close

ప్ర‌త్యేక క‌థ‌నం

మోదీకి గుణపాఠం ఖాయం

వ్యవస్థలను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రధాని యత్నం 
చౌకీదారే.. ‘చోర్‌’ అనేది భారతీయులందరికీ తెలుసు 
ఎన్డీయే హయాంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరింది 
అన్నదాతలు సంక్షోభంలో చిక్కుకొన్నారు 
తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటాం... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం 
ప్రియాంక రాకతో పార్టీకి నూతన ఉత్సాహం 
మోదీకి అభద్రతా భావం... అందుకే నేనంటే అక్కసు 
‘ఈనాడు’ ముఖాముఖిలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

దేశమంతా మోదీకి వ్యతిరేకంగా నినదిస్తోంది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. అవినీతి టోకున జరుగుతోంది. కేవలం 15 మంది పెద్దలకు రూ.3.5 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశారు. కానీ రైతురుణాలు మాత్రం మాఫీ కావడం లేదు. 2019 ఎన్నికలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాయని బలంగా నమ్ముతున్నాను. మా ట్రాక్‌ రికార్డు చూడండి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటకల్లో భాజపాను ఓడించాం. గుజరాత్‌లోనూ దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటు దగ్గరికి వచ్చాం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మేం మంచి ఫలితాలు సాధించగలుగుతామని నమ్ముతున్నాం. ప్రతిపక్షాలతో కలిసి నరేంద్ర మోదీని ఓడించబోతున్నాం. 


గత ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని, ఆ సర్కారుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చినా వాస్తవం మరోలా ఉందని, రోజుకు 27 వేల ఉద్యోగాలు చొప్పున ఊడిపోయాయని ధ్వజమెత్తారు. ‘రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ద్వారా అక్రమ మార్గంలో మోదీ తన మిత్రునికి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారు. అన్ని వ్యవస్థలనూ నాశనం చేసి, చివరికి రాజ్యాంగాన్నీ ధ్వంసం చేసేందుకు పూనుకొన్నారు. రైతాంగం ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. మోదీ సర్కారుకు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెబుదామా అని ఎదురు చూస్తున్నారు’ అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మళ్లీ బలం పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సోదరి ప్రియాంక మంచి వక్త మాత్రమే కాదనీ, మంచి శ్రోత కూడానని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె రావడం ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు దేశమంతటా కాంగ్రెస్‌ పార్టీకి ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ ‘ఈనాడు’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. 
ఈ ఎన్నికల్లో మీరు ఇస్తున్న ప్రధాన హామీలేమిటి? 
ఎన్నికల ప్రణాళిక మరికొద్ది రోజుల్లో విడుదల చేస్తాం. ఇందులో కనీస ఆదాయ హామీ పథకం పెద్దది. పేదరిక నిర్మూలనకు ఇది చాలా ముఖ్యం. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి పథకం చేపట్టలేదు. ఏ భారతీయుడు కనీస ఆదాయం కంటే దిగువన జీవనం సాగించకూడదు. దాని కంటే దిగువన ఉంటే ఆ మేరకు వారికి ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేస్తుంది. హరితవిప్లవం, జాతీయ ఉపాధి హామీ చట్టం చేసినట్లుగానే ఇది కూడా ఉంటుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభలో ఆమోదిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు కేటాయిస్తాం. విద్యకు జీడీపీలో 6% నిధులు కేటాయిస్తాం. ఆరోగ్య రంగానికీ ప్రాధాన్యమిస్తాం. రైతుల రుణాలను మాఫీ చేస్తాం. 

రఫేల్‌ ప్రధాన అంశమని భావిస్తున్నారా? 
అవును.. ఇది చాలా తీవ్రమైన అంశం. తన మిత్రుడు అనిల్‌ అంబానీకి రూ. 30వేల కోట్లు దోచిపెట్టేందుకు ప్రధానమంత్రి దేశ రక్షణను ముప్పులో పెట్టారు. అంబానీతో ఒప్పందానికి ప్రధాని ఒత్తిడి తెచ్చినట్లు ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడే చెప్పారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉండగా, ప్రధానిని రక్షించాలని దాచిపెడుతున్నారు. కొత్త రఫేల్‌ ఒప్పందం వల్ల విమానాల సంఖ్య తగ్గడమే కాదు.. ఎక్కువ మొత్తం చెల్లించాం. విమానాల రాక ఆలస్యం అవుతోంది. దీనివల్ల దేశ భద్రత ముప్పులో పడుతోంది. ఈ అంశం ఎన్నికల్లో కీలకమైంది. 
దేశంలో మహిళల సాధికారతకు ఏం చేయబోతున్నారు? 
దానికి ప్రధానమంత్రి ఓ మార్గం చూపాలి. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా మహిళా ఎమ్మెల్యేపై అత్యాచారం చేస్తే ప్రధాని ఏమీ మాట్లాడరు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడటంతోపాటు అన్ని రంగాల్లో వారి అభివృద్ధికి దోహదపడాలి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో గతంలో మా ప్రభుత్వం దీన్ని చేసి చూపించింది. ఉద్యోగాలు కల్పించడంతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా మహిళలను ప్రోత్సహించాలి. వీటన్నిటితోపాటు మహిళా రిజర్వేషన్‌ బిల్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. 


తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను మీరెలా పరిష్కరిస్తారు? 
కాంగ్రెస్‌కు తెలంగాణ చాలా ముఖ్యమైన రాష్ట్రం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాను. ఆ ఎన్నికల్లో మా పనితీరు ఆశించిన దానికంటే తక్కువగానే ఉన్నా, జాతీయ అంశాలపై జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని నమ్ముతున్నా. తెరాస ప్రభుత్వం ఎంతలా డబ్బు ఉపయోగించిందో అందరికీ తెలుసు. మాది సైద్ధాంతిక పోరాటం. ముఖ్యమంత్రి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో గెలుస్తామని నమ్ముతున్నా. తెలంగాణలో ఏకవ్యక్తి కుటుంబపాలన నడుస్తోంది. ప్రజాపాలన ఉండాలని కోరుకుంటున్నాం. 


మీ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది తెరాసలో చేరుతున్నారు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకొంటున్నారు? 
పార్టీ వదిలిపెట్టడానికి మా నేతలకు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెబుతున్నారు. అవినీతిపరులు పార్టీ వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. నిజాయతీపరులు మాత్రమే ఉంటారు. ఇది పార్టీకి మంచిదే. దీనివల్ల మా పార్టీ మరింత రాటుదేలుతుంది. కాంగ్రెస్‌ను మోసంచేసి వెళ్లినవారికి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గుణపాఠం నేర్పుతారు. 


నల్లధనం సమస్య రూపుమాపేందుకు మీ వ్యూహం ఏమిటి? రూ.2 వేల నోటు రద్దు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారా? 
నల్లధనానికి మూలకారణం అవినీతి. ఆ అవినీతికి ప్రధాన కారణం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. ఈ విషయంలో మన ప్రధాని పోస్టర్‌బాయ్‌లా మారారు. మరోవైపు బ్యూరోక్రాట్ల చేతుల్లో అధికారాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఆ అధికారాలే వారికి ఆయాచిత ప్రయోజనాలు పొందేందుకు ఆస్కారమిస్తున్నాయి. ముందు రాజకీయ పార్టీలకు నిధులందే విధానాన్ని ప్రక్షాళన చేయాలి. ఎన్నికల బాండ్లు మరింత అవినీతికి ఆస్కారమిస్తున్నాయి. రూ.2 వేల నోటు నిషేధం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. 2016లో పెద్దనోట్లను రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేసిందీ చూశాం. మరోసారి అలాంటి ప్రయత్నం చేయడం తెలివితక్కువ ప్రయత్నమే అవుతుంది. అవినీతిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొనే ప్రధానమంత్రి రూ.వెయ్యి నోటు రద్దు చేసి దాని స్థానంలో రూ.2 వేల నోటు తీసుకురావడమే హాస్యాస్పదం. 
భాజపా ఎన్నికల నినాదం ‘మేమంతా చౌకీదార్లం’ గురించి మీరేమంటారు? 
పేదలకు కాపలాదారులు ఉండరు. ఈ నినాదం ద్వారా తాను ఎవరి కోసం పనిచేస్తున్నానన్న విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టంగా చాటుకున్నారు. తాను ప్రధాని కావాలనుకోవడం లేదు, కేవలం చౌకీదారు కావాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పుడు అదే కాపలాదారుడు దొంగతనం చేస్తూ దొరికిపోయారు. అనిల్‌ అంబానీకి రూ.30 వేల కోట్లు ఎలా వెళ్లాయన్న విషయం ప్రజలకు చెప్పాలి. అనిల్‌ అంబానీకి, అలాంటి మరికొందరికి ఆయన కాపలాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ప్రతిధ్వనిస్తున్న ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అన్న మా నినాదాన్ని భాజపా అంగీకరించినట్టయింది. దాన్ని తిప్పికొట్టడానికే ఇప్పుడీ నినాదం అందుకున్నారు. ఇప్పుడు చౌకీదార్లుగా పిలుచుకొనేవారంతా కుంభకోణాల్లో ఇరుక్కుపోయారు. ప్రధానమంత్రి మోదీ దగ్గరి నుంచి, మంత్రులు పీయూష్‌ గోయల్‌, అరుణ్‌జైట్లీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, అతని కుమారుడు జైషా.. అవినీతిలో కూరుకుపోయారు. ప్రత్యక్షంగానో, లేదంటే స్నేహితులు, కుటుంబసభ్యుల ద్వారానో జాతి సంపదను దోచుకున్నారు. అలాంటివారంతా ఇప్పుడు చౌకీదార్లమంటూ పోజులు కొడుతున్నారు. ప్రజలేమీ అమాయకులు కారు. ఈ దేశ చౌకీదార్‌ చోర్‌ అన్న సత్యం ప్రతి భారతీయుడికి తెలుసు. 
ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావం చూపనున్నాయి? 
ప్రజలు తీవ్ర అసంతృప్తితో, కోపంతో ఉన్నారు. మోదీ పెద్దపెద్ద హామీలిచ్చారు. వీటిలో చాలామటుకు తప్పుడు హామీలే. ప్రతి ఒక్కరి ఖాతాకు రూ.15 లక్షలు జమ చేస్తామని, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని... ఇలా ఎన్నో మాటలు చెప్పారు. ఇవన్నీ హామీలుగానే మిగిలిపోయాయి.  ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించి... అంతా సంతోషంగా ఉన్నారని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. వాస్తవం అలా లేదు. ఉద్యోగాల కోసం యువకులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. దళితులు, ఆదివాసీలతో పాటు దేశంలో ప్రజాస్వామ్య వాతావరణానికి, సామరస్యతకు ప్రమాదం ఏర్పడింది. ఇవన్నీ ఎన్నికల్లో ప్రధానాంశాలే. 
వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. మీరు అధికారంలోకి వస్తే రైతులను గట్టెక్కించేందుకు ఏం చేస్తారు? 
సాగు దెబ్బతింటే దేశం ఇబ్బందుల్లో ఉన్నట్టే. రోజుకు రూ.3.50 చొప్పున నగదును బదిలీ చేసి... రైతులంటే వారికి ఎంత చిన్నచూపో చెప్పకనే చెప్పారు. ఇది రైతులను సంక్షోభం నుంచి బయట పడేస్తుందా? 15 మంది ధనికులకు సంబంధించి రూ.మూడున్నర లక్షల కోట్లు మాఫీ చేస్తారు. కానీ ఇదే పని రైతుల కోసం ఎందుకు చేయలేరు? రుణమాఫీ తాత్కాలికమైన ఉపశమనమే. ధనికులకు ఒక నీతి, వీరికో నీతా? రైతుల సమస్యల పరిష్కారానికి సాంకేతికతను పెంచాలి. అంతర్జాతీయ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి. వారి ఉత్పత్తులను నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. తగినంత రుణం ఇవ్వాలి. దేశంలో రెండో హరిత విప్లవం అవసరం. రైతులకు ఆదాయం వచ్చేలా చూడాలి. వారి జీవితాల్లో సుస్థిరత అవసరం. ఇది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం.

సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు రుణమాఫీ భరోసా 
కల్పిస్తుంది. దేశ వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చేందుకు రెండో హరిత విప్లవం అత్యవసరం. దాని ద్వారా రైతులకు 
సముచిత ఆదాయాన్ని కల్పించవచ్చు. వారికి సుస్థిర జీవనాన్ని సాకారం చేయవచ్చు. అది ఒక్క కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం.’’

తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు మన దేశ యువత 
సిద్ధంగా ఉంది. వారికి అవకాశాలు మాత్రం లేవు. నిరుద్యోగాన్ని 
కనీసం ఓ సమస్యగా గుర్తించడానికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ 
ఏమాత్రం ఇష్ట పడడంలేదు. సమస్యను గుర్తించనప్పుడు ఆయన ఇంకేం పరిష్కారం చూపుతారు?’’
అక్కసును అక్కసుతో జయించలేం. నన్ను నిరంతరం దుర్భాషలాడుతూ, ఎగతాళిగా మాట్లాడుతున్నందుకు ప్రధానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. తద్వారా ఆయన నాకు ఓర్పు వహించడం నేర్పారు. ఏదోఒకటి నేర్పుతున్న వారిని ఎలా ద్వేషించగలం? అయినా... ఆయన పట్ల నాకు ద్వేషం లేదు. ఉన్నదల్లా ప్రేమే!’’
మేం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. అవసరమైనన్ని రోజులు దాన్ని కొనసాగిస్తాం. ఈ విషయాన్ని   ఇప్పటికే స్పష్టం చేశాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం.’’

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నామమాత్రంగా మారింది. దీనికి కారణమేంటంటారు? 
ప్రజల అభీష్టాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఏర్పాటుచేశాం తప్ప ఎన్నికల్లో గెలవడానికి కాదు. మేం తెలంగాణలో బలంగా ఉన్నాం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని పునర్‌నిర్మించుకోవాలి. అందుకు మా నాయకులు సహకరిస్తారని నమ్ముతున్నా. అక్కడ పార్టీ పునర్వైభవానికి దండిగా అవకాశాలున్నాయి. 
మిమ్మల్ని ఓ వైపు పప్పు అని ఎగతాళి చేస్తున్నారు. కాంగ్రెస్‌ ముక్తభారత్‌ అంటున్నారు. వీటినెలా ఎదుర్కొంటారు? 
అక్కసు, నిస్పృహలతో ప్రత్యర్థులు నన్ను దుర్భాషలాడుతున్నారు. వారిపై అదే తరహాలో స్పందించడం నాకు ఇష్టం లేదు. అక్కసును అదే అక్కసుతో జయించలేం. నిరంతరం నా గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెబుతున్నా. అలా వారు నాకు ఎన్నో పాఠాలు నేర్పారు. ముఖ్యంగా ఓర్పు అలవడేలా చేశారు. మోదీ నన్ను ద్వేషించినా నా హృదయంలో మాత్రం ఆయన పట్ల ప్రేమే ఉంది. కేవలం అభద్రతాభావం, భయంతోనే ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారన్న సత్యం నాకు తెలుసు.

‘నిరుద్యోగం’ ప్రధానాంశమని మీరంటుంటే.. ప్రభుత్వమేమో నిరుద్యోగాన్ని పరిష్కరించామంటూ లెక్కలతో చెబుతోంది కదా.. 
దేశవ్యాప్తంగా లక్షల మంది యువతతో చర్చించిన తర్వాత వారి సమస్యలేంటో నాకు స్పష్టంగా తెలిశాయి. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్లలో ఇప్పుడే ఎక్కువగా ఉంది. చైనా రోజుకు 50 వేల ఉద్యోగాలను కల్పిస్తుంటే... మనం రోజుకు 27 వేల ఉద్యోగాలను కోల్పోతున్నాం. 2017-18లోనే కోటి ఉద్యోగాలు కోల్పోయాం. నిరుద్యోగాన్ని జాతీయ అత్యవసర సమస్యగా ప్రకటించి, తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. లక్షల మంది యువకుల శక్తిని దేశం ఉపయోగించుకోలేకపోతోంది. ప్రధాని అసలు దీన్నో సమస్యగా గుర్తించడానికి కూడా సిద్ధంగా లేరు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఇస్తే ఎంతకాలం కొనసాగిస్తారు? 
ఈ ప్రశ్న ప్రధానమంత్రిని అడగాలి. చట్టంలో చెప్పిన హామీలు ఎందుకు అమలుచేయలేదని నిలదీయాలి. మేం కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే తొలి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే చెప్పాం. ఆ మాట నిలబెట్టుకుంటాం. అవసరమైనన్ని రోజులు ఏపీకి ప్రత్యేక హోదా కొనసాగిస్తాం.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని నీతి ఆయోగ్‌ పదేపదే చెబుతోంది కదా? 
కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ ఏర్పాటుచేసింది. కానీ అదేమిటో, ఏమి చేస్తోందో ఇప్పటివరకు ఎవరికైనా తెలుసా? ఆర్‌బీఐ, సీబీఐ, నీతి ఆయోగ్‌ మొదలుకొని దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఈ ప్రభుత్వం రాజకీయం చేసింది. నిజాయతీపరులు, అనుభవజ్ఞులైన అధికారులను తప్పించి తమ అనుంగులను అందులో నియమించుకొంది. వారంతా తమ మాస్టర్స్‌ చెప్పినట్లు పలికే చిలుకల్లా వ్యవహరిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.
ప్రియాంక రాకతో కాంగ్రెస్‌ భాగ్యరేఖ మారుతుందని భావిస్తున్నారా? 
ప్రియాంకపై నాకు పూర్తి నమ్మకం ఉంది. తనకు అప్పగించిన బాధ్యతలన్నింటినీ సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఆమె మంచి వక్తే కాదు.. మంచి శ్రోత కూడా. ప్రజల మనసులను గెలుచుకొని కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తారు. పార్టీ మూల సిద్ధాంతాలను అర్థం చేసుకొని క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులతో అల్లుకుపోతున్నారు. ఆమె రాజకీయ ప్రవేశం యూపీతో పాటు, దేశవ్యాప్తంగా మా కార్యకర్తలు, నాయకులకు ఉత్సాహాన్నిచ్చింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.