close

ప్ర‌త్యేక క‌థ‌నం

భాజపా నెగ్గదు.. కాంగ్రెస్‌ పెరగదు

కేంద్రంలో సమాఖ్య కూటమిదే కీలక పాత్ర 
తెలంగాణలో ఎన్నికల సమరం ఏకపక్షమే 
16 చోట్ల తెరాస, ఒక స్థానంలో మజ్లిస్‌ గెలుపు ఖాయం 
ఎన్డీయే పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం 
మోదీ, రాహుల్‌ నియోజకవర్గాల్లో రైతులతో నామినేషన్లు వేయిస్తాం 
ఏపీలో తెదేపా గెలుపు ప్రశ్నార్థకమే 
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత

లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సమాఖ్య కూటమి కీలక పాత్ర పోషిస్తుందని నిజామాబాద్‌ ఎంపీ, తెరాస కీలక నాయకురాలు కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. భారతీయ జనతా పార్టీ నెగ్గదని.. కాంగ్రెస్‌ పార్టీ పెరగదని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల సమరం ఏకపక్షమేనని.. 16 స్థానాల్లో తమ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఇక్కడ విపక్షాల ఉనికే లేదని పేర్కొన్నారు. ఏపీలో తెదేపా గెలుపు ప్రశ్నార్థకమేనన్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశానని.. రూ.15 వేల కోట్లకుపైగా పనులు తన హయాంలో జరిగాయని వెల్లడించారు. ‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు కవిత సమాధానాలిచ్చారు. 

ఈ సారి నేను గెలిచాక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటం చేస్తా.. 
పదవులే లక్ష్యంగా గతంలో కూటముల ప్రయత్నాలు జరిగేవి. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ప్రజల అజెండాతో ముందుకొచ్చారు. ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తేనే పార్లమెంటులో సమాఖ్య స్ఫూర్తి వెల్లివిరిస్తుందని ఆయన విశ్వాసం. రేపటి ఎన్నికల్లో భాజపా నెగ్గదు.. కాంగ్రెస్‌ పెరగదు. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతుంది. కేంద్రంలో సమాఖ్య కూటమిదే కీలకపాత్ర. రాష్ట్రంలో లోక్‌సభ పోరు ఏకపక్షమే. 16 స్థానాల్లో తెరాస,  ఒకచోట మజ్లిస్‌ గెలవడం ఖాయం. 
ఎంపీగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు? ఎలా అనిపిస్తోంది? 
నిజామాబాద్‌ ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టే అదృష్టం కలిగింది. ప్రజలు ఆశించిన విధంగా సంతృప్తికరంగా పనిచేశా. నా నియోజకవర్గంతోపాటు తెలంగాణ అభివృద్ధికి కృషి చేశాను. మరోసారి ఇక్కడ పోటీ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. ప్రజలు మళ్లీ దీవిస్తారని విశ్వసిస్తున్నా. 
నియోజకవర్గ అభివృద్ధికి మీరు చేసిన కృషి? 
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లక్షల్లో జనం ఉంటారు. రాత్రి, పగలూ తిరిగినా అందరినీ కలవడం అసాధ్యం. అయినా మనఊరు- మన ఎంపీ కార్యక్రమం కింద వేలాది మందిని కలిశా. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేశా. బీడీ కార్మికులకు పీఎఫ్‌ కటాఫ్‌ వల్ల ఎదురవుతున్న సమస్యలు, ఇళ్లల్లో అత్తా, కోడళ్లకు పింఛన్లు కావాలనే అంశాలు అలానే తెలిశాయి. ఆయా అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన పరిష్కరించారు. జనానికి సంబంధించిన అన్ని అంశాల్లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచాను. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రూ.15 వేల కోట్లకుపైనే పనులు జరిగాయి. 

ఎన్డీయే పాలన ఎలా ఉంది? తెలంగాణపై ఎలాంటి వైఖరి కనిపించింది ? 
రాష్ట్రాల అధికారాలను హరించడం, మతపరమైన అంశాలతో ప్రజలను భయాందోళనలకు గురిచేయడం మినహా ఎన్టీయే సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదు. పేద వర్గాలకు ఎలాంటి మేలు జరగలేదు. అసత్యాలతో అయిదేళ్ల కాలం వెళ్లదీశారు. తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చామని అమిత్‌షా ఇక్కడికి వచ్చి చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి అంశాన్నీ సీఎం కేసీఆర్‌ ఖండించినా.. వారి నుంచి సమాధానం లేదు. పింఛన్లకు ఇచ్చే రూ.వెయ్యిలో 800 కేంద్రమే ఇస్తోందని భాజపా నేతలు చెప్పడం దారుణం. గుజరాత్‌లో వితంతు పింఛను రూ.700, వృద్ధాప్య పింఛను రూ.750 మాత్రమే. మరి అక్కడ కేంద్రం ఇచ్చే రూ.800 ఎక్కడికి పోయాయి. 
ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో రాణిస్తాయా.. ? 
గతంలో ప్రాంతీయ పార్టీలకు చెందినవారు ప్రధానులు అయ్యారు. కానీ, వారిని ఎదగనీయకుండా వెంటనే పదవుల్లోంచి దించేశారు. ఈ సారి అలాంటిది ఉండదు. కేసీఆర్‌ పక్కా ప్రణాళికతో వస్తున్నారు. ఆయన కూటమికి ప్రయత్నాలు చేస్తుంటే కోవర్టు అని, బీ టీమ్‌ అని వెక్కిరిస్తున్నారు. అవహేళన చేస్తున్నారు. కేసీఆర్‌కు ఉద్యమ సమయంలోనూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అయినా తెలంగాణను సాధించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో దేశ గతిని మార్చబోతున్నారు. 
నియోజకవర్గ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మీరు   సాధించిన విజయాలు..? 
నిజామాబాద్‌-పెద్దపల్లి రైల్వేలైన్‌ సాధన నా విజయాల్లో మొదటిది. దాని కోసం చాలా కష్టపడ్డా. పెద్దపల్లి నుంచి నడిచే రైలు చూసినప్పుడల్లా ఆనందం కలుగుతుంది. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు చేరుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు రైతులు 20 ఏళ్లుగా మద్దతు ధర కోసం పోరాడుతున్నారు. వారికి న్యాయం జరగాలని పసుపు బోర్డు సాధనకు కృషి చేశాను. కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చాను. దురదృష్టవశాత్తు కేంద్రం నుంచి స్పందన రాలేదు. కేవలం ప్రత్యేక పసుపు కార్యాలయం పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. అదీ రాలేదు. ఆ తర్వాత ఎంపీలతోనూ లేఖలు రాయించాను. చివరికి సుగంధద్రవ్యాల మండలి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా పసుపు రైతులకు అవగాహన సదస్సులు పెట్టాం. రాష్ట్ర, జాతీయ స్థాయికి సంబంధించి అనేక అంశాలను మా ఎంపీలతో కలిసి సభలో ప్రస్తావించాం. మా పోరాట ఫలితంగానే హైకోర్టు, ఎయిమ్స్‌ సాధించాం.

భవిష్యత్తు ప్రణాళిక..?

నియోజకవర్గానికి ప్రత్యేక ప్రణాళిక విడుదల చేయబోతున్నా. ఇక్కడి ప్రజలందరికీ రెండు పడక గదుల ఇళ్ల కోసం కృషి చేస్తున్నా. ఉద్యోగాలు, వ్యాపారాల ద్వారా ఉపాధి కల్పన జరగాలి. ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ఆహారశుద్ధి పరిశ్రమలతో పంటలకు మద్దతు ధరతోపాటు ఎక్కువ ఆదాయం వస్తుంది. మహిళలకు ఉపాధి దక్కుతుంది.  నిజామాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లోనూ ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు చక్కటి మార్గం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. 

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు? 
ఈ సారి రాష్ట్రంలో యుద్ధం ఏకపక్షంగానే జరుగుతుంది. శాసనసభ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం. మాకు 16, మజ్లిస్‌కు ఒక స్థానం దక్కడం ఖాయం. ప్రత్యర్థి ఎవరని కూడా నేను చూడడం లేదు. ప్రజలను కలిసి ఓట్లు అడుగుతున్నాను. ప్రజలే ప్రత్యర్థి పని పడతారు. 
లోక్‌సభలో మీకు ఎదురైన అనుభవాలు చెబుతారా? 
తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణకు శుభాకాంక్షలు తెలపకపోవడం బాధ కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఏడు మండలాలను ఏకపక్షంగా ఏపీలో కలిపింది. ఇలా తొలిరోజే నిరసనలతో నా పదవీ కాలం మొదలైంది. అదే రోజు రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడే అవకాశం వచ్చింది. అరగంట ముందు ఈ సమాచారం అందడంతో అన్ని అంశాలను రాసుకొని సభలోకి వెళ్లా.  తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రస్తావిస్తూ.. కోపం, ఆవేదనతో మాట్లాడా. దానికి మంచి స్పందన వచ్చింది. కశ్మీరీ పండిత్‌ల అంశంపై నా ప్రసంగాన్ని అందరూ అభినందించారు. పార్లమెంటులో ఎంపీలు మాట్లాడితే పనులన్నీ జరిగిపోతాయని చాలా మంది అనుకుంటున్నారు. పరిష్కారం అనేది అనేక అంశాలు, వ్యవస్థలతో ముడిపడి ఉంటుంది. చాలా అడ్డంకులు, పరిమితులుంటాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల జీవితాల్లో తక్షణమే మార్పురావడం కష్టం. ప్రజాప్రతినిధులు నిరంతరం చురుగ్గా పనిచేయాలి.
జాగృతి అధ్యక్షురాలిగా చేపట్టిన కార్యక్రమాల గురించి..? 
తెలంగాణ జాగృతిని అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థగా తీర్చిదిద్దాం. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, రక్తహీనత నివారణ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం. మా నియోజకవర్గ పరిధిలో 19 వేల మంది మహిళలకు పరీక్షలు చేస్తే.. 80 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు తేలింది. వారి కోసం ఏడేళ్ల ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా చేపడతాం. కిందిస్థాయి నుంచి ప్రతి అంశంపైనా ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. ఐరాస సంస్థల భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో యువత ఎదిగేందుకు కృషి చేస్తాం. 
సమాఖ్య కూటమికి కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాల ఫలితాలు ఎలా ఉన్నాయి? 
కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగుతోంది. ఒకటి, రెండు పార్టీలదే పెత్తనం. వాటి ధోరణి వల్ల సీల్డ్‌ కవర్లలో సీఎంల ఎంపిక, ఆరు నెలలకోసారి మార్పు చేయడం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టడం వంటివి జరుగుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తి పార్లమెంటులో ప్రతిబింబించాలన్నా.. జాతీయ స్థాయిలో పరిష్కారం దొరకాలన్నా.. ప్రాంతీయ పార్టీల కీలక పాత్ర ఉండాలనేది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. గతంలో పదవులే లక్ష్యంగా కూటముల యత్నాలు జరగేవి. ఇప్పుడు కేసీఆర్‌ ప్రజల అజెండాతో ముందుకొచ్చారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా రావాలని, ప్రజలకు న్యాయం జరగాలని చెబుతున్నారు. దీనికి మద్దతు లభిస్తోంది. చాలా పార్టీలు తెరాస బాటలోనే ఉన్నాయి. రేపటి ఎన్నికల్లో భాజపా నెగ్గదు.. కాంగ్రెస్‌ పెరగదు. ప్రాంతీయ పార్టీల బలం 100 నుంచి 150 ఉంటుంది. ఎన్నికల తర్వాత సమాఖ్య కూటమిదే కీలకపాత్ర అవుతుంది. 
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై మీ అంచనాలేంటి? 
అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు ప్రశ్నార్థకమే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీలోని పార్టీలు విభజనపై నిజాలు చెప్పకుండా ప్రజలను గందరగోళపరిచాయి. అప్పుడే నిజాలు చెప్పి ఉంటే ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలుండేవే కావు. ఇప్పటికైనా అక్కడి రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా పనిచేయాలి. నిజాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి.

ఎర్రజొన్న రైతులకు ఆ పార్టీలు చేసిందేమీ లేదు?


నిజామాబాద్‌ జిల్లాలో ఎర్రజొన్న రైతుల సమస్యలపై ఆందోళనలు జరుగుతున్నాయి? వారు నామినేషన్లు వేస్తున్నారు కదా? 
ఎర్రజొన్న రైతులకు కాంగ్రెస్‌, భాజపాలు చేసిందేమీ లేదు. రాజకీయంగా వారితో ఆందోళనలు చేయించి ప్రయోజనాలు పొందాలని ఆ పార్టీలు చూస్తున్నాయి. వారి సమస్యలపై మొట్టమొదటగా స్పందించింది సీఎం కేసీఆరే. గత ప్రభుత్వాలు మిగిల్చిన రూ.11 కోట్ల బకాయిలను చెల్లించారు. ఆ తర్వాత ఏడాది రూ.150 కోట్లను వెచ్చించి నిల్వలను కొనుగోలు చేయించారు. ఈ సారి రైతులతో మాట్లాడి వచ్చే లోపే భాజపా, కాంగ్రెస్‌ వాళ్లు దూరారు. కొంతమందిని జమ చేసి నామినేషన్లకు తెరలేపారు. వారికి రైతుల నుంచి ఏమాత్రం మద్దతు లేదు. నిజామాబాద్‌లో నామినేషన్లు వేస్తే అది నియోజకవర్గానికే తెలుస్తుంది. ఈ సమస్య జాతీయ స్థాయికి చేరాలంటే మోదీ, రాహుల్‌గాంధీలు పోటీ చేసే నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయాలి. అప్పుడు దీనిపై నిరంతరం చర్చ జరిగి పరిష్కారం లభిస్తుంది. మేం కూడా మోదీ, రాహుల్‌ నియోజకవర్గాలలో రైతులతో నామినేషన్లు వేయిస్తాం.  
సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ ఎన్నికల ప్రచారానికి బాధ్యురాలిగా ఉన్నారు కదా.. ? 
ఈ సారి పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయబోతున్నాం. కొన్ని పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. కాకమ్మకథలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇచ్చే రూ.వెయ్యి పింఛనులో రూ.800 కేంద్రం ఇస్తోందనేది అభూతకల్పన.  
చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యంపై మీరేమంటారు? 
ప్రస్తుతం శాసనసభల్లో కేవలం అయిదు శాతమే మహిళలు ఉన్నారు. పార్లమెంటులో 11 శాతం ప్రాతినిధ్యం ఉంది. దాన్ని పెంచేందుకు కొత్త నిబంధనలుగానీ, రిజర్వేషన్లుగానీ ఉండాలి. ఇప్పటి వరకు స్త్రీశిశు సంక్షేమ శాఖ స్థాయీ సంఘాల్లో మాత్రమే మహిళలకు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. అలాగే శాస్త్ర సాంకేతిక తదితర శాఖల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. మహిళలకు ఎక్కువగా నిధుల కేటాయింపు జరగాలి. ఈ సారి నేను విజయం సాధించాక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ప్రత్యేక పోరాటానికి దిగుతా.  
విభజన చట్టం అమలు తీరు ఎలా ఉంది? 
కేంద్రం సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించలేదు. రెండు రాష్ట్రాలకు సహకరించి విభజన ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. ఐఏఎస్‌ల కేటాయింపులో జాప్యం జరిగింది. ఉద్యోగుల విభజనలో ఆలస్యమైంది. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.