close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఏ రైలు ఏ జోన్‌ పరిధిలోకి?

కీలకం కానున్న రైళ్ల పంపకాలు 
ద.మ. రైల్వేలో ప్రస్తుతం 754 రైళ్లు 
ద.మ., దక్షిణ కోస్తాల మధ్య విభజన 
రైళ్ల నిర్వహణ బట్టి ఆ జోన్లకు కేటాయింపు? 
ఈనాడు - హైదరాబాద్‌

ద.మ. రైల్వే జోన్‌ పరిధి 
సికింద్రాబాద్‌ 
కాచిగూడ 
నాందేడ్‌ డివిజన్లు 
దక్షిణ కోస్తా జోన్‌ పరిధి 
గుంతకల్లు 
గుంటూరు 
విజయవాడ 
వాల్తేరు డివిజన్‌లో ఒకభాగం 

క్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా జోన్ల పునర్విభజనలో ఆయా రైల్వేజోన్ల పరిధిలోని డివిజన్ల సరిహద్దులతో పాటు వాటి పరిధిలో ఉన్న రైళ్ల పంపకాలు కూడా కీలకం కానున్నాయి. సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న ద.మ.రైల్వేలోని మూడు డివిజన్లు, ఒడిశాలోని భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా జోన్‌లో వాల్తేరు డివిజన్‌లో ఒక భాగంతో విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు ప్రక్రియ నడుస్తోంది. కొత్తగా ఏర్పడే జోన్‌లో.. పనిచేసే ఉద్యోగులతో పాటు, ఆ జోన్‌ పరిధికి రైళ్ల కేటాయింపు ప్రక్రియలు జరగాల్సి ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అన్నీ కలిపి 754 రైళ్లు ఉన్నాయి. వీటిని రెండు జోన్ల మధ్య ఎలా పంచుతారన్నది ఆసక్తికరంగా మారింది. వీటి పంపకాల్లో ప్రాథమిక నిర్వహణ చేసే స్టేషన్లు కీలకమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

రైళ్లు తిరిగే మార్గం ఆధారంగా... 
ప్రయాణికుల అవసరాలు, ప్రాంతాలను బట్టి ఎంఎంటీఎస్‌, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ (దురంతో, రాజధాని, శతాబ్ది) రైళ్లున్నాయి. ఇవి రాకపోకలు సాగించే ప్రాంతాలు ఒక జోన్‌ పరిధిలోనే ఉంటే ఆ జోన్‌కే వెళతాయి. ప్రారంభస్థానం, గమ్యస్థానం రెండు జోన్ల మధ్య ఉంటే ఏ జోన్‌కు అప్పగించేది కీలకంగా మారుతుంది. 
తూర్పు కోస్తా జోన్‌కు కేటాయించే రైళ్లలో సింహ భాగానికి పైగా దక్షిణ మధ్య రైల్వే నుంచి, కొన్ని రైళ్లను తూర్పుకోస్తా నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. 
ఏ రైలు ఏ జోన్‌కు కేటాయిస్తారన్నది రైలు మార్గాల విస్తీర్ణం, డివిజన్ల సంఖ్యను బట్టి కాకుండా సాంకేతిక అంశాల ఆధారంగా ఉంటుందని రైల్వే నిపుణులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ప్రస్తుతం ఆయా రైళ్లకు జరుగుతున్న ప్రాథమిక నిర్వహణ స్టేషన్‌ ఏ జోన్‌ పరిధిలో ఉంటే.. ఆ జోన్‌కు కేటాయించే అవకాశం అధికంగా ఉంటుంది’’ అని ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఇటీవల తిరుమల, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లకు జరిగిన మార్పులను ప్రస్తావిస్తున్నారు. రైళ్లను ద.మ.రైల్వే, దక్షిణ కోస్తా మధ్య పంపకాలు చేసిన తరువాత కూడా అవి ప్రస్తుతం తిరుగుతున్న మార్గాల్లోనే దాదాపుగా కొనసాగుతాయి. ప్రయాణికుల అవసరాలు, విజ్ఞాపనలను బట్టి.. ఆయా రైళ్లను ఇతర ప్రాంతాలకు పొడిగించడానికి, కొత్త స్టాప్‌లను ఏర్పాటు చేయడంలో ఆయా జోన్లు కీలకమవుతాయి. వాటి ద్వారా రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు వెళ్లి అక్కడ నిర్ణయాలు జరుగుతాయి. కేటాయింపులను బట్టి ఆయా రైళ్లపై సంబంధిత జోన్లకు హక్కుల ఉంటాయి. 
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి-హైదరాబాద్‌ మధ్య నడిచినప్పుడు రైలు నిర్వహణ హైదరాబాద్‌లో చేశారు. కొన్నాళ్ల క్రితం నిజామాబాద్‌కు పొడిగించారు. అక్కడ ఏర్పాట్లు లేకపోవడంతో తిరుపతిలో ప్రాథమిక నిర్వహణ చేస్తున్నారు. తిరుపతి విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. 
విశాఖపట్నం-తిరుపతి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ప్రాథమిక నిర్వహణ తిరుపతిలో చేసేవారు. ఈ రైలు ద.మ.రైల్వే పరిధిలో ఉండేది. ఇటీవల కడప వరకు పొడిగించారు. అక్కడ సదుపాయాల్లేక ప్రాథమిక నిర్వహణను విశాఖకు మార్చడంతో ఆ రైలు తూర్పు కోస్తా ఖాతాలోకి వెళ్లింది. విశాఖపట్నం ఇప్పడు దక్షిణ కోస్తా జోన్‌లో భాగం అవుతుండటంతో ఆ బండి కొత్త జోన్‌ ఖాతాలోకి వస్తుందని చెబుతున్నారు. 
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు ద.మ.రైల్వే పరిధిలోనే ఉంటాయి. సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి వరంగల్‌, మహబూబ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు వెళ్లి వచ్చే రైళ్లు.. అలాగే ఇతర జోన్ల పరిధిలోకి వచ్చే దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, గువహటి, చెన్నై, తిరువనంతపురం వంటి నగరాలకు వెళ్లి వచ్చే రైళ్లు మార్పులు లేకుండా ద.మ.రైల్వే పరిధిలోనే దాదాపుగా ఉంటాయి. 
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల నుంచి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధి వరకు తిరిగే డెము, మెము, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు దక్షిణ కోస్తా జోన్‌లోకి వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నగరాల నుంచి చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి నగరాలకు వెళ్లి వచ్చేవి కూడా ఈ జోన్‌లోకి వస్తాయని చెబుతున్నారు. 

ప్రధాన రైళ్ల నిర్వహణ ఎక్కడ? 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రధాన రైళ్లను పరిశీలిస్తే.. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తిరుపతిలో, పల్నాడుకు గుంటూరులో, గోదావరికి హైదరాబాద్‌లో.. విశాఖ, పద్మావతిలకు సికింద్రాబాద్‌లో, నారాయణాద్రికి తిరుపతిలో, వెంకటాద్రికి కాచిగూడలో, శాతవాహనకు విజయవాడలో, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు హైదరాబాద్‌లో, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు హైదరాబాద్‌లో ప్రాథమిక నిర్వహణ చేస్తున్నారు. జోన్ల పునర్విభజన నేపథ్యంలో ప్రాథమిక నిర్వహణ బట్టి రైళ్ల కేటాయింపు ఉంటుందని.. తక్షణం మార్పులు చేర్పులు ఉండకపోవచ్చని చెబుతున్నారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు విశాఖలో ప్రాథమిక నిర్వహణ చేస్తున్నారు.. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు వస్తే జన్మభూమి నిర్వహణ హైదరాబాద్‌లో చేయాలన్న ప్రతిపాదన ఉంది. నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలనే శబరికి ఉపయోగిస్తారు. దీంతో ప్రాథమిక నిర్వహణ హైదరాబాద్‌ నుంచి నర్సాపూర్‌కు మారే అవకాశం ఉందంటున్నారు. జోన్ల విస్తీర్ణం, డివిజన్ల సంఖ్యను బట్టి రైళ్ల పంపకాలు ఉండవని.. వాటి నిర్వహణకు ఆయా స్టేషన్లలో పిట్‌లైన్ల సామర్థ్యం కీలకమని.. భవిష్యత్‌లో ఆ సంఖ్య పెంచుకుంటే పరస్పర అంగీకారంతో రైళ్లు ఒక జోన్‌ నుంచి మరో జోన్‌కు బదిలీ అవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.