close

ప్ర‌త్యేక క‌థ‌నం

మన మీన.. ఆదాయ మేన

తెలంగాణ చేపల ఉత్పత్తిలో 40శాతం 9 రాష్ట్రాలకు ఎగుమతి
ఏటా పశ్చిమ బెంగాల్‌కు 21 శాతం
మూడేళ్లలో 3 లక్షల టన్నులకు పెరిగిన దిగుబడి
వచ్చే ఏడాది రూ. 4 వేల కోట్లను తాకనున్న మార్కెట్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. మూడేళ్ల కిందట రెండు లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి ఈ ఏడాది 3,40,000 టన్నులకు చేరుతుందని మత్స్యశాఖ అంచనా వేస్తోంది. రెండేళ్లలో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన చేపల్లో 40శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యాయని మత్స్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందులో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికే అత్యధికంగా ఏటా 21శాతానికి తగ్గకుండా చేపలు ఎగుమతి అవుతున్నాయని పేర్కొంటున్నారు.

ఏటికేడు పెరుగుతూ..
చేపల ఉత్పత్తితో పాటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఏటికేడు పెరుగుతుందని మత్స్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2016-17లో 3939 చెరువులు, కుంటల్లో 27.85కోట్ల పిల్లలను పంపిణీ చేయగా ఆ ఏడాది 1,93,732 టన్నుల చేపలు చేతికి వచ్చాయని తెలిపారు. 2017-18లో 11,067 జలవనరుల్లో 51.68కోట్ల పిల్లల్ని వదలగా 2,62,252 టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. 2018-19లో చెరువుల్లో నీరు లేని కారణంగా అనుకున్న లక్ష్యం మేరకు పంపిణీ చేయలేదని, కేవలం 49.15 కోట్ల పిల్లలను వదిలినప్పటికీ జనవరి నాటికి దిగుబడి 2,40,929 టన్నులు దాటిందని వివరించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 3,40,000 టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
2016-17లో రూ.2000 వేల కోట్లుగా ఉన్న మార్కెట్‌ విలువ, ఆ మరుసటి ఏడాది రూ.2800 కోట్ల నుంచి ఈ ఏడాది రూ.3600కోట్లకు చేరిందని చెబుతున్నారు. మరోవైపు 2019-20లో 21,189 జలవనరుల్లో 76కోట్ల పిల్లలు వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులు, కుంటల్లోకి అనుకున్న మేర నీరొచ్చి నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే చేపల ఉత్పత్తి నాలుగు లక్షల టన్నులు దాటి మార్కెట్‌ విలువ రూ.4000 కోట్లను చేరుకుంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రొయ్యలోనూ లాభాలు..
రెండేళ్ల కిందట ప్రారంభించిన రొయ్యల పంపిణీ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. 2017-18లో 11 రిజర్వాయర్లలో 1.108 లక్షల పిల్లలను వదలగా 7778టన్నుల ఉత్పత్తి వచ్చిందని మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ తెలిపారు. 2018-19లో 24 ప్రాజెక్టుల్లో 3.19 రొయ్యపిల్లలు వేయగా జనవరినాటికి 7269 టన్నులు చేతికి వచ్చాయన్నారు. 2019-20లో 4కోట్ల పిల్లలను పంపిణీ చేసి పదివేల టన్నుల ఉత్పత్తిని అందుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. చేపలు, రొయ్య పిల్లలకు సంబంధించి ప్రస్తుతం టెండర్లు నడుస్తున్నాయని, వచ్చే ఏడాది నిర్దేశించిన మొత్తంలో పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

రాష్ట్రాలవారీగా..
తెలంగాణలో ఉత్పత్తయిన చేపలు పశ్చిమబెంగాల్‌, అసోం, దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పొరుగున్న ఆంధ్రపదేశ్‌తో సహా అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌కు ఎగుమతి అవుతున్నట్లు మత్స్యశాఖ గణంకాలు చెబుతున్నాయి.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.