసింది. భాజపా తొలి జాబితాలోనే పది స్థానాలకు పేర్లను ప్రకటించింది. ప్రధాన పార్టీలు సుదీర్ఘ కసరత్తు అనంతరం గెలిచే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్లు కేటాయించాయి. తెరాస నలుగురు సిటింగ్‌లను పక్కన పెట్టగా; కాంగ్రెస్‌ ఒకచోట, భాజపా ఒకచోట సిటింగ్‌లను తప్పించాయి. ప్రధానపార్టీలు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన వారిలో 16 మందిని లోక్‌సభ అభ్యర్థులుగా బరిలో దింపడం విశేషం. శాసనసభ ఎన్నికల ఫలితాలతో డీలా పడిపోకుండా అధికార తెరాసకు దీటుగా అభ్యర్థులు ఉండాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేని నేతలను తెరపైకి తెచ్చింది. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో నిలిచిన తొమ్మిది మందిని రంగంలోకి దింపింది. ఎమ్మెల్యేలు పార్టీని వీడటం వంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రేణులు నిరాశకు గురికాకుండా చూడటంతో బాటు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే అవకాశాలను నిర్లక్ష్యం చేయకూడదని ముఖ్యనేతలను బరిలో దింపింది. మూడు నెలల్లోనే రెండో ఎన్నికను ఎదుర్కోవాల్సి రావడం ఇబ్బందికరమైనా పార్టీ పోటీ చేయాల్సిందే అని స్పష్టం చేయడంతో బరిలో దిగారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అభ్యర్థులగా బరిలో దింపింది. ఈ ఇద్దరు నేతలకు పూర్వపు నల్గొండ జిల్లాలో ఉన్న పట్టు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించడం వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంది. తొలిజాబితాలోనే మల్కాజిగిరి స్థానానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డిని ప్రకటించింది. కరీంనగర్‌, మహబూబాబాద్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌లలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌, బలరాంనాయక్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మధుయాస్కీలనే ఖరారు చేసింది. కొత్తవారికి మెదక్‌, జహీరాబాద్‌ల నుంచి అవకాశమిచ్చింది. మహబూబ్‌నగర్‌ నుంచి పోటీకి సీనియర్‌ నేతలు విముఖత చూపడంతో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డిని ఎంపిక చేసింది. నాగర్‌కర్నూలులో సిటింగ్‌ ఎంపీ నంది ఎల్లయ్యను మార్చాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ మల్లు రవి వైపు మొగ్గు చూపింది. ఆదిలాబాద్‌లో శాసనసభ ఎన్నికల ముందు తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిన రమేష్‌ రాఠోడ్‌కు టికెట్‌ ఇచ్చింది. చేవెళ్ల బరిలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అభ్యర్థిత్వం పార్టీలో చేరినపుడే ఖరారైంది. మెదక్‌, జహీరాబాద్‌, సామాజిక సమీకరణల నేపథ్యంలో వరంగల్‌ స్థానం నుంచి దొమ్మాట సాంబయ్యను బరిలో దింపిది. పెద్దపల్లి నుంచి అనూహ్యంగా మాజీ మంత్రి, వికారాబాద్‌కు చెందిన ఎ.చంద్రశేఖర్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోకపోవడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురుకాలేదు. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం ఫలితాలపై ప్రభావం చూపిందనే అభిప్రాయంతో ఉన్న పార్టీ ఖమ్మం మినహా మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

వ్యూహాత్మకంగా కమలదళం
అభ్యర్థుల ఎంపికలో కమలదళం పేరు ప్రతిష్ఠలు, సామాజికవర్గం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సికింద్రాబాద్‌ నుంచి అనేక పర్యాయాలు పోటీచేసిన కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ స్థానంలో కిషన్‌రెడ్డిని ఎంపిక చేసింది. మూడు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన కిషన్‌రెడ్డి అంబర్‌పేట అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాయకత్వ లోటును డి.కె.అరుణ చేరికతో పూడ్చుకుంది. ఆమెను మహబూబ్‌నగర్‌ నుంచి బరిలో దింపింది. రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కొడుకు ధర్మపురి అరవింద్‌ కొంతకాలం నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అక్కడ తెరాస అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ కవితకు అరవింద్‌ గట్టి ప్రత్యర్థి అవుతారని భావించి టికెట్‌ ఇచ్చింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.