close

ప్ర‌త్యేక క‌థ‌నం

తిరుగులేని నేత మోదీ 

దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు సాటిలేరు 
ఐదేళ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలోకి తీసుకెళ్లాం 
భాజపాకు 300 మించి, ఎన్డీయేకు 367పైగా సీట్లు రావడం ఖాయం 
తెలుగురాష్ట్రాల్లో అవినీతి పెరిగింది..ఆర్థిక క్రమశిక్షణ కొరవడింది 
బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై కేటీఆర్‌ మరికొంత పరిశోధించాలి 
కాజీపేట, తిరుమల బాలాజీ.. కొత్త రైల్వే డివిజన్లకు ఇప్పుడు అవకాశం లేదు 
‘ఈనాడు’తో ముఖాముఖిలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ 
ఈనాడు - హైదరాబాద్‌

యిదేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అన్నిరంగాల్లో ప్రగతిపథంలోకి తీసుకెళ్లిందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సరితూగే నాయకుడు ఇతర కూటములు, పార్టీల్లో లేరని కేంద్ర రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ తిరుగులేని నాయకుడని.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు 300పైగా, ఎన్డీయే కూటమి 367కు మించి స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని ఆయన ఆక్షేపించారు. తెలుగురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని.. అవినీతి పెరిగిందన్నారు. ఈ అంశాలపై ప్రజలను చైతన్యం చేసి అధికారంలోకి ఉన్న పార్టీలపై ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘మై భీ చౌకీదార్‌’(నేను కూడా కాపలాదారుడిని) కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన గోయల్‌ ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? 
దేశంలో 130 కోట్ల జనాభా ఉంది. కులం, మతం వంటి వివక్ష లేకుండా అభివృద్ధి జరగాలి. పేదలు పైకి రావాలి. వెనుకబడిన రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు అందాలి. దేశ సమైక్యతను కాపాడే, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగే నేతను ప్రజలు కోరుకుంటున్నారు. ఇవి ప్రధాని మోదీ మాత్రమే ఇవ్వగలుగుతారు. 
తెలుగురాష్ట్రాల్లో భాజపా ఒంటరిగా పోటీచేస్తోంది. ఎలాంటి ఫలితాలు సాధించబోతున్నారు? 
2014లో తెలంగాణలో ఒకటి, ఏపీలో రెండు స్థానాల్లో గెలిచాం. ఈసారి కచ్చితంగా అంతకంటే అధికంగా.. వీలైనన్ని స్థానాల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు పెద్దఎత్తున నిధులిచ్చింది. కేంద్ర పథకాలతో ప్రజలకు లబ్ధి జరిగింది. 
ఒకే ఎమ్మెల్యే ఉన్న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు? 
అసెంబ్లీ ఎన్నికలపై స్థానికాంశాలు ప్రభావితం చూపుతాయి. లోక్‌సభ ఎన్నికలు..దేశ ప్రధాని కోసం జరిగేవి. దేశభద్రత, అభివృద్ధి, మంచి పాలన, నిజాయితీగల నాయకత్వం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళతాం.

ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి కొత్త 10 హైస్పీడ్‌ కారిడార్లలో హైదరాబాద్‌ను విస్మరించారని తెరాస అంటోంది. అహ్మదాబాద్‌-ముంబయి మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును చేపట్టడానికి గుజరాత్‌.. ప్రధాని మోదీ రాష్ట్రం కావడమే కారణమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అంటున్నారు.  
కొత్త హైస్పీడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులు ప్రతిపాదనలే. ఏవీ ఇంకా ఖారారుకాలేదు. హైదరాబాద్‌-బెంగళూరు ప్రధాన నగరాలు. వాటి మధ్య సెమీహైస్పీడ్‌ కారిడార్‌ వచ్చేందుకు అనుకూతలున్నాయి. హైదరాబాద్‌- చెన్నై మధ్య రావడానికి అవకాశాలున్నాయి. ‘‘కేటీఆర్‌ నాకు మంచి మిత్రుడు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై మరింత అధ్యయనం చేసి రావాలని కోరుతున్నా. ఆయనకు ఫోన్‌చేసి మాట్లాడుతా. అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలుపై యూపీయే హయాంలోనే అధ్యయనం పూర్తయింది. మోదీ ప్రభుత్వం వచ్చాక నిర్ణయం తీసుకుంది.

టికెట్ల కేటాయింపులో అగ్రనేత అడ్వాణీతో పాటు దత్తాత్రేయ వంటి సీనియర్లను పక్కన పెట్టారన్న విమర్శలపై ఏమంటారు? 
సీనియర్‌ నేతలను భాజపా విస్మరించలేదు. వారిని ఎంతో గౌరవిస్తాం. పాలనలో ప్రభుత్వానికి, పార్టీకి తమ సహాయసహకారాలు అందిస్తారు. నా తల్లి ముంబయి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 65 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నారు. 
మెరుపుదాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలపై ఏమంటారు? కాందహార్‌ విమాన హైజాక్‌ సమయంలో నాడు ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను అప్పటి ఎన్డీయే ప్రభుత్వమే విడుదల చేసిందంటున్నారు.. 
కాంగ్రెస్‌ నేత శ్యాంపిట్రోడా చేసిన విమర్శలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ నేతలకు జ్ఞాపకశక్తి తక్కువ అనుకుంటా. 2008లో భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులపై గట్టిగా స్పందించి ఉంటే నేడు తీవ్రవాదం సమస్య ఉండేది కాదు. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదంపై గట్టిగా స్పందించలేదు. విమాన హైజాక్‌ ఘటనలో- ఉగ్రవాద సంస్థ నాయకుడు మౌలానా మసూద్‌ అజర్‌ విడుదలపై ఆనాడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ కూడా ఉంది. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పింది. ఉగ్రవాదుల చెరలో ఉన్న 161 మంది బందీల విడుదలకు అందరితో చర్చించే మసూద్‌ విడుదలపై నిర్ణయం తీసుకున్నాం. 2010లో కశ్మీర్‌లో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. పాక్‌తో స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా నాడు 25 మంది ఉగ్రవాదుల్ని వదిలారు. అందులో కొందరు భారత్‌పై ఉగ్రదాడులు చేసినవారున్నారు. 
తెలంగాణలో కాజీపేట, ఏపీలో తిరుమల బాలాజీ రైల్వే డివిజన్ల ఏర్పాటుపై డిమాండ్లు నెరవేరతాయా? విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఇచ్చినప్పటికీ 125 సంవత్సరాల వాల్తేర్‌ డివిజన్‌ను లేకుండా చేశారన్న విమర్శలు వస్తున్నాయి.. 
ప్రస్తుతానికి కాజీపేట, తిరుమల బాలాజీ వంటి కొత్త డివిజన్ల ఏర్పాటుకు అవకాశం లేదు. వాల్తేర్‌ డివిజన్‌ను తొలగించినట్లు కాదు.. డివిజన్‌ ఉన్నప్రాంతాన్ని జోన్‌ ప్రధాన కార్యాలయంగా పైస్థాయికి తీసుకెళ్లాం.ఏపీ పునర్విభజన చట్టంలో- ఏపీకి కొత్త రైల్వేజోన్‌ను పరిశీలించమని మాత్రమే ఉంది. ఆర్థికంగా, సాంకేతికంగా చాలా క్షుణ్ణంగా పరిశీలించాం. అతికష్టం అయినప్పటికీ కొత్త జోన్‌ ఏర్పాటుచేశాం. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ డివిజన్‌ పేరుతో కొందరు రాజకీయ నేతలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.